Wednesday, January 10, 2018

అజ్ఞానవాసి - ఓ ప్రేక్షకుడి ప్రశ్నవళి



తెలుగు లో కొంచం పెట్టుబడి కి కొంత రాబడి వొచ్చే దర్శకుల ఉన్నది చాలా కొద్దిమంది . వాళ్లలో త్రివిక్రమ్ ఒకరు .  అతుకుల బొంత సినిమా ని కూడా రంగులు అద్ది మాయ చేసి జనాలని ఎదో విధం గా థియేటర్ కి రప్పించగలిగిన కొద్దీ మంది లో ఇతను ఒకరు . అది అతని మాటల గారడీ కావొచ్చు మారేదన్న కావొచ్చు.  గత కొన్ని సినిమాలు గా అయన వేరే వాళ్ళ భావచోర్యం మీద బాగా ఆధారపడి , ఎలాగోలా నెట్టుకొస్తున్నారు .  అజ్ఞాతవాసి సినిమా కి ముందర యద్దనపూడి గారి మీనా మక్కి మక్కి కాపీ కొట్టి అల్లరిపాలు అయ్యారు.  చివరికి ఆవిడకి క్షమాపణ చెప్పి టైటిల్స్ లో పేరు వేశారు. ఇప్పుడు ఇంకో ఫ్రెంచ్ సినిమా ని శుబ్భరంగా లేపేసి దాన్ని మసి పూసి మారేడు కాయ చేసి  (విడుదల కి ముందు గోడవకాకుండా ఉండటం కోసం గూఢచారుల వార్త ప్రకారం పదికోట్లు చెల్లించారు అని భోగట్టా ). ఇంకా సినిమా లో చూసుకోండి కావలిసినంత చెత్త . మొదటి రోజు స్క్రీన్ మీద చల్లడానికి తీసుకెళ్లిన కెళ్లిన పేపర్ కాగితాల కన్నా ఎక్కువ చెత్త సినిమా లో ఉంది.  మచ్చుకు కొన్ని బులెట్ పాయింట్స్  :
1.  హీరో గారు రాగానే ఎదో పాట ప్రపంచాన్ని బాగు చేసే గొప్ప వ్యక్తి అనే భావం వొచ్చేలా ఇచ్చి ... కుర్చీ గురించి ఒక మంచి డైలాగు చెప్పి ... ఎక్కడికో తీసుకెళ్లి దాని బాత్రూం లో వదిలేసారు .
2. పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లో మొగవాళ్ళకి ఆడవాళ్ళకి విడిగా బాత్రూములు ఉండవు ! ... అక్కడ పోగ కూడా తాగవచ్చు .
3. 50 వేలమంది పనిచేసే కార్పొరేట్ ఆఫీస్ లో మేనేజర్ ఆడవాళ్ళ పిర్రలమీద కొట్టినా కుయ్యి కయ్యి మనరు .
4. హీరో హీరోయిన్ ని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకోగానే హీరోయిన్ వెంటనే లవ్వుఆడేసును .
5. హీరో గారు ఆడవారి బాత్రూం లో కి వెళ్లి సిగరెట్టు తాగవచ్చును.
6. పాతికేళ్ళు కంపెనీ లో అతి పెద్ద పొజిషన్ లో ఉండి కంపెనీ పూర్తీ పేరు తెలీదు విలన్ కి .
7. పోలీస్ అధికారి వచ్చి పరిశోధిస్తా పొడిచేస్తా అని చెప్పి మళ్ళి సినిమాలో ఎక్కడా కనపడకుండా పోవును .  
8. హీరో కార్పొరేట్ ఆఫీస్ లో సైకిల్ మీద వొచ్చి బెల్ట్ తో ఇతర పెద్ద అధికారులని కొట్టవచ్చును.
9. హీరో రోడ్ దాటాలి అంటే మధ్యలో చెట్లు ఉన్నచో సెక్యూరిటీ బుజాల మీద ఎక్కి ఆ చెట్లు దాటవచ్చును.
10. హీరో ఎవరిని కావాలి అంటే వాళ్ళని కిడ్నప్ చెయ్యవచ్చును. వారి గురించి వారి తల్లి తండ్రులు కానీ వారి స్నేహితులు కానీ పోలీస్ లకి  కనపడుటలేదు అన్న రిపోర్ట్  ఇవ్వరు.
11. హీరో తండ్రి బులెట్ తగిలి పెద్ద భవంతి మీద నుంచి పడిపోతే అది పోలీసులు ఆత్మహత్య గా భావించెదరు .
12. సీసీ టీవీ లో హీరో వరకే కనపడుదురు . మిగిలిన హీరో స్పూన్లు కనపడరు .
13 హీరోయిన్లు ఇద్దరు హీరో కోసం సూర్యకాంతం , ఛాయాదేవి లాగ జుట్లు పట్టుకుని కొట్టుకుందురు .
14. కార్పొరేట్ ఆఫీసుల్లో డ్రెస్సుకోడ్ ఉండదు. పెళ్ళికి వెళ్లినట్టు రోజు డిజినెర్ షేర్వాణీ  వేసుకుని వెళ్ళవచ్చు.
15. హీరో వొచ్చిన పని మానేసి ఎన్ని ఆడంగి (క్షమించాలి ఈ పదానికి పర్యాయపదం తెలీదు ) వేషాలు వేస్తె అంటే కామిడి అన్నమాట .
16. హీరో తమ్ముడు కారు ప్రమాదం లో మరణిస్తే అది తాగి నడిపి ఉండవొచ్చు అని పోలీస్ గారు చెప్పెదరు. వీరు చెవిలో కాలిఫ్లవర్ పెట్టుకుని వినెదరు .
17. హీరో ని అర్జెంటు గా రమ్మని చెపితే ... వాడు తీరికగా కాశీ , ప్రయాగ గట్రా  తీర్ధయాత్రలు చేసి ... శవదహనాలు అర్పణలు చేసి వస్తాడు .  హౌ ?
18. నువ్వు యుద్ధం చెయ్యాలి అని తీసుకు వస్తే , తీసుకువచ్చిన వాళ్ళకి మళ్ళా మనం యుద్ధం చెయ్యాలి అని కుర్చీ డవిలాగు ? తీసుకొచ్చినవాడికే క్లాస్ ... ఏందీ ఈ రచ్చ 
19. ఇంకో బ్లండర్ ఏంటి అంటే ... ఖుష్బూ డైరెక్ట్ గా హీరో ని వారసుడు అని పరిచయం చెయ్యొచ్చు ... ఈడు మరువేషాలు తింగర ఆటలు మానేసి కింగ్ అనెయ్యొచ్చు . అప్పుడు విలన్ వొచ్చి ఛాలెంజ్ చెయ్యొచ్చు ...  ఒక తొక్కలో మేనేజర్ రోజూ ఆలా పిర్రలు వాయిస్తుంటే , హౌ they tolerate ..  అర్జున్ రెడ్డి మీద విరుచుకుపడ్డ లేడీస్ వేర్ అర్ యు ఐ అస్క్ ? 

గమనిక :  మిగిలినవి గుర్తు వచ్చినప్పుడు అతికించబడును 

అంకితం : ఒకప్పటి మాటల మాంత్రికుడి కి ..

