Saturday, May 15, 2010

ఓ వర్షం ... ఓ అనుభూతి

పొద్దున్నే కాఫీ తాగుతూ బ్లైండ్స్ తీస్తే ధారగా పడుతున్న వర్షం... ఎదురుగా పచ్చటి తివాచిలాంటి పచ్చిక బైలు... బస్సు లో కూలిపనికి పోతుంటే బస్సు వెళ్ళే లోయ అంతా పచ్చగా , ఏపుగా పెరిగన చెట్లు మధ్యలో వర్షం ధారగా పడుతుంటే అలా బస్సు దిగి అక్కడే నుల్చోవలనిపిస్తుంది ..

కాలేజి లో ప్రాజెక్ట్ చేసే రోజుల్లో వైజాగ్ వెళ్ళాను ప్రాజెక్ట్ పని మీద. అక్కడ సందీప్ కిషన్ (ప్రస్థానం లో శర్వానంద్ కి తమ్ముడు గా వేసిన అబ్బాయి ) వాళ్ళ తాత గారి ఇంట్లో నా మకాం. వాళ్ళ ఇల్లు వైజాగ్ లో శాంతి ఆశ్రమం ఎదురుగా ఉంది. ఆశ్రమం పక్కనే కైలాస కోన వెళ్ళే దారి ఒక వైపు ఉంటె ఇంకో వైపు రామకృష్ణా బీచ్ అందువల్ల సంద్రాన్ని రోజు సంబరంగా చూసే వాడిని.. పొద్ద్దునే లేచే అలవాటు ఉండటం వల్ల ఉదయం వ్యాహ్యాళి కి వెళ్ళే వాడిని రోజు పొద్దునే సంధ్య దేవి ని బలవంతం వల్ల రోడ్డున పడే సూర్యుడి ఎరుపుదన్నాన్ని చూసే వాడిని.. సందీప్ వాళ్ళ తాతగారికి నేను ఇలా రాముడు మంచి మంచి బాలుడు టైపు అవ్వడం వల్ల తెగ నచ్చేసాను . నాకు నిజానికి సందీప్ బాబాయిలు ఇద్దరు మంచి స్నేహితులు (వయో బేదం ఉన్నా కాని ). దాంతో నన్ను బ్రహ్మాండం గా ఊరంతా తిప్పి తెసుకోచ్చేవారు.

సరే ఒక రోజు అరకు వెళ్దాం అని అడిగాను. అరకు అంటే వైజాగ్ నుంచి పొద్దునే ఒక రాలు ఉంటుంది. అది కిరండోలు దాక వెళ్ళాక అక్కడ నుంచి ఇంకో ఇంజన్ తగిలించుకుని వెళ్తుంది. పొద్దునే వెళ్ళిన రైలు మళ్ళి రాత్రి కి తిరిగి వస్తుంది వెళ్ళే అప్పుడు ట్రైన్ లో వెళ్లి వచ్చే అప్పుడు బస్సు లో రావాలి అని మా ప్లాన్. కాని ట్రైన్ పొద్దునే ఏడు లోపలే బయలు దేరుతుంది. వీళ్ళ ఇంట్లో ఏమో ఏడుకు ముందర లేగవటం అంటే అదో ప్రపంచ వింత. అతి కష్టం మీద సందీప్ వల్ల ఆఖరి చిన్నాన్నని ఒప్పించగలిగా.

సరే పొద్దునే అయిదు కి లేచి అరుకల్ల్లా రైలు స్టేషన్ లో ఉన్నాం. అప్పటికే తుపర పడుతోంది..మేము రైలు పెట్టె లో ఎక్కి కూర్చున్నాం . ఎక్కువ జనాలు లేరు. బోగి కి నలుగురు ఉంటె గొప్ప. బాగ్ లో నుంచి వాక్ మాన్ తీసి హెడ్ ఫోన్స్ పెట్టుకుని చెరో పుస్తకం పట్టుకుని రైలు బయలు దేరడం కోసం వేచి చూస్తున్నాం.. చేతిలో ఉన్న చందమామ పూర్తీ అయింది కాని రైలు ఎక్కడా కదిలే సూచనలు కనపడలా. కిందకి దిగి వెళ్లి కనుక్కుంటే వాడికి తెలీదు పోమ్మనాడు.. ఇంకా చేసేది ఎం లేక ప్లాట్ ఫోరం మీద దొరికే ఇలాచి టీ తాగుతూ పడుతున్న వర్షాన్ని చూస్తూ కాసేపు గడిపాం.

మా మిద జాలేసిందో ఏమో డ్రైవర్ వచ్చాడు దాదాపు తొమ్మిది గంటలకి. రైలు ఎక్కి కూర్చున్నాం, వర్షా కాలం కావడం వల్ల ఏమో, పచ్చగా తివాచి పరిచినట్టు ఉంది రైలు లో నుంచి చూస్తుంటే, దాదాపు గంటన్నర ప్రయాణం చేసి ఉంటాం, హటాత్తుగా రైలు సిగ్నల్ దగ్గర ఆగి పోయింది. పావు గంట అయినా కదలలేదు.. వెళ్లి డ్రైవర్ కి అడిగాం. మాదెం ఉంది సారు .సిగ్నల్ లేదు అన్నది జావాబు. రైలు ఎక్కడ ఉంది అని అడిగితె ఎస్ కోట దగ్గర అన్నాడు . ఎస్ కోట అంట శృంగవరపు కోట అని అర్ధం. సరే అని పట్టాలమీద నడుచుకుంటూ స్టేషన్ దాకా వెళ్ళాం .. కానీ అది కొండల మధ్య ఉండటం వల్ల బైట ప్రపంచం ఎం కనపడలా. అక్కడ స్టేషన్ లో కొంచం సేపు ప్రచార్లు చేసాం... ఎక్కడా కదిలేలాగా కనపడలా...

అప్పుడు మా వాడు చల్లగా .. ఇక్కడ ఎక్కువ సేపు ఉంటె మా వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు అని చెప్పాడు... నాకు అర్ధం కాలా. మా కాబోయే మామ గారిది ఈ ఊరే. అయన అందరికి తెలుసు, నేను కూడా తెలుసు కాబట్టి వార్త చేరిందంటే నన్ను, నాతొ పాటు నిన్ను ఇంటికి తీసుకెళతారు అన్నాడు.. ఇదేమి ట్విస్ట్ రా బాబోయ్ అనుకుని , కిం కర్తవ్యమ్ తోచక దిక్కులు చూస్తూ కూర్చున్నా. దూరాన ఏదో కొండ మీద రెప రెప రెప లాడుతున్న జెండా కనపడింది. ఏంటి అది అడిగా.. అది గుడి అని చెప్పారు.. వెళ్దామా అని అడిగాను. అది కొంచం కష్టం ఏమో అని నసిగాడు మా వాడు.

