Saturday, October 31, 2009

ఏక్ నిరంజన్ - చిత్ర సమీక్ష

సిగరెట్టు తాగేవాడు ఎలా అయితే చట్టబద్దమైన హెచ్చరికను లెఖ్ఖ చెయ్యడో (పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది కదా సిగరెట్టు డబ్బా మీద ) అలాగే నేను కూడా జనాల మాట పెడ చెవిన పెట్టి సినిమాహాల్లో కి ఒక దూకు దూకాను స్నేహితుడి తో కలిసి. మామూలు గా ఒక రేంజ్ హీరో సినిమా అయితే హాలు ఎంత లేదు అన్న సగం పైన నిండుతుంది. రెండువందల పైగా పట్టే హాలు లో ముప్పై మందిమి ఉన్నాము మాతో కలిపి మొదటి ఆట శుక్రవారం నాడు. కాక పొతే పూరీ గారికి లేని బుర్ర మనకి మాత్రం ఉంటుందా అని నిశ్చయించేసుకుని , నిర్ణయించేసుకుని ఒక సారి బుర్ర లో ఎం లేదు కాళి అని చెయ్యి పెట్టి చూసుకుని హాయిగా ముందర సీట్ మీద కాలేస్కుని , స్టార్ బక్స్ కాఫీ తాగుతూ సినిమా చూడటం మొదలు పెట్టాం.

ఎప్పుడో చిన్నప్పుడు చూసిన Qayamat Se Qayamat తక్ లో ని మర్కండ్ దేశ్ పాండే (సినిమాలో పేరు చిదంబరం ) హటాత్తుగా తెర మీద దర్శనం ఇచ్చాడు. ఇయన ఏదో హిందీ సినిమా దర్శకత్వం చేస్తున్నాడు అని విన్నా ఈ సినిమా లో ఏం చేస్తున్నాడురా బాబు అనుకున్నా. పిల్లలని ఎత్తుకుపోయి, వాళ్ళతో బిచ్చం ఎత్తించి బతికే పాత్ర అతనిది. అలాగే మన నాయకుడిని కూడా ఎత్తుకు పోతాడు. ఎత్తుకు పోయిన పిల్లాడికి తన తల్లి తండ్రులు ఎవరో తెలీదు. ఒక రోజు చిదంబరం ని పోలీసులు తరుముతూ ఉండగా, మన నాయకుడు (పేరు చోటూ ) పట్టిస్తాడు. అప్పుడు ఆ పోలీసు చోటూ కి ఒక రూపాయి ఇస్తాడు. ఆ దెబ్బకి మన వాడు పోలీసు ఇన్ఫార్మర్ గా మారి నేరస్తులని బేడీలు (బేడీలు ఇండియా లో ఎక్కడ పడితే అక్కడ దొరుకును , ఎవరు పడితే వారు కొనుకోవచ్చు ను అన్న కొత్త విషయం తెలిసింది అన్న లైట్ వెలిగింది నా బుర్ర పైన ) వేసి మరి పోలీసు స్టేషన్ కి తీసుకు వచ్చి కమీషన్ తిసుకుపోతావుంటాడు.

నాయిక పేరు సమీర. పాత తరం నాయిక ల లాగ పాపం పొట్ట కూటికి సంగీత పాఠాలు తన పాతిక వేల రూపాయల గిటార్ మీద ఫీజు కూడా కట్టని విద్యార్దుల కి నేర్పిస్తూ , కట్టుకోడానికి సరి అయిన బట్టలు లేక పాపం చిన్నప్పటి గౌన్లె వేసుకుంటూ , తలకి నూనె పెట్టుకునే డబ్బుకూడా లేక తైల సంస్కారం లేని జుట్టు ని గాలికి వదిలేసి తినడానికి తిండిలేక సోమాలియా అమ్మాయి లాగ ఉంటుంది. తిండి లేని ఆ అమ్మాయిని చూసి దుక్కలాంటి ఈ అబ్బాయి గోతి (ప్రేమ లో అని చదువుకోగలరు ) లో పడిపోతాడు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న చందం గా అమ్మాయి ప్రేమ లో పడితే సరి పోదు కదా, అమ్మాయి అన్న మరి రౌడీ , పోలీసు లిస్టు లో ఉన్నవాడు వాడిని పట్టిస్తే డబ్బు వస్తుంది , అందువల్ల నాయకుడు ఆ పని చేసి డబ్బు సంపాదిస్తాడు. ఆ ఆన్న ఇంకో దున్న సోను భాయి (సోను సూద్ ) దగ్గర పని చేస్తాడు. అక్కడ నుంచి అన్న, దున్న ల తో ఈ చోటూ కొట్టుకోడం , మధ్య లో సోమాలియా సమీర తో పాటలు పాడటం , విదేశాలలో గెంతులు వెయ్యడం తో సరి పోతుంది.

పూరీ బ్రాండ్ perverted దృశ్యాలు ఈ సారి అలీ, బ్రహ్మానందం , అభినయశ్రీ , మీద, కొంత వేణు మాధవ్ మీద చిత్రీకరంచబడ్డాయి. ఒక కుళ్ళు కామెడి దృశ్యం, ఒక భారి పోరాటం, ఒక పాట ఇలా సినిమా ఆరు పోరాటాలు మూడు పాటలు తో పూరీ మార్క్ సంబాషణ లతో సాగిపోతోంది. సినిమాలో బాగున్నవి సోను సూద్ , బ్రహ్మాజీ మధ్య ఉన్న సంబాషణలు . బాగొలెనిదీ పూర్తి సినిమా.

సినిమాకి సోను సూద్ ప్రధమ ఆకర్షణ, తరవాత, బ్రహ్మాజీ. ఆ తరవాత ప్రభాస్, ప్రభాస్ పాత్ర చాలా వరకు బుజ్జిగాడికి కొనసాగింపు, బుజ్జిగాడికి ఎక్కువ , పోకిరి కి తక్కువ లాగ ఉంది. సంభాషణలలో కొన్ని బాబు మింగేస్తాడు. మనం ఏమన్నాడో ఒక సారి ఆలోచించుకోవాలి. నాయిక కి డబ్బింగ్ చెప్పిన సబితా రెడ్డి దారుణం. ఒకో సారి పెదవుల కదలికకి వచ్చే సంభాషణకి సంభందం ఉండదు. రెండు దేనికి అదే. ఎవరి గోల వారిది టైపు. లాజిక్ కి అందని సన్నివేశాలు కో కొల్లలు సినిమాలో. దానికి తొడు సినిమా అంతా విరివిరిగా కనపడే పరభాషా నటులు చూసేది తెలుగు సినిమానో లేక వేరే భాష సినిమానో తెలీకుండా.

సాంకేతికంగా సినిమాలో బాగుంది మణిశర్మ సంగీతం, శ్యాం కే నాయుడు కెమెరా. సినిమాలో బాగుంది ఇంకోటి ఉంది. జాక్సన్ కి నివాళి గా పెట్టిన పాట సినిమాకి పరమ దండగ పాత్ర నాయిక . అంత చెత్త నాయిక ని ఈ మధ్య కాలం లో తెలుగు సినిమా లో చూడలేదు. ఆ అమ్మాయి ఆహార్యం , మొహానికి వేసి రంగు తో సహా అంతా దండగే. ఇంతోటి భాగ్యానికి అంత కర్చుపెట్టలా అంటే మరి పూరీ గారి కి నచ్చింది తప్పదు. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా . వర్మ ఎప్పుడో చెప్పాడు .నాకు కావలసింది తీస్తా, చూస్తె మీ ఖర్మ , నా భాగ్యం. లేక పొతే నా ఖర్మ , మీ భాగ్యం అని .. ఇదీ అంతే.

తాజా కలం : ఇది నిజానికి మహేష్ తో చెయ్యవలిసిన సినిమా. ముందర మహేష్ బాబు తో పోకిరి -2 గా ఈ సినిమాని చేద్దాం అని అనుకున్నారు. మహేష్ త్రివిక్రం సినిమా చెయ్యడం వాళ్ళ కాళి లేక ప్రభాస్ చేసాడు అని వార్త.

ఏక్ నిరంజన్ : తారాగణం : ప్రభాస్, కంగనా రావుత్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : పూరీ జగన్నాథ్.

Friday, October 30, 2009

బంపర్ ఆఫర్ , జయీభవ చిత్ర సమీక్షలు

పూరీ గారి తమ్ముడు, శ్రీ సాయి రాం శంకర్ గారు నటించిన బంపర్ ఆఫర్ చూసే బాగ్యం ఈ మధ్య తటస్తించింది అప్పటికే రమణమ్మ పాట సూపర్ హిట్ కావడం వల్ల సినిమా మీద పెద్ద అంచనాలే పెట్టుకున్నారు సోదరులు ఇద్దరూ. సినిమా మొదలే తేడా గా మొదలు అవుతుంది. తల్లి కోవై సరళ , కొడుకు కలిసి ఆరవ సినిమాలో లాగ ఎందుకె రవణమ్మ పాటకి మసాలా నాట్యం తో మనకి ఒక రకమైన బెదురు పుట్టిస్తారు. అది అయ్యాక ఎవరో వచ్చి వీడు మరి ఎక్కువ స్టెప్స్ వేస్తున్నాడు అని కాళ్ళు విరగ గొడతారు. అది నాయక పని అని తెలిసి , హీరో వెళ్లి ఆ అమ్మాయి చెంప పగలగొడతాడు. ఆ అమ్మాయి వచ్చి విడి విరిగిన కాలు ని ఇంకో కర్ర తీసుకుని కొడుతుంది. పాత సినిమాలో తలకి దెబ్బ తగిలి మతి పొతే మళ్ళా దెబ్బ తగలనే మళ్ళా పోయిన మతి వచ్చినట్టు వీడి కాలు కూడా వచ్చేస్తుంది. ఆ దెబ్బతో వీడికి కుడా ఆ పిల్ల మీద ప్రేమ పుట్టేస్తుంది

నీ అందం చూసి , నీ బాబు డబ్బు చేసు కాదె , నీ బలుపు చూసి నిన్ను ప్రేమిస్తున్నా అని హీరో గారు చెప్పేస్తారు. నాయక కూడా విడి బుర్ర తురుగుడు చూసి ప్రేమించేస్తుంది. హీరో నాన్న నాయక తండ్రి వద్ద పని చేస్తూ ఉంటాడు.

ఇదేంటి బంపర్ ఆఫర్ కథ అని ఇడియట్ కథ చెపుతున్నాడు వీడికి పూరి సినిమాలు చూసి మైండ్ బ్లాక్ అయ్యింది అని మీరు అనుకుంటే, చల్ల చల్లని పూరీ కూరలో కాలు వేసునట్టే (పూరీ గారు అదే హీరో క్యారెక్టర్ ని తీసి తీసి ఆ వేడి లేకుండా చేసాడు మరి ).

ఆవకాయ బిర్యాని నాయిక బిందు అందాలుఆరబోసింది. కాని అమ్మాయి కొంచం ఒళ్లు తగ్గించాలి, ఇలా అందాలు ఆరబోయాలి అంటే. జోక్ ఏంటి అంటే, పాటల్లో సుబ్బరంగా చూపించిన ఈ అమ్మాయి, స్విమ్మింగ్ పూల్ దగ్గర మాత్రం కొంచం కప్పుకుని కనపడింది. ఇంకో కామెడి ఏంటి అంటే , అయిదు లక్షలు ఇచ్చి జయప్రకాశ్ ని (ఈయనది ఒక రాజకీయ నాయకుడి పాత్ర ) ఎవరన్న సరే నాన్న అని అనేయడమే,

హీరో, నాయిక తండ్రి ని బీదవాడిని చేస్తా అని అనడమే బంపర్ ఆఫర్. అప్పటిదాకా బోలెడు తెలివి తేటలు ఉన్న నాయికి తండ్రి కి ఇంటెర్వల్ నుంచి బుర్ర పనిచెయ్యడం మానేస్తుంది. దాంతో హీరో వేసే ఎత్తులకి చిత్తయై , చెత్త అయ్యి డబ్బు పరువు పోగాట్టుకుని జైలు కి వెళ్తాడు. హీరో అతని దగ్గర నుంచి కొట్టేసిన డబ్బుతో నాయిక తో సంతోషంగా ఉంటాడు.

బాడీ పెంచిన సాయి రాం, నటన పెంచితే బాగుండేది. మనం ఆ పైనున్న సాయిరాం ని తలుచుకునే బాద తప్పేది. బిందు కి చెయ్యడానికి ఎం లేదు. హీరో కావలసినప్పుడు వచ్చి అర్ధనగ్నంగా గెంతులేయ్యడం తప్ప. మిగిలిన నటులు ఉన్నారు అంటే ఉన్నారు. లేక పొతే లేదు. . ఉన్నంతలో కొంచం బాగున్నది రఘు సంగీతం మాత్రమె. కొత్త దర్శకుడు జయరవీంద్ర కి కొత్తగా చెయ్యడానికీ ఎం లేదు. అన్ని వెనక ఉండి పూరీ గారు చూస్కున్నారు మరి. సినిమా చిన్న కేంద్రాలలో బాగానే ఆడుతోంది అని భోగట్టా. కాని మరి ఏక్ నిరంజన్ దాటికి మరి ఎంత వరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.