Thursday, January 5, 2017

గణేష్ పాత్రో గారికి నివాళి , వారి ఇంటర్వ్యూ


మార్చ్ 1984
పొద్దున్న 8:30 ..  పొద్దునే పేపర్ చదువుతూ పక్కింట్లో నుంచి వచ్చే వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు వింటున్నా.  అప్పుడే ఫిబ్రవరి లో విడుదల అయినా ముద్దుల కృష్ణయ్య మీద మొదటిసారిగా గణేష్ పాత్రో గారి పేరు విన్నా .  ఆ సినిమా దాదాపు గా సంవత్సరం ఆడేసింది సుభాష్ థియేటర్ (ముషీరాబాద్ , హైదరాబాద్ ) లో అప్పుడు ఆ సినిమా కి పంపిణీదారులు శ్రీనివాసా ఫిలిమ్స్ వాళ్ళు.  ఆ తరవాత చాలా సార్లు గణేష్ పాత్రో గారి పేరు విన్నా , ( దాదాపు గా అన్ని బాలచందర్ గారి  అన్ని సినిమాలు ఇలా చాలా. క్రాంతి కుమార్ , స్రవంతి రవికిశోర్ గారి సినిమాలు , సీతారామయ్య గారి మనవరాలు, తలంబ్రాలు, ఆహుతి , మయూరి , అమ్మ రాజీనామా , 2001 లో తొమ్మిది నెలలు చిత్రం తరవాత పన్నెండు ఏళ్ళకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) ) కానీ పర్సనల్ గా వారితో పరిచయం ఎప్పుడు జరగలేదు. నేను హైదరాబాద్ లో అయన మద్రాస్ లో ఉండటం వల్ల అనుకుంటా . ఆ తరవాత నేను అమెరికా రావడం ,  సరదాగా సినిమా ఇంటర్వ్యూలు చెయ్యడం వల్ల చాలా మంది పరిచయం అయ్యారు.  అలాగే ఒక సారి అంతులేని కథ సినిమా మీద ఒక ఆర్టికల్ రాస్తూ గణేష్ పాత్రో గారి పేరు దగ్గర ఆగిపోయా , దాదాపు ఒక ఏడాది పాటు అయన  ఫోన్ నెంబర్ పట్టుకోవడానికి సరిపోయింది (నేను ఇండియా లో ఫ్రెండ్స్ కి చెప్పడం వాళ్ళు బిజీ లో కనుకుంటా అని కాలం గడపటం ఆలా జరిగిపోయాయి ) .
2006 విజయదశమి..
మొత్తానికి అయన నెంబర్ సంపాదించి , ఫోన్ చేశా.  అయన బిజీ గా ఉన్నాను తరవాత మాట్లాడుదాం అని అన్నారు . నేను పట్టువదలని విక్రమార్కుడి లాగా ఇంకో నాలుగు సార్లు కాల్ చేశాను.   ఆ ముహూర్త బలం ఏంటో తేలీదు కానీ ఆ తరవాత దాదాపు గా ప్రతి నెల కో రెండు నెలలకో నేను ఆయనకి ఫోన్ చెయ్యడమో లేక నేను చెయ్యకపోతే అయన ఫోన్ చేసి  " ఎరా నాన్న ఎలా ఉన్నావు ఫోన్ చెయ్యడం లేదు నీ ఆరోగ్యం  అది ఎలా ఉంది అని ? " అని ఆయనే ఫోన్ చేసే వారు.

అమెరికా లో ఎక్కడ ఏదన్న కాల్పుల్లో లేక ఇంకా ఏదన్న జరిగితే అయన మొదటగా ఫోన్ చేసే వారు " ఏరా నాన్న మీ ఊర్లో కాదు కదా . నువ్వు ఎలా ఉన్నావు ? " అని ఫోన్ వచ్చేది .

ఏ రోజు నన్ను ఒక పాత్రికేయుడు గా కానీ ఒక తెలీని మనిషి గా కానీ చూడలేదు. అసలు మేమిద్దరం ఎప్పుడు కలవలేదు అంటే ఎవ్వరు నమ్మరు  అంత బాగా నాతొ మాట్లాడేవారు. ఒక సారి ఒట్టావా (కెనడా ) కి వాళ్ళ అబ్బాయి గారి ఇంటికి వచ్చారు . రాగానే నాకు ఫోన్ చేసి కుదిరితే రమ్మన్నారు . నాకు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అప్పుడే సడన్ గా  ఒకరోజు న్యూయార్క్ ఒక్క రోజు కోసం వస్తున్నా రావడానికి కుదురుతుందా అన్నారు . అప్పుడు కూడా కుదరలేదు. దాంతో ఆయనని కలవడం కుదరలేదు.

సీతమ్మ వాకిట్లో సినిమా రిలీజ్ అయిన రోజు నేను ప్రీమియర్ అయ్యాక బాగా లేట్ అవ్వడం తో పొద్దున్నే ఫోన్ చేద్దాం అని పడుకున్నా.  పొద్దున్న లేచి తీరికగా చేద్దాం అనుకుని కాల్ చేశా . అయన పొద్దున్న నుంచి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అంటే ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు. 

బాలచందర్ గారితో మాట్లాడాలి అంటే అయన ఫోన్ లో ఇంటర్వ్యూ లు ఇవ్వరు కానీ నేను చెప్తా లే అన్నారు . ఆయనతో మాట్లాడించారు. అప్పటికే బాలచందర్ గారి ఆరోగ్యం సరిగ్గా లేదు .  అయన ఆరోగ్యం కుదుట పడ్డాక ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను .  కానీ అయన ఆ అనారోగ్యం నుంచి బయటపడకుండా నే వెళ్లిపోయారు.  ఆ వార్త కి పాత్రో గారు ఎలా తట్టుకున్నారో అని ఇంటికి ఫోన్ చేశాను. అప్పుడే అయన అనారోగ్యంగా ఉన్నారు హాస్పిటల్ లో ఉన్నారు అని చెప్పారు. అప్పటి నుంచి రోజు ఫోన్ చేసి పరిస్థితి కనుకున్నే వాడిని.  సరిగ్గా బాలచందర్ గారు పోయిన పన్నెండు రోజులకి గణేష్ పాత్రో గారు కూడా వెళ్లిపోయారు తిరిగిరాని లోకాలకి  (బాలచందర్ గారి మరణం గణేష్ పాత్రో గారికి తెలియనివ్వలేదు ) .

ఒక మనిషి మరణం మనం  మనకి ఎంత కోల్పోయామో అయన పోయాక కానీ తేలీదు అన్నదానికి ఉదాహరణ నాకు వారికీ ఉన్న అనుభందం . అయన మాట్లాడుతుంటే ఇంట్లో సొంత మనిషి మాట్లాడుతున్నట్టు గా ఉండేది . ఒక మనిషిని మనం వ్యక్తిగతం గా కలవకపోయినా చేరువ అవడం అంటే ఇదే ఏమో .  అయన పోయి రెండు సంవత్సరాలు అయినా ఇంకా అయన మాట మనసు రెండు ఇక్కడే ఉన్నట్టు గా ఉంటుంది. ఎరా నాన్న ఎలా ఉన్నావు అన్న పదం ఇంకా వినిపించదు అంటే నమ్మబుద్ది కావడం లేదు .   మనం ఈ జీవన పరుగు పందెం లో ఎం కోల్పోతున్నామో కోల్పోయాక కానీ తెలీదు అంటే ఇదే .  అయన నా స్మృతిలో ఎప్పటికీ సజీవులే . దాదాపు గా పదేళ్లు ఆయనతో ఉన్న బంధం  ఒక జీవిత కాల అనుభందం .