ఆ గుడికి వెళ్ళాలి అంటే, ఒక కొండ ఎక్కి, దిగి , ఒక వాగు దాటి ఇంకో కొండ ఎక్కాలి అని చెప్పాడు. మరి ఇంకేం పద అని బాగ్ తెసుకు వచ్చి స్టేషన్ మాస్టర్ కి అప్పగించి ఇద్దరం పట్టాల వెంట వెళ్లి కొండ దగ్గర ఆగాము. అక్కడ నుంచి మెట్లు ఉన్నాయ్.. కొండ మీదకు, అప్పటికి పూర్తిగా తడిచిపోయాము... వేసుకున్న నైకీ బుట్లలోకి పూర్తిగా నీళ్ళు వెళ్లి పోయాయి.. తను వేసుకున్న చెప్పులు జారే సూచనలు కనపడ్డాయి.. సరే అని వాటిని అక్కడ వదిలేసి (పక్కనే బడి ఉంది లెండి, అక్కడ బంత్రోతుకి అప్పగించాం ).

అక్కడ నుంచి మెట్లు ఎక్కి కొంచం పైకి వెళ్ళగానే ఇంకా మెట్లు అయిపోయాయి కానీ సిమెంట్ దరి కొంచం ఉంది... అది ఎక్కి మళ్ళి కొండ దిగాం. రెండు కొండల మధ్య వాగు (నిజానికి అది నలుగు కొండల మధ్య లోయ లాగా ఉంది ఎటు చూసినా పచ్చని చెట్లు ఆకాశం నుంచి ధారగా పడుతున్న వర్షం, చుట్టూ పచ్చదనం, కింద నీళ్ళు, అదో అద్భుత ప్రపంచం లాగా ఉంది... సరే వాగు దాటుందాం అని చూస్తే ఉరవడి వేగం గా ఉంది.. మా ఇద్దరికీ ఈత రాదు. సరే అని కాసేపు తగ్గుతుంది ఏమో చూద్దాం అని కాళ్ళు వాగులో పెట్టి ఒడ్డున కాసేపు కూర్చున్నాం. ఎక్కడ వర్షం తగ్గే సూచనలు కనపడాల మేము తడవటం తప్ప.
మావాడు పోద్దామా అని అడిగాడు (అంటే వెనక్కి అని వాడి అర్థం )

నేను పోదాం అని వాగులోకి అడుగు వేసాను.
,మా వాడు ఎం అనలేక నాతొ పాటు వాగులోకి అడుగు వేసాడు .
వాగు మరి ఎక్కువ దూరం లేదు.. కాని లోతు బాగానే ఉంది..

దాదాపు రొమ్ముల వరకు నీరు వచ్చింది మధ్యలో దానికి తోడూ ఒరవడి బాగానే ఉంది.. నేను ఉత్సాహం గానే ఉన్నా.. మా వాడు గంభీరంగా ఉన్నాడు... అయిదు నిమషాల్లో వాగు దాటేసాం మా వాడు ఒక దీర్ఘమైన నిట్టూర్పు వదిలాడు. నేను విననట్ట్టు గా మళ్ళి కొండ ఎక్కడం మొదలు పెట్టాను. అప్పటికి బట్టలు కాకుండా .. లో దుస్తులు కూడా తడిసి వర్షం బైట కాదు దుస్తుల లోపల కూడా అన్నట్టు గా ఉంది. కాని చుట్టూ ఉన్న సౌందర్యం అవి దేన్నీ లెక్క చేయ్యనివడం లేదు. అలా కొండ ఎక్కి వెళ్తే చిన్న గుడి. ఒక చిన్న వరండా . దాంట్లో ఒక బైరాగి గారు కుర్చుని ఉన్నారు. జడలు కట్టిన జుట్టు, వంటి మీద కాషాయ రంగు పంచె తప్ప ఎం లేదు. ఏంటి బాబు ఈ వానలో వచ్చారు అని అడిగారు...
వాగు పొంగి ఉండాలి .. ఎలా వెళ్తారు అని కూడా అడిగారు.
ఈ అబ్బాయిది ఈ వూరు కాదు.. గుడి చూద్దాం అని వచ్చాడు అని మా వాడు సమాధానం ఇచ్చాడు..
రాత్రికి ఇక్కడ ఉండటానికి ఎం లేదు బాబు, తిరిగి వెళ్తారా ? వాగు పొంగి ఉంటుంది కూడా ఇంకా ఎలా అని అడిగారు అయన ...
ఇంకా ఎం అనుకోలేదు స్వామి.. ఇక్కడ చూడటానికి బాగుంది... చాల చల్లగా కూడా ఉంది... చుట్టూ ఎటు చూసినా కొండలు భలేగా ఉంది అని అన్నాను...

స్వామి దగ్గర ప్రసాదం తీసుకువచ్చి ఇద్దరికీ పెట్టారు... అక్కడే కింద కుర్చుని తిని వర్షం నీళ్ళతో చేతులు కడుక్కుని కొంచం సేపు కూర్చున్నాక ..
చీకటి పడేలా ఉంది అని గొణిగాడు మా వాడు...
వాగు పరిస్తితి ఎలా ఉందొ అన్నారు స్వామి గారు...
పోనీ ఇక్కడే ఉందాం లే .. వెళ్లి చేసేది ఎం లేదు గా అన్నాను నేను...
ఇంకా నయం ... మామ వాళ్ళు ఈపాటికి గుడి దగ్గర మనకోసం కాపు కాసి ఉంటారు .. మనం వెళ్ళాక పొతే కాగాడాలతో పైకి వచ్చినా వస్తారు అని కంగారుగా అన్నాడు మా వాడు
సరే ఎలాగు నీళ్ళల్లో నే కదా వచ్చింది .. పోదాం పద అని బయలుదేరాము స్వామి వారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తెసుకుని ...
కిందకి వేగంగానే వచ్చాం.. ఇందాకటి కన్నా వాగు ఇంకా కొంచం పొంగింది.. కానీ బాగానే దాటాం.. నాకన్నా మావాడు పొడవు కాబట్టి తనకి ఎం ఇబ్బందిలేక పోయింది. నాకు మాత్రం మెడ దాకా వచ్చాయి నీళ్ళు... కాకపోతే ఈ సరి ఒక కర్ర తెసుకున్నం లోతు ఎంత ఉందొ ముందర తెలేదానికి అందువల్ల ఎక్కువ రిస్క్ అనిపించలేదు ఆ వాగు దాటి కొండ ఎక్కి చేసే అప్పటికి మళ్ళి వెనక్కి వెళ్దామా అన్నంత అందంగా ఉంది ఆ ప్రక్రుతి.

