Tuesday, March 23, 2010

ఇంకో ... సినిమా కథ....

అనగనగా ఒక అమెరికా రాజ్యం లో ని ఒక రాష్ట్రము లో ఒక భారతీయ ఐ బి యం ఉద్యోగి.. ఐ బి యం లో ఉద్యోగం, మంచి అనుభవం ఉండటం వాళ్ళ మంచి వేతనం కూడా ఉండేది. చక్కగా పెళ్ళాం పిల్లలతో హాయిగా ఖరీదైన కార్లో తిరుగుతూ ఉండగా ఒక రోజు తెలుగు వారిలో చాల మందికి కుట్టే సినిమా చీమ కుట్టింది ఈయనకి కూడా. మరి కుట్టాక మంట పెట్టకుండా ఉండదు కదా. అది ఇద్దరితో కలిసి ఒక సినిమా ని వాళ్ళ ఊర్లో వేసే దాకా ఊరుకోలేదు... అలా వాళ్ళ ఊర్లో సినిమాలు వేస్తూ ఉండగా .. ఎన్ని రోజులు మా ఊర్లో నీ వెయ్యడం అని ఒక రోజు చూసి చూసి ఒక చిన్న సినిమా అమెరికా మొత్తానికి కొనేసాడు. అదృష్టం బాగుంది దాంతో ఆ సినిమా కి పెట్టుబడికి రెండింతలు వచ్చింది. దాంతో ఇంకో సినిమా సినిమా కొన్నాడు. అది బాగానే ఆడింది. డబ్బులు వచ్చాయి. దాంతో అబ్బాయి గారికి తన మిద తనకే బోలెడు నమ్మకం ఏర్పడిపోయింది....

ఈ లోపల ఒక సినిమా కి సహాయకుడిగా చేసిన కుర్ర దర్శకుడి తండ్రి ఈయనకి ఒక స్నేహితుడి ఇంట్లో విందు లో తగిలాడు. అయన అప్పటికే ఇలాంటి విందు లకి భుజాన ఒక వల తీసుకుని వెళ్తున్నాడు. కానీ ఆ వలలో చిన్న చిన్న చేపలే తప్ప సినిమా మొత్తం తీస్తాం అన్న చేప ఎప్పుడు పడలేదు. ఈ సారి అదృష్టం మొహం చాటేయ్యడం వల్ల మనవాడు అడ్డంగా దొర్కిపోయాడు. నువ్వు కొంచం పెట్టుబడి పెడితే చాలు మిగిలింది పెట్టడానికి బోలెడు మంది మా ఇంటి ముందర క్యూ లో ఉన్నారు లాంటి చెక్కర పూత మాటలు నమ్మి బొక్క బోర్ల పడి, సినిమా తియ్యడానికి తయ్యారు అయి పోయాడు.

కుర్ర దర్శకుడు ఈ లోపల ఒక రెండు రోజులు వేరే తారాగణం తో సినిమా మొదలు పెట్టి ఆపేసాడు (కారణాలనేకం దాని గురించి ఇంకో 'సారి" బ్లాగుతా !). ముందర సహాయ దర్శకుడిగా చేసిన సినిమా లోని సగం తారాగణం తో కొత్త సినిమా మొదలు పెట్టాడు. సినిమా అనుకున్నాక సినిమా దురద ఉన్న నాకు ఫోన్ చేసాడు...

అతను : భయ్యా సినిమా అనుకుంటున్నా ...

నేను : ప్రస్తుతం బాగానే ఉన్నావు కదా .. సినిమా తియ్యడం అవసరమా... అందులో ఆ హీరో కి పది సినిమాలకి రెండే కొంచం చెప్పుకోదగ్గ హిట్లు ... వాడికి కి అంత మార్కెట్ లేదు బ్రో...

అతను : అందుకే మనకి చవకగా వస్తున్నాడు.. ఎంతలేదు అన్నా వాడికి ఇచ్చే పారితోషికం మనకి టీవీ వాళ్ళకి అమ్మేయ్యడం వల్ల వచ్చేస్తుంది...

నేను : సరే ... వాడి పారితోషికం వరకు సరే అనుకో .. కాని మిగిలిన సినిమా సంగతో.... ఏది కథ ఒక సారి చెప్పు....