గణేష్ పాత్రో గారు మరణించడానికి ముందర వారితో జరిపిన ఇంటర్వ్యూ లో విశేషాలు క్లుప్తం గా  : 

మరో చరిత్ర, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, గుప్పెడు మనసు ఇలాంటి సినిమాల పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది కె.బాలచందర్ గారి పేరు. చాలా కొద్ది మంది సినీప్రియులు గుర్తించే మరో విషయం ఒకటుంది. ఈ సినిమాలన్నిటికీ రచయిత ఒక్కరే. గణేశ్ పాత్రో గారు. ప్రస్తుతం చెన్నైలో నివాసం వల్ల ఆంధ్ర పాత్రికేయులతో అట్టే టచ్‌లో లేరు అందుకే ఈ తరంలో చాలా మందికి ఆయన గురించి తెలియదు. చాలా ప్రయాస పడి ఆయన్ని సంప్రదిస్తే ప్రస్తుతం టీవీ సీరియళ్ళతో బిజీగ ఉన్నాను తీరిక చేసుకొని ఫోన్ చేస్తానన్నారు.  చివరికి ఆయనతో మాట్లాడినప్పుడు చెప్పిన విశేషాలు...

చిన్నప్పుడు..
మా నాన్నగారు పార్వతీపురం దగ్గిర ఒక గ్రామానికి కరణం గా పని చేస్తుండేవారు. నా చిన్నప్పుడు ఆయన రాత్రుళ్ళు,  గ్రామస్థులకోసం రామాయణ, మహాభారతాలను చదువుతూ ఉండేవారు. నాకట్టే అర్థాలు తెలియకపోయినా, నేనూ ఆయన్ని అనుకరిస్తూ చదివేందుకు ప్రయత్నిస్తుండేవాణ్ణి. ఆయనొకసారి నా పఠనం విని, ఆనాడు నన్నే చదవమన్నారు. నేను శ్లోకాలు చదువుతుంటే ఆయన అర్థాలు, తాత్పర్యాలు చెబుతుండేవారు. మా ఊర్లో హైస్కూల్ ఉండేది కాదు అందుకని ఆయన పార్వతీపురంలో ఒక ఇల్లుకొన్నారు. తోడుగా మా బామ్మ ఉండేది. గట్టిగా మందలించే వారు లేకపోవడంతో నేను నాటకాల్లో చురుకుగా పాల్గొనడం మొదలెట్టాను.
పాఠ్యపుస్తకాలతో పాటు చాలా సాహిత్యపుస్తకాలు చదివేవాణ్ణి.  నా తరువాత చెల్లి, తమ్ముడూ అదే బళ్ళో చేరడంతో మా అమ్మకూడా పార్వతీపురం వచ్చేశారు. మా నాన్నగారు కూడా పార్వతీపురంలో ఉంటూ గ్రామానికి వారానికి రెండుసార్లు వెళ్ళిరావడం మొదలెట్టారు. రావిశాస్త్రి గారి ప్రేరణతో విశాఖయాసలో చందోబద్ధమైన పద్యాలు రాసి విఫలమయ్యాను. పీయూసీ పూర్తవగానే  యూనివర్సిటీకి ఎక్కడికి వెళ్ళాలా  అని ఆలోచిస్తున్న సమయంలో మిత్రులంతా ఆంధ్రా యూనివర్సిటీ బాగుంటుందని సలహా ఇచ్చారు. అక్కడ స్టేజీ నాటకాలుంటాయా లేదా అన్న ఒక్క విషయం నిర్ధారించుకొని అక్కడికే వెళ్ళాను. ఏయూ లో సాంస్కృతిక విభాగానికి సంయుక్త కార్యదర్శి పదవి నిర్వహిస్తూ, నాటకాలు రాసి, నటిస్తూ ఉండేవాణ్ణి.

సినీరంగంలో తొలి అడుగు
తేనెమనసులు లో పాత్రకోసం నేనూ అప్ప్లయి చేశానని చాలా మందికి తెలియదు. స్క్రీన్ టెస్ట్‌కు పిలుపు కూడా వచ్చింది కాని ఆ ఉత్తరం నాన్నగారి చేతిలో పడటం, ఆయన ససేమీరా అనడంతో నేను వెళ్ళలేదు. నేను నాటక రచయితని అయ్యాక   క్రాంతికుమార్ గారు, మరికొందరు రమ్మని ఆహ్వానించారు కానీ ఈ సారి మా మావగారు వద్దన్నారు. ఆయనప్పటికే నాలుగైదేళ్ళు సినీ ఫీల్డులో పనిచేసి విసిగిపోయి ఉన్నారు. ఇద్దరు మిత్రులు లో ఏఎన్నార్ వద్ద పనివాడిగా, కన్నెవయసులో రోజారమణి తండ్రిగా రెండు పాత్రలు వేశారు. మా మావగారు పోయాక మద్రాసులో ఒక నాటకం వేశాం. ఆ నాటకాన్ని చూసిన ప్రభాకర్ రెడ్డిగారు దాన్ని సినిమాగా తీద్దామన్నారు. నిజానికి మూడు నాటకాలను కలిపి నా మొదటి సినిమా రూపుదిద్దుకొంది. "నాకు స్వతంత్ర్యం వచ్చింది" టైటిల్. అదే జయప్రద గారి మొదటి సినిమా కూడా. ప్రభాకర్ రెడ్డిగారితో పని చేయడం ఒక గొప్ప అనుభవం. ఆయన చాలా చాలా మంచివారు. నాకు చాలా సహాయం చేశారు. తన పార్ట్నర్స్ కి తెలీకుండా నాకు ఆర్థికసహాయం చేసేవారు. చాలా మంచి మనిషి.

నా సినీ ప్రస్థానం
ఎగుడు దిగుడుగా మొదలయ్యింది. మద్రాసులో నా నాటకాలు చూసిన దుక్కిపాటి మధుసూదనరావు గారు వెంటనే ఒక ఆఫరిచ్చి వెయ్యినూటపదహార్ల అడ్వాన్సు ఇచ్చారు. ఆ రోజుల్లో, రైటర్లకి అది చాలా పెద్దమొత్తం. అలాగే ఆయన అతిథి గృహంలో విడిదినిచ్చారు. ఆత్రేయ మాస్టారు, సుశీల గారు, చక్రవర్తి గారు నా పక్కనే ఉండేవారు. మూణ్ణెళ్ళ కథా చర్చలు, సంభాషణల తర్వాత ఆయన ప్రాజెక్టు ఆపేసి ఇంటిని ఖాళీ చేయమన్నారు. ఒక్కసారిగా ఏమీ తోచని అయోమయంలో పడ్డాను. ఆ కథా చర్చల్లో పాల్గొన్న తాతినేని రామారావుగారు నన్ను ప్రత్యగాత్మ గారికి రికమండ్ చేశారు. ఆయన నాకు అల్లుళ్ళొస్తున్నారు సినిమా ఇచ్చారు. అది కాస్తో కూస్తో హిట్టయ్యాక నాకు ఆఫర్లు రావడం మొదలెట్టాయి.

ఆత్రేయ గారితో అనుబంధం
ఇంత చిన్న వ్యాసంలో చెప్పలేను. ఆయన గురించి చెబుతూ ఎంత రాసినా సరిపోదేమో. ఆయనెంతో గొప్ప మనీషి. ప్రత్యగాత్మ గారు నాకు PAP బ్యానర్లో అవకాశమిచ్చినప్పుడు నా దగ్గిర అట్టే డబ్బుల్లేవు. నా పిల్లలిద్దర్నీ బళ్ళో చేర్పించడానికి అడ్మిషన్ ఫీజులు కట్టాలి. అంత పెద్ద బ్యానర్లో పని చేయడం అదే మొదలవడంతో ఎలా అడగాలో తెలీదు. అప్పుడు ఆత్రేయగారే నన్ను పిలిచి అడిగారు డబ్బులేవైనా ఉన్నాయా అని. లేవని సమాధానమివ్వడంతో ఇంట్లో పరిస్థితి గురించి వాకబు చేసి, ఆయన అసిస్టెంటుతో ఫీజు పంపించారు. అలాగే నాకూ కొన్ని డబ్బులిచ్చారు.
PAP బానర్ డబ్బులిచ్చాక వెనక్కిస్తే తీసుకోవడానికి నిరాకరించారు. ఆయనే నన్ను బాలచందర్ గారికి పరిచయం చేశారు. ఇవాళ నేనున్న పొజిషన్ కి ఆత్రేయగారే కారణం. ఆయన ఆశీర్వాదంతోనే నేనీ ఫీల్డులో మనగలిగాను.