ఇంకో పక్క వర్షం ఏమో చొక్కలోనుంచి ధారలు గా కారుతోంది... ఆ మెట్ల మీద అలా వాన మాతో పాటు గా వస్తున్నట్టు గా మా ముందర మాకు దారి చూపిస్తున్నట్టు జల జల సాగుతున్న వాన నీరు... కొండల మీద నుంచి దూకుతున్న సన్నన్ని ధార ఒక వైపు ఇంకో వైపు వర్షపు ధార. చుట్టూరా పచ్చని చెట్లు... వాటి మీద నుంచి పడే ధార... ఎంతసేపటికి కదిలే సూచనలు కనపడపడక మా వాడు మెట్లమిదే కూర్చున్నాడు... కొంచం సేపటికి మా వాడి మీద జాలి తలిచి దిగడం మొదలు పెట్టాను... బడి దగ్గరకి వెళ్ళే అప్పటికి మా వాడి కాబోయే బావమరిది గొడుగు తో తువ్వాలు తో రెడీ గా ఉన్నాడు ..నాకు నవ్వు ఆగలేదు... మా వాడు సిగ్గు పడిపోయాడు..
ఏంటి ఇలా సెప్పకుండా పారోచ్చేసినారు (వచ్చేసారు ) అని అడిగాడు బి.ఎం (బావ మరిది ).
మా వాడు దిక్కులు చూస్తున్నాడు
అనుకోకుండా రైలు ఆగిపోవడం తో ఇలాగా పారోచ్చినాం (వచ్చాం ) అని చెప్పా..
మరి ఎలాదారనేటి (వెళ్దామా ) అన్నాడు బి.ఎం (అయన ఉద్దేశం లో వాళ్ళ ఇంటికి )
మా వాడు మళ్ళి దిక్కులు లెక్క పెట్టడం మొదలు పెట్టాడు...
లేదు ఈ పాలికి ఒగ్గేయండి ... మల్లీ పాలోచ్చినప్పుడు ఇంటికి వస్తాం.. ఈ రోజు ఎల్లక పొతే అంకుల్ కంగారు పడతారు అని చెప్పా...
అక్కడ నుంచి మా సామాను తీసుకుందాం స్టేషన్ కి వెళ్లి అనుకుంటే బి.ఎం గారు ఆల్రెడీ తీసుకునే వచ్చేసారు. ఎం అనలేక ఇంక అక్కడ ఉన్న పాక హోటల్ లో టీ తాగి బస్సు ఎక్కి మళ్ళి వైజాగ్ వచ్చేసాం ... అలా అరకు వెళ్ళలేదు కాని .. అంత అందమైన ప్రదేశాన్ని చూసాం అన్న భావన మాత్రం ఇప్పటికీ ఉంది.
మేము ఇంటికి చేరే అప్పటికి మేము శృంగవరపు కోట కి వెళ్లి వాళ్ళ మామగారింటికి వెళ్ళకుండా వచ్చేసాం అన్న వార్త ఇంటికి చేరిపోయింది. ఇంక పాపం మా వాడిని ఆడుకున్నారు ఒక వారం రోజులు ఇంట్లో అందరు...

ఎప్పుడు వర్షం వచ్చినా (మా పిట్ట్స్ బర్గ్ లో ) మా ఊర్లో ఉన్న కొండల మధ్య ఆ వర్షాన్ని చూసినా నాకు ఆ శృంగవరపు కోట, ఆ గుడి ఆ వర్షం, ఆ కొండలు గుర్తుకు వస్తూనే వుంటాయి..

Thursday, May 13, 2010

అమెరికా అమ్మాయి (1976)

అమెరికా అమ్మాయి అనగానే మనకి గుర్తు వచ్చేది పాడనా తెలుగు పాట అన్న పాట లేక పొతే ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా అన్న పాట. అమెరికా అమ్మాయి గా వేసింది ఫ్రెంచ్ అమ్మాయి దేవయాని . దేవయాని కి గత సంవత్సరం భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చారు.. ఆ సినిమా గురించి కొన్ని విశేషాలు ...


నవత ఆర్ట్స్
అమెరికా అమ్మాయి (1976)

టెక్నికల్
కలర్
35 mm

తారాగణం :
శ్రీధర్ ... మోహన్
రంగనాథ్ ... ఆనంద్
అన్నే చయ్మోట్టి (దేవయాని )... నీనా aka మీనా
దీప ... సుధ
గుమ్మడి వెంకటేశ్వరావు ...మోహన్ , ఆనంద్ తండ్రి
కాంతా రావు ... సుధ తండ్రి
పండరీ బాయి ... జానకి (మోహన్ తల్లి )
రమాప్రభ ... షెల్లీ
గిరిజ ... కాంతమ్మ
రాజబాబు ... గంటయ్య
శరత్ బాబు ... రాజు
ఇంకా అర్జా జనార్ధన రావు , కే .కే శర్మ , చలపతి రావు , గిరిజ రాణి , విజయబాల

సాంకేతిక వర్గం :
కథ : ఎ పీ నాగరాజన్
సంభాషణలు గొల్లపూడి మారుతీ రావు
పాటలు : 'పద్మ భూషణ్ ' దేవులపల్లి కృష్ణ శాస్త్రి , సి నారాయణ రెడ్డి ఆరుద్ర , మైలవరపు గోపి
గానం : ఎస్. పే బాలసుబ్రహ్మణ్యం , జి . ఆనంద్ , రమేష్ , పే . సుశీల , ఎస్ . జానకి , వసంత , వాణి జయారాం
చాయాగ్రహణం బాలు మహేంద్ర
నృత్యం : వెంపటి చిన సత్యం , తార, రాజు -శేషు
కళ : కళాధర్
కూర్పు : సుబ్బయ్య
సంగీతం : జి .కే వెంకటేష్
సహాయ సంగీత దర్శకులు : ఎల్ . వైద్యనాధన్ , ఫిలిప్ , ఇళయరాజా
నిర్మాత: 'నవతా ' కృష్ణం రాజు
చిత్రానువాదం , దర్శకత్వం : సింగీతం శ్రీనివాస రావు

పాటలు :
ఆమె తోటి మాటుంది ,పెదవి దాటి రానంది
రచన : మైలవరపు గోపి
గానం : ఎస్. పే బాలసుబ్రహ్మణ్యం ,
నటులు : రంగనాథ్ , దీప

జిలిబిలి సిగ్గుల చిలుకను చేరెను గోరింక
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : ఎస్. పే బాలసుబ్రహ్మణ్యం , వాణి జయారాం
నటులు : రంగనాథ్ , దీప

టెల్ మీ , టెల్ మీ, టెల్ మీ డు యు లవ్ మీ లవ్ మీ !
రచన : ఆరుద్ర
గానం : ఎస్. పే బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ . జానకి
నటులు : రంగనాథ్ , దీప

పాడనా తెనుగు పాట పరవశనై , మీ ఎదుట
రచన : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం : పే . సుశీల
నటులు : దేవయాని