బంపర్ ఆఫర్ : తారాగణం : సాయిరాం శంకర్ , బిందు , సాయాజీ షిండే సంగీతం : రఘు కుంచె , దర్శకత్వం : జయ రవీంద్ర
--------------------------------------------------------------------------------------------------------------------
జయీభవ

యాక్షన్ హీరో గా పేరు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ మొదటి సారిగా కాస్త ట్రెండ్ మార్చి యాక్షన్ కి కొంచం హాస్యాన్ని కలిపి కుటుంబ ప్రేక్షకులకి దగ్గర కావాలని చేసిన ప్రయత్నం జయీభవ.

కాని కథ పాత చింతకాయ పచ్చడి. కొత్త సన్నివేశాలు ఉన్నయ్యా , అంటే ఆలోచించవలసిందే. సినిమాలో ఒక్కటే కొంచం కొత్తగా ఉంది. హీరో నాకు పుట్టబోయే కొడుకు కి నీ పేరే పెట్టుకుంటా అనగానే ఆలీ కి, బ్రహ్మానందం కి వెనుక దేవుళ్ళకి వచ్చినట్టు చక్రం తిరగడం అన్నది బాగుంది.

కథ ని ఇంటెర్వల్ బాంగ్ కోసం మొదటి సగం గంటలో పూర్తి చేసి , రెండో సగం గంటన్నర సాగదీసారు. కథ ప్రకారం, ఒక దుష్టుడి వల్ల విడిపోయిన స్నేహితుల పిల్లలు ప్రేమించుకుని పెద్దలని కలపడం అన్నది కథాంశం.

ఇంటెర్వల్ లో నాయకా నాయికిలకి వారిద్దరి తండ్రులిద్దరూ ప్రస్తుతం శత్రువులు అన్న సంగతి తెలుస్తూంది. తరవాత ప్రేమికులిద్దరూ కలిసి ఒకరి ఇంట్లో ఒకరు ప్రవేశించి ఇంటి వారిని ఎలా మెప్పించి ఒప్పించారు అన్నది కొంచం కామెడి గా చూపించాలి అని ప్రయత్నం చేసారు. ప్రయత్నం చేసారు అని ఎందుకు అన్నా అంటే, అది ప్రయత్నమే కాని ఫలితం లేకపోవడం వల్ల. సినిమా రెండో సగం నస, కొనసాగడమే తప్ప కోన (చివర ) ఎక్కడా కనపడలేదు. ఒక పాట చిత్రీకరణ బాగుంది. సో సో సంగీతం. కళ్యాణ్ రామ్ హాస్య సన్నివేశాలకు ఇంకా ఇంప్రూవ్ కావాలి. హన్సిక పాత్ర కి చెయ్యడానికి ఎం లేదు షరా మామూలు. ఆడే పాడే బొమ్మ. రఘు బాబు , రఘు కారుమంచి కామెడి పరవాలేదు. బ్రాహ్మి దండగ . ఇంకా ఎక్కువ చెప్పుకోవడం అనవసరం ఈ సినిమాకి. సోది సినిమా.

జయీభవ తారాగణం : కళ్యాణ్ రామ్ , హన్సిక దర్శకత్వం : నరేన్ కొండేపాటి

Wednesday, October 28, 2009

ది బాయ్ ఇన్ ది srriped పైజమాస్


ఒక రోజు మా స్నేహితుడి స్నేహితుడు భోజనానికి పిలిచారు. మనకి అసలే ఎక్కువగా ఇలా ఫార్మల్ భోజనాలకి వెళ్ళాలి అంటే ఒక విధమైన బెరుకు. వీలయినంతగా తప్పించుకోడానికి ప్రయత్నిస్తా. సో అలాగే ఇది తప్పించుకోడానికి వెళ్లి ఒక మాల్ లో ఉన్న పుస్తకాల దుకాణం లో దూరాను. అక్కడ జాన్ బోయ్నే పుస్తకం ది బాయ్ ఇన్ ది srriped పైజమాస్ కనపడింది. జాన్ బోయ్నే రాసిన మొదటి పుస్తకం The thief of time చదివాను. అది బాగానే అనిపించింది. ఇది ఎలా ఉంటుందో అని ఒక సారి సెర్చ్ కొట్టి చూసా. అప్పటికే అది అయిదు మిలియన్ కాపీలు అమ్మింది అని తెలిసి సరే అని కొని అక్కడ ఉన్న కాఫీ షాప్ లో కూర్చుని చదవటం మొదలు పెట్టాను. కథ బాగానే ఉన్నా కొన్ని సన్నివేశాలు నాటకీయతని సంతరించుకున్నాయి అని అనిపించింది. పుస్తకం చివరకి వచ్చే సరికి భాద వెయ్యక మానదు. మొత్తం మిద మంచి పుస్తకమే అని అనిపించింది.

జాన్ మొదటి డ్రాఫ్టు మొత్తం రెండు రోజ్జులలో రాసాడు అని చెపుతారు. కథ మొత్తం ఒక తొమ్మిదేళ్ళ అబ్బాయి వైపు నుంచి చెప్పబడుతుంది . కథాకాలం హిట్లర్ పాలన సమయం లో జరిగినట్టు గా ఉంటుంది. బ్రునో ఒక తొమ్మిదేళ్ళ అబ్బాయి. హాయిగా బెర్లిన్ లో అయిదంతుస్తుల మేడలో బోలెడు మంది పనివాళ్ళ మద్య సంతోషంగా ఉంటూవుంటాడు. ఒక రోజు బడి నుంచి వచ్చే సమయానికి వాళ్ళ నాన్న కి వేరే వూరికి బదిలీ అయ్యింది అని తెలుస్తూంది. తన పన్నెండేళ్ళ అక్కతో కలిసి ఆ వూరికి వెళతాడు బ్రునో. అక్కడ అతనికి ఆడుకోవడానికి ఎవ్వరూ ఉండరు. బెర్లిన్ లో బోలెడు సందడిగా ఉన్న ఇంటి నుంచి వచ్చిన బ్రునో కి కొత్త స్థలం అసలు నచ్చదు. ఒక రకంగా అది వాడికి జైలు లాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళనివ్వరు వాడిని. అలాంటి సమయం లో ఒక రోజు కిటికి లో నుంచి చూస్తున్న బ్రునో కి దూరంగా ఒక కంచె అక్కడ చారల పైజమాలు వేసుకున్న మనుషులు కనపడతారు. వారు మనుషులే కారు అంటాడు తండ్రి. ఒక రోజు కంచె దగ్గర చుక్కలా కనపడ్డ అబ్బాయి ని వెతుకుంటూ వెళ్తాడు బ్రునో, అక్కడ పరిచయం అవుతాడు జువిష్ కుర్రాడు ష్మయూల్. తన వయసు వాళ్ళు ఎవ్వరూ లేని బ్రునో కి ష్మయూల్ ఎడారిలో ఒయస్సిస్ లా కనపడతాడు. ఇద్దరికీ స్నేహం కుదురుతుంది. రోజు కంచె దగ్గర కలుసుకుని ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు.

ఇంతలొ మళ్లి బ్రునో తండ్రికి బెర్లిన్ బదిలీ అవుతుంది. ఆఖరి సారి ష్మయూల్ ని కలిసి వెళ్లడానికి కంచె దగ్గరకి వెళ్తాడు బ్రునో. అక్కడ ష్మయూల్ తండ్రి కనపడటం లేదు అని తెలిసి బ్రునో , ష్మయూల్ లో కలిసి వెతుకుదాం అని కంచె కి కింద తవ్వి లోపలకి వెళ్తాడు వర్షం మొదలు అవుతుంది , ష్మయూల్ తండ్రి కనపడడు, బ్రునో వెనక్కి వెళ్లి పోదాం అని అనుకుంటాడు కాని ఈ లోపల సైనికులు చుట్టుముట్టి అందరిని ఒక గదిలోకి పంపుతారు . అక్కడ వర్షానికి తడవకుండా ఉండటానికి పంపారు అని అనుకుంటారు ఇద్దరూ. కానీ అది ఒక గాస్ ఛాంబర్. అలా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని తెలీకుండానే ఇద్దరూ కలిసి మృత్యువు ని చేరుకుంటారు.

రచయిత తుది పలుకులో బ్రునో కోసం వెతికిన తల్లి తండ్రులకి బ్రునో దుస్తులు కంచె దగ్గర దొరకడం వల్ల జరిగింది ఊహించగలుగుతారు అని చెపుతారు . దాదాపు గా నలభై బాషలలో ఈ పుస్తకాన్ని అనువదించారు అంటే ఈ పుస్తకం ఎంత మందికి నచ్చిందో ఆలోచించండి.

ఈ కథ మిద విమర్శలు లేవా అంటే ఎందుకు లేవు ఉన్నాయి. అప్పట్లో మరి ఇంత చిన్నపిల్లల్ని concentration క్యాంపు లో అసలు ఉంచేవారు కాదు, గాస్ ఛాంబర్ లో ముందరే పంపెసేవారు లాంటి విమర్శలు కనిపించాయి. కాని ఇవి ఏవీ నవల విజయాన్ని ఆపలేక పోయాయి.

ఈ కథ ని అచ్చుకావడానికి ముందరే ప్రూఫ్ కాపి ని జాన్ ఏజెంట్ మార్క్ హెర్మన్ కి డేవిడ్ హేమాన్ కి విడి విడిగా పంపారు. పుస్తకం అచ్చు కాక ముందర నుంచే వారి తో విడి విడిగా జాన్ చర్చించేవారు. తర్వాత వారి ఇద్దరినీ కలిపి చర్చకు పిలిచారు. అలా వాళ్ళిద్దరూ కలిసి చిత్రానికి పని చేసారు.

కథ లో లేని చాల సన్నివేశాలు సినిమాలో కనపడతాయి. అలాగే చాలా సన్నివేశాలు కథలో నుంచి సినిమాలో కి వచ్చేఅప్పటికి దారితప్పి కనపడకుండా పోయాయి. కాని అవి తప్పదు అంటారు జాన్. సినిమాకి స్క్రీ ప్లే కోసం వాళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో తనకి తెలుసునని ప్రతి మార్పు తనకి తెలిసే జరిగింది అని చెప్పారు జాన్.

మార్క్ హార్మన్ పేరు వినగానే గుర్తు వచ్చేది అయన మొదటి చిత్రం Blame it on Bellboy (దీన్నే తెలుగు లో ఎవడి గోల వాడిది అని ఈ వి వి గారు తీసారు ) , తర్వాత గుర్తుకు వచ్చేది మైఖేల్ కేన్ అద్భుతంగా నటించిన లిటిల్ వాయిస్ చిత్రం. అయన ఈ చిత్రాన్ని కూడా బాగా తీసారు.

డేవిడ్ హేమన్ పేరు వినగానే మనకి హారీ పోట్టర్ సినిమాలు గుర్తురాక మానవు. ఈయనే వాటి అన్నిటికి నిర్మాత. ఇవే కాక అయన ఇంకా వేరే సినిమాలు కూడా తీసారు. వాటిలో ఇది ఒకటి.

బ్రునో గా వేసింది Asa Butterfield , ఇతనికి ఒక అన్న ఒక అక్క ఉన్నారు. చిన్నప్పట్టి నుంచి గిటారు , పియానో వాయించడం లో అనుభవం సంపాదించాడు. తొమ్మిదో ఏట రాక్ స్కూల్ పోటిలలో పాల్గొని గిటార్ బహుమతి గా పొందాడు. సినిమాకోసం అప్లై చేసిన వాళ్ళల్లో ఇతనే మొదటి వాడు. Audition కి వచ్చిన వాళ్ళల్లో మూడో వాడు. డేవిడ్ కి మార్క్ కి వెంటనే నచ్చినా కాని మిగిలిన వాళ్ళని కూడా పరీక్షించే చివరకి తీసుకున్నారు. British Independent Film Awards లో దేవ్ పటేల్ (slumdof millionere hero ) పోటి పడ్డాడు మోస్ట్ ప్రోమిసింగ్ న్యూ కమ్మర్ అవార్డు కి. ఇతని రాబోయే చిత్రం లో Anthony Hopkins తో నటించనున్నాడు. ష్మయూల్ గా వేసింది జాక్ స్కాన్లోన్. ఇతను వడపోతలో చివరి ముగ్గురిలో మిగిలాడు. ఆ ముగ్గురిని Asa Butterfield తో కలిపి విడివిడిగా చిత్రీకరించి చూసి చివరికి ఇతన్ని ఎన్నిక చేసారు. ఇతను కూడా చాలా బాగా చేసాడు.

నిర్మాత డేవిడ్ హేమాన్ కూడా ఒక చక్కటి పాత్ర వేసారు. సినిమా మొత్తం బుడాపెస్ట్ లో తీసారు. concentration camps సన్నివేశాలకి ఎస్కాపే తో విక్టరీ సెట్ వాడారు. సినిమాలో ఇంకా చెప్పుకోదగ్గవి కెమెరా , సంగీతం , ఆర్ట్ వర్క్ ... అన్ని చక్కగా కుదిరాయి.