ఈరంకి శర్మగారు చిలకమ్మ చెప్పింది సినిమాని బాలచందర్ గారి పర్యవేక్షణలో రీమేక్ చేస్తున్నారు. అది మలయాళ సినిమా రీమేక్.  బాలచందర్ గారికి దర్శకుడితో సెట్లపై సమయం వెచ్చించగలిగే ఒక మంచి రచయిత కావాలి. గురువుగారు అప్పటికే బిజీ అవడంతో, నన్ను బాలచందర్ గారి సహాయకులు అనంత్ గారికి పరిచయం చేశారు. అనంతు గారికి నా స్టేజి బాక్‌గ్రౌండ్ తెలిశాక మరింత ఆసక్తి కలిగి బాలచందర్ గారివద్దకు తీసుకెళ్ళారు. ఆయనకు నేను చిలకమ్మ చెప్పిందికి చేసిన పని చాలా నచ్చింది. అది అనకాపల్లిలో, వైజాగ్‌లో చిత్రీకరించాం. KB,కమల్ ని పరిచయం చేస్తూ తెలుగులో ఒక డైరెక్టు చిత్రం చేయాలని తలపెట్టారు. అంతులేనికథ చేస్తూ వైజాగ్ నచ్చడంతో అక్కడే దాన్ని షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆత్రేయగారు అనారోగ్యం వల్ల మరోచరిత్ర చేయలేక నన్ను చేయమని బాలచందర్ గారికి రికమెండ్ చేశారు. అలా కేబీ గారితో నా అనుబంధం మొదలయ్యింది.

మరోచరిత్ర చూశాక ఆత్రేయ గారు నన్నందరిముందూ కౌగిలించుకొని నాకు గర్వంగా ఉంది. చాలా బాగా రాశావు అన్నారు. అక్కడికక్కడే భరతముని అవార్డు దొరికినంత సంబరం కలిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేనా సంఘటన మర్చిపోలేను. చాలా గొప్ప మనిషి. నన్ను బాగా ప్రోత్సహించేవారు. చాలా సినిమాలకు రికమెండ్ చేసారు.

బాలచందర్ గారితో..
బాలచందర్ సర్, నేనూ ఇప్పటికి ఇరవయ్యేళ్ళుగా కలిసి పనిచేశాం. అంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే కుదరదు. మాకు చిన్న చిన్న అభిప్రాయభేదాలున్నా ఆయన హృదయం మాత్రం బంగారం. ప్లాటినం కూడా  ( నవ్వు ) . ఆయనకు మనుషులంటే విపరీతమైన అభిమానం. చాలా సున్నిత స్వభావులు. అప్పట్లో నేను చెయిన్‌స్మోకర్‌ని. ఆయన ముందు కూడా కాల్చగలిగే పర్మిషన్ నాకొక్కడికే ఉండేది. ఆయన ముందు సిగరెట్ తాగే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అందుకని షూటింగ్ మధ్యలో బయటకివెళ్ళేవాణ్ణి. అదే గ్యాప్‌లో నా కోసం అడిగేవారు. సెట్లో లేనని చెప్పేవాళ్ళు అక్కడ. వెనక్కోచ్చాక అడిగితే సిగరెట్ కోసం వెళ్ళానని చెప్పాను. ఇలా ఒక వారం రోజులు జరిగింది. ఒకరోజు ఆయన పిలిచి, ఇక్కడ అంతా స్మోక్ చేసే వాళ్ళే నా ముందర నటిస్తారు. ఒక్క నువ్వే ధైర్యంగా చెప్పావు. షూటింగ్ సమయం అట్టే వృధా చేయొద్దు. కావలంటే నా ముందరే సిగరెట్ తాగు అన్నారు. ఇప్పుడు నేను మానేశాననుకోండి.

మేమిద్దరం కలిసి చేసిన మరోచరిత్ర చాలా హిట్టయ్యింది. అదాయన రెండు భాషల్లో నిర్మించారు. నేనూ తెగ బిజీగా ఉండేవాణ్ణి. దాంతో చాలా మంది నేను వేరే వాళ్ళకు చేయననుకోవడం మొదలెట్టారు. అలాగే నేను కేవలం ఆయన డైలాగుల్ని తెలుగులోకి అనువదిస్తానని మరో పుకారుండేది. రెండూ అబద్ధాలే. సీన్ గురించి చర్చించాక ఇద్దరం డైలాగులు రాసుకునేవాళ్ళం. మర్నాడు పొద్దున ఇద్దరం చూసుకొనేవాళ్ళం షూటింగ్ ముందర. అనువదించే  సమయమెక్కడిది? నిజానికి కొన్ని సార్లు, నా డైలాగులు బాగున్నాయని తలిచి, ఆయన తిరగరాయడానికి షూటింగ్ కాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గుప్పెడు మనసు సినిమా టైటిల్ కూడా నేను సజెస్ట్ చేసిందే. తమిళ మాతృక (నూల్ వెళి..దారంతో సరిహద్దు) తెలుగుకు అంత నప్పదని నేను సూచించాను. అదాయనకు
చాలా నచ్చింది. ఈ మధ్య ఒక పెద్ద టీవీ సీరియల్ తీశారు ఇదే టైటిల్ తో. ఇలాంటివి చాలా ఉన్నాయి.

మిగతా కాంపుల్లో..
వేరేవారికి నేను రాయననే  అపవాదు చెరిపేసినందుకు నేను భార్గవ ఆర్ట్స్ గోపాలరెడ్డి గారికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తమిళంలో హిట్టయిన ఒక చిత్రాన్ని తెలుగులో మనిషికో చరిత్రగా తీద్దామనుకున్నారు. అందరిలాగే నేను రీమేకులకే రాస్తాననుకొని నాదగ్గరికి వచ్చారు. కానీ నన్ను కలిశాక ఆయన అభిప్రాయం మార్చుకొన్నారు. అప్పటినుండీ నేను వాళ్ళ బానర్లో శాశ్వత  సభ్యుడినయ్యాను. దాదాపు ప్రతీ సినిమా నేనే రాశాను. అన్నీ బాగా హిట్టయ్యాయి. మనిషికో చరిత్ర సినిమాలో చివర్లో నేను కనిపిస్తాను కూడా. KB తో పోలిస్తే పని తీరులో చాలా తేడా ఉండేది. కానీ రచయిత ఎప్పుడూ ఒక బ్రాండుకు పరిమితమవకూడదు. ఏ పనైనా నిరూపించుకోగలగాలి.
జయభేరి బానర్ కి కూడా నేను చాలా సినిమాలు రాశాను.  ఒకవిధంగా అక్కడ కూడా పర్మనెంట్ రైటర్ నేనే. అతడు సినిమాకి మాత్రం, త్రివిక్రం స్వయాన రచయిత అవడం వల్ల రాయలేదు.

