Thursday, January 28, 2010

గుమ్మడి గారి గురించి నా జ్ఞాపకాలు

గుమ్మడి గారిని మొదటి సారి అక్క పెళ్లి లో చూసాను. అప్పటికి బాగా చిన్నవాడిని కావడం తో ఏమీ తెలీదు. నిజానికి అయన గుమ్మడి అని కూడా నమ్మలేదు లెండి. అంతకు ముందే మాయాబజార్ సినిమా చూసి ఉండటం వల్ల గుమ్మడి అయితే బలరాముడి గెట్ అప్ లో ఉంటాడు, ఇయన ఎవరో అని అనుకున్నా. దాంతో ఎక్కువ పట్టించుకోకుండా ఆడుకోవడానికి వెళ్లి పోయాను. తరవాత స్కూల్ లో ఉన్నప్పుడు ఒక రోజు స్కూల్ ఎగ్గొట్టి (ఇంట్లో వాళ్ళే ఎగ్గోట్టించారు లెండి ) ఏదో సినిమా ప్రీమియర్ కి అన్నపూర్ణ స్టూడియో కి వెళ్ళాం. అప్పుడు అక్కడ ప్రేమాభిషేకం షూటింగ్ జరుగుతోంది. గుమ్మడి గారిది దాంట్లో డాక్టర్ వేషం.. షూటింగ్ గాప్ లో ఎవరి అబ్బాయి, ఎం చదువుతున్నావు అని మార్కులు అడిగి, పాలు బిస్కెట్స్ తెప్పించి ఇచ్చారు.

తరవాత ఏడాది గాంధి సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా ప్రిమియర్ మహేశ్వరి టాకీస్ లో జరిగింది. దానికి వెళ్ళినప్పుడు మా పక్క సీట్స్ లో ఉన్నది గుమ్మడి గారు, సుహాసిని గారు, బానుచందర్, రాజా (బహుదూరపు బాటాసారి షూటింగ్ నుంచి వచ్చారు అందరూ ). ఆ తరవాత దాదాపుగా కలవలేదు సరిగ్గా ఎప్పుడు. ఏదన్నా సినిమా ఫంక్షన్ లో చూసినా వాళ్ళది ఫ్రంట్ రోవ్స్ మాది ఎప్పుడు స్టేజి వెనకాల సంత దాంతో ఎక్కువ మాటలు ఉండేవి కాదు.

ఆయనకి ఇద్దరా సినిమా చేస్తున్న సమయం లో ఆయనకి గొంతు సంబందిత చికిత్స జరగడం వల్ల ఆయనకి నూతన్ ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పారు. అయన కి అది చాలా బాద కలిగించింది. ఒక నటుడు ఎరువు గొంతుకు తో నటించాలా అన్న భావనతో నటనకి దూరంగా చాలా కాలం దూరంగానే ఉన్నారు. రెండు ఏళ్ళ క్రితం అతి బలవంతం మీద శ్రీ కాశీ నాయన చరిత్ర అన్న సినిమాకి అయన వయసుకి సరిపడా పాత్ర కావడం తో ఒప్పుకున్నారు. అది గత ఏడాది విడుదల అయ్యింది.

2007 లో తానా సభలకి అయన వారి మనవడు వీరు ఉప్పల తో వచ్చారు. అయన పక్కన రామారావు గారి అమ్మాయి పురంధరేశ్వరి గారు ఉన్నారు. నన్ను వీరు తీసుకువెళ్ళి పరిచయం చేసారు. అప్పటికే బోలెడు జర్నీ చేసి రావడం వల్ల అయన అలసి పోయి ఉన్నారు. మర్నాడు తన హోటల్ గదికి రమ్మని చెప్పారు. పురందేశ్వరి గారు బాబాయ్ గారు అంటూ ఆయనతోనే ఉన్నారు.

మర్నాడు మరీ పొద్దునే వెళ్లి ఆయనని ఇబ్బంది పెట్టడం దేనికి అని మధ్యానం వెళ్దాం అనుకున్నాను. పొద్దునే బాలకృష్ణ గారి తో కలిసి అయన సాయంత్రం వేయబోయే నాటకం రిహార్సల్ కి వెళ్ళాను. అక్కడకి గుమ్మడి గారు వచ్చారు. బాలకృష్ణ గారు ఎదురు వెళ్లి బాబాయ్ గారు అంటూ తీసుకు వచ్చి కూర్చోబెట్టి అయన తో కాసేపు గడిపి నాటకం రిహార్సల్స్ లో మునిగి పోయారు. అయన మధ్య మధ్య లో వచ్చి ఎమన్నా కావాలేమో కనుక్కుంటూనే ఉన్నారు. నేను గుమ్మడి గారితో అక్కడ ఆ పూటంతా గడిపి ఆయనతో భోజనం హాల్ కి కూడా వెళ్ళాం. అప్పటి నుంచి ఆయనతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఫోన్ చెయ్యగానే ముందర వారి ని చూసే రమేష్ ఫోన్ ఎత్తి పేరు చెప్పి ఆయనకి ఇచ్చేవాడు. అయన కి మళ్లీ గుర్తు చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. చాల ఆప్యాయం గా మాట్లాడేవారు. ఒక పెద్ద నటుడిని అన్న ఎగో ఎప్పుడు ఉండేది కాదు. మన ఇంట్లో తాతగారితో మాట్లాడినట్టే ఉండేది ఆయనతో మాట్లాడుతుంటే.

ఒక మాయాబజార్, ఒక మహామంత్రి తిమ్మరుసు , ఒక నేను మనిషినే, ఒక తాత మనవడు, ఒక అర్ధాంగి ఇలా చాలా సినిమాలు ఉన్నాయి అయన లేకుండా ఇంకొకరు చెయ్యలేని సినిమాలు. అయన ఎప్పుడు పక్క నటులని dominate చెయ్యాలని చూసేవారు కాదు. పక్కవారితో పోటీ పడేవారు కానీ వాళ్ళని మింగేయ్యలని మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఆయనతో మాట్లాడుతుంటే ఒక బాబాయ్ గారి తోనో, ఒక మమయ్యగారితోనో లేక మన తాత గారితోనో మాట్లాడుతున్నట్టు ఉండేది. కానీ ఒక పెద్ద నటుని తో మాట్లాడ్తున్నట్టు గా ఉండేది కాదు. అయన పోవడానికి ముందర రెండు రోజుల క్రితం మాయాబజార్ రంగుల్లో వస్తోంది అని ఫోన్ చేసినప్పుడు బోలెడు సంబర పడిపోయారు ఆ సినిమా గురించి చాల మాట్లాడారు. ఇంతలో ఇలా అవుతుంది అని అనుకోలేదు. నాకు తెలిసి ఆయనకి విరోధులు అంటూ ఎవరు లేరు. చిత్ర పరిశ్రమ లో అజాత శత్రువు అందరికి మిత్రుడు ఆయనే.

ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ ...

Thursday, January 21, 2010

బెహితి హవా థా వొహ్ ..ఉడితి పతంగ్ థా వొహ్ ...

త్రీ ఇడియట్స్ లో ఈ పాట వినగానే మనకి తెలీకుండానే ... మనతో కొంతదూరం ప్రయాణం చేసి ఎక్కడ ఉన్నారో తెలీని స్నేహుతుల గురించి గుర్తు కు రాక మానదు. నేను చిన్నప్పుడు బళ్ళో చదువుకున్నపుడు నాది ఎప్పుడు మొదటి బెంచ్. అంటే ఎప్పుడు టీచర్ మొహం ఎదురుగా కనపడతా ఉండేవాడిని. దానికి విరుద్ధం గా చివరి బెంచి లో ఉండేవాళ్ళు సోమనాథ్ , చంద్ర శేఖర్, బాలాజీ లు. బాలాజీ బాగానే చదివే వాడు కాని, మిగిలిన ఇద్దరు చదువులో సుందోపసుందులు టైపు. దాంతో క్లాసు టీచర్ నాకు ఒకడిని , బాలాజీకి ఒకడిని అంట గట్టారు. అంటే వాళ్ళకి అన్నిటిలో పాస్ మార్క్లులు తెప్పించేలా చేసే బాధ్యత మాది అన్నమాట. నేను సగం రోజులు తరగతులకి హాజరు అయ్యేవాడిని కాదు. ఆ సమయం లో డ్రామా రిహార్సలు అనో, డాన్స్ రిహార్సలు అనో , లైబ్రరీ లోనో ఉండేవాడిని. విడి చదువు సంధ్య మనం చూడటం ఏంటి రా భగవంతుడా అని దేవుడిని తిట్టుకున్నా. మనం బడి అయ్యి పోయాక ఎప్పుడు తిన్నగా ఇంటికి వచ్చే బాపతు కాదు. చాలావరకు క్లాసు టైం లో నే హోం వర్క్ పూర్తీ చేసేవాడిని, బడి అవ్వగానే, బాలానందం కి వెళ్లి అక్కడ నాటకం రిహార్సలో , ఆటలో కానిచ్చి తీరికగా ఇంటికి చేరేవాడిని. నేను ఇంటికి చేరే సమయానికి వీడు హాజరు. వీడు ఉండేది మా పక్క వీదే. వీడి ఇంటి పక్కనే చందు ఉండేది. వీళ్ళ ఇంటికి ఒక అయిదు నిమషాల దూరం లో నే బాలాజీ ఉండేది. బాలాజీ వాళ్ళ ఇల్లు చిన్నది, చందు వాళ్ళది, సోము వాళ్ళది కూడా చిన్న ఇళ్ళే. అందరిలోకి మాదే విశాలమైన ఇల్లు. దాంతో మొత్తం ముగ్గురు మాఇంటికి వచ్చి, అరుగు మీదో , మా అమ్మ చూసి లోపలి పిలిస్తే చాపమీదో పుస్తకాలు ముందేసుకుని చదువు నటిస్తూ నా బలాదూర్ తిరుగుళ్ళు అయ్యి నేను వచ్చే వరకు తెగ చదువు నటించేసే వాళ్ళు. బాలాజీ ఇద్దరికీ చెప్పాలా అన్న ఫీలింగ్ తో లెవెల్ కొట్టేసేవాడు. నేను ఇంటికి వచ్చి మా అమ్మో లేక అన్నావు పెట్టె టిఫినీలు (అనగా వాళ్ళని చూడు ఎప్పుడు వచ్చారో, చదువు మీద శ్రద్ద గాడిద గుడ్డు ఏమన్నా ఉందా లాంటవి అన్నమాట) తింటూ వీళ్ళ మీద మనసులో కారాలు మిదియలు అన్ని నూరేసి చదువు కు కూర్చునే వాడిని. కూర్చున్నా మనకి అప్పటిదాకా ఆడి రావడం తో సుబ్బరంగా నిద్ర దేవి గారు కళ్ళ మీదకు వచ్చేసేవారు.

నేను ఎప్పుడు లంచ్ కి ఇంటికి వచ్చేవాడిని కాదు. సోము ఎప్పుడు లంచ్ కి ఇంతకి వెళ్ళేవాడు. దాంతో నేను వాళ్ళ అమ్మగారికి వీడికి లంచ్ కి రావడం కుదరదు అని చెప్పేసా ఒక రోజు. రోజు లంచ్ టైం లో వాడితో హోం వర్క్ పూర్తీ చేయించడం మొదలు పెట్ట. దాంతో నాకు కొంత సమయం కలిసి వచ్చేది సాయంకాలం. ఇంటికాడ ఇంకో ఇబ్బంది వచ్చేది. సోము, చెందు ఇద్దరు తెలంగాణా భాస ఎక్కువ. నేను వాళ్లతో మాట్లాడుతుంటే ధారాళంగా ఏందీ బె , బలిసిందా (ఏంటో అడగకండి, ఆ వయసులో నాకు తెలీదు కాని ఇద్దరు ధారాళంగా వాడేవారు ) లాంటివి వాడేవాడిని. అన్నప్పుడల్లా మా అన్న నెత్తి మిద టెంకి జెల్ల పడేది. వీడి బాద కొంచం తప్పింది అనుకుంటే , బాలాజీ, చందుల బాద తప్పలా. దాంతో బాలాజిని నాటకం లో పాత్ర కి లాగా. వాళ్ళ ఇంట్లో నేను ఉన్నా అని ఒప్పుకున్నారు. మా ఇంట్లో అక్షంతలు మామూలే తా చెడ్డ కోతి వనమెల్లా చరిచింది అని.