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా
రచన : మైలవరపు గోపి
గానం : జి . ఆనంద్ ,
నటులు : దేవయాని , శ్రీధర్

డార్లింగు లింగు లిటుకు
రచన : ఆరుద్ర
గానం : జి . ఆనంద్ , రమేష్ , వసంత
నటులు : రాజబాబు, రమాప్రభ

ఆనంద తాండవమాడే , శివుడు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : పే . సుశీల
నటులు : దేవయాని

కథా సంగ్రహం :
మోహన్ అమెరికా నుంచి వస్తూ అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాడు. ఇది నచ్చని మోహన్ తండ్రి మోహన్ ని ఇంల్తో నుంచి పంపించి వేస్తాడు.. మోహన్ తమ్ముడు ఆనంద్, సుధ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మోహన్ భార్య నీనా భారతీయ సంప్రదాయాలని పాటిస్తే , ఆనంద్ భార్య సుధ విదేశి సంస్కృతి పట్ల ఆకర్షితురాలు అవుతుంది. సుధ భారతీయ సంస్కృతీ లో ఉండే గొప్పదానాన్ని ఎలా తెలుసుకుంది అన్నది మిగిలిన కథ...

సినిమా కి పూర్వ రంగం :
నవతా కృష్ణం రాజు గారిది ఆమలాపురం. ఆయన అసలు పేరు నడిమిపల్లి కృష్ణంరాజు. ఆక్కడ వ్యాపారం చేసుకుంటున్న ఆయన్ని స్నేహితులు కొందరు సినిమాల్లోకి తీసుకువచ్చారు. 1964 లొ మంచి మనిషి సినిమా ని తాతినేని చలపతి రావు గారు ఇంకొంతమంది స్నేహితులతో కలిసి మొదలు పెట్టారు. కాని కొన్ని ఆర్ధిక సమస్యల వల్ల ఆ సినిమా మధ్యలొ ఆగి పోయింది. అప్పుడు దాని దర్శకుడు కె.ప్రత్యగాత్మ గారు కృష్ణం రాజు గారి స్నేహితులు అవడం చేత, ఆ సినిమాకి కొంచం సహాయం చెయ్యమని చెప్పారు. దాంతో ఆ సినిమా కి పెట్టుబడి పెట్టడంతో కృష్ణం రాజు గారి చిత్ర రంగ ప్రవేశం జరిగింది. కాకపోతే ఆయన పేరు ఎక్కడా కనపడదు ఆ సినిమా టైటిల్స్ లో. అప్పటి నుంచి సినిమాలలో అడపా దడపా పెట్టుబడి పెట్టిన కృష్ణం రాజు గారు 1975 లొ నవతా ఆర్ట్స్ స్థాపించి అప్పుడే దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్న సింగీతం గారిని దర్శకుడిగా, రంగనాథ్ నాయకుడిగా జమీందార్ గారి అమ్మాయి సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమా పది పదిహేను రోజులు షూటింగ్ జరిగాక ఎస్.వి.రంగారావు గారు హఠాత్తుగా మరణించారు. దాంతో ఆ భాగం అంతా మళ్ళీ గుమ్మడి గారితో చిత్రీకరించారు. (మ్రోగింది వీణా పదే పదే హృదయాల లోనా పాట గుర్తు ఉందా, అది ఆ సినిమాలోదే ). ఆ చిత్రం కొన్ని కేంద్రల్లో వందరోజులాడింది.

ఇక అమెరికా అమ్మయి సినిమా గురించి...
సింగీతం గారు తమిళం లో వచ్చిన మేల్నాట్టు మరుమగల్ సినిమా చూడటం సంభవించింది. అది తమిళం లో ఒక మోస్తరుగా ఆడిన సినిమా కాని, కొన్ని మార్పులు చేస్తే తెలుగు లో బాగా ఆడుతుంది అని అనుకుని, తన దర్శకత్వంలో సినిమా తియ్యలి అని వచ్చిన సత్యనారాయణ గారితో చెప్పారు. ఆయనకి అది అంతగా నచ్చలేదు. (తరవాత అయన సింగీతం గారి దర్శకత్వం లో శ్రీ సుబ్రమణ్యేశ్వర బ్యానర్ మీద సొమ్మొకడిది సోకొకడిది తీశారు). అప్పుడే నవతా కృష్ణం రాజు గారు కూడా ఆ సినిమా చూసి ఇది చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. అప్పుడు ఆ చిత్రం హక్కులు కొని సింగీతం గారితో కథా చర్చలు మొదలు పెట్టారు. సింగీతం గారు, గొల్లపూడి గారు తమిళ సినిమా కి చాలా మార్పులు చేర్పులు చేసి కథా సంవిధానాన్ని సిద్ధం చేశారు
.
జమీందార్ గారి అమ్మాయి లో నాయకుడిగా వేసిన రంగనాథ్ ని ఒక నాయకుడిగా, శ్రీధర్ ని ఇంకో నాయకుడిగా అనుకున్నారు. తమిళం లో శివకుమార్ (గజిని ఫేం సూర్య తండ్రి) శ్రీధర్ పాత్ర పోషించగా, కమలహాసన్ పాత్ర తెలుగు లో రంగనాథ్ పోషించాడు. తమిళ్ లో కమలహాసన్ పక్కన వేసింది జయసుధ. ఒక పాటలో కమల్ తో నృత్యం చేసింది వాణీ గణపతి (నాకు తెలిసీ ఆ అమ్మాయిది ఇది ఒక్కటే సినిమా.) తెలుగులో ఆ పాత్ర కి అప్పుడే మలయాళం లో ఒక సినిమా చేసిన దీపని తీసుకున్నారు. (దీప అసలు పేరు ఉన్ని మేరి, అప్పట్లో కేరళ లో అందాల పోటి లో ప్రధమురాలిగా వచ్చింది) తమిళం లో అమెరికా అమ్మాయి గా చేసిన అమ్మాయి కి వీసా అయిపోవడం తో ఇంకో కొత్త అమ్మాయి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక డాన్స్ స్కూల్లో చూసి ఒక ఫ్రెంచ్ అమ్మాయి ని ఎన్నిక చేసారు. ఆ అమ్మాయి ఈ సినిమా చెయ్యాలి అంటే ఒకతే షరతు పెట్టింది. అది చిదంబరం ఆలయం లో తను ఆరంగేట్రం చెయ్యాలి అని. సరే అని వెంపటి చిన సత్యం గారి తో శిక్షణ ఇప్పించి చిదంబరం ఆలయం లో ఆనంద తాండవమాడె పాట ని చిత్రీకరించారు. అది దాదాపు గా ఒక వారం జరిగింది. అక్కడ నుంచి వచ్చాక మద్రాస్ లో రెండు రోజులు సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. ఆ తరవాత ఆ అమ్మాయి హఠాత్తుగా మాయమయ్యింది. వీళ్ళు కంగారు పడి చచ్చీ చెడి కనుక్కుంటే ఆ అమ్మాయి కి కూడా వీసా అయిపోవడం వల్ల వాళ్ళ దేశం వెళ్ళిపోయిందని తెలిసింది. దాంతో హతాశులయ్యారు (ప్రతీ సినిమాకీ ఈ పది రోజుల గండం ఏంటిరా బాబూ అని ).