కుదిరితే తప్పక చూడాల్సిన చిత్రం

Saturday, October 24, 2009

కొత్త చిత్రాల సమీక్షలు

ఈ వారం నేను చూసిన వాటిలో కొంచం బాగున్నా సినిమా Law abiding citizen. అసలు బాగోలేనివి ఘటికుడు, జగన్మోహిని.

కొంచం బాగున్నా సినిమా అని ఎందుకు అన్నా అంటే , Law Abiding Citizen లో హింస పాలు ఎక్కువ, చెత్త క్లైమాక్స్ కావడం వల్ల ఆ సినిమా సాధారణ సినిమా కి కొంచం ఎక్కువ గా మిగిలింది. కథ, కథనం బాగుండి క్లైమాక్స్ వల్ల పాడయిన సినిమా ఇది.

Clyde ఒక మంచి భర్తా , మంచి తండ్రి. అతనికి ఒక పది సంవత్సరాల కూతురు. ఒక రోజు కూతురు తో ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు దుండుగులు ప్రవేశించి , ఇతన్ని పొడిచి , భార్య ని హత్య చేసి , కూతురు ని ఎత్తుకు పోయి హత్య చేస్తారు. తర్వాత ఇద్దరు పట్టు పడతారు. District Attorney నిక్ కి ఈ కేసు అప్పగిస్తారు. కోర్ట్ లో కేసు వాధించాల లేక అప్ప్రోవేర్ గా మారిన వాడితో డీల్ కుదుర్చుకుని వాడికి శిక్ష తగ్గించి రెండో వాడికి మరణ శిక్ష విధించడమా అని డైలమా లో పడతాడు నిక్. సహాయకురాల్ని సలహా అడుగుతాడు. ఆ అమ్మాయి, కేసు నడిస్తే బోలెడు పని గంటలు , లక్షల కొద్ది ప్రజా ధనం దండగ అవుతుంది అందువల్ల డీల్ కుదుర్చుకోవడం బెటర్ అన్న సలహా ఇస్తుంది. దాని ప్రకారం నిక్ డీల్ కుదుర్చుకుని ఒకడిని విడిచి పెట్టేస్తాడు. రెండో వాడికి పదేళ్ళ శిక్ష , మరణ దండన విధిస్తారు. వెళ్ళే పోయే అప్పుడు మొదటి వాడు నిక్ ని షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు CLYDE నిస్సాహాయం గా గాయపడి చూస్తూ ఉండి పోతాడు.

పదేళ్ళు గడిచాక శిక్ష అమలు చేసే సమయం లో ఇంజెక్షన్ లో ఏదో కలవడం వల్ల హంతకుడు నరక యాతన అనుభవించి మరణిస్తాడు. అది ఎలా జరిగింది అని ఆలోచించే లోపలే విడుదల కాబడ్డ హంతకుడి ని కిడ్నాప్ చేసి చిత్రహింసల పాలు చేసి ఖండ ఖండాలు గా చేసి దాని వీడియో చేసి నిక్ కి పంపిస్తాడు Clyde.

ఈ లోపల Clyde ఇంటి ని చుట్టుముట్టి అరెస్టు చేస్తారు. Clyde తను హత్య చేశాను అని ఒప్పుకుంటాడు కాని ఆధారం ఏది అని అడుగుతాడు. ఎక్కడ ఆధారం దొరకదు. ఈ లోపల జైలు లో ఉండే Clyde కేసు కి సంభందించిన ఒకో ఆఫీసర్ ని మట్టుపెట్టడం మొదలు పెడతాడు. ఎలా చేస్తున్నాడో అర్ధం కాక నిక్ సతమతమవుతాడు.

ఆఖరికి నిక్ ఎలా చేదించాడు. ఎం చేసాడు అన్నది క్లైమాక్స్. నాకు క్లైమాక్స్ చిత్రం లో పరమ చెత్త గా అనిపించింది. ఒక పక్కన Clyde చేసేది తప్పు అని చెపుతూ నిక్ చేసింది కూడా అదే కదా అని అనిపించింది.

సినిమాలో ముఖ్యం గా చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే , సంభాషణలు. మొదటి డ్రాఫ్టు రాసింది Kurt Wimmer. ( Al Pachino , Collin Farell నటించిన The Recruiter కి కూడా ఈయన స్క్రీన్ ప్లే చేసారు. తరవాత దానికి మెరుగులు దిద్దింది Frank Darabont. ఈయన ఇంతకు ముందర (The Shawshank Redemption, The Greenmile, The majestic ) లాంటి సినిమాలకి పనిచేసారు. ఈయనే డైరెక్ట్ చేస్తారు అని కూడా అనుకున్నారు కాని చివరి నిమషం లో Felix Gary Gray (The Negotiator (1998) , The Italian Job (2003) ) డైరెక్ట్ చేసారు.

నిక్ గా జేమీ ఫాక్సు, Clyde గా గేరార్డ్ బట్లర్ ( 300, పి ఎస్ ఐ లవ్ యు హీరో ) పోటి పడి నటించారు. హింస కొంచం ఎక్కువగా ఉండటం వల్ల అందరికి నచ్చకపోవచ్చు ఈ చిత్రం. నిక్ కి clyde మిద సానుభూతి ఉంటుంది కాని అతను చట్టాన్ని తన చేతుల లో కి తీసుకోవడం భరించలేక పోతాడు. తన దాకా వస్తే అన్నది ఎలా ఉంటుందో బాగా తెలిసి వస్తుంది నిక్ కి.

చిత్రం : Law abinding citizen Cast : Jamie Foxx, Gerard Butler , Director : F.Gary Gray.
---------------------------------------------------------------------------------------------

ఘటికుడు

ఈ సినిమా చూసాక గొప్ప సందేహం రాక మానదు. ఘటికుడు ఎవరు అని. ఇలాంటి చెత్త చిత్రం ఒప్పుకున్నా నాయకుడా , ఇలాంటి పాత చింతకాయ కథ ని బోలెడు కర్చు పెట్టి తియ్యడానికి ఒప్పించగలిగిన దర్శకుడా లేక తెలిసి తెలిసి ఇలాంటి సినిమా చూసే నా లాంటి సీతయ్యలా ?

మనం ఈ మధ్య బోలెడు సినిమాల్లో చూసినట్టే హీరో ఒక కిరాయి హంతకుడు ( మన కథకులకి ఈ మధ్య తాజా జాడ్యం ఈ కిరాయి హంతకుల నాయకుల పైన సినిమా తియ్యడం ) ఎప్పుడు గురి తప్పని నాయకుడు ఒక సారి గురి తప్పుతాడు. పెంపుడు తండ్రి తో పందెం కట్టి ఎలా అయినా సరే ఆ తప్పించుకున్న వారి ని చంపుతా అని ప్రతిన పూని, ఆ ఇంట్లో పని వాడుగా ప్రవేశిస్తాడు. అక్కడ ఇతను ఎలా నెగ్గుకు వచ్చాడు, చంపడానికే వెళ్ళాడా ? లేక వేరే కారణం ఏంటి ? గట్రా గట్రా ఏదో ఒక తెర మిద మీరు కూడా సితయ్యలు అయితే చూడండి లేక పొతే వచ్చే నష్టం ఎంత మాత్రము లేదు .

హీరో చంపడానికి వెళ్ళడం అక్కడ హీరోయిన్ ఉండటం, గురుడు పీకల లోతు లేక ఇంకా ఎక్కువ కుదిరితే పడిపోవడం , బుర్ర తక్కువ హీరోయిన్ ఒడ్డు పొడుగు ఉన్నాడు అని ప్రేమించేయ్యడం చాలా మాములుగా దీంట్లో కూడా అంతే. కొత్తేం లేదు. హీరో కి చదువు చట్టుబండలు ఉండవు. కాని కంప్యూటర్లు , హాకింగ్ లు గట్రా అవలీలగా చేసి పారేస్తాడు.

క్లైమాక్స్ కామెడీ ఏంటి అంటే .. హీరోయిన్ కారు గాల్లో క్రేన్ కి కట్టి ఉంటుంది.. విలన్ ఆ కార్ కి బజ్జుక ప్రయోగిస్తాడు. వెంటనే పెలేది కాదు, దానికి టైమర్ ఉంటుంది. మరి నాయకుడు వెళ్లి రక్షించాలి కదా.. ఇలాంటి సినిమా కామేడీలకి ఈ సినిమా లో బోలెడు అవకాశాలు ఉన్నాయ్ లెండి.

సినిమాలో బాగుంది ఒక్కటే, సూర్య , వడివేలు కామెడి అది తప్ప సినిమా అంతా పరమ చెత్త. చాలా రోజుల తరవాత బి సరోజా దేవిని చూడటం బాగుంది. కానీ ఆవిడ కొంచం తగ్గితే బాగుంటుంది ఏమో. ఆవిడ పాత్ర మాత్రం దండగ పాత్ర. సినిమా నే దండగ .. ఇంకా పాత్రల విషయం ఎందుకు అంటే ఎం చెప్పలేం మరి . తమిళ్ నాడు లో మంచి వసూళ్ళ ల లో ఉంది మరి.

ఘటికుడు : సూర్య , నయన తార దర్శకత్వం : కే ఎస్ రవికుమార్
----------------------------------------------------------------------------------------------
జగన్మోహిని ...

తెలుగు లో డెబ్భై ల చివరల లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం జగన్మోహిని. ఈ చిత్రం తో జయమాలిని ఒక రేంజ్ లో ఇమేజ్ వచ్చింది. ఆ తరవాత ఆ అమ్మాయి లేకుండా లేని చిత్రం ఒక దశాబ్దం వరకు లేదు అంటే అతిశయోక్తి కాదేమో. అప్పటి వరకు తెలుగు కమల్ హసన్ (కమల్ తమిళ్ లో వేసిన వేషలని ఇక్కడ తెలుగు లో నరసింహ రాజు చేసారు ఆ సమయం లో, తూర్పు - పడమర , అమ్మాయిలు జాగర్త ) ఇమేజ్ ఉన్న నరసింహ రాజు కి జానపద నాయకుడి గా ఇమేజ్ తెచ్చి కొత్త జీవితాన్ని ఇచ్చింది ఈ పాత జగన్మోహిని. ఈ తరవాత జానపదం అంటే నరసింహ రాజే అన్న మాట చిన్న నిర్మాతలకి.

తెలుగు లో నే కాక తమిళ్ లో కూడా ఈ సినిమా బాగానే ఆడింది అప్పట్లో. ఇప్పుడు తెలుగు , తమిళ్ లో లవర్ బాయ్ గా పేరు ఉన్న రాజా, భారి అందాల నమిత ముఖ్య పాత్రల్లో ఈ సినిమా , దానికి ఇళ్లయరాజ గారి సంగీతం అంటే అందరి (ముఖ్యం గా తమిళ్ లో ) అంచనాలు పెరిగాయి. నాకు తప్ప. నా ఉద్దేశం లో రాజా అసలా ఆ పాత్ర కి సరి పోడు అని అనిపించింది. అదే విషయం చెప్పాను తనకి. అయన మళ్ళా అటువంటి ఛాన్స్ రాదు అని దూకేసాడు ఆ సినిమాలోకి (పోయేది ప్రేక్షకుడు కదా ) .

సినిమా కథ మొత్తం మార్చి పడేసారు. మంచిదే సరిగ్గా తియ్యగలిగితే. కాని ఇక్కడ ఒక్క సన్నివేశం కూడా అతికే సన్నివేశం లేదు. పాత్రల పేరు కూడా అన్ని ఆరవ వాసన. అలల దొంగ, జగన్, ఇవి పేరులు. నమిత తెలుగు వాళ్ళకి కష్టం, ఆవిడ తమిళ తంబి లకే ఇష్టం. సినిమా లో అప్పటికి ఇప్పటికి పెరిగిన సాంకేతిక అభివృద్ధి వల్ల సినిమాని ఇంకా బాగా ఎలా తియ్యవచ్చో అరుంధతి , మగధీర లాంటి సినిమాలు నిరూపించాయి. అవి చూసిన కళ్ళకి ఇది చుస్తే ఏడ్చినట్టు ఉంది అనడం తప్పు కాదు.

రాజా అసలు దేని మీదా శ్రద్ధ పెట్టి నట్టు గా కనపడదు. ఒకో సీన్ లో ఒకో రకం గా ఉంది అయన వస్త్ర ధారణ కాని, కేశాలంకారణ కాని. ఎక్కడ జానపద పోలికలు కనపడవు అయన ఆహార్యం లో కాని , భాష లో కాని. మీరా పాత్ర దారుణం. అలీ, హనుమంత రావు లు కలిసి హాస్యాన్ని అపహాస్యం చేసారు..