ఎలా అయితే ఎం సోము, చందు లో పాస్ అయ్యి మా కష్టాలు కడతేర్చారు అని నేను బాలాజీ కొంచం ఊపిరి పిల్చుకున్నాం. కాని వాళ్ళు ఆ సంవస్తరం అయినా మా ఇంటికి రావడం మాత్రం మానలేదు చదువు కోసం. కానీ మరసటి సంవత్సరం మేము ఇల్లు, నేను స్కూలు మారడం తో ఇంటికి రావడం తగ్గింది. బాలాజీ అప్పుడప్పుడు బాలానందం లో కలిసేవాడు. మళ్ళి సోము ని చందు ని పదో క్లాస్స్ పరికలప్పుడు కలిసా. మా అందరికి పరిక్ష రాసే సెంటర్ ఒక్కటే కావడం వల్ల. అప్పుడప్పుడు వల్ల సందులో క్రికెట్ ఆడటానికి వెళ్ళేవాడిని కాని మొత్తం మిద మెల్లి మెల్లి గా అది కూడా తగ్గింది.

పోయిన సారి ఇండియా వెళ్ళినప్పుడు వాడి ఇంటికి వెళ్ళాను. వాడు దొరకలేదు. ఫోన్ లో కూడా దొరకలేదు. వాళ్ళ అన్న ఉన్నాడు కాని వాడికి మనం అసలు పరిచయం లేదు దాంతో ఒక రోజు ఒక గంట సోము కోసం వేచి చూసి రాక తిరిగి వచ్చేసా. చందు ఎక్కడ ఉన్నాడో తెలీదు. బాలాజీ కూడా ఇల్లు మారిపోయాడు. గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేద్దాం అన్నా ఇంటి పేరు తెలీదు.

Wednesday, January 20, 2010

మంచు లో మా వూరు ....

గత వారం మా ఊర్లో చలి ఇరగదీసింది. అర్కి టిక్ బ్లాస్ట్ వల్ల మంచు బాగాపడటం వల్ల వాతావరణం దారుణంగా చల్లబడడం వల్ల గాలి లో చల్లదనం మైనస్ లోకి వెళ్ళింది.అలాంటి ఇలాంటి మైనస్ కాదు. దాదాపుగా పదిహీను డిగ్రీల ఫారిన్ హీట్. దాంతో మా ఊర్లో ఉన్న మూడు నదులు దాదాపుగా ఘనీభావించాయి. ఇవిగోండి మంచు లో మా వూరు ఫోటోలు ...

మా ఇంటికి కట్టిన మంచు తోరణంఇది మా మంచు మొక్కకి ఉన్న మంచు ఆకు



ఇది మా డౌన్ టౌన్ మధ్యలో ఉన్న బస్సు స్టాప్ దగ్గర ఉన్న వంతెన
నీళ్ళు రాని పంపు

మా నదులు



మా ఉరు పిట్ట్స్ బర్గ్

Sunday, January 17, 2010

అదుర్స్ - సమీక్ష

గతంలో సొమ్మొకడిది - సోకొకడిది , గజదొంగ లాంటి కవలలు తప్పి పోయి చివరికి తండ్రిని రక్షించే సినిమాలు చూసిన వాళ్ళకి ఈ సినిమాలో తరవాత వచ్చే సన్నివేశం ఏంటో చాలా అవలీలగా చెప్పెయ్యవచ్చు. వినాయక కి పాత పాత చింతకాయ సినిమా అయిన కొత్త బాటిల్ లో చూపిస్తాడు అన్న పేరు ఉంది. అదుర్స్ నిజానికి కొత్తగా చెప్పింది ఏమి లేదు. కాని ఎన్ టి ఆర్ చారి గా చేసిన నటన కోసం చూడవచ్చు.

సినిమాలో బోలెడు కలగా పులగం చేసి కొత్త వంట అని పాత పచ్చడే పెట్టినట్టు ఉన్నారు. చిన్నపుడే విడిపోయన కవల పిల్లలు నరసింహ, నరసింహా చారి వేరే ఊర్లల్లో పెరిగి పెద్ద అయ్యాక ఒకే ఊరికి చేరుతారు. నరసింహా చారి బ్రాహ్మణుడిగా పెరిగితే , నరసింహ పోలీసు ఆఫీసర్ కావాలి అని ఇన్ఫార్మర్ గా షిండే దగ్గర చేరుతాడు. నరసింహ షియాజీ కోసం చేసే పనులకి తోడుగా పనిలో పనిగా శయాజీ కూతురు షీలా తో ప్రేమాయణం కూడా చాటుగా చేస్తూ ఉంటాడు. ఇది తెలిసిన షియాజీ నరసింహ ని మట్టుపెట్టాలని తెలివిగా ప్లాన్ చేస్తాడు. హీరో ని మట్టుపెట్టే వాళ్ళు ఉండరు అని విలన్ కి తెలీదు కాబట్టి హీరో సహజంగా తప్పించుకుతాడు. సినిమాలో పనికి మాలిన సజ్జ చాల ఉంది, ముకుల్ దేవ్, సుప్రీత్ బుర్ర లేని మెయిన్ విలన్ మహేష్ మంజ్రేకర్ , ఆశిష్ విద్యార్తి ఇలా తెలుగు తెలీని సజ్జ చాలా ఉంది. మరి మనవాళ్ళకి తెలుగు రాణి విలన్స్ అంటే బోలెడు ప్రేమ కదా. దానికి తోడూ నటనలో ఓ అంటే డం రాని నాయిక షీలా ఉంది. అమ్మాయి బట్టలు తక్కువ వేసుకుని హీరో తో గెంతడం తప్ప చేసింది ఏం లేదు సినిమాలో.

సినిమాలో బాగున్నది బ్రాహ్మి, నరసింహా చారి గా ఎన్ టి ఆర్ ల నటన. ఒక రకం గా ఎన్ టి ఆర్ చారి గా అభినయం కాని, వాచకం కాని వంక పెట్టలేకుండా ఉన్నాయి. నరశింహ గా ఎక్కువ చెయ్యడానికి ఏం లేదు నటనలో. సినిమాలో పాటలు వినాయక్ ఫార్మాట్ లో ఉన్నాయి. పాట, కొట్టుకోడం, ఒక హాస్య సన్నివేశం, మళ్ళి పాట, ఇదే సినిమా మొత్తం. అసలా ఇద్దరు నాయకిలకి ఒకటే పని బట్టలు తక్కువ వేసుకుని హీరో తో గెంతులు వెయ్యడమే. నటనకి ఆస్కారం లేని పాత్రలు. పాటలు అసలా అవుట్ అఫ్ ది సింక్ . దేనికి పాట వస్తుందో ఆ వినాయకుడికే తెలవాలి. మాములుగా వినాయక్ సినిమా లో ఉండే సుమోలు మారి ఆడీ కార్ గా రూపాంతరం చెందింది. కెమెరా పరవాలేదు. మొదట్లో తీసిన కొన్ని సన్నివేశాలు బాగున్నై. సంభాషణలు బాగున్నై. కథే బాగాలేదు. సంగీతం సో సో .. దేవిశ్రీ తన పాటలు తానె కాపి కొట్టుకుంటున్నాడు. అర్గెంటుగా అయన సంగీతం తరగతలు హాజరు అవ్వడం బెటర్ ఏమో.