మళ్ళీ నాయిక కోసం వేట మొదలు పెట్టారు. అప్పుడు ఏనుగుల సీతారామారావు గారు అని కృష్ణం రాజు గారి స్నేహితుడు ఒకాయన ఉండేవారు, ఆయన ప్రభుత్వ సాంస్కృతిక శాఖ లో పని చేసేవారు. ఆయన వీధిలోనే దేవయాని గారు ఉండేవారు. దేవయాని కూడా ఫ్రాన్స్ నుంచి డాన్స్ నేర్చుకోవడానికి ఇండియా వచ్చారు. అలా దేవయాని గురించి తెలిసిన సీతారామ రావు గారు కృష్ణం రాజు గారి కి చెప్పడం, కృష్ణం రాజుగారు సింగీతం గారు మద్రాస్ లో జరిగిన దేవయాని ఆరంగేట్రం చూడటం జరిగింది.

దేవయాని సినిమా లో అవకాశం అనగానే ఎగిరి గంతెయ్యలేదు. ముందర చెయ్యగలనా అని సందేహించారు. సింగీతం గారు, కృష్ణం రాజు గారు ఒప్పించి ఆమెతో సినిమా మొదలు పెట్టారు. సినిమా గురించి మాట్లాడుతూ దేవయాని " సినిమాలో నేను ఫ్రాన్స్ నుంచి, దీప మలయాళం నుంచి, బాలు మహేంద్ర గారు మద్రాస్ నుంచి, మిగిలిన వాళ్ళు అంతా దాదాపుగా ఆంధ్రా నుంచి, దాంతో చిత్రమైన కలయికగా ఉండేది. దీపకి, నాకు ఇదే మొదటి సినిమా కావడం వల్ల కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం, కాని అందరు బాగా సహకరించడం తో అది పెద్ద అడ్డంకి అనిపించలేదు, నాట్యం కోసం అప్పటికే సంస్కృతం నేర్చుకోవటం వల్ల తెలుగు పలకడం కొంచెం సులువు అయ్యింది, అందువల్లే పాడనా తెలుగు పాట కి లిప్ సింక్ అంత బాగా వచ్చింది" అన్నారు. ఈ సినిమా కోసం నేను కూచిపూడి నాట్యరీతులని శ్రీ వెంపటి చినసత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. అంత పెద్ద వారి దగ్గర శిక్షణ దొరకడమన్నది ఒక అదృష్టమని చెప్పాలి. ఆనంద తాండవం పాటకి సత్యనారాయణ గారి దగ్గర అప్పుడు సహాయకురాలిగా శ్రీమతి శోభా నాయుడు గారు పని చేసారు అది ఇంకో తీపిగుర్తు" అని ఆ సినిమా గురించి అన్నారు ఆవిద. ఈ సినిమా హిట్ అయ్యాక ఆవిడకి చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆవిడ నృత్యం మీదే కేంద్రీకరించారు తన దృష్టిని. ఆవిడ వదిలేసిన ఆవకాశాల్లో కమలహాసన్ సినిమా నుంచి రాము కరియత్ సినిమా వరకూ ఉన్నాయి.

రంగనాథ్ మాట్లాడుతూ " నవతా సంస్థ ఒక రకంగా నాకు మాతృ సంస్థ లాంటిది. నేను చాలా సినిమాల్లో చేశాను, కొన్ని చిత్ర సంస్థల ఆఫీసు కూడా ఎక్కడ ఉంటుందో తెలీదు నాకు, కాని నవతా సంస్థ కార్యాలయానికి మాత్రం కథా చర్చల్లో కాని, ఊరికే కలవడానికి కాని ఎదో ఒక రకం గా వెళ్ళేవాడిని. నవతాలో నేను చేసిన సినిమాలు అన్నీ సంగీత పరంగా నాకు మంచి పేరుని తీసుకువచ్చాయి. (జమీందార్ గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం వగైరా). అప్పట్లో మేము ఎంతమంది హీరోలు సినిమాలో అని చూసే వాళ్ళం కాదు, మనకి ఇచ్చిన పాత్ర బాగుందా లేదా అని చూసేవాళ్ళం. సింగీతం గారి స్కూల్ డిఫరెంట్ గా ఉండేది. అంతకు ముందర నేను చేసిన రెండు సినిమాల దర్శకులు ఒక రకంగా చెబితే ఈయన ఇంకో రకంగా చెప్పేవారు. నటనలో కొంచెం ఎక్కువ కాదు, కొంచెం తక్కువ కాదు సరిగ్గా ఉండాలి అని చెప్పేవారు. కొంచెం ఎక్కువ అనిపిస్తే ఇది ఎక్కువ అయింది అనేవారు, లేదంటే కొంచెం తక్కువ అయింది అనేవారు. ఆయన చాలు అంటే మనం సరిగ్గా చేసినట్టని అర్ధం. సినిమాలో నాకు మూడు పాటలు ఉన్నా, నాకు మాత్రం ఒక వేణువు వినిపించెను పాట మీద మక్కువగా ఉందేది, నా పాటలు అన్నీ తీసివేసి నాకు ఆ పాట ఇవ్వమని కూడా అడిగాను, కాని నా పాత్రకి ఆ పాట నప్పదు అని ఒప్పుకోలేదు. శ్రీధర్ గారు మంచి స్నేహితులు ఆయ్యారు ఆ సినిమాతో. ఈ సినిమాలో ఒక పాటకి నృత్య దర్శకుడు లేరు. ఆమెతోటి మాటుంది పాటకి సింగీతం గారు వచ్చి ఈ పాటకి నృత్య దర్శకులు లేరు, మీరు నేను కలిసి చేద్దామని నాతో చేయించారు. అంతే కాదు ఈ సినిమాలో నాకు ఎక్కడ మేకప్ లేదు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లకీ తెలుగు రాదు, అందులో ఇద్దరికీ మొదటి సినిమా. దీప రోజు రాగానే ఏమండీ మీ భర్త బండలు బాగుండాయ అని అడిగేది... భార్యాబిడ్డలు అని ఆమె అర్థం, దేవయాని పక్కా పర్ఫెక్షనిస్ట్. చాలా కష్టపడేవారు ఆవిడ. ఆవిడకి పద్మశ్రీ వచ్చింది అని విని చాలా సంతోషం వేసింది" అన్నారు.