అలాగే అందమైన అనుభవం, నిర్ణయం సినిమాలకు కొన్ని పాటలు కూడా రాశాను. అంత గుర్తుంచుకోదగ్గవేమీ కాదులే. ఏదో అవసరార్థం రాసినవి, పెద్దగా చెప్పడానికేమీ లేదు వాటి గురించి.

గణేశ్ పాత్రో, వివాదాలు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. నంది అవార్డులు మొదలయిన కొత్తలోనే  అవి తిరస్కరించిన వాట్లో నేనొకణ్ణి. మొదట్లో నంది అవార్డులు కేవలం కొత్త చిత్రాలకు మాత్రమే ఇచ్చేవారు. డబ్బింగ్ సినిమాలకిచ్చేవారు కాదు. చిలకమ్మ చెప్పింది తెలుగులో మంచి విజయం సాధించినా దానికో మలయాళ సినిమా మాతృక. ప్రభుత్వం అవార్డిచ్చినప్పుడు, పాత్రికేయుడొకరు నా అభిప్రాయమేమిటని అడిగారు. రీమేకు చిత్రాలు అవార్డుకు అనర్హులని నేను స్వీకరించలేదు  . తర్వాత చాలా రచ్చ జరిగి, ప్రభుత్వం అవార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఆ రోజుల్లో,  విజయచిత్ర (చందమామ పబ్లికేషన్స్) వారు యువ రచయితలను ప్రోత్సహిస్తూ ఒక కాలం నిర్వహించేవారు. పరిశ్రమలో ఎవరికైనా నచ్చితే దాన్నేసినిమాగా మలచేవారు. అందులో నా కథ కూడా ఒకటి అచ్చయ్యింది. ప్రతాప్ ఆర్ట్స్ వారి రాఘవ గారికి నా కథ నచ్చి సినిమా తీద్దామని అన్నారు. దర్శకత్వ బాధ్యతలు కూడా నాకే అప్పగిస్తానన్నారు. నాకు అద్భుతమైన అవకాశమనిపించి పని చేయడం మొదలెట్టాను. తాతినేని రామారావు గారొకసారి ఈ సినిమా గురించి విని అడిగితే నేను అమాయకంగా కథ మొత్తం చెప్పేశాను. ఓ రెణ్ణెళ్ళ తర్వాత అమితాభ్ హీరోగా హిందీ సినిమా అంధా కానూన్ విడుదలయ్యింది. నేను చెప్పిన కథే. నేను వెంటనే మద్రాస్ హైకోర్టులో కేసు వేశాను. అప్పట్లో ఇలా కాపీలు కొట్టడం సర్వసాధారణం కానీ కేసు వేసిన వాళ్ళు మాత్రం లేరు. ఆ తర్వాత నన్నొక రెబెల్‌గా ముద్ర వేసి, ఏదైనా అవకాశమిచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్ళు.

గమనిక : ఈ ఇంటర్వ్యూ సీతమ్మ వాకిట్లో సినిమా కి చాలా ముందు జరిగిన సంభాషణల సారాంశం మాత్రమే.

Tuesday, January 21, 2014

నేనొక్కడినే - నా ఒక్కడి సమీక్ష


     సుకుమార్  - మహేష్ బాబు సినిమా , సక్సెస్ బాట లో ఉన్న మహేష్ ,  కర్చు కి వెనకాడకుండా తీసిన సినిమా ఇంకా ఈ సినిమా తెలుగు సినిమా ల లో ఒక నూతన అధ్యాయం అని మాములుగా నే ఉదారగోట్ట బడ్డ సినిమా . 
    ముందర నుంచి నాకు సుకుమార్ మీద మరి అంత గొప్ప అభిప్రాయం లేదు .   వాణిజ్య పరమైన సినిమాలు తియ్యడం బాగా నే వచ్చు సుకుమార్ కి .  స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది. కాని తీసిన సినిమాలు అన్ని ఒక రకం గా పర్వేర్తేడ్ సినిమాలు అని నా అభిప్రాయం .  ఉదాహరణ కి ఆర్య సినిమా నే తీసుకోండి.  హీరో సినిమాలో అమ్మాయిని వెంట పడి నువ్వు ప్రేమించాక పోయినా నేను ప్రేమిస్తా అని వేదిస్తాడు . అదే ఇంకో అబ్బాయి చేస్తే సహించలేడు.  ఒక రకమైన సైకో .. ఈ సినిమా మే లో విడుదల అయ్యింది.  జూన్ లో విజయవాడ శ్రిలక్ష్మి ని అన్యాయం గా పొట్టనపెట్టుకున్నారు ఇలాంటి ప్రేమికుడు ఒకడు . 
   హండ్రెడ్ పెర్సెంట్ లవ్ ఇంకో డకోటా సినిమా ..  నాయకుడు  దీంట్లో ఒక రాంక్ హోల్డర్ , అతడి ఫోటో పెద్ద పెద్ద హోర్డింగ్స్ లో పెడతారు కాలేజి వాళ్లు . అలాంటి వాడు తరవాత  రాంక్ కోసం అడ్డమైన పనులు చేస్తాడు.. ఆఖరికి నాయిక ని అడ్డం పెట్టుకుని రాంక్ తెచ్చుకుంటాడు . ఇది యువతకి ఎలాంటి చెత్త ఐడియా లు ఇస్తుందో ఒక్క సరి ఆలోచించాడా అన్నది నాకు సందేహమే . 
   ఇంకా ఇలాంటి సినిమాలు తీసిన దర్శకుడి సినిమా అంటే నాకు ముందు నుంచి ఒక రకమైన సందేహాలు ఉన్నాయ్ .  (అవి సినిమా చూసాక తీరిపోయాయి అనుకోండి ) .. అందరు ఓ పోగిడేసినట్టు ఇదో అద్భుతమైన తెలుగు చిత్రం కాదు అనడం లో నాకు ఎటువంటి సందేహం లేదు .  రెగ్యులర్ సినిమా లో బ్రాహ్మి ఉంటాడు .. దీంట్లో లేడు అదే తేడా .  ఒక సినిమాలో బ్రాహ్మి ని (బాద్షా ) మీకు ఏది కలో ఏది నిజమో తెలీదు , ఇది టైం మెషిన్ ని ఆడుకుంటారు . ఈ సినిమాలో జనాలని డైరెక్టర్ ఆడుకున్నాడు అదే తేడా . 
    మాములుగా సినిమాల్లో ప్రతీకార చిత్రాలు మొదలు అయినప్పటి నుంచి ఉండే ఫార్ములా ఒక్కటే . నా కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళని విడిచి పెట్టను .. దెబ్బకు దెబ్బ తీస్తాను అన్నది . ఇందులో కూడా అంతే . రెగ్యులర్ సినిమాలో  ఉండే ఒక నాయిక , మూడు డ్యూయెట్ లు , ఒక ఐటెం సాంగ్ , ప్రతి పది నిమషాలకి ఒక పోరాటం , తల్లి తండ్రుల హత్య , ముగ్గురు విల్లన్లు ఇవి అన్ని కూడా ఈ సినిమాలో ఉన్నాయి . లేనిది హాస్యం ఒక్కటే అదే ఈ సినిమాలో ఉండే ప్రత్యేకత అంటే ఇంకా ఎం చెప్పలేం .
     సినిమాలో మనం ఆడే రెగ్యులర్ రుబిక్ క్యూబ్ ఇంకా కొంచం మార్చి సినిమాలో వాడారు . దాంట్లో నాయకుడు చిన్నప్పుడు దాన్ని ఒక రకం గా తీసుకు రావడం అన్నది చెప్పరు మనకి .. (అది ఎడిటింగ్ లో పోయింది అన్నది దర్శకుడి ఉవాచ )  ఇలాంటివి మనకి అర్ధం కానివి అన్ని ఎడిటింగ్ లో పోయాయి . అనవసరం అయిన చాలా సన్నివేశాలు ఉండిపోయాయి (సినిమా విడుదల అయ్యాక ఒక ఇరవై నిమషాల సినిమా ఎడిట్ చేసారు మరి ).  ఇవే కాక సినిమాలో  Tomcruise, camerion diaz   నటించిన  Knight and Day  సినిమా నుంచి సన్నివేశాలకి సన్నివేశాలు ఎత్తేసారు .  మరి అన్యాయం ఏంటి అంటే , సినిమా చివరలో మహేష్ బాబు , గౌతమ్ పాట , సన్నివేశం రెండు కూడా అయితే ఓల్డ్  బాయ్ అన్న కొరియా సినిమా నుంచి ఎరువు  తీసుకొచ్చి ఈ సినిమా కి ఎరువు గా వాడారు .  దానికి మన వాళ్ళు  అబ్బ ఎం తీసాడు , ఎలా తీసాడు మహా తోపు అని మెచ్చి శాలువాలు కప్పడం మొదలెట్టేసారు .  ( వందశాతం ప్రేమ సినిమా లో హీరో కాపి కొట్టడం ఎలా నో చూపించాడు , ఈ సినిమాలో దర్శకుడు  అది చేసి చూపించారు )  
    సినిమా లో బాగుంది మహేష్ నటన .  చాల బాగా చేసాడు . నేపధ్య సంగీతం మొత్తం ఓల్డ్ బాయ్ సినిమా నుంచి ఎత్తుకోచ్చారు.  సినిమా లో హీరో పాప్ సింగర్ ... బట్ బిభత్సమైన పోరాటాలు అద్భుతం గా ఒంటి చేత్తో చేసేస్తూ ఉంటాడు . ఫాస్ట్ అండ్ ఫురియాస్ సిన్మా లో లాగ భవంతుల మీద నుంచి అవలీలగా దూకి పరిగెట్టడం లో కూడా ప్రవీణుడు.  ఇంకా డాక్టర్ ఉంటాడు సినిమాలో ప్రపంచం లో ఇలాంటి డాక్టర్ ని ఎక్కడ చూడని టైపు, హీరో కన్నా వాడికి ముందర వైద్యం చేయించవలసిన వాడు .. ఫోటోగ్రఫి బాగుంది . హీరోయిన్ మనకి అలవాటు పడటానికి టైం పడుతుంది . బట్ ఓకే .