అతను : కథ పలానా వాళ్ళు బ్రహ్మాండంగా రాసారు.... దాని మీద మనవాళ్ళు ఇంకా చిత్రిక పడుతున్నారు ... పలానా పాము రాజు గారు మనకి మాటలు రాస్తున్నారు.... అయన కి ఈ మధ్యే బోలెడు బహుమతులు వచ్చాయి తెలుసు కదా....

నేను : పాము రాజు మాటలు రాస్తున్నాడు ... వీరేశ్ సంగీతం ఇలాంటి సోది కబురులు కాదు బ్రో ... ఇద్దరు ఎ రోజు కూడా సమయానికి ఇవ్వరు...ఈ సోది కాదు .. కథ ఏంటో చెప్పు.... మొత్తం స్క్రిప్ట్ విన్నావా ?, స్టొరీ బోర్డు చూసావా ? ఏదో పీ డి యఫ్ ఫైల్ పంపు చూస్తాను...

అతను : చెప్పా కదా కథ ని చిత్రిక పడుతున్నారు .. అవ్వగానే చెపుతా మొత్తం... ఈ లోపల పాము రాజు గారు మాటలు కొన్ని సన్నివేశాలకి ఇస్తా అన్నారు... వీరేశ్ పాటలు కూడా ఇచ్చేస్తా అన్నాడు... మొన్న హిందీ సినిమా లో పక్క పాత్ర వేసిన అమ్మాయి బాగుంది .. ఆ పిల్లే నాయకి మన సినిమా లో ....

నేను : బాసు ఇలా కాదు కాని ఆ హీరో కి ఇచ్చేది సగం చాలు... మొత్తం స్క్రిప్ట్ చేతిలో లేకుండా ... సెట్ మీదకి వేళ్ళకు... అని ఫోన్ పెట్టేసా....

ఆ తరవాత ఆ నిర్మాత వారానికి ఒక ఫోన్ చేసేవాడు.... సినిమా స్క్రిప్ట్ అద్బుతం గా వచ్చేస్తోంది... పాటలు ఒక రేంజ్ లో వస్తున్నై అది ఇది అని...అలా రెండు నెలలు గడిచాయి..... మళ్ళా ఇంకో ఫోన్ ...

అతను : భయ్యా వచ్చే నెల పదో తారీకు షూటింగ్ మొదలు పెడుతున్నా... మనవాళ్ళు అందరిని ముహూర్తం రోజు రమ్మని చెప్పు...

నేను : స్క్రిప్ట్ ఏది ? పాటలు అన్ని ఓకే అయ్యాయా ?? సంభాషణలు పూర్తీ అయ్యాయా ?

అతను : ఏది మనం మొదలు పెట్టగానే పది రోజుల్లో అన్ని వచ్చేస్తాయి ... దాదాపు అన్ని అయ్యిపోయాయి... ఇప్పుడు మొదలు పెట్టకపోతే .. మళ్ళా కాల్ల్శీత్స్ సమస్య వస్తుంది... తప్పదు మొదలు పెట్టెయ్యాలి...

నేను : .....

అతను : ముహూర్తానికి మన కోణంగి హీరో వస్తున్నారు... మరి అయన సినిమాకి అమెరికా లో మనం హుంగామ చేసాం కదా అప్పుడు మనతో మాట్లాడారు కదా .. తప్పకుండా వస్తారు ... అయన కాక .. ఇంకా రామానాయుడు , దిల్ రాజు , శేఖర్ , క్రిష్, కోణంగి బావ గారు ఇంకా చాల మంది వస్తా అని వాగ్దానం చేసారు ...

నేను : వాళ్ళ సినిమాకి నువ్వు ఇక్కడ హంగామా చేస్తే వాళ్ళు అక్కడ వస్తారు అనుకోవడం బుర్ర తక్కువ పని.... మీరు స్వయంగా వెళ్లి పిలిస్తే దాంట్లో సగం మంది రావచ్చు ఏమో....

అతను : లేదు భయ్యా నిజంగా వస్తారు... కోణంగి హీరో గారికి మనం అంటే చాల ఇది....

నేను : దూరంగా ఉంటె అన్ని ఇదే ... దగ్గరగా వెళ్ళాక ఆ ఇది ఎం ఉండదు....

అతను : అయన అలాంటి హీరో కాదు...

నేను : .....

అతను : భయ్యా మన సినిమాలో ఒక రోల్ కి ఇలియానా ని తెసుకుందాం అనుకుంటున్నాం .. నీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఉందా...