సినిమాలో పాటలు సాహిత్యం గురించి :
కృష్ణం రాజు గారు ఎక్కువగా రాణి బుక్ హౌజ్ దగ్గర సాయంకాలాలు గడిపేవారు. (రాణి బుక్ హౌజ్ యజమాని అట్లూరి పిచ్చేశ్వర రావు గారు రచయిత, భార్యా భర్తలు, చివరకు మిగిలేది లాంటి సినిమాలకి మాటలు కూడా రాశారు). ఆకొట్టు చాలా మంది రచయితలకు సాయంకాలాల సమావేశాలకి విడిది గా ఉండెది. కృష్ణం రాజు గారికి పాటల రచయిత గోపి గారితో అక్కడే పరిచయం. గోపీ గారు ఈ సినిమాకి రాసిన ఒక వెణువు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు కదా..

అలాగే పాడనా తెలుగు పాట ని కృష్ణ శాస్త్రి గారు రాశారు. అప్పటికే ఆయనకి మాట కొంచెం కష్టంగా ఉండేది. ఆ పాట కోసం రోజూ గాయకుడు ఆనంద్ వెళ్ళి ఆయనని కలిసే వారు. అలా దేవులపల్లి వారి తో పరిచయం కలగడం తన అదృష్టం అంటారు ఆనంద్. గాయకుడిగా ఆనంద్ కి ఇది ఒక రకంగా మొదటి సినిమా, ఇంకో రకంగా రెండో సినిమా. ఆనంద్ మొదటి సినిమా నిజానికి పండంటి కాపురం, ఆ సినిమాలో కోరస్ పాడారు. సింగిల్ గా పాడిన మొదటి సినిమా అమెరికా అమ్మాయి. ఈ సినిమాలో పాటతో తన సినిమా ప్రస్థానం మొదలు పెట్టడం తన అదృష్టం అంటారు ఆనంద్.
దాని గురించి మాట్లాడుతూ " అప్పట్లో చంద్రమోహన్ ఇంట్లో పండగలు ఒక వేడుకలా చేసే వారు, దానికి చాలా మంది సినిమావాళ్ళు వచ్చేవారు. నా స్నేహితుడు మేడిశెట్టి అప్పారావు నన్ను ఒక పండగకి అక్కడికి లాక్కెళ్ళాడు. నేను అప్పుడే మద్రాస్ వచ్చి అవకాశాలకోసం ప్రయత్నిస్తున్న రోజులు. మా వాడి ప్రోద్బలం తో నేను అక్కడ ఒక పాట పాడాను. ఆ పాట వింటూ ఒకాయన నిలబడిపోయారు. పాట అయ్యాక ఆయన మర్నాడు నవతా కార్యాలయానికి వచ్చి కనపడమన్నారు, ఆయనే నవతా కృష్ణం రాజు గారు. మర్నాడు కార్యాలయానికి వెళ్ళగానే ఆయన జీ.కె.వెంకటేశ్ గారికి నన్ను పరిచయం చేశారు. వెంకటేశ్ గారు నన్ను ఒకటి రెండు పాటలు పాడమని, నేను పాడాక విని తప్పకుండా నీకు అవకాశం ఉంటుంది అని మాట ఇచ్చారు.

తరవాత నాకు కృష్ణశాస్త్రి గారి దగ్గర నుంచి పాట తెచ్చే పని అప్పగించారు. రోజూ కృష్ణశాస్త్రి గారి దగ్గరకి వెళ్ళడం ఆయన్ని పాట గురించి అడగటం, అలా ఆయనతో పరిచయం జరగడం జరిగింది. నా పాట నచ్చి ఆయన నా గురించి మహాదేవన్ గారికి రికమండ్ చేస్తూ ఒక ఉత్తరం రాసి ఇచ్చారు. అలా ఈ సినిమా తరవాత నాకు బంగారక్క సినిమాలో మహదేవన్ గారి సంగీత దర్శకత్వం లో దూరాన దూరన తారా దీపం పాట పాడే అవకాశం వచ్చింది.

ఈ సినిమాలో దాదాపు అన్ని పాటలు అయిపోయాయి, అన్ని పాటలు బాలు గారు, సుశీల గారు పాడేశారు, ఒక పాట ఏమొ రమేశ్ పాడారు (రమాప్రభ, రాజబాబు మీద డార్లింగు లింగు లిటుకు పాట) ఇంకా ఒక్క పాటె ఉంది, నాకేమో టెన్షన్ ఇంకా పాడించరేమో అని. వెంకటేశ్ గారు అప్పుడు నాకు ఒక వేణువు పాట ట్యూన్ ఇచ్చి సాధన చెయ్యమన్నారు. సినిమాలో మిగిలిన పాటలేమో హుషారయిన పాటలు ఇదేమో కొంచెం స్లో గా ఉంది, ఈ పాట అసలు జనాలు గమనిస్తారొ లేదో కూడా అని సందేహం వచ్చింది, కాని సాధన చేసేవాడిని. ఇది వెంకటేశ్ గారు గమనించారు, ఒక రోజు నన్ను ఇంటికి తీసుకువెళ్ళి మెహదీ హసన్ గారు పాడిన గజల్ వినిపించి ఆ పాటకి ఉన్న సంగీతం దాని ప్రాముఖ్యత వివరించారు, అప్పుడు అర్ధం అయింది ఆ పాట కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో. ఆ పాట రికార్డింగ్ అయ్యాక విన్నవారు అందరూ, పాట బాగుంది కాని బాలు గారు పాడితే ఇంకా ఎంత బాగుండేదో అని అనడం మొదలు పెట్టారు, ఇది విని నాకు మళ్ళీ టెన్షన్ మొదలయ్యింది. వెంకటేశ్ గారి దగ్గరకి వెళ్ళి భయపడుతూనే " సార్ నా పాట వుంటుందాండీ" అని అడిగాను. ఆయన అభయహస్తం ఇచ్చి పాటలన్నింటిని వెంటనే ఆడియో కంపనీకి పంపేశారు. అలా నా మొదటి పాట వెంకటేశ్ గారి దయవల్ల వెలుగు చూసింది. అలా అమెరికా అమ్మాయి సినిమాకి పాడిన వేళావిశేషం, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. మా అబ్బాయికి అమెరికాలో అమ్మాయి పుట్టింది. ఇలా ఇప్పుడు మా ఇంట్లోనే ఒక అమెరికా అమ్మాయి ఉంది" అన్నారు నవ్వుతూ. ఆనంద్ గారు చెప్పని ఇంకో విశేషం కూడా ఉంది. అమెరికా అమ్మాయికి గాత్రధారణ చేసింది సుజాత గారు. అప్పట్లో ఉషా ఉథుప్ పాడిన పాట ఆవిడ పాడటం చూసి కృష్ణం రాజు గారు ఈ అమ్మాయి ఐతే అమెరికా అమ్మాయికి గాత్రానికి సరిపోతుంది అని భావించి ఆ అమ్మాయితో డబ్బింగ్ చెప్పించారు. సుజాత డబ్బింగ్ చెప్పింది ఈ ఒక్క హిత్రానికే. అప్పటికీ ఆనంద్ కి ఆవిడకి పరిచయం లేదు. తరవాత ఆవిడ ఆనంద్ కి శ్రీమతి అయ్యారు. అలా అమెరికా అమ్మాయి ఆనంద్ గారి జీవితంలో ఒక ముఖ్య మలుపుకి కారణం అయ్యింది. దీపకి గాత్ర దానం చేసింది దుర్గ. ఇప్పుడు దుర్గ కూతురు కూడ ఒక లీడింగ్ డబ్బింగ్ ఆర్టిస్టు.