Saturday, October 26, 2013

భాయ్ .... సినిమా సమీక్ష



కొన్ని నెలల క్రితం మెహర్ రమేష్ అనే ఒక గొప్ప దర్శకుడు , వెంకటేష్ అనే  హీరో ని డిఫరెంట్ గా చూపిస్తా , ఈ సినిమా డిఫరెంట్ గా చేశా అని కాకమ్మ కథలు చెప్పి షాడో అని మహత్తర చిత్ర రాజాన్ని తీసి అటు నిర్మాతని , హీరో ని పనిలో పని గా ప్రేక్షకులని హింసించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది.  మనవాళ్ళు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోకుండానే , వీరబద్రం అనే దర్శకుడు నాగార్జున ని అదే కథ ని కొంచం అటు ఇటు గా చెప్పి నిర్మాతగా కూడా ఒప్పించి సినిమా తీసి పారేసాడు (నిజ్జంగా పారేసాడు ) .

     సినిమా విడుదల కి ముందర వీరబద్రం , నాగార్జున ఇచ్చిన బిల్డుప్ కి ఈ సినిమా తోపు అని వెళ్ళామో , హాల్ లో నుంచి తోసు కుంటూ రావాల్సిందే . హీరో పేరు భాయ్ , చేసేది ఒక మాఫియా డాన్ వద్ద కిల్లర్ పని.  కానీ ఆరుగంటల వరకే ఆ పని ఆ తరవాత ప్లే బాయ్ అని ఒక డైలాగ్ ఉంటుంది అది మొదటి సీన్ వరకే (సాంగ్ కోసం) , ఆ తరవాత ఆ సంగతి మర్చిపోతారు.  నాగన్న ఓపెనింగ్ పంచ్ డైలాగ్ , ఆ తరవాత ఒక నెత్తిమీద టోపీ కిందపడకుండా జులపాల విగ్ కదలకుండా వొళ్ళు అలవకుండా ఒక భీకరమైన (చూసేవాళ్ల కి  అని తీసేవాళ్ల అభిప్రాయం లెండి ) ఫైట్ అయ్యాక సాంగ్ అయ్యాక హైదరాబాద్ లో ఉన్న అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ ని లేపే పని ఒప్పుకుని హైదరాబాద్ కి విగ్ తీసేసి వస్తాడు .
      హైదరాబాద్ లో అండర్ కవర్ కాప్ ని పట్టుకునే పని మర్చిపోయి సరదాగా ఇంటర్వెల్ వరకు గడిపి ఇంటర్వెల్ లో ఆ పోలీస్ తన తమ్ముడు అని తెలుసుకుని షాక్ తింటాడు . (షాడో లో కూడా డిట్టో డిట్టో ) .  తరవాత హీరో వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తి ఇంట్లో కి చేరి హీరో తమ్ముడిని రక్షించుకోడానికి ప్రయత్నిస్తాడు , కాని తమ్ముడికి తెలిసిపోతుంది అన్న భాయి అని .  తమ్ముడు హీరో వెనకాల పడతాడు , ఈ లోపల నిజం డాన్ కి సంగతి తెలిసి వాళ్ళ వెనకాల పడతారు, ఇంకా క్లైమాక్స్ ఫైట్ గట్రా గట్రా ...
    నాగార్జున ఒకటో రెండో సీన్స్ లో కాస్త నటించడానికి ట్రై చేసాడు . మిగిలిన సీన్స్ లో నల్ల కళ్ళజోడు తో లాగించేసాడు.  బాబు కి ఈ మధ్యే మోకాళ్ళకి శాస్త్ర చికిత్స జరిగింది దాంతో ఇంకా ఎక్కువ శ్రమ పడకుండా ఫైట్ లు  డాన్సులు కానిన్చేసారు .  గురుడు ఫైటింగ్ కి వెళ్ళే ముందర ఒక డ్రెస్ , ఫైట్ లో ఒక డ్రెస్ , ఫైట్ అయ్యాక వచ్చే సీన్ లో ఇంకో డ్రెస్ తో సంబంధం లేకుండా దృశ్యాలు వచ్చి పోతూ ఉంటాయి. 
  ఇంకా నటుల సంగతి సరే సరి . హేమ కి డైలాగ్స్ కూడా లేవు, ఇంకా మిగిలిన వాళ్ల  సంగతి సరే సరి . సినిమా అంతా హేమా హేమీలు ఉన్నారు .. ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా నటించాలి , సినిమా కి ప్లస్ అవుతుంది అన్నవాళ్లు లెరు. అందరు ఒకటే చెక్క మొహం వేసి నటన అంటే తెలీని వాళ్ళలాగా కనిపించారు .హీరోయిన్ సంగతి మర్చిపోయా ... ఎందుకంటే హీరోయిన్ కి చెయ్యడానికి ఎం లేదు . అమ్మాయి మొహం లో ఎటువంటి భావం పలకదు (సినిమా లో తండ్రి పాత్ర ద్వారా ఆ విషయం కూడా చెప్పించారు ). మన అదృష్టం బాగుంది అమ్మాయి సినిమాలో నుంచి ఇంకా తాత్కాలికం గా విరమించా అని మొన్నే ట్వీట్  చేసింది  భారి తారాగణం భారి డబ్బింగ్ , భారి తలనొప్పి వెరసి భాయి.
          సినిమా మొత్తం పంచ్ డైలాగు ల తో లాగించారు . సినిమా లో మాత్రం పంచ్ లేకుండా చేసారు .
    నిజానికి ఈ సినిమా పోకిరి రాజా అన్న మలయాళం సినిమా కి ఫ్రీ మేక్ ... ఆ సినిమాలో మమూట్టి , పృథ్వీ రాజ్ లు ఇద్దరికీ మంచి పాత్రలు ఉండటం వల్ల  సినిమా వర్క్ అవుట్ అయింది . ఇక్కడ తమ్ముడి పాత్ర ని స్నేహ భర్త ప్రసన్న తో చేయించారు . అలా అని ఆ పాత్ర కి మంచి గా మలచారా అంటే అలాంటిది ఎం లేదు, ఆట లో అరటి పండు పాత్ర .
సినిమా విడుదల కి ముందర నాగన్న ఇచ్చిన ఇంటర్వ్యూ లో అత్తారింటికి సినిమాకి దేవిశ్రీ సంగీతం ఇచ్చాడు, హంస నందిని గెంతింది ... మా సినిమా కి కూడా సేం టు  షేమ్  అన్నాడు . నిజం గానే షేమ్ ..  ఇలాంటి సోది లెక్కలు వేసుకుని సినిమా తీస్తే సినిమా సోది లో లేకుండా పోతుంది అని థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ కి తెలీకపోవడం ఏంటో అర్ధం కాదు.