మొత్తం మిద సినిమా ఎలా ఉంది ? పరవాలేదు. చారి, బ్రాహ్మి కామెడి ని ఎంజాయ్ చేయొచ్చు. పాటలు దండగ. కథకి అనవసరం గా వచ్చే అడ్డం తప్ప. ఎన్ టి ఆర్ డాన్సులు బాగానే చేసారు. విలన్లు అందరు దండగ జోకర్ల పాత్రలు. రఘుబాబు బాగానే చేసాడు. విలన్ డెన్ కాని, విలన్ విదేశీయులతో చేసే సమావేశాలు కాని చూస్తె పాత కృష్ణ గారి డిషుం డిషుం సినిమాలు గుర్తుకు వస్తే అది మీ తప్పు కాదు.

Saturday, January 16, 2010

నెలవంక (1983)


చిన్నప్పుడు ఈ సినిమా చూసినప్పుడు. ఎందుకు ఈ సినిమా ఆడలేదు అన్నది నాకు అర్ధం కాలేదు. మంచి సినిమా మంచి సాహిత్యం మంచి నటన, మంచి సంగీతం, మంచి చాయాగ్రహణం అన్నీ ఉన్నాయ్ కాని సినిమా ఆడలేదు.

కథ టూకీగా :
ఆ ఊరికి మాజీ రాజా వారు శ్రీరామదాసు (గుమ్మడి ) అయన గుర్రంబండి నడిపేవాడు రహీం (సోమయాజులు ) . ఇద్దరు చిన్నపుడు కలిసి చదువుకున్నా పదిమందిలో వారి చనువు బైట పెట్టేవారు కాదు. ఆ ఊరిలో ఉన్న ఇద్దరు హిందూ ముస్లింల ఐక్యత కి తమ స్వార్థానికి బలి పెడతారు. దానికి రామదాసు, రహీం ఎం చేసారు అన్నది ముఖ్య కధాంశం. దానికి ఉపకథ గా ,రామదాసు కూతురు ప్రేమాయణం, రహీం కొడుకు మంచితనం లాంటివి జోడించారు.
చిత్రం లో చెప్పుకోదగ్గవి , గుమ్మడి, సోమయాజుల నటన. ఇద్దరు పోటి పది నటించారు. వాటికి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి సాహిత్యం, రమేష్ నాయుడు సంగీతం, ఎస్ గోపాల రెడ్డి గారి చాయాగ్రణం అదనపు ఆకర్షణ.

సినిమా గురించి :

జంధ్యాల గారికి ఇది నాలుగో సినిమా దర్శకుడిగా. అంతకు ముందర తీసిన మూడు (ముద్దా మందారం, మల్లె పందిరి, నలుగు స్తంభాలాట ) కూడా ప్రేమ చుట్టూ తిరిగే సినిమాలు. ఇది మాత్రం మత సామరస్యం కి సంభందించిన సినిమా. అసలు గుమ్మడి ని, జే వి సోమయజులని పెట్టి సినిమా మొత్తం తియ్యడానికి బోలెడు ధైర్యం కావాలి (ముఖ్యాపాత్రదరులు గా ) . ఈ సినిమా నిజానికి జంధ్యాల తన క్లాస్స్ మేట్ మెట్టెల రామబ్రహ్మం నిర్మాతగా మొదలు పెట్టారు. అయన అప్పుడు జగయ్య పేట కాలేజి లో కామర్స్ ఉపాధ్యాయునిగా పని చేస్తూ ఉండేవారు. సినిమా పూర్తీ అయ్యాక దాదాపుగా మూడు నెలలు విడుదల కి నోచుకోలేదు ఈ సినిమా. అక్టోబర్ లో సెన్సార్ జరుపుకున్న ఈ సినిమా జనవరి లో విడుదల అయ్యింది. ఆ ఇబ్బందుల నుంచి బైటపడటానికి నరసింహ రావు గారిని ఆశ్రయించారు. అందువల్ల అయన పేరు నిర్మాతగా కనపడుతుంది.

సినిమా మొత్తం ముక్త్యాల లోని వాసిరెడ్డి రాజ్యలక్షమ్మ గారి కోట లో తీసారు. ఈ కోటకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే , ఈ కోటకి ఒక వైపు గుంటూరు, ఇంకో వైపు వరంగల్లు మూడో వైపు కృష్ణనది కి అవాలి వొద్దు కృష్ణ జిల్లా. అంతే కాక ఇక్కడ జనాభా హిందూ ముస్లింలు దాదాపుగా సరి సగం. ఇప్పటి వరకు ఎప్పుడు అక్కడ హిందూ ముస్లింల గొడవలు జరగలేదు. ముక్త్యాల రాజా వారి గుర్రం బండి తోలేవాడు కూడా ముస్లిం. ఇవి అన్ని దృష్టిలో పెట్టుకుని జంధ్యాల ఈ సినిమాని ఇక్కడే తియ్యాలి అని నిశ్చయించుకున్నారు.

నిర్మాత ది జగ్గయ్య పేట కావడంతో, అక్కడకి ముక్త్యాల దగ్గరే కావడంతో, వంట వాళ్ళని జగ్గయ్యపేట నుంచి తీసుకువచ్చి ఇక్కడ మెస్ ఏర్పాటు చేసి మొత్తం అందరికి భోజనాలు ఏర్పాటు చేసారు. సినిమా మొత్తం దాదాపు నలభై రోజుల్లో పూర్తి చేసారు. జూన్ ఇరవై మూడున నెలపొడుపు రోజున మొదలు పెట్టి ఆగష్టు నాలుగో తారీఖికుకి మొత్తం చిత్రీకరించడం పూర్తి చేసారు. యూనిట్ మొత్తం కోటలోనే బస. సోమయాజులు గారు సహజత్వం కోసం నిజంగానే గడ్డం పెంచారు. కాని మధ్యలో రెండు రోజులు బాపు గారి పెళ్లీడు పిల్లలు షూటింగ్ లో పాల్గొనాల్సి రావడం తో అయన గడ్డం తీసేశారు. దాంతో మళ్ళి గడ్డం పెదిగే దాక ఒక వారం ఆయనతో షూటింగ్ జరపలేదు జంధ్యాల . ఆ సమయం లో మిగిలిన సన్నివేశాలు తీసారు. ఈ షూటింగ్ లో నే గుమ్మడి గారు తన యాభై ఆరో పుట్టిన రోజు జరుపుకున్నారు.