నేను : ఆల్రెడీ హిందీ పిల్ల హీరోయిన్ అన్నావు కదా .. మళ్ళా ఇలియానా దేనికి... సినిమా బడ్జెట్ ఎంత ?
అతను : హీరోయిన్ కాదు భయ్యా ... కాలేజి లో కాలేజి బ్యూటీ రోల్ ఒకటి ఉంది ... దానికి ఒక అమ్మాయి కావాలి... ఇలియానా కాని అనుష్క కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం ....

నేను : ఇలియానా అలాంటివి చెయ్యడమో బ్రో ...

అతను : మన డైరెక్టర్ గర్ల్ ఫ్రెండ్ కి ఇల్లియనా మంచి ఫ్రెండ్ .. మనవాడు ఒప్పిస్తా అని అంటున్నాడు...

నేను : అక్కడ అంట సీన్ లేదు నాకు తెలిసి...

అతను : కాదు చూడు ఆ రోల్ కి ఆ అమ్మాయి అయితే నీ బాగుంటుంది... మన వాడు ఒప్పిస్తాడు... (సినిమా లో చివరకి ... ఈయన చెప్పిన వాళ్ళు ఎవరు లేరు... ఒక మోస్తరు గా ఆడిన సినిమాలో హీరోయిన్ ని తీసుకున్నారు ).
ఎవరికోసం సమయం ఆగదు ... అలాగే ఆ వచ్చేనెల పదో తారీకు వచ్చేసింది.... అయన చెప్పిన వాళ్ళలో ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా రాలేదు.... ముహూర్తం మరి పొద్దున్నే తొమ్మిదికి ఉండటం కారణం అని అయన ఉవాచ .... పాటలు పూర్తీ గా అయ్యాయా అంటే కాలేదు... సంభాషణలు , స్క్రీన్ ప్లే , స్టొరీ బోర్డు అన్ని కూడా డిటో డిటో ... షూటింగ్ మాత్రం మొదలు అయ్యింది... మొదటి షెడ్యూల్ ఒక నాలుగు రోజులు అయింది.. రెండో షెడ్యూల్ కి ఒక ఇరవై రోజుల వ్యవది ఉంది. ఈ లోపల పాటలు, సంభాషణలు లాంటివి ఎమన్నా పూర్తీ చేస్తారు ఏమో అని ఆశ పడ్డాను... లేదు అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగి పోయాయి....

రామాయణం లో పిడకల వేట లాగా ఈ లోపల కుర్ర దర్శకుడు పీకల లోతు ప్రేమలో మునిగి పోయాడు... కాని సినిమా ప్రేమలు శాశ్వితం కాదు అన్నట్టుగా అది కూడా ముడునాల్ల ముచ్చట అయ్యింది... గుండె పగిలన దర్శకుడు
నిద్రలేకుండా షూటింగులకి వచ్చి మూడ్ బాగాలేదు ప్యాక్ అప్ అనేవాడు.. దాంతో మనవాడికి కాలేది.... వీటికి తోడూ డబ్బులు ఇస్తా అన్నా జనాలు కనుచూపు మేరలో కనపడటం మానేసారు... సినిమా మీద నమ్మకం తో ఉద్యోగం మానేసాడు... ఎటు చూస్తె అటు అప్పులు.... ఇంకో పక్క సినిమా పూర్తీ చెయ్యాలి.. పాము రాజు మన్నుతిన్న పాము లా మందు తాగి పడుకోవడం తప్ప సంభాషణలు ఇవ్వడు.. వీరేశ్ కి మూడ్ రాదు ...వాడికి మూడ్ వస్తే మ్యూజిక్ సిట్టింగ్స్ కి వెళ్ళడానికి కుర్ర దర్శకుడికి మూడ్ రాదు... పాటలు కావు... సినిమా మొదలు పెట్టి నలుగు నెలలు సగం సినిమా కూడా కాలేదు... చేతిలో పైసా లేదు... హైదరాబాద్ లో ఉన్నవి తాకట్టుకో అమ్మకానికో వెళ్ళిపోయాయి.... కోటిన్నర అనుకున్న సినిమా రెండున్నర అయ్యేలా ఉంది... ఇంకా ఎక్కువ అవుతుంది ఎమోకూడా తెలీదు. టి వి హక్కులు సగం రేట్ కి తాకట్టు పెట్టి ఊరి నిండా అప్పులు చేసి సినిమా పూర్తీ చేస్తాడు.