సినిమాలో కొంతవరకు భరించగాలిగింది నరసింహ రాజు తండ్రి పాత్ర వేసారు దీంట్లో. అలాగే కోట శ్రీనివాస్ రావు. తన పాత్రని బాగా చేసారు. జగన్మోహిని తల్లిగా జయమాలిని ని ప్రయతించారు కాని ఆవిడ చేయ్యననడం వల్ల ఆవిడ అక్క జ్యోతి లక్ష్మి ఆ పాత్ర చేసారు.

మొత్తానికి అందరు కలిసి జగన్మోహిని ని దారుణమైన సినిమా గా చెయ్యడానికి శాయశక్తులా కృషి చేసి విజయాన్ని సాధించారు. జై జగన్మోహిని టీం ...

జగన్మోహిని : రాజా , నమిత , కోట శ్రీనివాస్ రావు , మీరా . దర్శకత్వం విశ్వనాధం

ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము ...


















ఒక పక్క మనం అభివృద్ధి చేద్దాం అని చంకలు కొట్టుకుంటూ .. ఇంకో పక్క మన ట్రాఫిక్ ని చూడండి ఎలా ఉందొ ...

పంపిన వారు : హేమంత్ పరాన్జీ

Wednesday, October 21, 2009

ఓ గురువారం సాయంత్రం

అమెరికా లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇండియా వెళ్తున్నారు అంటే ముందర మనం ఆలోచించేది వాళ్ళు మనకి ఎం తీసుకెళ్తున్నారు అని. అదే వాళ్ళు వస్తున్నారు అంటే మనకి ఎం తెస్తున్నారు అని. అలాగే పోయిన గురువారం మధు ఇండియా వెళ్తున్నాడు అని తెలిసి గుడిలో ఉండే జయగారు ఏవో ఇస్తా అని అన్నారు. సరే అని మంగళ వారం వెళ్ళాం తెచ్చుకుని పాక్ చెయ్యడానికీ. ఆవిడ మధు గారు మధ్యానం వెళ్ళిపోతారు కదా సాయంత్రం మీటింగ్ ఉంది వెళ్తారా అని అడిగారు. సాయంకాలాలు మనకి పని పాట ఎం ఉండదు కదా సరే అని చెప్పా. ఎం మీటింగ్ లాంటి వివరాలు కూడా ఎం అడగలేదు. ఆ సంగతి అప్పుడే మర్చిపోయాను.

గురువారం సాయంకాలం సాయి గారు కాల్ చేసి గుడికి వస్తున్నారా అని అన్నారు. గుడికే కదా అని చిరిగిన జీన్స్ , రెగ్యులర్ గా వేసే టి షర్టు , చెప్పులు వేసుకుని సాయి గారి కోసం ఎదురుచూడటం మొదలు పెట్టాను. సాయి గారు మాములుగా గుడికి పంచె కట్టుకుని వస్తారు. కాని ఈ రోజు మంచి ఆఫీసు డ్రెస్ లో వచ్చారు అప్పుడు సందేహం వచ్చింది ... డ్రెస్ మార్చుకోవాలా అని అడిగితె , మారిస్తే బెటర్ అని అన్నారు. ఎం మీటింగ్ అంటే , ఎస్ ఎం యు లో టర్కీ దేశస్తులు అన్ని దేశస్థులతో ఒక స్నేహేపురిత డిన్నర్ అని చెప్పారు. మన దగ్గర ఫార్మల్స్ లేవు , అన్ని జీన్స్ తప్ప. సరే అని వేరే జీన్స్ కు మరి , ఇంకో ఫార్మల్ చొక్కా వేసుకుని , షూ వేసుకుని బయలుదేరాను. గుడి లో పూజారి గారి అబ్బాయిలు ఇద్దరినీ పిక్ అప్ చేసుకునే మీటింగ్ జరిగే చోటికి బయలుదేరాం.

మీటింగ్ కాడ ఎక్కువగానే ఉన్నారు జనాలు. వెళ్ళగానే అందరికి నేమ్ టాగ్స్ ఇచ్చారు. దానితో పాటు ఒక రంగు కాగితం ఇచ్చారు. నా కిచ్చిన రంగు కాగితం ఆకు పచ్చ. మా నలుగురికి సీట్లు నాలుగు వేరు వేరు టేబల్ లో ఇచ్చారు. ఒకో టేబల్ మిద ఎనిమిది మంది కి కూర్చునే వీలు ఉంది. మా టేబల్ మిద నేను వెళ్ళే అప్పటికి ఒక టర్కీ దేశస్థుల జంట, ఒక అఫ్రికాన్ అమ్మాయి కుర్చుని ఉన్నారు. నేను దగ్గరకి వెళ్ళగానే అతను నవ్వుతూ లేచి ఎదురు వచ్చి పరిచయం చేసుకున్నారు. తన పేరు ముస్తఫా , ఇక్కడ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు . ఏడో తరగతి పిల్లలకి కంప్యూటర్ క్లాస్సులు చెపుతాను అని చెప్పారు.

నన్ను పరిచయం చేసుకున్నాను. ఆఫ్రికా అమ్మాయి పక్కన ఇంకో ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ఈ లోపల సమావేశం మొదలు పెట్టిన సూచనగా డయాస్ మిద ఒక అతను వచ్చి ప్రారంభ ఉపన్యాసం మొదలు పెట్టాడు. ఇది మొదలు పెట్టి పది సంవత్సరాలు అయ్యింది అని చెప్పారు. ఎక్కువగా టర్కీ వాళ్ళే కనపడ్డారు. వారి తరవాత ఇక్కడ వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చిన అమెరికన్స్ ఉన్నారు ఇండియాన్స్ మేము నలుగురు కాకా ఇంకో ఇద్దరు కనపడ్డారు. దాదాపు గా అందరూ సూట్ వేసుకునే ఉన్నారు, మేము తప్ప.

మా టేబల్ మిద ఎనిమిది మంది కూర్చో వచ్చు అని చెప్పా కదా. ఒకో కుర్చీ దగ్గర మేము వెళ్ళే అప్పటికే ఒక ప్లేట్ నిండా సలాడ్ (కుకుంబర్, లేక్టిస్ వగైరాలతో చేసినది ) పెట్టి ఉంది. మంచి నీళ్ళు కాని , ఐస్ టీ కాని సర్వ్ చేస్తున్నారు తాగాడానికి. ఇంకో ప్లేట్ లో రెండు రకల టర్కీ స్వీట్స్, ఒక చిన్న బుట్ట లో టర్కీ రొట్టెలు రొట్టెలు ముందర ఒక క్రీం లాంటిది ఉంది ... అది విడిగా కూడా తినవచ్చు అని తర్వాత తెలిసింది.

ఉపన్యాసాలు వింటూ సలాడ్ తినడం మొదలు పెట్టాం. మధ్య మధ్య లో ముస్తఫా టర్కీ గురించి చెపుతూ నేను భారత దేశం గురించి చెపుతూ సలాడ్ ముగించాం. ఉపన్యాసాలు (అందరు అమెరికన్స్ ) ఇచ్చే వారు అందరు దాదాపు గా టర్కీ ని సందర్శించారు. అక్కడి వారి పద్దతులు, అక్కడి వారి స్నేహపూరిత వాతావరణం గురించి ఎక్కువ గా మాట్లాడారు . ఉపన్యాసకుడిని పరిచయం చేసే అప్పుడు, ఒక్కొక్కళ్ళ పేరు వెనుక బోలెడు డిగ్రీలు చెప్పారు. వీళ్ళకి చాలా ఓపిక అంత చదవటానికి అని అనుకున్నా (మనం ఏమో విన్నది రాయడానికే బద్ధకం కదా మరి ).

ముగ్గురి వుపన్యాసం అయ్యాక డిన్నర్ మొదలు పెట్టడానికి ముందర , ఒక ప్రకటన చేసారు. ప్రతి ఒక్కరు వేరే టేబల్ దగ్గరకి వెళ్లి కొత్తగా ఇంకో ముగ్గురిని కొత్తగా పరిచయం చేసుకోవాలని చెప్పారు. నేను నా టేబల్ మిద ఉన్నవాళ్ళనె పూర్తిగా పరిచయం చేసుకోలేదు అని ముందర ఆ ఆఫ్రికా అమ్మాయి కనపడగానే పరిచయం చేసుకున్నా. ఆవిడ ఆఫ్రికా లో ఒక చిన్న దేశం నుంచి వచ్చారు అని చెప్పారు. ఆవిడ పక్కన ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్న పక్కన దేశం లో నుంచి వచ్చారు. నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉండగానే అనిల్, సునీల్ (పూజారి గారి పిల్లలు ) వచ్చారు. నేను వాళ్ళని పరిచయం చేసి మాట్లాడుతూ ఉండగా , ఇంకో ముగ్గురు పరిచయం చేసుకున్నారు. అంత బిన్న దేశాలకి చెందినవారే. ఇలా ఒక అయిదు నిమషాలలో దాదాపు కొత్తగా ఒక ఎనిమిది మంది కలిసారు.

మళ్ళా ఒక ప్రకటన , డిన్నర్ కి అందరు కూర్చోవాలని.. అప్పుడు నాకు ఇచ్చిన కాగితం అకుపచ్చది టేబల్ మిద పెట్టినట్టు గుర్తు వచ్చింది. నా పక్కన ఉన్న ముస్తఫా ఎదురుగా గిలబి రంగు కాగితం, వాళ్ళ పక్క వాళ్ళ దగ్గర ఎర్ర కాగితాలు గమనించాను. అవి మేము తినే ఆహారం గురించి సర్వర్ కి తెలియడానికి ఇచ్చిన కాగితాలు అని అర్ధం అయింది. నాది శాఖాహారం, పింక్ ఉంటె చేపలు, ఎర్ర రంగు కి కోడి మాంసము ఇలా వివిధ రంగులకి వివిధ రకాల భోజనం. నాకు శాఖాహారం లో సమోసా లాంటిది ఒక మూడు పెట్టారు దాంట్లో లైట్ గా పాల కూర పెట్టారు (మనకి ఎక్కువగా ఆలుగడ్డ మసాల పెడతారు కదా ). కొంచం బ్రోకల్లి , కొంచం వేయించిన బీన్సు , వేయించిన అన్నం కొంచం లావుగా ఉన్నది పెట్టారు. మనకి ఆ అన్నం సయించలేదు కాని ఒక సమోసా లాంటింది తిని ఆ బ్రోకేల్లి , బీన్సు తిని సరిపుచ్చు కున్నా.

స్వీట్స్ మనకి మిడిల్ ఈస్ట్ షాప్స్ లో కూడా దొరకుతాయి , వాటిని dry గా తెచ్చి వాటి మీద గోరువెచ్చని పంచదార పాకం వేస్తె చాలా బాగుంటుంది అని ముస్తఫా భార్య చెప్పారు. మేము భోజనం ముగించే సమయానికి మళ్ళా ఉపన్యాసాలు మొదలు పెట్టారు. ఇంకో ముగ్గురు అయ్యాక ఇక్కడి మేయర్ వచ్చి ఉపన్యాసం మొదలు పెట్టారు. అయన చెప్పిన దానిప్రకారం తొంభైల మొదట్లో ఇక్కడ తెల్ల వాళ్ళే ఎక్కువ గా ఉండేవారు (తొంభై శాతం ) ఇప్పుడు తెల్లవాళ్ళ సంఖ్య అరవై అయిదు కి వచ్చింది. మిగిలిన ముప్పై అయిదు శాతం లో ఇరవై శాతం వరకు మన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు అని చెప్పారు . ఈ పద్దెనిమిది ఏళ్లలో చాలా పెరిగింది మన సంఖ్య అని అర్ధం అయ్యింది.

సమావేశం ముగిసే సరికి కొంచం ఏదోలా అనిపించింది. అప్పుడే అయ్యి పోయిందా అన్న భావన. అక్కడ సాయి గారి టేబల్ లోఒక టర్కీ కి చెందిన మెడికో కుర్చుని ఉంది. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం. తనకి అక్కడ చదువుకునే అవకాసం లేక ఇక్కడకి వచ్చి చదువుకుంటోంది (టర్కీ లో అమ్మాయిలు జుట్టు కనపడకుండా తల మొత్తం ఒక వస్త్రం కప్పుకుంటారు. అమ్మాయిలు, కాని University లొ చదివె అమ్మాయిలు అలా కప్పుకుంటె వారికి University లో చదివె అవకాశం లేదు అలా అని కప్పుకొక పొతే వారు వారి మతానికి అపచారం చెసిన వారు అవుతారు . అందువల్ల వారికి అక్కడ చదివె అవకశం లేదు ) ఎంత బాధొ వింటుంటె నె, అలాంటిది అనుభవించాలి అంటె ఒక్క సారి అలొచించండి.) మన దేశం ఎంత గొప్పదొ అని అనిపిచదం లొ తప్పు లెదు. అక్కద నుంచి బైటకి వచ్చాక కొంతమంది కొత్త స్నెహితులని కలిసిన అనుభుతితొ యింటికి చెరుకున్నా.