శరత్ బాబు కి మలుపు తెచ్చిన చిత్రం. :
శరత్ బాబు అప్పటికి నాలుగైదు సినిమాల్లో నాయకుడిగా వేసాడు. అందువల్ల ఈ సినిమాలో ప్రతినాయకుడి వేషం వస్తే, చెయ్యాలా వొద్దా అని సందేహిస్తుంటే గాయకుడు ఆనంద్ బలవంత పెట్టి ఒప్పించారు (ఆనంద్, శరత్ బాబు రూంమేట్స్ అందువల్ల ఆ చనువు ఉంది వాళ్ళ ఇద్దరి మధ్య.) ఈ సినిమా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు బాలచందర్ గారి సినిమా కి కూడా అదే ధియేటర్ లో డబ్బింగ్ జరుగుతుంది. ఒక రోజు శరత్ బాబు, రంగనాథ్, దుర్గ డబ్బింగ్ ధియేటర్ లో ఉన్నప్పుడు, బాలచందర్ గారు చూడటం జరిగింది. ఎర్రగా పొడవుగా ఉన్న ఈ కళ్ళద్దాల అబ్బాయి గురించి ఆరా తీసారు బాలచందర్ గారు. శరత్ బాబు ఉన్న సన్నివేశాలు అన్ని అచ్చి బాబు (నవతా కృష్ణం రాజు గారి అబ్బాయి ) వేసి చూపించారు బాలచందర్ గారికి. తరవాత సినిమా ఫంక్షన్ లో సింగీతం గారు, శరత్ బాబు ని తీసుకెళ్ళి పరిచయం చేసారు. ఆ వేళా విశేషం వల్ల బాలచందర్ గారి సినిమాల్లో దాదాపుగా అన్నిటిలో ఉన్నారు శరత్ బాబు. బాలచందర్ గారు తమిళం లో నే కాక శరత్ బాబు ని కన్నడ సినిమాల్లో కి కూడా పరిచయం చేసారు.

ఇతర విశేషాలు"
- ఇది రంగనాథ్‌కి అయిదో సినిమా. (చందన, చదువు-సంస్కారం, జమీందారుగారి అమ్మాయి, ఒక దీపం వెలిగింది, అమెరికా అమ్మాయి)
- ఇది దర్శకుడిగా సింగీతం గారికి కూడా ఐదో సినిమా (నీతి-నిజాయితీ, దిక్కట్ర పార్వతి, జమీందారుగారి అమ్మాయి, ఒక దీపం వెలిగింది, అమెరికా అమ్మాయి)
- సినిమా కి మొదట్లో పేర్లు వచ్చే అప్పుడు దామెర్ల రామారావు గారి తైలవర్ణ చిత్రాలు పెడితే బాగుంటుంది అని దానికి అనుమతి కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే, బాపు గారు ఆదుకున్నారు. బాపు గారు దామెర్ల గారి దగ్గర అనుమతి తీసుకువచ్చారు. అందువల్ల వారికి ముందుగా కృతజ్ఞతలు ఇచ్చారు సినిమా మొదట్లో.
- సినిమాకి అనుకున్న నిర్మాణ వ్యయం ఎనిమిది లక్షలు. కాని ముందర ఒక అమ్మాయితో కొంత చిత్రీకరణ జరిపాక ఆ అమ్మాయి మధ్యలో వెళ్ళిపోవడం వల్ల నిర్మాణ వ్యయం ఇంకో రెండు లక్షల దాకా పెరిగింది.
దాదాపు నలభై ఐదు రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకుంది.
- చిదంబరం, ఊటీ, మద్రాస్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుందీచిత్రం.
- రంగనాథ్ పారితోషికం పదివేలు, శ్రీధర్, దేవయాని పారితోషికం చెరో పదిహేను వేలు, దీపకి ఐదు వేలు పారితోషికం. చిత్ర ముఖ్య నాయకుడితో సమంగా పారితోషికం తీసుకున్నది బాలు మహేంద్ర.
- ఈ సినిమాకి జీ.కె.వెంకటేశ్ కి సహాయకులుగా చేసింది ఎల్.వైద్యనాథన్ (పుష్పక విమానం సినిమాకి, ఆర్.కె.నారాయణ్ మాల్గుడి డేస్ కి సంగీతం అందించినదీ ఈయనే). మరొకరు ఇళయరాజా. అప్పట్లో వెంకటేశ్ గారి దగ్గర మ్యూజిక్ కండక్టర్ గా ఎల్.వైద్యనాథన్ గారు, కంపోజింగ్ అసిస్టెంట్ గా ఇళయరాజాగారు ఉండేవారు.
శరత్ బాబు ఈ సినిమాలో వేషం చేయాలా వద్దా అని సందేహిస్తుంటే, గాయకుడు ఆనంద్ బలవంతపెట్టి ఒప్పించారు. (ఆనంద్, శరత్ బాబు రూమ్మేట్స్ అప్పట్లో). అప్పటికీ ఇంకా రమాప్రభ, శరత్ ల వివాహం జరగలేదు. ఈ సినిమా విడుదల అయ్యాక వారి వివాహం జరిగింది.