ఆదుర్తి గారి మొదటి చిత్రం అమర సందేశం లో కథానాయకుడిగా నటించిన అమర్ నాథ్, కెమెరామన్ ఎస్ గోపాలరెడ్డి గారు పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవారు. అమర్ నాథ్ గారి అబ్బాయి రాజేష్ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలిసి జంధ్యాల గారికి పరిచయం చేసారు గోపాల రెడ్డి గారు. అలా ఈ సినిమాలో తులసి పక్కన నటించే అవకాశం వచ్చింది. తర్వాత రెండు జెళ్ళ సీత, ఆనంద భైరవి లాంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు, చాలా సినిమాల్లో సహాయ పాత్రలు చేసారు. చిన్నవయసులో తండ్రి లాగే గుండె నొప్పి తో పోయారు. గోపాల రెడ్డి గారి మేనల్లుడు అనూర్ (కమెరా మాన్ / దర్శకుడు రసూల్ కి అన్నయ్య ) ఇంకో ముఖ్య పాత్ర వేసాడు. కాకపోతే సినిమాలో అతని పేరు కిరణ్ గా వేసారు. అనూర్ తరవాత రెండుజెళ్ళ సీత లో ఒక చిన్న పాత్ర వేసారు. ప్రస్తుతం ఇంగ్లండు లో ఎలెక్ట్రానిక్ పరిశ్రమ నడుపుతున్నారు. ఈ సినిమాలో ఇంకో చిన్న పాత్ర వేసింది రాజ్యలక్ష్మి తల్లి గారు సభారంజని (రాజ్యలక్ష్మి సినిమాల్లోకి రాక ముందర ఈవిడ ప్రముఖ రంగస్థల కళాకారిణి. ).

రాజేష్ కి గాత్ర ధారణ చేసింది బాలుగారు, జంధ్యాల కూడా రెండు మూడు పాత్రలకి గాత్రధారణ చేసారు. ఈ సినిమాకి పని చేసిన వాళ్ళల్లో ముఖ్యులు ఎం వి రఘు తరవాత కాలం లో పేరు పొందిన ఛాయాగ్రాహకుడు / దర్శకుడు గా పేరు పొందారు. దివాకర్, శ్రీనివాస్ రెడ్డి లు కూడా చాయగ్రహకులుగా రాణించారు శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా బాలకృష్ణ తో కృష్ణబాబు అన్న సినిమా కూడా నిర్మించారు. సహాయ దర్శకుడు ఈ వి వి దర్శకుడిగా మరి ప్రస్తుతం తన యాభయ్యవ సినిమా తీస్తున్నారు.

పుల్లారావు ఈ చిత్రం నుంచి జంధ్యాల గారి దగ్గర చేరారు. దాదాపుగా జంధ్యాల గారి అన్ని సినిమాలకి ఈయన పనిచేసారు. ప్రస్తుతం తమ్ముడు భగవాన్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.

ముద్దమందారం, నాలుగుస్తంభాలాట తరవాత తులసికి ఇది మూడో సినిమా జంధ్యాల గారి దర్శకత్వం లో. ఈ సినిమా నాటికి తులసికి పదనాలుగేళ్ళు. నటుడిగా బాలాజీ కి ఇది మొదటి చిత్రం. తర్వాత ఓ ఆడది ఓ మగాడు లో పెద్ద పాత్ర తో జనాలకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో రాజేష్ పక్కన తోలుబొమ్మలాటలో సహాయకుడిగా వేసాడు. నిజానికి ఆ పాత్ర జిత్ మోహన్ మిత్ర వెయ్యాల్సింది. ఆ తోలుబొమ్మల పాట పాడింది జిత్ మోహన్ మిత్రా నే. బాలాజీ నటి రోహిణి కి అన్న.

ఈ సినిమాకి తప్పకుండా జాతీయ బహుమతి వస్తుంది అని ఆశించారు జంధ్యాల. అవార్డు కోసం పంపిన ప్రింట్ సకాలం లో ఢిల్లీ చేరకపోవడం, అసలు ప్రింట్ ఎక్కడ ఉందొ కూడా తెలీక పోవడం లో రాజకీయాలు జరిగి ఉంటాయి అని అన్నారు జంధ్యాల.

సినిమా విజయవంతం కాకపోవడం లో తన తప్పుకూడా ఉందేమో అంటూ నెలవంక తీశాను. కాని నేల వంక చూడటం మర్చిపోయాను అన్నారు (పామర జనానికి నచ్చలేదు ఈ సినిమా అని అయన భావం).

కృతజ్ఞతలు : శ్రీ జంధ్యాల, పులగం చిననారాయణ , ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, జే పుల్లారావు, రసూల్

ఈ సినిమా గురించి మరికొన్ని వివరాలకి ఆంగ్లం లో రాసిన వ్యాసం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
జంధ్యాల గారికి , ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి నివాళి

Friday, January 15, 2010

దుల్హా మిల్ గయా .... సమీక్ష


ఈ మధ్య హిందీ సినిమాలు చూస్తుంటే అవి హిందీ సినిమాలో , లేక హాలీవుడ్ సినిమానా అన్న సందేహం రాకమానదు. ఎందుకంటే సగం సినిమాలు అమెరికా, కెనడా లేక ఇంగ్లాండ్ లో తీస్తున్నారు అందువల్ల మన దేశి సినిమానా లేక విదేశి సినిమానా అన్న సందేహం రాక తప్పదు. ఈ మధ్య వచ్చిన త్రీ ఇడియట్స్ తప్పించి. దాదాపు గా అన్ని సినిమాలు విదేశాలలోనే చిత్రీకరిస్తునారు. 2007 లో మొదలు పెట్టిన సినిమా మూడేళ్ళు అయ్యాక తీరికగా విడుదల అయింది. ఇది నిజానికి ట్రినిడాడ్ లో చిత్రికరించబడిన మొదటి భారతీయ సినిమా.