Monday, October 19, 2009

మహాత్మా - బ్లూ చిత్ర సమీక్షలు

మహాత్మా ( తెలుగు చిత్రం )

కృష్ణ వంశి పేరు వినగానే ఎవరో విలేఖరి పూర్వకాలం ఇచ్చిన ట్యాగ్ లైన్ క్రియేటివ్ అని వచ్చేస్తుంది అదేదో ఇంటి పేరు లాగా. (సూపర్ స్టార్ కృష్ణ , మెగా స్టార్ చిరంజీవి గట్రా లాగా వాళ్ళు ఇప్పుడు ఆ పదవి లో లేక పోయినా సరే. ) శ్రీకాంత్ వందో సినిమా, కృష్ణ వంశి దర్శకత్వం , పేరు మహాత్మా అనగానే జనాలకి అంచనాలు పెరుగాయి.

కృష్ణ వంశి మాములుగానే సినిమా కి శ్రీకాంత్ చిత్రానికి ఉండే మార్కెట్ కన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి (కృష్ణ వంశి సినిమాలకి ముందర అనుకున్న బడ్జెట్ కి పూర్తీ అవ్వడం అన్నది కలలో మాట, ఎప్పటికప్పుడు బడ్జెట్ పెంచుకుపోవడం అయన creativity అనడం తప్పుకాదు) సినిమాని నష్టానికి (ఇది కూడా చాలా మామూలు అయన సినిమాకి )అమ్మారు . సరే సినిమా ఇంకా మాములుగా మన ఎన్ ఆర్ ఐ లు కొన్నారు (చెప్పినా వినరు కదా అని మనం చెప్పడం మానము కదా) అతి సాధారణం గా సినిమా ప్రింట్ ఆలస్యం గా వచ్చింది అందువల్ల సినిమా కూడా ఆలస్యం గా విడుదల అయ్యింది.

సరే ఈ లోపల మనకి తిన్నది అరగదు కదా, అందరికి ఫోన్ లు చేసి ఎలా ఉంది సినిమా అని అడిగాం. చాల వరకు కృష్ణ వంశి పైత్యం అది ఇది అన్నారు. మనం కొంచం సీతయ్య టైపు కదా సినిమా చూడటం లో (ఎవరి మాటా వినం ) అందుకని ఓపికగా మొదలు పెట్టా సినిమా చూడటం.

మొదటి నలభై నిమషాలు సినిమా తాబేలు నడక. గొంగళి ఎక్కడ అంటే వేసిన చోటే అన్నట్టు కదలదు. రెండు ఆరవ గోల పాటలు తప్ప. (టైటిల్ సాంగ్ బాగుంది).. ఇంకా నాయిక సంగతి చెప్పక్కరలేదు . కారణం లేకుండా లా చదివి ఉ అంటే ఓ అని ఏడుస్తానుంటుంది. లా చదివితే ఎడవకుడదని కాదు కాని ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉంటారు అండి మన కృష్ణ వంశి సినిమాలో . సినిమా మొదటి గంట దాదాపు గా అయ్యాక అప్పుడు కొంచం మలుపు తిరుగుతుంది అక్కడ నుంచి కొన్ని ఎత్తుకొచ్చిన (అంటే ఇంతకు ముందర ఇలాంటి సన్నివేశాలు వేరే సినిమాలో చూసాం కదా అన్న భావన రావడం అన్నమాట ) సన్నివేశాలతో సాగుతా ఉంటుంది. ఆఖరి పది నిమషాలు మంచి గ్రిప్ లో కి వెళ్లి క్లైమాక్స్ బాగా తీసారు.

కథానాయకి కి భాష తో బాటు నటన కూడా రాదు.కథ మంచి పట్టులో ఉన్నప్పుడు స్వప్నం లో జానపద బాణీ లో పాట వాళ్ళ కేరళ లో హీరో తో పాటు ఇంకో వంద మంది తో నీళ్ళల్లో పాడుకుంటుంది పడవ ఎక్కి.. అమ్మాయి తండ్తి కి ఎక్కువ సహాయపడుతూ ఉంటుంది అయన లాయర్ కాబట్టి. సినిమా మొదట్లో కొత్తగా ప్రాక్టీసు పెట్టిన లాయర్ అని చెపుతారు. మధ్యలో టీవీ వాళ్ళు ఏమో లీడింగ్ లాయర్ అని చెప్పేస్తారు అంటే ఈ లోపల అమ్మాయి లీడింగ్ లాయర్ అయిపొయింది అన్నమాట. హీరో తనకోసం గన్ పట్టుకుంటే రౌడీ అయిన సరే ప్రేమించిన అమ్మాయి తర్వాత గాంధి గారి కబుర్లు చెపుతుంది. హీరో వేరే కారణాల వాళ్ళ గాంధీ గిరి గురించి తెలుసుకుని ప్రశ్నలు వేస్తె అప్పుడు దారి చూపుతుంది. అంతకు ముందర హీరో ని సంస్కరిద్దాం అని ఆలోచన ఏ కోశానా ఉండదు. సుబ్బరంగా పాటలు పాడుకుంటూ తిరిగేస్తుంది.

ఒక్క హీరోయిన్ అనే కాదు, ఏ పాత్రకి సరి అయిన లోతు లేదు పాత్రలు . అన్ని పై పై నే. ఏ సన్నివేశం చూసినా మందలు మందలు గా జనం. కథ కాళ్ళకి అడ్డం పడుతూ కనపడతారు. కథకి అవసరం లేని సన్నివేశాలతో ఇబ్బంది పడుతూ, మనని ఇబ్బంది పెడుతూ ఏదో ఉంది అని అనిపిస్తూ , ఏమి లేదని కనిపిస్తూ , ఇదే కృష్ణ వంశి సినిమా అని నిరూపిస్తూ నీరసంగా, నిశ్చలం గా కదలక పోవడం ఈ కదిలే చిత్రం ప్రత్యేకత.

సినిమా చూస్తుంటే శ్రీకాంత్ తన నటన కంటూ ఉన్న ప్రత్యేకత ని మర్చిపోయాడు ఏమో అనిపిస్తుంది. చాలా సన్నివేశాలలో చిరంజీవే కనపడతాడు శ్రీకాంత్ కన్నా. రామ్ జగన్ కి కొంచం గుర్తింపు వచ్చిన వేషం ఇదేనేమో శివ తరవాత. జయప్రకాశ్ రెడ్డి కూడా పరవాలేదు.

సినిమా లో ముఖ్యం గా చెప్పుకోవలిసినది సిరివెన్నెల పాట. అద్బుత్యమైన పాట. ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధి (సెన్సార్ ఇబ్బంది వల్ల కొంతమంది ఇంటిపేరు గా మార్చారు ) అది తప్ప సినిమా లో పైన చెప్పినట్టు గా సరుకు తక్కువ సౌండ్ ఎక్కువ.

ఇన్ని కబుర్లు చెప్పిన మహాత్ముడు కృష్ణ వంశి వరదబాదితులకి సహాయం చేసే విషయం లో గాంధి గారి విగ్రహం లాగే నిశ్చలంగా ఉన్నారు కదలకుండా , మెదలకుండా, నన్ను కాదన్నట్ట్టుగా జరిగేది చూస్తూ ...

మహాత్మా .. శ్రీకాంత్ వందో చిత్రం. భావన నాయిక , కృష్ణ వంశి దర్శకత్వం .
---------------------------------------------------------------------------------------------
బ్లూ (హిందీ చిత్రం )

హిందీ వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు ఏమో అని మనకున్న సందేహలని పటాపంచలు చేసే చిత్రం బ్లూ.. నూట ముప్పై కోట్లు పెట్టి తీసిన సినిమా. ఈ సినిమాకి pirates of the carribean సినిమాకి పనిచేసిన కెమెరా మాన్ పని చేసారు, సంవత్సరం కష్ట పడి చేసిన సినిమా అది ఇది అని ఓ చెప్పితే నిజమే అనుకున్నా. పాటలు కూడా బాగానే ఉన్నాయ్ కదా అని కొంచం ఆతురత గానే చూసా.. సినిమా లో మొదటి సన్నివేశం చూడగానే ఇది కూడా సరుకు తక్కువ సౌండ్ ఎక్కువ సినిమా అని తల మిద బల్బు వెలగడం మొదలు పెట్టింది. అయిన సరే మనం సీతయ్య వారసులం కదా సినిమాలు చూడటం లో, అందుకని ఆ బల్బ్ మిద టర్కీ టవల్ వేసి మొత్తం ఓపికగా చూసా.

సినిమా చాలా వరకు ఆంగ్లం లో వచ్చిన పాత సినిమా Deep (1977) కి నకలు. సినిమాలో చాలా వరకు సన్నివేశాలు వేరే వేరే ఆంగ్ల సినిమాలో వచ్చిన సన్నివేశాలకి నకలు. పనికి రాని చేజ్ దృశ్యాలు. నవ్వు రాని హాస్య దృశ్యాలతో నింపేశారు.

లారా దత్తా బికిని దృశ్యాలు బాగున్నై . అలాంటివి చూసి మనం ప్రియమణి ని అలా చూస్తె రాజుని చుసిన కళ్ళతో మొగుడిని చూస్తినట్టు ఉంటుంది మరి. సినిమాలో బాగుంది కెమెరా మాత్రమె. మిగిలింది అంతా పరమ పరమ బోర్ సినిమా.

సంజయ్ దత్ ఊరిపోయి దారుణంగా ఉన్నాడు. నాయికలు పరవాలేదు. అక్షయ్ కొంచం పరవాలేదు. జావేద్ ఖాన్ సినిమా సగం మొహం కనపడదు రెండు కారణాల వల్ల .. ఒకటి అయన కి ఉన్నవి ఎక్కువగా చేజ్ దృశ్యాలు అందువల్ల బైక్ మిద హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మొహం కనపడదు. రెండో కారణం జుట్టు సగం మొహం కప్పెయ్యడం వల్ల (మన రామ్ చరణ్ కి అంటే అర్ధం చేసుకోగలం వీడికి ఆ అవసరం ఏంటో అర్ధం కాలా మరి )

కథ మొత్తం ఒక సముద్రం లో మునిగిన సంపద గురించి. దానికి దారి తెలిసిన వాడు ఒక్కడే .. సంజయ్.. దాని కోసం ఎవరు ఎలా ఎం చేసారు అన్నది కథ. బాహామాస్ కొత్తగా అందంగా ఉంది అని చెప్పడం హాస్యాస్పదం. అది ఎలాంటి కెమెరా అన్న సరే అందంగానే ఉంటుంది . అండర్ వాటర్ కమెరా బాగుంది. మంచి స్టాండర్డ్ maintain చేసారు.


నీతీ : పాటలు బాగుంటే ... సి డి కొనుక్కుని విను. అంతే కాని సినిమా చూడాలనుకోకు.( గన్ను చూడాలనుకుంటే తప్పులేదు.. బుల్లెట్ చూడాలనుకుంటే తప్పే. చచ్చి పోతాం ( అతడు లో డైలాగు ) )

నూట ముప్పై కొట్లలో ముప్పై కోట్లు వచ్చినా గొప్పే ఈ సిన్మాకి .


బ్లూ : తారాగణం : అక్షయ్ కుమార్, సంజయ్ డుత్త్, జావేద్ ఖాన్ ,

Wednesday, October 14, 2009

పురాణ ప్రలాపం - హరి మోహన్ ఝూ

డెట్రాయిట్ లో సాహితి సభలకి ఉమా వచ్చినప్పుడు లక్ష్మి రెడ్డి గారి ఉపన్యాసం వినడం జరిగింది. పుస్తకం కొంచం బిన్నంగా ఉంది అని అనిపించింది. చదివాక నిజంగానే భిన్నంగా అనిపించింది. మనం చిన్నప్పటి నుంచి ఏదో ఒక సందర్భం లో సత్యనారాయణ వ్రతాన్ని ఇంట్లో చెయ్యడమో, లేక ఎవరి ఇంట్లో ఏదన్న శుభకార్యం జరిగినప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తుకుంటూ ఉంటె వెళ్లి చూడటమో, సంవత్సరానికి ఒక సారి ఏదో ఒక సందర్భం గా ప్రసాదం తినడం జరగక మానదు. ఆ వ్రత కథని ఇప్పటికి బోలెడు సార్లు కూడా వినివుంటాం.

కథకులు హరిమోహన్ ఝూ గారి ప్రకారం ఆ పూజ ఒక పూజ ఒక నాటకమైతే , కథ ఒక నవల.. పూజ నాటకం అని ఎందుకు అన్నారు అంటే , అన్ని ఉత్తితిగా పెట్టి, ఇదే బంగారం అనుకో, ఇదే పట్టు పీతంబరం అనుకో అని అంటాం కదా. పైగా అన్ని పెట్టి గంట వాయించేసి తినేది మనమే. అందువల్ల అది ఒక నాటకం అని ఈయన భావన.