Saturday, September 28, 2013

అత్తారింటికి దారేది .... సమీక్ష ...


   త్రివిక్రమ్ అభిమానులని (నాకు తెలిసి చాల మందిని ) నిరాశ పరిచిన సినిమా ఇది.  ఒక రకం గా గుండమ్మ కథ సినిమా కి ఇంకా బోలెడు శ్రీను వైట్ల , వినాయక్  లని కలిపి దానికి కొంచం విదేశి సొగసులు అద్ది న  స్వదేశి సినిమా ఇది. 

 సినిమా రిలీజ్ కి ముందరే అంతర్జాలం లో సినిమా ప్రత్యక్షం కావడం తెలుగు లో ఇదే మొదటి సారి.  దెబ్బతో సినిమాకి బోలెడు పబ్లిసిటీ ,  నిర్మాతకి టెన్షన్ వచ్చేసింది. హడావిడిగా సినిమా విడుదల చేసేసారు

  సినిమా మొదట్లో మిలాన్ లో ఉండే ఫలానా కంపని లో షేర్స్ , దాన్ని స్వంతం చేసుకోవాలని ఎవడో గొట్టం గాడు ప్లాన్, నా కంపని కొంటావా అని హీరో వాడిని తన్నడానికి వెళ్లి , వాడిని వదిలేసి ఇంకో గొట్టం గాళ్ళని చంపేసి , వాడిని బెదిరించి నేను సింహాన్ని అని అర్ధం పర్ధం లేని డవిలాగులు నాలుగు చెప్పి బోమ్మ తుపాకి ఊపుకుంటూ వచ్చేస్తాడు .
   హీరో పేరు గౌతమ్ , గౌతమ్ తాతగారు బొమ్మై ఇరాని, బాబు ముకేష్ రుషి వీళ్ళు ఇద్దరు ఇంటి ఆడపడుచు , పాతికేళ్ళ క్రితం ఇంట్లో నుంచి వెళ్లి పోయిన సునంద (నదియ ) కోసం ఏడుస్తూ ఉంటారు . తాతగారికి మూడు నెల్లల్లో  రాబోయే పుట్టినరోజు కి సునందని తీసుకువస్తా అని ప్రతిజ్ఞ చేసి గౌతమ్ బాబు బ్యాండ్ మేళ్ళం గాళ్ళని (అనగా బాడీ గార్డ్ గాళ్ళు , వీళ్ళు  హీరో గారి కోసం బట్టలు ఇస్త్రి చెయ్యడం, చెప్పులు మొయ్యడం లాంటివి మాత్రమె చెసెదరు. పోరాటములు హీరో గారే చేసెదరు అని గమనించవలెను )  తీసుకుని భారతదేశం సొంత విమానం లో బయలుదేరతారు.  విమానం లో ఎక్కువ స్థలం లేక (లేక పొతే ప్రొడ్యూసర్ కి వాచిపోతుంది కదా మరి ) విదేశి బ్యాండ్ మేళ్ళం గాళ్ళని వదిలేసి స్వదేశి వాళ్ళని పెట్టుకుంటాడు దిగగానే, వాళ్ళకి బాబు గారి గురించి మొత్తం ఆటోమేటిక్ గా ట్రైనింగ్ అయి ఉంటారు. సార్ వాళ్ళని వేలి  తో కంట్రోల్ చేసేస్తూ ఉంటారు. 

   గౌతమ్ మేనత్త భర్త  గారికి గుండెపోటు రావడం , హీరో గారు రక్షించడం , దెబ్బకి మేనత్త ఇంట్లో డ్రైవర్ గా పాగా వేసి, ఇంట్లో సమస్యలని పరిష్కరిస్తూ , అత్త కూతుర్లకి లైన్ వేస్తూ ఉండంటం చక చక జరిగిపోతాయి  .  మరి ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉండాలి కదా ... అత్తగారు మేనల్లుడిని ఎప్పుడో  గుర్తుపట్టా అనీ చెప్పడం ఇంటర్వెల్ అన్నమాట .
   ఆ తరవాత సినిమాలో కి ఫ్యాక్షన్ గొడవలు , హీరో గారు సింగల్ హ్యాండ్ తో వాళ్ళని సితకకోట్టడం వినాయక్ సినిమాలో లాగ చేసింగులు , వైట్ల సినిమా లో లాగ హీరోయిన్ కి తాత్కాలికంగా గజినీ అయిపోవడం ఆ పై సినిమా పిచ్చి ఉన్న బ్రాహ్మి సినిమాకి సంబంధం లేని కామెడి , కెవ్వు కేక సాంగ్ పేరడీ  గా హీరో గెంతడం, కాటమ రాయుడ కదిరి నరిసిమ్హుడా అని బ్రహ్మిని తన్నడం లాంటి వెకిలి చేష్టలతో సినిమా రెండో అర్ధ భాగం లాగించి ... చివరకి అత్తగారిని పుట్టింటికి తీసుకువెళ్ళడం తో కథ ముగిస్తాడు త్రివిక్రమ్...

 సినిమా లో బాగోలేనివి :
   ఒకటి కాదు సినిమా చూస్తూ ఉంటె పాత  సినిమాలో ని సీన్స్ రివ్వున వచ్చిపోతూ ఉంటాయి . సెంటిమెంట్ సీన్ లో కూడా ప్రాస లో మాట్లాడుతూ ఉంటారు జనాలు .

 పనికి రాని కాస్టింగ్ బోలెడు మంది సినిమా నిండా ... హీరో కి ఇంకో నలుగురికి తప్ప ఎవరి పాత్ర కి సరి అయిన న్యాయం జరగదు .  హీరోయిన్ కి బుర్ర ఏ కాల్లో కూడా లేనట్టు గా ఉంది.

హీరోయిన్ బెడ్ రూం లో బాత్ టబ్ ఉంటుంది ... బెడ్ రూం కి బాత్ రూం కి తేడా ఉండదు అనుకుంటా మరి ... 