ఫర్దీన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సుస్మితా సేన్ లాంటి బడా బడా తారలు ఉన్నారు , కొత్త దర్శకుడు అని చూసామో, దుల్హ మిల్ గయా కాదు.. బకరా మిల్ గయా అని అనుకోక తప్పదు. సినిమా పాత చింతకాయ పచ్చడి. ఫర్దీన్ తండ్రి పోతూ పోతూ రాసిన వీలునామా ప్రకారం, ఫర్దీన్ పదిహేను రోజుల్లో పంజాబ్ లో ఉన్న ఫర్దీన్ తండ్రి స్నేహితుడి కూతురుని చేసుకోక పొతే ఆస్తి మొత్తం ఏదో ఒక ఫౌండేషన్ కి పోతుంది. ఆస్తి కోసం వెళ్లి ఇసితా శర్మ ని అర్జెంటు గా పెళ్లి చేసుకుంటాడు. చేసుకుని మళ్ళా వస్తా అని ఇంగ్లాండ్ వచ్చేసి జల్సా గా బతికేస్తూ ఉంటాడు. మూడు నెలలు చూసిన అమ్మాయి ఇంగ్లాండ్ లో దిగుతుంది. అక్కడ భర్త ఇంట్లో కి వెళ్ళడానికి ద్వార పాలకులు అడ్డం పడతారు. దొంగచాటుగా లోపలి వెళ్తే అక్కడ భర్త ఎవరో అమ్మాయి కౌగిలిలో ఉంటాడు. అది చూస్తూ ఏడుస్తూ రోడ్ కి అడ్డం పది ఆక్సిడెంట్ చేసుకుని, ఫ్లైట్ లో పరిచయం అయిన సుష్మిత సేన్ కార్ కింద పడుతుంది.

సుష్మిత మంచి డిమాండ్ లో ఉన్న మోడల్, ఫర్దీన్ కి స్నేహితురాలు కూడా. ఈ అమ్మాయిని రక్షించి ఇంటికి తీసుకువెళ్ళి జరిగింది తెలుసుకుని, ఫర్దీన్ కి బుడ్డి చెప్పడానికి, ఈ అమ్మాయికి వేష భాషలు మార్చి, ఫర్దీన్ ని ఈ అమ్మాయి వెనకాల పడేలా చేసి గట్రా గట్రా ... ఇంకా మొత్తం చెప్పక్కరలేదు కదా. ఇంత పాత చింతకాయ పచ్చడి సినిమాని ఇప్పటివాళ్ళు ఎలా ఆదరిస్తారు అనుకున్నాడో దర్శకుడు అసలా అర్ధం కాదు. షారుఖ్ ఉన్నాడు అంటే ఉన్నాడు. ప్రాధాన్యత లేని అతిధి పాత్ర. సినిమా మొత్తం లోకి సుష్మిత ఒక్కటే బాగా చేసింది. మిగిలన వాళ్ళు అందరూ నిద్ర మొహాలతో (లేక చెక్క మొహాలు అనాలా ) తూ తూ మంత్రం గా ఉన్నారు. పరమ సోది సినెమా. సుష్మిత లేక పొతే రెండో నిమషం లో కట్టెయ్యవచ్చు. పాటలు కూడా చెత్త.

ఇంత చదివి సినిమా చూసారో బకరా మిల్ గయా అని అనుకోక తప్పదు మరి ....

దుల్హా మిల్ గయా ( హిందీ ) . తారాగణం, : ఫర్దీన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సుష్మిత సేన్ , ఇషితా శర్మ గట్రా

Thursday, January 14, 2010

జంధ్యాల గారికి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి నివాళి . ..

జంధ్యాల గా అందరికి పరిచయం ఉన్న జంధ్యాల గారిని మాకు శివ గా తెలుసు. చిత్రపరిశ్రమ కి రాకముందు స్నేహితులు ఆయనని శివ అని కాని శాస్త్రి అని కానీ పిలిచేవారు. జంధ్యాల గారి తండ్రిగారికి విజయవాడ లో బుష్ Radio షాప్ ఉండేది. అప్పట్లో నేను అల్ ఇండియా Radio లో పని చేసే వాడిని. నేను రాసిన తెరలు నాటకం radio లో ప్రసారం అయ్యింది. అప్పటికే జంద్యాల తన ట్రూప్ తో కలిసి సంధ్యారాగం లో శంఖారావం లాంటి నాటకాలు రాసి ప్రదర్శిస్తూ ఉండేవారు. నా నాటకం విని కబురు చేసారు. అలా ఇద్దరం నవోదయ లోనో , వారి షాప్ లో నో కలుస్తా ఉండేవారం. తరవాత అయన బి. ఎన్. రెడ్డి గారు రంగుల రాట్నం తరవాత సినిమా చేద్దాం అనుకుని, దానికి ఈయనతో సంభాషణ లు రాయించడానికి పిలిపించడం తో మద్రాస్ వెళ్ళిపోయారు.

జంధ్యాల గారు, వేటూరి గారు అప్పట్లో విశ్వనాధ్ గారికి , రాఘవేంద్ర రావు గారికి సమంగా సినిమాలు రాసేవారు. రెండు వైపులా పేరు బాగా వచ్చింది. బాపు గారు కృష్ణావతారం అని కృష్ణ - శ్రీదేవి నాయకా నాయకులుగా చేస్తూ నన్ను ఒక పాట రాయమని అడిగారు. అలా రాసిన పాట చిన్నారి నవ్వు చిట్టి తామర పువ్వు .. ఆ పాట విని నేను సినిమాకు రాసా అని తెలిసి జంధ్యాల చాలా సంతోషించారు.

నెలవంక సినిమాకి అసలు నిర్మాత మెట్టెల రామబ్రహ్మం అని జగ్గయ్య పేట కాలేజి లో కామర్స్ lecturer గారు. ఆయన జంధ్యాల ఇద్దరు క్లాస్ మేట్స్ . నాలుగు స్తంభాలాట సినిమా పెద్ద హిట్ అయింది. వెంటనే జంధ్యాల ఈ సినిమా మొదలు పెట్టారు. నాలుగు స్తంభాలాట సినిమా లో బాగా పాపులర్ అయిన జంట సుత్తి జంట అని అందరికి తెలిసిందే. సుత్తి జంట లో ఒకరయిన సుత్తి వీరభద్ర రావు గారు నాకు రేడియో లో సహాధ్యాయి. (జంధ్యాల వీరభద్ర రావు గారు ఇద్దరు కాలేజి నుంచి స్నేహితులు , కలిసి కూడా నాటకాలు ఆడారు ) అయన జంధ్యాల కి నాగురించి చెప్పారు. జంధ్యాల. జంధ్యాల కి నేను ముందే పరిచయం అయ్యి ఉండటం వాళ్ళ వెంఠనే రమ్మని కబురు పంపారు. నేను వెళ్ళాక మద్రాస్ పామ్ గ్రూవ్ హోటల్ లో బస ఏర్పాటు చేసారు. అక్కడే ఆరు పాటలు రాసాను నెలవంక సినిమాకి. ఒక వారం ఉన్నాను అక్కడ.