కథ చివర్లో ఈ కథ చదివి అక్షింతలు వేసుకున్నవారికి , ప్రసాదం తిన్నవారికి, పూజ చేసినవారికి అష్ట ఐశ్వర్య ప్రాప్తి, మరణం తరవాత సత్యలోక ప్రాప్తి లభిస్తాయి అని ఉంటుంది కదా. మరి జనాలు అందరు ఇది చదివి ప్రసాదాలు తినేసే ఉంటారు కదా. వారు అందరికి ఐశ్వర్యం ఎందుకు రాలేదు. ముందర ఈ పూజ కాశి లో బీద బ్రాహ్మణుడు చేసి తరించారు అని అంటారు కదా. మరి మిగిలిన బ్రాహ్మణులు ఎందుకు ఈ పూజ చెయ్యలేదు. వారికి ఆ మాత్రం తెలివి లేదా ?

అంతే కాదు భగంతుడు పెద్ద వ్యాపారి. పూజ చేస్తా అని చెయ్యకుండా వాయిదా వేసే వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేసి వాళ్ళు పూజ చెయ్యగానే వాళ్ళకి విముక్తి కలిపిస్తూ ఉంటాడు .

సౌభాగ్య సంతతికరం సర్వత్రా విజయీ ప్రచమ్ (పూజ చేసే వాడు సౌభాగ్యం పొందుతాడు అన్ని చోట్ల గెలుపొండుతాడు ) అంటే వాడి ప్రతివాది ఇద్దరు పూజ చేస్తే ఎవరు గెలుపు పొందుతారు.

పూజ చేయించే గృహస్తు కోరిక సిద్దిస్తుందో లేదో కాని పూజ చేయించన బ్రాహ్మణుడి కోరిక మాత్రం సిద్దిస్తుంది. ఎందుకంటే కథ విని అందరు బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి. లేక పొతే విధాత కూడా ప్రతికులుడు అయి పోగలదు..

ఇది మచ్చుకు మాత్రమె నేను ప్రస్తావించింది . హరి మోహన్ గారు ప్రతి పద్యం ఎంచుకుని దానికి బోలెడు నానార్హాలు చెప్పారు. అయన భాష పాండిత్యానికి ముగ్డులం కాక తప్పదు. ఒక ఇరవై మూడు ప్రసంగాలో అన్ని బాబాయి , అబ్బాయి ల మధ్య చర్చ జరిగినట్టు చూపించారు. అక్కడక్కడ అనువాదం కొంచం ఇబ్బంది పెట్టినా తప్పకుండా చదవాలిసిన పుస్తకం ఇది .

పురాణ ప్రలాపం - మైథిలి మూలం : హరి మోహన్ ఝూ . తెలుగు అనువాదం : లక్ష్మి రెడ్డి వేల వంద రూపాయలు

పెత్తనం - మల్లీశ్వరి కథలు

డెట్రాయిట్ లో సాహితి సభలకి వెళ్లి నప్పుడు ఆనంద్ మల్లీశ్వరి గారి కథల పుస్తకం ఇచ్చారు. పుస్తకం చిన్నగానే ఉండటం తో కథ అక్కడే చదవటం మొదలు పెట్టాను. మొదటి కథ పోరాటం చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఒకరి కథ కొంచం ఇంచు మించు గా యిలాగే ఉండటం తో ఆసక్తి కలిగింది. మంచి శైలి. ఈవిడ మీద ఓల్గా గారి ప్రభావం బాగానే ఉన్నట్టు గా ఉంది (ఓల్గా గారి నవలల మీద పరిశీలన చెయ్యడం వాళ్ళ ఏమో మరి ). మిగిలిన స్త్రీ వాద రచయిత్రులకి ఈవిడకి కొంచం మంచి తేడా ఉంది. మిగిలన వాళ్ళలా కాక యివిడ మగవాళ్ళ వైపు కూడా కొంచం ఆలోచిస్తున్నారు అని అనిపించింది. అంతే కాక వర్ణ వివక్ష లాంటి వాటి మీద కూడా బాగా చర్చించారు. ఇది మంచి పరిణామం.

స్త్రీలకి ప్రయాణం లాంటి వాటి వెనుక ఇంత మానసిక సంఘర్షణ ఉంటుందా అని అనిపించింది. మీరే చేసారు అన్న కథ మనం మనకి తెలీకుండా ఎలా అమ్మాయిలని అబ్బాయిలని విడిగా చూస్తున్నామో చెపుతుంది. (అమెరికా లో అమ్మాయిలు అయితే పింక్ కలర్ , అబ్బాయిలు అయితే బ్లూ కలర్ దుస్తులే దొరుకుతాయి. ఒక పక్క ఇద్దరు సమానమే అని ఇంకో పక్క ఈ గోల ఏంటి అని ఎంత చిరాకో నాకు, ఒక రకం గా పింక్ చూస్తె ఎలర్జీ వచ్చే అంతగా ).

ఇంకో మంచి కథ ఊయ(హ) ల మంచం. మన మనసులో కోరికలు ఎలా అణచి వేయబడతాయో దాని వల్ల ఎలా నలిగిపోత్తమో బాగా చెప్పారు. మంచి కథ.

అన్ని మంచి కథలేనా అంటే , కొన్ని సాధారణ కథలు కూడా ఉన్నాయి . వంటాట అను రాజకీయ వంటింటి కథ, మాట్లాడుదాం , పాద బందనం లాంటివి కొంచం సాదా సీదా కథలు లాగే ఉన్నాయి నాకు.

కథనం అన్నింట్లో బాగుంది. కథ మొదలు పెట్టగానే చదివించే గుణం, అనవసర మసాలాలు లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నది మనసుకు ఎక్కే లాగ చెప్పే గుణం అన్ని కథలలో ఉంది.

శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ నిర్వహించిన కథ సంపుటాల పోటీలో బహుమతిగా ఆర్ధిక సహాయం పొందిన పుస్తకం. వారి అమ్మాయి స్నిగ్ద పేరు మిద స్నిగ్ద బుక్స్ అని ప్రచురించారు.

పెత్తనం - మల్లీశ్వరి కథలు వేల నలభై రూపాయలు.

Tuesday, October 13, 2009

జే డి చక్రవర్తి కామెడి ...

మాములుగా మన సినిమా వాళ్ళ మిద ఒక పాత జోక్ ఉంది. హీరోయిన్ ఎప్పటికి పదహారు ఏళ్ళు దాటదు. కాని ఇప్పటి హీరోయిన్ కొంచం అటు ఇటు గా మరీ అంత దాయటం లేదు. మన జే డి చక్రవర్తి మాత్రం హీరోయిన్ కన్నా దారుణం. ఇంటర్వ్యూ ఇస్తే మహేశ్వరి గులాబీ లవ్ స్టొరీ లేకుండా ఉండదు. ఇంకా దారుణం ఏంటి అంటే దాని మిద చెత్త కామెడి. ఈ మధ్యే గాయని స్మిత కొత్తగా ముస్తఫా ముస్తఫా (మన వాళ్ళకి తెలుగు పేర్లు పెట్టడం నామోషి కదా మరి,) అని స్నేహితుల మీద ఒక కార్యక్రమం ఏదో ఛానల్ కి మొదలు పెట్టింది ( ఈవిడ కూడా బోలెడు ఆంగ్లం లో ను కొంచం మొద్దు (ముద్దు కాదు ) మొద్దు తెలుగు లో నాజుకుగా (అని ఆవిడ అబిప్రాయం ) మాట్లాడుతోంది .

జే డి మాటల్లో కొన్ని ఆణిముత్యాలు కొన్ని...
నటుడి నుంచి దర్శకుడి గా మారడం అన్నది గ్రాడ్యుయషన్ పట్టలాంటిది, హిందీ లో సినిమా చేస్తే మాస్టర్స్ పట్టా , హాలీవుడ్ సినిమా చేస్తే డాక్టరేట్ పట్టా లాంటిది .

రాంగోపాల్ వర్మ గారి తర్వాత బోలెడు టాలెంట్ ఉన్న ఏకయిక దర్శకుడు కృష్ణ వంశి గారు మాత్రమె. కృష్ణవంశి ని జనాలు కావలిసినట్టు సినిమాలు చేసుకోన్నివ్వడం లేదు. అయన జనాలకోసమే వాళ్ళు కోరిన సినిమాలు చేస్తున్నారు...

మోస్ట్ ఓవర్ rated artist సిద్దార్థ . ఎందుకంటే సిద్ధార్థ కి ఇవ్వలిసిన దానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తున్నారు అంట.

అన్నిట్లోకి హై లైట్ కామెడీ ... శివ చిత్రం చేసే నాటికి అయన వయసు పదహారు మాత్రమె.....

ఈయన కూడా మనకోసమే తొందర్లో ఒక సంగీత భరిత ప్రేమ కథా చిత్రాన్ని తియ్యబోతున్నారు అంట.

Friday, October 9, 2009

ఏడీ ఆ కామన్ మాన్. రక్షకుడు...

యువరాజ్యదినేత .. యువ రాజు శ్రీ శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కనపడటం లేదు. అప్పట్లో (అంటే చిరంజీవి గారు పార్టీ పెట్టక ముందర ) కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి మొదలు పెట్టి, అప్పటి జీవన సహచరి బావి భార్య అయిన రేణుక గారికి ఒక కోటి రూపాయల చెక్ ఇచ్చారు. భక్త జనం రెండు అంబులెన్స్ లు కూడా బహుమతి ఇచ్చారు ఆ పార్టీ కి. ఇప్పుడు రాష్ట్రము వరదలతో తల్లడిల్లుతుంటే మన కొమరం పులి మాత్రం కలుగులో నుంచి బయటకి ఎందుకు రావడం లేదు చెప్మా ? వరదల్లో ఉన్నది ఆ కామన్ మాన్ కాదా ? వాళ్లకి ఈ సమయం లో ఆసరా అవసరం లేదా .. లేక అన్నగారు వెళ్లి పలకరించి వచ్చారు కదా నేను అక్కరలేదు అని అనుకుంటున్నారా ? అన్నగారు కి డబ్బు ఇస్తే మీరు నటిస్తారా ... అలా ఎప్పుడు చెయ్యలేదు కదా. మరి ఇప్పుడు మాత్రం ఆ సూత్రం ఎలా కుదురుతుంది ? అప్పట్లో అది చేస్తాం ఇది చేస్తాం అని వాగ్దానాలు చేసేసారు కదా.. పదివిలోకి వస్తేనే చేస్తారా. అలా అని ఎప్పుడు అనలేదే ఆ సమయం లో... మీ తరవాత వచ్చిన పిల్లలు రామ్ చరణ్ , అల్లు అర్జున్లు ఏదో కొంత మీ అన్నగారికి ఇచ్చారు .. మీరు, మీ ఇంకో బండ అన్నగారు ( నాగేంద్ర బాబు )మాత్రం బండల్లాగే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు

కాల్షీట్ కి మూడు లక్షలు సంపాదించే బ్రాహ్మి బాబు లక్ష రూపాయలు పెట్టి సరకులు పంపారు .... ఇయనే కొంచం బెటర్ ఏమో పవన్ గారి మిద...

మిగిలిన తొట్టి కామిడి గాంగ్ మాత్రం ఇంకా మేలుకోలేదు... అలీ కాల్షీట్ కి రెండు లక్షలు, మిగిలన చిన్న చితకా రోజుకు (అంటే ఒక కాల్షీట్ కి, సాధారణంగా కాల్షీట్ అంటే ఉదయం ఎనిమిది నుంచి మూడు వరకు ఒక కాల్షీట్ దాంట్లో మళ్ళా కాఫీకి భోజనానికి , మధ్య లో ఒక గంట నిద్ర కి పోతుంది ) అరలక్ష నుంచి పైకే ఉన్నారు. లేడీ ఆర్టిస్ట్ అయితే రోజుకి పాతిక వేల నుంచి పైకే కాని తక్కువ కి ఎవరు లేరు. ఇంత సంపాదించే వాళ్ళు మనకి ఎంత సేవ చేస్తున్నారు అంటే .. ఏమీ లేదు.. కబుర్లు మాత్రం కోటలు దాటుతాయి అందరివి .. హీరో ల తో సహా ...

వీళ్ళు ఇలా ఉంటె నాయకిలు అసలా పట్టించుకోడం లేదు. ఒక్క నాయకి కూడా ఇదిగో నా సాయం అని అన్న పాపాన పోలేదు. .. ఒకళ్ళు కూడా సినిమా కి డెబ్భై లక్షలకి కి తక్కువ కి రావడం లేదు ఈ మధ్య (నేను చెప్పేది మీడియం రేంజ్ హీరోయిన్స్ సంగతి ) టాప్ హీరోయిన్ అయితే కోటి పైనే

Thursday, October 8, 2009

నిద్ర పోయే నిర్మాతలు /దర్శకులు

ఒక సినిమాకి విడుదల వాయిదా పడిందీ అనుకోండి. తరవాత విడుదల అయ్యే రోజు వరకు మన నిర్మాత దర్శకులు నిద్రపోతారు. తాజా ఉదాహరణ మన మహాత్ముడు కృష్ణవంశి గారి నిర్మాత. రెండో తారీకు విడుదల కావాల్సిన సినిమా తొమ్మిదికి వాయిదా పడింది. అంటే వాళ్ళకి ఇంకో వారం సినిమా కి కావలసిన వి ఎమన్నా కావాలి అంటే చేసుకునే సమయం దొరికింది అన్నట్టు. ఈ లెఖ్ఖన అమెరికా కి కాని ఇంకో దేశానికీ కాని ప్రింట్ బోలెడు ముందు పంపు కునే అవకాశం ఉంది. కాని ఆఖరి నిమషం లో మన నిర్మాత దర్శకుడు మేలుకుని ఆఖరి రెండు రీళ్ళు లో ఏదో చిన్న తప్పు ఉంది అది సరి చేసి పంపుతాం అని కూర్చున్నారు. ఓవర్ సీస్ కి కొన్న పంపిణీదారుడికి విమాన చార్జీలతో బొక్కతో పాటు టెన్షన్ మాత్రలు మింగాక తప్పలేదు.