ఇక ప్రస్తుతం :
నవతా కృష్ణం రాజు గారు, శ్రీధర్ గారు ఇద్దరు మన మధ్య లేరు. రంగనాథ్ గువ్వలజంట సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ప్రస్తుతం అటు సినిమాల్లో ఇటు టీవి లోను నటిస్తూ బిజీ గా ఉన్నారు. శరత్ బాబు, రమాప్రభ విడి పోయి చాలా కాలం అయింది. రమాప్రభ కూడా అటు సినిమాల్లో ఇటు టీవి లోను నటిస్తూ బిజీ గా ఉన్నారు, శరత్ బాబు మగధీర తరవాత మల్లి బిజీ అయ్యి ప్రస్తుతం తెలుగు, తమిళ , కన్నడ సినిమాల్లో బిజీ గా ఉన్నారు. ఆనంద్ గారు (ఈ వ్యాసం రాసే సమయానికి ) అమెరికా లో కొడుకు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయన ఇంకా స్వరమాధురి సంస్థ ద్వారా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దీప కేరళ లో ఉన్నారు అని అన్నారు. ఆవిడ గురించి కనుక్కుందాం అనుకున్నా ఎవరికీ తెలీదు ఎక్కడ ఉన్నారో. దేవయాని గారికి పోయిన సంవత్సరం భారత ప్రభుత్వం ప్రద్మశ్రీ ఇచ్చి సత్కరించారు. సింగీతం గారు ప్రస్తుతం వరుడు సినిమా లో తాత గారి వేషం వేసారు. ప్రస్తుతం కొత్త సినిమా కి కథా చర్చలు జరుగుతున్నాయి. కృష్ణం రాజు గారి అబ్బాయి అచ్చిబాబు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అయన బాలు గారి పాడుతా తీయగా కార్య క్రమానికి నిర్మాత.

కృతజ్ఞతలు : సింగీతం శ్రీనివాస్ రావు, ,అచ్చి బాబు (కృష్ణం రాజుగారి అబ్బాయి) దేవయాని, రంగనాథ్, శరత్ బాబు గార్లకి కృతజ్ఞతలు.

ఆంగ్లం లో ఈ వ్యాసాన్ని చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి

Tuesday, May 11, 2010

అప్పిచ్చు వాడు మూర్ఖుడు ....

అప్పిచ్చు వాడు వైద్యుడు అని పుస్తకాల్లో చదువుకున్నాం కాని... నిజానికి అప్పిచ్చువాడు పెద్ద మూర్ఖుడు... నాకు అర్ధం కాని విషయం ఏంటి అంటే.... ప్రతి ఒక్కళ్ళు అప్పు తీసుకునే అప్పుడు, ఒక ఫలానా తారీకుకి తప్పకుండా ఇచ్చేస్తా అని అన్ని రకాల వాగ్దానాలు చేసేస్తారు.. ఇంకా మనం ఇచ్చే దాక మనకి ఉపిరి ఆడనివ్వరు... సరే ఇస్తాం. వాళ్ళు ఇస్తా అన్న గడువు దాటిపోతుంది ..మన డబ్బు రాదు.. వాళ్ళు ఇల్లు కొంటారు ... స్తలం కొంటారు... లేదా కారు కొంటారు... లాప్ టాప్ కొంటారు... మన డబ్బు మాత్రం రాదు... అందుకే మరి అప్పిచ్చు వాడు మూర్ఖుడు అనేది...

మానవ సంభంధాలు అన్ని ఆర్ధిక సంభందాలే, అందువల్ల మనకి వాడు ఎంత మంచి స్నేహితుడు అయినా .. వాడు మన డబ్బు ఇవ్వడం మానేసి అన్ని కొంటుంటే చిరాకు పెరిగిపోతూ ఉంటుంది... బైట పడలేము. మెల్లిగా దూరం అవ్వడం కూడా జరగవచ్చు.. నేను చాల సందార్బాల్లో చేసేది ఒక్కటే... ఎవరికన్నా డబ్బు ఇస్తున్న అంటే దాని గోడకి వేసిన సున్నం అని మనసులో అనుకుని ఇస్తే ... మనకి చాలా వరకు అది రాదు అని తెలుసు కాబట్టి ఒక రకంగా నిశ్చింతా గా ఉంటుంది. అలా కాకా వాళ్ళు ఇస్తారు అని మనం ఆ కర్చు కి సరిపడా ఇంకో టి రెడీ గా పెట్టుకున్నామో అంతే సంగతులు...

అందరు అలా ఉంటారు అనుకుంటే తప్పే... మా నాన్న ప్రతిసారి పోలమో , స్తలమో కొన్నపుడు అప్పు చేసే వారు. కాని దాన్ని వెంటనే తెర్చేసే వారు... అది తీర్చే వరకు మాకు రోజు క్లాసు .. దాంతో ఇంట్లో అప్పు అంటె ఒక . తప్పు లాగా స్థిరపడిపోయం. కాని అమెరికా లో అలా కాదు. అమెరికా అంటా అప్పు మయమే. ఆ క్రెడిట్ కార్డ్ .. ఈ కార్డ్ అని వొడ్డి అని ముక్కు పిండి వస్తూల్ చేస్తారు. మనలాగా వోద్దిలి పెట్టరు.

ఇచ్చిన ప్రతి సారీ వీడన్నా తిరిగి ఇస్తాడు ఏమో అని ఒక రకమైన దింపుడు కళ్ళెం ఆశ ఒకటి అనుకుంటా... ఎంత మానసికంగా ఇవ్వడు అని సిద్దపడినా.. కాని ఆ ఆశ ఎప్పుడు అడియాసే అవుతుంది... దానికి తోడూ.. మనకి బాగా దగ్గరి వాళ్ళు నేను చెప్పనా ! అయిన నువ్వు వినలా .. నీ కర్మ లాంటి మాటలు ఈటెలు మామూలే. మొగుడు కొట్టినందుకు కాదు .. తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టు... ఒక పక్క వాడు డబ్బు ఇవ్వడు.. ఇంకో పక్క మనవాళ్ళు తిల్ట్లు ...
ఇంకో బాద ఏంటి అంటె ... మనం ఇవ్వం అని అన్నాము అనుకోండి.. వాడికేం బోలెడు సంపాదిస్తున్నాడు .. మనం అడిగింది ఎంత... లేదన్నాడు ... పోయేటప్పుడు కట్టుకు పోతాడా... ఇంకా రకాల రకాల విషయాలు అంటారు... మనం కష్టపడింది ఎందుకు ఇవ్వాలి అని మాత్రం ఆలోచించరు.

ఇంకా కొందమంది ఉంటారు.. వాళ్ళకి తెలుసు మనకి అవసరం అని.. కాని మనకి ఇవ్వాల్సి ఉన్నా... ఎం తెలీనట్టే నటించేస్తారు. మంచి నంది బహుమతి ఇచ్చెయ్యవచ్చు వీళ్ళకి నటనలో .. ఇంకా కొంతమంది అప్పుల అప్పరవులూ ఉంటారు ... పొద్దున్నే లేచి "అప్పు" డే తెల్లారింది అనుకునే వాళ్ళు. ఉన్నారు... కాని వాళ్ళు ఉన్నారు అంటె నాలాంటి మూర్ఖులు ఉండబట్టే కదా అన్నది సత్యం...

కానీ ... అందరూ ఒకలాగా ఉండరు... తీర్చే వాళ్ళు కూడా ఉంటారు.. వాళ్ళకి ఈ వ్యాసం వర్తించదు.. వాళ్ళలాంటి వాళ్ళకోసం ఆశ తో నేను ఎప్పుడూ మారను...