షూటింగ్ మొత్తం ముక్త్యాల కోట పరిసర ప్రాంతాల్లో జరిగింది. నిర్మాతలది కూడా జగ్గయ్య పేట కావడం తో చుట్టుపక్కల వాళ్ళు చాల సహాయం చేసారు. నేను షూటింగ్ కి ఎక్కువ వెళ్ళలేదు. ఏది మతం ఏది హితం పాట అప్పుడు మాత్రం ఒక రోజు ఉన్నాను. ఆ పాటకి తప్పకుండా జాతీయ బహుమతి వస్తుంది అని అనేవారు జంధ్యాల. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ప్రింట్ సకాలం లో ఢిల్లీ చేరకపోవడం వల్ల అది తప్పిపోయింది అని అంటారు అయన.

ఈ సినిమా తరవాత పుత్తడి బొమ్మ సినిమాకి (నిర్మాత వెంకటరత్నం , పూర్ణిమ, నరేష్, ముచెర్ల అరుణ తారాగణం). రావు గోపాల రావు సినిమా కి (జయకృష్ణ నిర్మాత , చంద్రమోహన్ , ముచ్చెర్ల అరుణ , రావు గోపాల రావు తారాగణం ) జంధ్యాల గారితో పనిచేసాను. ఎక్కువగా నాకు సినిమాల మిద ఆసక్తి లేకపోవడం వల్ల నేను మద్రాస్ లో ఎప్పుడు ప్రయత్నం చెయ్యలేదు.

రేడియో లో పని మానేసాక నేను ఆంధ్ర ప్రభ లో పని చేశాను. అక్కడ ఉన్నప్పుడు జంధ్యాల గారితో జంధ్యా సమయం అని ఒక కాలమ్ రాయించాను. అది అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. అయన తరవాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఎక్కువగా కలవక పోయినా అప్పుడప్పుడు స్నేహితుల ఇళ్ళల్లో జరిగే విందుల్లో కలుస్తూ ఉండేవాళ్ళం. అయన మంచి సరదా అయిన మనిషి. ఇంకా మంచి సినిమాలు తీసేవారు ఏమో బతికి ఉంటె. చిన్న వయసులో నే పోయారు. నేను మరచిపోని మంచి మనుషుల్లో జంధ్యాల గారు ఒకరు.

జనవరి పద్నాలుగు జంధ్యాల గారి జయంతి సందర్భంగా ...

Saturday, January 9, 2010

సంక్రాంతి - ముగ్గులు


సంక్రాంతి అనగానే ముందర మనకి గుర్తు వచ్చేవి ముగ్గులు , ముగ్గుల పైన జోకులు... మా ఆవిడ రధం ముగ్గు వేస్తూ వెళ్ళింది ఇంకా రాలేదు అన్నది వినని వాళ్ళు ఉండరు ఏమో. ఇవే కాక బోగి పళ్ళు, చెరుకు ముక్కలు, బోగి మంట, హరి దాసులు , అరిసెలు ఇలా లిస్టు చాలా నే ఉంది ... ముగ్గులు అనగానే అమ్మాయిలకే కదా, అబ్బాయిలకి ఏంటి అనకోకండి. అబ్బాయిలకి కూడా ముగ్గు కష్టాలు ఉంటాయి మరి...

బాగా చిన్నప్పుడు మేము నారాయణగూడా లో అద్దెకి ఉండేవాళ్ళం. అక్కడ సందు మొత్తంలోకి మాదే పెద్ద వాకిలి. దాంతో సంక్రాంతి వచ్చిందంటే చాలు నాకు పొద్దునే డ్యూటీ పడేది. నాకు ఇద్దరు అక్కలు. చినక్క లేచేది కాదు. పెద్దక్కకి తోడు గా నేను లేగవాల్సి వచ్చేది. పొద్దునే అయిదు కి లేచి నన్ను సందు చివర ఉన్న పాలవాళ్ళ దగ్గరకి బకెట్ ఇచ్చి పంపేది. మళ్ళా చలి ఎక్కువ అని తాతగారి ముఫ్లర్ తలపాగా లాగా చుట్టి, స్వెటర్ వేసి పంపేది. బకెట్ పట్టుకుని అక్కడ నిలుచుంటే ఒక పావుగంట చూసి ఆ పాలవాళ్ళ ఎవరో ఒకళ్ళు వచ్చి దాని నిండా పేడ ఇచ్చి పంపేవాళ్ళు. అది మోసుకుంటే వస్తే అక్క దాంట్లో నీళ్ళు కలిపి కళ్ళాపి చల్లి ముగ్గు మొదలు పెట్టేది. తోడుగా దుప్పటి కప్పుకుని చలికి ఆపు కుంటూ నిద్ర కళ్ళతో తోడుగా కూర్చుని ఆ గీత సరిగ్గా రాల ఇక్కడ వంకర పోయింది అని వంకలు పెట్టి సందు మొత్తం మీద పెద్ద ముగ్గు వేసి ఆ రోజు ముగించేది. మాకు గొబ్బెమ్మలు పెట్టె ఆచారం లేదు కాని ముగ్గు మద్యలో పసుపు కుంకుమ, రేగిపళ్ళు చెరుకు ముక్కలు వేసేవాళ్ళం. రధం ముగ్గు మళ్ళా గీతలు, చుక్కలు అని రెండు రకాలుగా రెండు వైపులా వేసేది. ఆ గీతల ముగ్గులు చాలా ఈజీ కదా సో మనకి బాగానే వచ్చేశాయి కొన్ని రోజులకి. హృదయ పద్మం, పూలసజ్జ , సీతాకోక చిలకల ముగ్గు, దీపం ఇలా ఒక పుస్తకం నిండా ఉండేవి. బోటనీ పుస్తకం ఉంది కదా దానిలో ఎప్పటికప్పుడు షీట్స్ ఆడ్ చేసుకోడమే పని. ఒక సైజు దిండు అనుకోండి. (కొంచం పెద్ద అయ్యాక క్లాసు లో అమ్మాయిలకి సైట్ కొట్టడానికి ఈ జ్ఞానం పనికి వచ్చింది. సిటి అమ్మాయిలకి ముగ్గులు సరిగ్గా రావు కదా మరి).