ఇది కొత్తగా జరిగీ విషయం కాదు .. ఎప్పుడూ ఇదే పాట. గీరేశం గారు చెప్పినట్టు మనవాళ్ళు ఉత్త ...

సిరివెన్నెల గారు పాడిన ఈ పాట వినండి ఈ చిత్రం నుంచి

నిన్ను కలిసాక - చిత్ర సమీక్ష

అభిరాం (చైతన్య), దీప్తి (దీప ) ఒక జంట. చందు (సంతోష్) బిందు (ప్రియ ) ఇంకో జంట. అభిరాం , బిందు ప్రాజెక్ట్ పనిమీద అమెరికా కి వస్తారు. ఇద్దరు ఒకే చోట పని చెయ్యడం, పక్క పక్క అపార్ట్మెంట్ లో ఉండటం తో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అక్కడ భారతదేశం లో దీప్తి కి చందు పరిచయం అవుతాడు. కానీ వాళ్ళ పరిచయం స్నేహాన్ని దాటదు. అభిరాం తనది ప్రేమో ఆకర్షణ అన్నది తెలుచుకోలేక పోతాడు. దీప్తి ని ప్రేమించే తను మళ్ళా ఇంకో అమ్మాయిని ఎలా ప్రేమిచగలడో అతనికే అర్ధం కాదు. చివరికి ఎం చేసాడు అన్నది ముగింపు.

మాములుగా ఇలాంటి కథల్లో మన వాళ్ళు హీరో పేరున్న వాడు అయితే , నాయకి పేరున్నది అయితే ఇద్దరినీ కలిపేసి ఇండియా లో ఉన్న వాళ్ళని కలిపేసి నానా కంగాళీ చేసి , తల తోక లేని ప్రేమ మిద ఒక ఉపన్యాసం పెట్టి ముగిస్తారు. ఈ సినిమాలో అందరు కొత్తవాళ్ళు కావడం వల్ల అటువంటి పైత్యం ఎం పెట్టకుండా చక్కగా ముగించారు.

నటుల్లో చైతన్య బాగా చేసాడు. సంతోష్ పరవాలేదు. నాయకిలు ఇద్దరు పరవ్హాలేదు. సంగీతం బాగానే ఉంది. మౌనం మనసుల్లోన పాట బాగుంది. నిర్మాణ విలవలు బాగున్నై.

శివనాగేశ్వర రావు అమితాబ్ గెట్ అప్ లో లవ్ గురు గా దండగ పాత్ర. అలాగే ఎం ఎస్ నారాయణ, కొడుకు పాత్రలు కూడా దండగ. కథకి ఎందుకు పనికి రాని పాత్రలు. కృష్ణుడు , ఆఫీసు లో సన్నివేశాలు చాలా వరకు సాగాతీతకి తప్ప దేనికి పనికి రావు. కథకి అనవసరమైన సన్నివేశాల వల్ల సినిమా నత్త నడక సాగినట్టుగా ఉంటుంది.

ఆందరూ డాన్సుల్లో వీకే .. జగపతి బాబు ఒక చిన్న పాత్రలో తన వేషం తానె వేసాడు. సినిమా పర్వాలేదు చూడొచ్చు. శివనాగేశ్వర రావు తన భాణి వదిలి కొత్త భాణి లో వెళ్ళడానికి మంచి ప్రయత్నమే చేసారు.

జూనో (2007)

ఈ రోజు మధ్యానం అనుకోకుండా ఏదో ఛానల్ లో జూనో అన్న సినిమా చూడటం జరిగింది. నిజానికి టైటిల్స్ వెరైటీ గా ఉండటం వల్ల , పాట కూడా చాల నచ్చడం వల్ల సినిమా మొత్తం చూసాను.

Juno MacGuff (Ellen Page) అన్న పదహారేళ్ళ అమ్మాయి సినిమా మొదలు కాగానే తను కడుపుతో ఉన్న విషయం తెలుసుకుంటుంది. ముందర అబోర్షన్ కి ఆలోచించినా తరవాత ఏదన్న మంచి కుటుంబానికి తను కనగానే పెంపకానికి ఇవ్వాలని నిర్ణయించుకుని అలంటి వాళ్ళ కోసం వెతకడం మొదలు పెడుతుంది . పేపర్ లో పడిన ప్రకటనల ని చూసి ఒక దాన్ని ఎంచుకుని వల్ల ఇంటికి వెళ్తుంది. Mark , vinessa Loring (Jason Bateman and Jennifer Garner) లు ఆ ప్రకటన ఇస్తారు . వాళ్ళ ఇల్లు వాళ్ళ దాంపత్యం చూసి ఆ ఇల్లు అయితే తన పుట్టబోయే బిడ్డకు సరి అయిన స్తలం అని నిర్ణయించుకుంటుంది. కాని పాప పుట్టబోయే సమయానికి అన్యోనంగా ఉన్న మార్క్ , వేన్నిసా దాంపత్యం లో కలతలు వస్తాయి. మార్క్ తను పిల్లలని పెంచడానికి తయారుగా లేను అని , విడిపోవాలని నిర్ణయించుకున్నా అని చెప్తాడు. జూనో కి దుఖం ఆగాదు. వినీసా ని ఒంటరిగా భాద్యత తీసుకునే బలం ఉందా అని నోట్ పెట్టి వెళ్లి పోతుంది. చివరికి ఏమవుతుంది అన్నది సినిమా చూస్తీనే బాగుంటుంది.

సినిమా మొత్తం చూసాక పాటలు కాని , జూనో గా చేసిన ఎలన్ పేజి నటన గాని మర్చిపోలేం. సినిమా మొత్తం Vancover లో తీసారు. దాదాపు నలభై రోజుల్లో (ముప్పై రోజుల్లో షూటింగ్ కి ) మొత్తం సినిమా చిత్రీకరణ అయిపొయింది ఈ సినిమాకి అంటే నమ్మక శక్యం కాదు. అతి చిన్న బడ్జెట్ తో (6.5 millions ) తీసిన ఈ సినిమా fox searchlight కంపెనీ కి మొట్ట మొదటి పెద్ద హిట్ సినిమా.

దర్శకుడు Jason Reitman కి ఇది రెండో సినిమా. మొదటి సినిమా thank you for smoking (ఇది కూడా మంచి సినిమా , కుదిరితే తప్పకుండా చూడండి ) . జేసన్ తండ్రి కూడా దర్శకుడే , అయన ghost busters, kindergarden cop లాంటి సినిమాలు తీసారు.

ఆరు వారాల లో పూర్తీ చేసిన ఈ సినిమాకి టైటిల్స్ మాత్రం దాదాపు గా ఏడు నెలలు పట్టింది అంటే ఆశ్చర్యం వేస్తుంది. సినిమా టైటిల్స్ కోసం ఎలన్ పేజి ని ఒక రున్నింగ్ త్రేడ్ మిల్ మిద సన్నీ డి ఆరంజి జుస్ కాన్ ఇచ్చి పరిగెత్తించి దాన్ని టైటిల్స్ కి వాడారు అనిమషన్ చేసి. దాదాపు గా తొమ్మిది వందల కట్ అవుట్ లి చేత్తో చేస్తినవి వాడారు దిని కోసం.

సినిమా కోసం అంటూ రాయించిన పాటలు తక్కువ ఈ సినిమాకి. Kimya Dawson పాడిన పాటలు ఈ సినిమాకి ఒక రకం గా జీవం పోసాయి అని చెప్పవచ్చు. తనకి దర్శకుడు స్క్రిప్ట్ పంపగానే దాదాపు గా ఒక నూట ఇరవై పాటలు తనవి సిడి లో పంపింది. వాటిలో కొన్నిటిని సినిమాకి వాడారు.

కెనడా లో తీసిన ఈ సినిమా కి దాదాపు కెనడా కి సంబందిచిన వారే పని చేసారు. ఒక నిర్మాత తప్ప. అందువల్ల కీ సినిమాకి కెనడా లో జరిగే genie సినిమా అవార్డు లకి అర్హత లేదు అని అన్నారు . కాని అక్కడ వేరే అవార్డులని ఇది సంపాదించింది. మూడు ఆస్కార్ nominations ని ఒక ఆస్కార్ అవార్డు ని పొందింది ఈ సినిమా. సెప్టెంబర్ లో ఫిలిం ఫెస్టివల్స్ లో విడుదల అయిన ఈ సినిమా డిసెంబర్ 2007 లో లిమిటెడ్ రిలీజ్ గ వచ్చి తర్వాత అంతటా విడుదల అయ్యింది.

నాకు నచ్చిన ఈ పాట మీ కోసం ఈ కింద

Wednesday, October 7, 2009

అంతే నా ...

ఈ మాట వినగానే మనకి టక్కున బొమ్మరిల్లు సినిమా లో ..వీలైతే నాలుగు మంచి మాటలు ... కుదిరితే కప్పు కాఫీ అన్న సంభాషణ గుర్తుకు రాక మానదు. ఈ మధ్య డెట్రాయిట్ వెళ్లి వచ్చాక ఒక రకమైన నిర్వేదం లో పడిపోయాను. వెళ్ళినప్పుడు , వచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నా, బోలెడు మంది కలిసారు , కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నా , కొన్ని దొరకని సినిమాలు తెచ్చుకున్న అన్న ఆనందం లో ఉన్నా.

చక్కగా నాలుగు మంచి మాటలు , బోలెడు కాఫీలు తాగాను అన్న ఆనందం అక్కడ నుంచి వచ్చాక ఆవిరి అయిపొయింది. మనం వయసులో పెద్ద వాళ్ళం అవుతున్నాం , మనసులో కూడా అవుతున్నామా ? మనలో పెద్దరికం ఎప్పటికి వస్తుంది ? పెద్దరికానికి వయసుకు ఎందుకు సంబంధం లేదు ? మనం వయసుతో పాటు మనసు ఎందుకు పెరగదు ... అంతుపట్టని ప్రశ్నలు

మనం ఎవరం వేరే వాళ్ళ మీద బురద జల్లడానికి... అసలా మనకి ఎం అధికారం ఉంది వేరే వ్యక్తీ జీవితం లో కి తొంగి చూడాటానికి. అసలా ఎవరిని అన్నా అనడానికి మనకి ఎం అధికారం ఉంది. మనకి ఒక వ్యక్తీ కొన్ని కారణాల వల్ల నచ్చక పోవచ్చు, అంతమాత్రం చేత ఆ వ్యక్తీ ని కాని ఆ వ్యక్తి జీవితం మిద కాని బురద చల్లే అధికారం ఎవరు ఇచ్చారు మనకి ? ఎంత సేపు జనాలు మనకే జే జే లు పలకాలి , మన చుట్టూ నే తిరగాలి అంటే ఎలాగా ? మనలో ఆ సత్తా ఉంటె మనం అడగక ముందే జనాలు గుర్తిసారు కదా ?

మనకి నచ్చక పొతే అది సున్నితంగా చెప్పే విధానాలు చాల ఉన్నాయి కాదా. మనం వాళ్లతో మాట్లాడటం మానేయ్యక్కర లేదు . వాళ్లతో నవ్వుతూనే ఇది మాకు ఇబ్బంది గా ఉంది అని చెప్పవచ్చు. సమస్య మనలోనే ఉంది. మనం అందరం. వేరే వాళ్ళ జీవితాలని శాసించాలి అనుకోవడం ఎంత తప్పు! మన జీవితాన్ని శాసించడానికి మనకి సమయం సరిపోదు. అలాంటిది మనం వేరే వాళ్ళకి చెప్పడం ఎంత హాస్యాస్పదం ! వారికి సలహా కావలిస్తే మనం వారికీ ఇచ్చే వారం అని వాళ్ళు అనుకుంటే ముందే అడిగీ వారు కదా. అసలా మనకి సలహా ఇవ్వలిసినంత అవసరం ఉందా ? మనం సరిగ్గా ఉన్నామా .. మనకే అంతా తెలుసా ? మనం ఎప్పుడన్నా సమస్య కి రెండో వైపు చూస్తున్నామా ? ఎవరు మన మాట వినకపోతే వాళ్ళని బ్లాగ్లలో పెట్టి ఇష్టం వచ్చినట్టు రాసేయ్యడమేనా. ఎంత గందర గోళం గా ఉందొ

అంతా చదివి అంతే నా అనుకుంటే ఎం చెప్పలేం...