ఈ లోపల హీరో సినిమాలు మూడు విడుదల అయ్యి "పోయాయి"... వాటికి పోస్టర్ కి అంటించిన జిగురు కర్చు కూడా రాలేదు అని అనుకున్నారు. దాంతో సినిమా కొనే నాధుడు కరువయ్యారు. వచ్చిన కాస్త కూస్త జనం ఈయన చెప్పిన ధరకి నచ్చక వెనక్కి వెళ్ళిపోయారు..... మనకి దురద ఆగదు కదా.. ఫోన్ చేశా...

నేను : ఎప్పుడు రిలీజ్...

అతను : రేపు దిల్ రాజు కి చూపిస్తున్నాను.. అయన మూడు కోట్లు ఇస్తే సినిమా ఇచ్చేస్తాను...

నేను : కష్టం ఏమో ... ఆ హీరో కి అంత మార్కెట్ లేదు ... సినిమా మ్యూజిక్ అంత బాగాలేదు ....

అతను : అలా అంటావేంటి .. ఒక సరి సినిమా రిలీజ్ అయ్యాక ... ఈ మ్యూజిక్ జనాలకి ఎక్కుతుంది... ఇది రికార్డ్లు బద్దలు కొడుతుంది....

నేను : .....( రికార్డు లు బద్దలు కొట్టడానికి రిలీజ్ చెయ్యి మరి అని మనసులో అనుకుని.. ) .... ధియేటర్ అవి మాట్లాడవా....

అతను : ఆల్రెడీ పేస్ బుక్ లో మన దానికి రెండు వేల మంది ఆడ్ ఆన్ అయ్యారు.. ఆ రెండు వేల మంది ఇంకో రెండు వేల మందికి చెపుతారు.. అలా అల్లా మనకి మంచి పబ్లిసిటీ వస్తుంది.. (స్టాలిన్ సినిమాలో లాగా)...

నేను : ... డూడ్ అవి సినిమాలు.. .జీవితం లో కష్టం అలాంటివి.... రెండు వేల మంది అంటే ఒక షో కి కూడా ఫుల్ల్స్ కాదు... మహేశ్వరి లో అప్పర్ క్లాసు సీట్స్ దాదాపు వెయ్యి ... కొంచం రియల్ గా ఆలోచించు... ధియేటర్ మాట్లాడవా అంటే సోది చెపుతావు ఏంటి...

అతను : అంటే మంచి ధియేటర్ లు చూస్తున్నాం .... ఇంకా తారీకు ఒకటి అనుకుంటే అన్ని అవి వస్తాయి... మన సినిమాకి మంచి క్రేజ్ ఉంది ... (ఎవరికీ అని అడగకండి... )..

నేను : ఎన్ని ప్రింట్స్ వేస్తున్నారు...

అతను : ఇంకా ఎం అనుకోలేదు... తొందరలో చెపుతాను ...

ప్రింట్స్ కి డబ్బు లేక హీరో దగ్గర తీసుకుని ... సినిమా మొత్తానికి విడుదల చేసారు... ఏలూరు లో మొదటి రోజు వచ్చిన మొత్తం వెయ్యి రూపాయలు... ఆ దెబ్బకి రెండో రోజు సినిమా ఎత్తేసారు ఏలూరు లో ... హైదరాబాద్ లో నాలుగు వారాలు ఆడింది సినిమా... ఒకే ధియేటర్ లో అనుకునేరు... కాదు వారానికి ఒక ధియేటర్ చొప్పున.... కుర్ర దర్శకుడి కి తియ్యడం రాదు.. నిర్మాతకి సినిమా మార్కెటింగ్ చెయ్యడం రాదు... విడుదల అయిన రెండో రోజు పేపర్ లో ఎక్కడా కనపడలా ... అతను చెప్పిన దాని ప్రకారం ... పెద్ద వాళ్ళు అందరు కలిసి మంచి ధియేటర్ లు ఇవ్వలేదు.. మరి అలాంటప్పుడు కళావర్ కింగ్ ... మన్మదులు లాంటి డకోటా సినిమాలకి ధియేటర్ లు దొరకగా .ఈయనకి దొరకక పోవడం ఏంటో ఆయనకే తెల్వాలి....