పెద్దక్క పెళ్లి అయ్యాక ఆ ఇల్లు మారిపోయాం, దాంతో ముగ్గు బాద తప్పింది అనుకున్నా. ఈ సారి ఇల్లు కి పాత ఇల్లు అంత వాకిలి లేకపోయినా బాగానే ఉంది. ఇక్కడ పాలవాళ్ళు కూడా లేరు, అబ్బ ఇంకా బోలెడు హాప్పీస్ అనుకున్నా. అప్పటిదాకా రోజు ఏడు కి కూడా ఏడుస్తూ లేచే చిన్నక్క , పెద్దక్క లేని లోటు తీరుస్తా అని మంగమ్మ శపదం చేసింది. దాంతో మళ్ళా మన కష్టాలు మొదలు. పేడ మాత్రం తెచ్చే పని తప్పింది. మా పక్కింటికి పాలు పొయ్యడానికి వచ్చే వాడు తెచ్చిస్తా నెలకి పది ఇస్తే అని బేరం పెట్టాడు. దాంతో ఆ పని తప్పింది కాని, తోడుకోసం లేచే పని మాత్రం తప్పలా. పెద్దక్క వేసే అప్పుడు చూసే వాడిని కాబట్టి మనకి కూడా కొంచం ముగ్గులు వచ్చేవి. దాంతో చిన్నక్కకి అప్పడప్పుడు సలహాలు ఇచ్చేవాడిని. ఒకో సారి ఊరుకున్నా మనం లెవెల్ కొంచం ఎక్కువ కొడితే, టెంకి జెల్లలు పడేవి. దాంతో నేను ఉండను పో అని అలిగీవాడిని. ముగ్గులో పోయగా మిగిలిన రేగిపళ్ళు లంచం ఇస్తా అని , లేక పొతే చెరుకు ముక్కం మొత్తం నీకే అని ఏదో ఒకటి చెప్పి కుర్చోపెట్టేది. ఇంకో రెండేళ్ళకి ఈ అక్కకి కూడా పెళ్లి అయిపొయింది. దాంతో పొద్దునే లేచే బాద తప్పింది అనుకున్నా.

ఇద్దరు అక్కలు వెళ్ళిపోయాక. ఆ డ్యూటీ నానమ్మ తీసుకుంది. తాతగారు తోడుగా లేచే వారు కానీ సమస్య ఏంటి అంటే నానమ్మ ముగ్గు వేస్తా పెద్దగా రామదాసు కీర్తనలో, లేక పొతే ఏదో ఒక రాముడి మీద పాట అందుకునేది. (అలా విని విని నాకు చాల వరకు వచ్చేశాయి). ఇంకేం నిద్ర పడుతుంది. తాత గారు పోయాక ఇంకా మళ్ళా మామూలే నేను డ్యూటీ లో కి మొదలు.

ఇలా కాదు అని కొన్ని సార్లు పండగకి నూజివీడు పెదనాన్నగారి ఇంటికో లేక మా ఊరో వెళ్దాం అని ఎత్తు వేసా. ఒక సారి నూజివీడు వెళ్ళా. అక్కడ నిద్రలేపే వాళ్ళు కాదు కాని, పొద్దునే గోబ్బిళ్ళు పాట ఉండేది. ఆ దెబ్బకి లేచి కుర్చోవాల్సిందే. మేము ఉండేది కోనేరు పేట లో అప్పుడు. ఆ వీదిలో పంతులు గారు , మునసబు గారు ఇంకా అన్ని పెద్ద వాళ్ళ ముంగిళ్ళు , దాంతో పోటి పడి ముగ్గులు వేసేవారు. అమ్మాయిలందరూ పొద్దునే గొబ్బెమ్మ పాటలు. ఇంకా ఎం పడుకుంటాం. కాని చూడటానికి భలే బాగుండేది లెండి. ఆది అవ్వగానే మమ్మల్ని నిద్ర మొహలతోనే తోడు కోసం వేణుగోపాల స్వామి గుడికి లాక్కుపోయెవాళ్ళు. పొద్దునే సంక్రాంతి రోజుల్లో మంచి ప్రసాదం పెడతారు కదా మరి.

ఇలా కాదు అని ఇంకో సారి మా ఊరు వెళ్ళాను. అక్కడ ఇంట్లో లేపే వాళ్ళు ఎవరు వుండరు అని బోలెడు సంతోషించా. ఎక్కడా తెల్లారక ముందే బోగిమంట వేస్తున్నాం రా అని పక్కింటి వాళ్ళ పిల్లలు లేపెసారు. ఏది దొరికితే అది తెచ్చి వెయ్యడమే ఆ మంటల్లో. ఆ తరవాత హరిదాస్ గారు రావడం, ఎడ్ల పూజ , భూమి పూజ గట్రా గట్రా అని ఆ వారం ఏదో ఒక రకం గా నిద్రలేపెసారు.

ఐరనీ ఏంటి అంటే, అంత ముగ్గులు పెట్టిన అక్కకి పెళ్లి అయ్యాక కాపురం మేడ ఛాలా కాలం. దాంతో ముగ్గు ముచ్చట కి పెళ్లి తో ఆగిపోయింది. చిన్నక్కకి మేడ మీద కాకపోయినా వాకిలి తక్కువ. దాంతో ఆవిడకి అంతే. ఇప్పుడు ఇద్దరికీ సొంత ఇళ్ళు ఉన్నా వాకిళ్ళు తక్కువ కావడంతో అంత పెద్ద పెద్ద ముగ్గులు పెట్టె ఆశ లేదు. నేను తర్వాత కాలం లో హాస్టల్ లో ఉండటం, అక్కడ చదువు ముగించుకుని ఇక్కడ కూలీ పనికి రావడం తో ఆ ముగ్గులు, హరికథలు, అన్ని మిస్ అవుతూనే ఉన్నా. ఇక్కడ ఎక్కడన్నా ఒకళ్ళ ఇంటిముందర ఎపుడన్నా ప్లాస్టిక్ ముగ్గులు చూడటమే, మొన్న డల్లాస్ లో మాత్రం మా స్నేహితుడి భార్య ఇంటి ముందర చాక్ పీస్ తో వేసిన ముగ్గు చూసి ముచ్చట పడ్డా. సంక్రాంతి కి ఇంకా పెద్ద ముగ్గు వేస్తా అని అంది , కాని పాపం ఈ Arctic blast వల్ల అక్కడ కూడా మంచు పడటం తో ముగ్గు వేసే ఆశ లేదు ఈసారి అక్కడ.ఇదిగోండి డల్లాస్ లో మంచు పడితే ఎలా ఉంటుందో చూడండి ..