కుదిరితే కాసిని మంచి మాటలు .. కొంచం కాఫీ తాగి వెళ్ళండి .. దయ చేసి పక్క వాళ్ళ మిద మాత్రం బురద చల్లకండి.. ఇది విజ్ఞప్తి మాత్రమె...

Thursday, October 1, 2009

గణేష్ - రెచ్చిపో చిత్ర సమీక్షలు

గణేష్

ఎవరికీ ఆపద వచ్చినా ఆదుకునే స్వభావం గణేష్ ది (రాం). గణేష్ స్నేహితుడు కి మేనత్త కూతురితో చిన్నపుడే సంబంధం నిశ్చయం అవుతుంది .కానీ ఆటను ఇంకో అమ్మాయి తో ప్రేమలో పడతాడు. ఆ పెళ్లి తప్పిపోవాలి అంటే ఆ మేనత్త కూతురికి ఒక ప్రేమికుడు ఉండాలి , ఆ అమ్మాయి ని ప్రేమలో దించి పెళ్లి తప్పించి, స్నేహిఉడికి ప్రేమించ అమ్మాయితో పెళ్లి చేసే కార్యక్రమం లో చాలా మాములుగా నాయకుడు నాయక ప్రేమలో పడటం , నాయకకి నిజం తెలిసి నాయకుడిని అసహ్యించుకోడం , నాయకుడు , నాయకకి తన ప్రేమ నిజం అని నిరూపించుకోడం వగైరా లతో స్తూలంగా కథ నడుస్తుంది.

అసహ్యించుకునే నాయకకి అయిదు నిమషాల్లో తన ప్రేమ ఎలా నిరుపించుకుంటాడు అన్నది కథనం గా చెప్పి నిర్మాతని ఒప్పించాడు ఏమో నా సందేహం.

సినిమా మొదటి సగం బాగానే ఉంది. రెండో సగం లో దారి తప్పాడు దర్శకుడు. ముందుగా తెలిసి పోయే కథ, సాగతీత ప్రేమ కథ, (రోహిణి హత్తంగడి ఉన్న దృశ్యాలు మనకి రావోయి చందమామ లో షావుకారు జానకి దృశ్యాలు కొంచం ఒకే రకంగా ఉన్నాయి , రావోయి చందమామ ఎం ఒరిజినల్ కాదు లెండి. అది ఇంకో ఆంగ్ల సినిమా కి నకలు ).
నాయకికి కి రెండో సగం మొత్తం ఏడవటం లేదా పాటల్లో గెంతడం తప్ప పనేం లేదు.

బ్రహ్మానందం పాత్రని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఆశిష్ విద్యార్థి పాత్ర సరిగ్గా సినిమాలో అతకలేదు. ఇలా చెప్పుకుంటే పొతే చాలా కాళీలు ఉండి సినిమా సరిగ్గా రాలేదు చివరకి. మొదటి సగం చూసి వచ్చేస్తే బాగానే ఉంటుంది మరి.

రాం పాటల్లో బాగానే చేసాడు. పిల్లలు బాగా చేసారు. కమెరా బాగుంది. సంగీతం ఏడ్చినట్టు ఉంది. పాటల్లో వెరైటీ అనుకున్నట్టు ఉన్నారు బొంగురు గొంతుతో పాడించారు. రెండో సగం లో రెండు పాటలు చివర్లో పిల్లలని కొట్టే సన్నివేసాలు తీసేస్తే కొంచం బెటర్ గా ఉండేది ఏమో సినిమా. సినిమా లో రెండో సగం లో కొంచం సేపు పిల్లలు కనపడరు, కొంచం సేపు విలన్ కనపడడు లాంటి వి చాలా రకాల తప్పులు ఉన్నాయ్.

గణేష్ : రాం, కాజల్ బ్రహ్మానందం , ఆశిష్ విద్యార్థి, కెమెరా : హరి అనుమోలు , సంగీతం : మికీ జే మేయర్.
దర్శకత్వం : శరవణన్

రెచ్చిపో ...

ప్రేక్షకుడు చచ్చిపో ... మన సినిమావాళ్ళకి ఒక తెగులు ఉంది. హీరో ఎంత ఎదవ అయితే అంత గొప్ప అని. చాలా సినిమాల్లో లాగే దీంట్లో కూడా నాయకుడు దొంగ. గొప్పవాళ్ళని దోచి పేదవాళ్ళకి దానం చేసే గొప్ప మనసు ఉన్నవాడు. ఇంకా అలాంటి దొంగ కోసమే నాయకి పుట్టి ఉంటుంది . నాయకి ఇంట్లో నాయకుడు అయిదు వందల కోట్లు నల్ల ధనం ఎత్తుకుపోతాడు. ఆ ధనం కోసం విలన్ నాయకిని దుబాయ్ ఎత్తుకుపోతాడు. నాయకుడు తప్ప ఎవరు రక్షించలేరు అన్న పోలీసు కమిషనర్ తొక్కలో సలహా విని హోం మినిస్టర్ కూతురిని రక్షించమని దొంగని అడగటం, దొంగ గారు దుబాయ్ వెళ్లి డాన్ ని తుక్కు తుక్కు గా బాది నాయకిని రక్షించడం మిగిలన కథ.

నితిన్ కండలు పెంచడం తప్ప బుర్రలో గుజ్జు పెంచే యోచన ఎక్కడ ఉన్నట్టు కనపడడు. ఎంత సేపు ఎన్ని డాన్సులు ఉన్నాయ్ , ఎన్ని పోరాటాలు ఉన్నాయ్ అని చూసుకోవడం తప్ప, కథ ఎంత కంగాళీ గా ఉందొ చూసుకోవడం లేదు. ఇది బాబు కి పదమూడో పల్టి బాక్స్ ఆఫీసు దగ్గర. గజని మొహమద్ ని మించి పోయే లాగ ఉన్నాడు. సినిమాలో హాస్య సన్నివేశాలు చూస్తున్నంత సేపూ మన పక్కన వాళ్ళు మనకి గిలిగింతలు పెట్టలిసిందే నవ్వడానికి.

మాములుగానే నితిన్ కి భాష సమస్య. బాబు కి ఈ భాష కూడా రాదు కాబట్టి , మన కర్మ అని సరిపెట్టుకోవాలి. నటన కూడా అంతంత మాత్రం. ఇలియానా కి అందంగా కనపడటం తప్ప చెయ్యడానికీ ఎం లేదు. పాపం అదే చేసింది . మిగిలిన పాత్రలు సో సో. సాంకేతికం గా కొద్ద సో సో ...

ఎక్కడ దొరకలేదు అని గాలించి గాలించి విలన్ ని పెట్టాం అని చెప్పారు. కానీ అక్కడ అంత సీన్ ఉన్నట్టు కనపడడు. విలన్ చుట్టూ ఎప్పుడు అర కోర బట్టలు వేసుకున్న అమ్మాయిలూ అలా కనపడతారు (మరీ పాత సినిమా లో లాగా ).

దర్శకుడు పరచూరి మురళి చెప్పడం ఇది అయన తీసిన చిత్రలలోకి అత్యంత ఉత్తమైన చిత్రం అని. ఈ లెక్కన ఇక ముందర మనం మురళి గారి సినిమాలకి దూరంగా ఉండటమా మంచిదేమొ...

రెచ్చిపో ...
నితిన్, ఇలియానా , దర్శకత్వం : పరచూరి మురళి

బంపర్ ఆఫర్ - సాయి రాం శంకర్ ఇంటర్వ్యూ కామెడి

ఈ రోజు సాయిరాం తన విడుదల చిత్రం గురించి మాట్లాడటానికి పత్రికల వాళ్ళని పిలిచారు ... అయన చెప్పిన కొన్ని సంగతులు ...

నా ఈ సినిమాలో క్యారెక్టర్ కొంచం ఇడియట్ సినిమా లో రవితేజ గారి పాత్ర లాగా ఉంటుంది
(అంటే కొత్తగా ఎం ఉండదు అనుకుంటా )..
సినిమా మొదలు పెట్టగానే రమణమ్మ పాట చేసాము. అది అయ్యాక చూసుకుంటే చాలా అద్భుతంగా వచ్చింది ... మాకు దాంతో కాన్ఫిడెన్స్ పెరిగి మిగిలిన సినిమా అంతా పూర్తి చేసాం (అంటే ఇంతకు ముందర అలా చెయ్యక పోవడం వల్ల అవి ఫ్లోప్ అయ్యాయా ...)

శంకర్ గారు చెప్పిన మంచి dialogues సినిమాలో
- నాలాంటి ఎదవ తప్ప నిన్ను ఎవరు చేసుకున్నా వాడి జీవితం నాశనం అయి పోతుంది ..
- మీ అమ్మ బాబు చచ్చే అంత ఒట్టు .. ఐ లవ్ యు ...

ఇలాంటి చాలా మంచి సంభాషణలు ఉన్నాయ్ అంట అండి సినిమాలో మరి ఇంకా ఆలస్యం దేనికి ఆలసించిన ఆశాభంగం బంపర్ ఆఫర్ మిస్ కాకండి ...

మంచు పూల వాన

మొన్న న్యూజెర్సీ వెళ్ళినప్పుడు వాసు , కుప్పిలి పద్మ కథలు మంచుపూల వాన కథా సంపుటం ఇచ్చారు. న్యూ జెర్సీ నుంచి Detriot వెళ్ళే దారిలో కథలు అన్ని చదివేసా. కాని detriot లో ఉండే బిజీ వల్ల పుస్తకం గురించి రాసే సమయం దొరకలా. పుస్తకం మొత్తం చదివాక ఎం రాయాలా అని ఆలోచిస్తే .. ఒకప్పుడు బెంగాలి కథల మిద ఒకరు వేసిన విమర్శ గుర్తుకు వచ్చింది. బెంగాలి కథలు అంటే బండెడు పాద ధూళి , కుండెడు కన్నీళ్లు అని. అలాగే పద్మ గారి కథలు చదవుతుంటే దాదాపు అన్ని కథలలో ఉదా రంగు ఆకాశం, పూలు, వర్షం పడిన సాయంత్రం. తప్పని సరి. అలా అని కథలు బాగా లేవా అంటే బాగానే ఉన్నాయ్,. కానీ అంత ఆకాశాన్ని అన్ని పూలని ఒక్కసారే చదవటం కష్టం ఏమో.

ఒక్కోసారి కథలు చదువుతుంటే దాదాపు అన్ని కథల ఫార్మటు ఒకే లాగ ఉంది అన్న భావన వస్తే మనతప్పు కాదు. ఉదాహరణకి ఒక restuarent లో వంటవాడు ఉన్నాడు అనుకుందాం. అతను వంటకు ముందర అన్ని మసాలాలు సిద్దం చేసుకుని , వంట ఆర్డర్ రాగానే దాని బట్టి మసాలాలు కలిపి పొయ్యి మిద పెట్టి వంట పూర్తీ చేస్తారు. అలాగీ ఈ కథలు కూడా ఉన్నాయ్ ఏమో అని ఆ సందేహం . పైన చెప్పినట్టు అన్ని కథల్లో ఆకాశం , పువ్వులు , మబ్బులు , వర్షం లాంటివి తప్పని సరి. అన్నిటిలో ఉండే ఇంకో సహజమైన విషయం, అమ్మాయిలు మంచి వాళ్ళు , అబ్బాయిలు మనసు చంచలం, అమ్మాయిలు వాళ్ళ భావాలకి నచ్చక పొతే సుబ్బరంగా వాక్ అవుట్ చేస్తారు. చాల వరకు కథలు ప్రేమ మీదే , భావుకత ఉన్న అమ్మాయి , ఇంకో భావుకత ఉన్న అబ్బాయి ప్రేమలో పడటం ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండవు , ఉన్నా ఆ ప్రేమ తిని తాగేసే రకాలు లాంటి కథలు .

అన్ని కథలు అలాగే ఉన్నాయ్ అని కాదు. అన్నిటిలో నాకు నచ్చిన కథలు అమ్మకో ఇల్లు. దీంట్లో కూడా మొక్కలు పూలు లాంటివి ఉన్నా కాని మంచి కథ. ఒక కూతురు తన తల్లికి ఒక ఇల్లు కొనివ్వడానికి దారి తీసిన పరిస్ధితులు , పర్వ్యసానం చక్కగా ఉంది. ఇంకో మంచి కథ చెమ్మగిల్లిన ఆకాశం. కమింగ్ అఫ్ ది ఏజ్ కథ వర్షపు జల్లు. రెండు కథలు drainage సమస్యలు హైదరాబాద్ లో ..

కథలు చదివించేవి గా ఉన్నా , కొన్ని మంచి కథలు ఉన్నా , సమస్య అల్లా దాదాపు అన్ని కథల్లో ఉండే ప్రకృతి వర్ణన చాల వరకు ఒకే రకంగా ఉండటం.

మంచుపూల వాన - కుప్పిలి పద్మ కథలు , వేల తొంభై అయిదు రూపాయలు