 పళ్ళు రాలి పొతే ఫిసికల్లీ హండికప్ద్ కోటా కిందకి వస్తారా ??!! త్రివిక్రమ్ గారు కొంచం అప్పడప్పుడు మోకాలు గోక్కోండి ప్లీజ్.  నిన్నటి దాక లేని షాప్స్ అన్ని ఇంటిముందర తెల్లరె టప్పటికి ప్రత్యక్షం అవుతే ఇంట్లో వాళ్ళకి ఈ మాత్రం అనుమానం రాదు .. అసలు దాన్ని గురించే పట్టించుకోరు.

త్రివిక్రమ్ ఇంకా అతడు హంగొవెర్ నుంచి బైటకి వచ్చినట్టు లేరు . ఇంకా ఫైట్ సీన్స్ ఆ హాంగ్ ఓవర్ నుంచి రాలేదు . అదే రకం గా తీస్తున్నారు . 

  కొన్ని సింహాద్రి సీన్స్ , కొన్ని వినాయక్  సీన్స్ , కొన్ని వైట్ల సీన్స్ ... కొంచం గుండమ్మ కథ , కొంచం ఇంగ్లీష్ సినిమా   సీన్ సీన్ కి పాత సినిమాలు చిరాగ్గా వచ్చిపోతూ ఉంటాయి ...

బాగున్నై :
పవన్ కళ్యాణ్ , పవన్ కళ్యాణ్ ... పవన్ కళ్యాణ్ ... ఇన్ని లోపాలున్నా సినిమా చూడగలిగాం అంటే ఓన్లీ బికాస్ అఫ్ పవన్ కళ్యాణ్ .  అదరగొట్టాడు. ఇంతకు ముందర సెంటిమెంట్ సీన్స్ లో పవన్ చేయ్యగిలిగే వాడు కాదు. కాని ఈ సినిమా తో దాన్ని అధిగమించాడు . హి ఇస్ గుడ్ .
 ప్రసాద్ మురేళ్ళ చాయాగ్రహణం బాగుంది . అలాగే అక్కడక్కడ దేవిశ్రీ పరవాలేదు . ఆనంద్ సాయి సెట్స్ బాగున్నై.  పవన్ కోసం ఈ సినిమా ఒక సారి  ఓకే నాకు ...

Sunday, September 8, 2013

తూఫాన్ - చిత్ర సమీక్ష



సిరు గారు కేంద్రమంత్రి గా కావడం .... జంజీర్ సినిమా హిందీ ప్రకటన దాదాపు గా ఒక సమయం లో జరిగాయి. తెలుగే  సరిగ్గా రాని  అంజని పౌత్రుడు హిందీ లో  ఇరగ తీసేస్తాడు అని మన వాళ్ళు బోలెడు నమ్మకాన్ని , కొండంత ఆశని పెట్టుకున్నారు (కొంతమంది ). కాకపోతే బాబు గారి కోయ్యమొహం మీద ఇంకాస్త ఎక్కువ నమ్మకం ఉన్న నాలాంటి వాళ్ళు ముందరగానే ఫిక్స్ అయిపోయాం ఇదో గాలివాటం సినిమా నే కాని వాళ్ళు చెప్పినట్టు  గా తూఫాన్ కాదు అని.
    సినిమా మొదలు అవ్వగానే అవాంతరాలు కూడా మొదలు అయ్యాయి.  ముందర హక్కుల చిక్కులు, ఆ పై సంజయ్ జైలు మధ్యలో ఇలా చిక్కులు అన్ని అయ్యిపోయాయి అనుకుంటే చివర్లో రాష్ట్ర విభజన , సినిమా కొన్న బ్లూ స్కై వాళ్ళు వెన్నక్కి పోవడం లాంటివి జరిగాయి.  అన్ని అడ్డంకులు దాటి సినిమా విజయవంతం గా విడుదల అయ్యింది . ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకుల సంగతి చూద్దాం.
   సినిమా మొదలు కాగానే ఇప్పటికి కొన్ని వేల సార్లు చూపించినట్టే రాష్ట్ర మంత్రి రోడ్ మిద ధర్నా , హీరో గారు తండ్రి , బాబాయ్ గార్ల పోస్టర్ల సాక్షి గా మంత్రి ని కొట్టి దారి ని సుగమం చేసి ప్రజలని రహదారి బాధల  నుంచి రక్షించి మంత్రి ఆగ్రహం కారణం గా ముంబై కి బదిలీ చెయ్యడం చక చక జరిగిపోతాయి .
    ఆల్రెడీ కామెడి మొదలయింది అని అనుకోకండి ... పేర్లు పిచ్చ కామెడి ... తూఫాను టపాను అంటూ దాదాపు నగ్నంగా ఉన్న అమ్మాయిలు (బాండ్ టైపు ) వొంటి నిండా సంకెళ్ళ తో వస్తూ పోతూ ఉంటారు . (జంజీర్ అన్నమాట ) దానికి అర్ధం పర్ధం లేని సాహిత్యం ఒకటి జత . చంద్రబోసు గారు ఇలా దరిద్రం గా రాస్తారు అని అనుకోలా ... డబ్బింగ్ గాబ్బు గా ఉంది ...  నిజానికి తెలుగు సినిమాకి దర్శక పర్యవేక్షణ యోగి కాని అయన ఎక్కడా కనిపించినట్టు గా లేదు మరి.
 పేర్లు అవ్వగానే సర్ గారి రికార్డ్లు పనిపాట లేని అనౌన్సర్ లు రికార్డ్లు వేస్తూ ఉంటారు . వెనకాల ఒకటే నేపధ్య సంగీతం రఘుపతి రాఘవ రాజారాం అని, సినిమాకి దానికి సంబంధం లేకుండా . ఒకపక్కన హీరో జనాలని చావ చిత్తక కొడుతూ ఇంకో పక్క శాంతి మంత్రం పాటిస్తున్నట్టు గా ఉంది .  మన పోలీసులకి గడ్డం చేసుకోడానికి సమయం ఉండదో లేక జీతం చాలదో తెలీదు కాని సినిమాలో ఎక్కడ గడ్డం చేసుకున్నట్టు గా కనపడదు. 
ఇంకా శ్రీహరి నటన ... అబ్బోఅదొ టార్చర్ ..  షేర్ ఖాన్ అని పేరు పెట్టుకున్నా కదా అని అరవడమే పనిగా పెట్టుకునట్టు గా ఉంది .  ప్రతి మాట ఒక రేంజ్ లో అరవడం అరవ సినిమా లాగా ...షేర్ ఖాన్ , హీరో ఇద్దరు కొట్టుకున్నాక , షేర్ ఖాన్ చెయ్యి కలపబోతే నీకు సంకెళ్ళే వేస్తా అని , తరవాత సీన్ లో ఇద్దరు స్నేహితులు అయిపోతారు, ముందర సీన్ కి సంబంధం లేకుండా.   హీరో పక్కన ఉండే పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు బఫూన్ టైపు బుర్ర అరికాల్లో కూడా లేని రకాలు .
   ఇంకా హీరోయిన్ పేస్ బుక్ లో పరిచయం అయిన స్నేహితురాలి పెళ్ళికి అమెరికా నుంచి వచ్చి , పెళ్లి లో ఐటం డాన్సు చేసి మందు కొట్టి (పెళ్లి నగరం లో జరుగుతుంది ) అమ్మాయి స్టార్ హోటల్ లో ఉంటుంది రెండిటికి మధ్య ఊరు ఉంటుంది ...ఇంక ఆవిడ అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ గారి హత్య చూస్తుంది .
   ఆ తేజ ఎవరు అనగానే ఇంకో ఐటెం సాంగ్.  అది అవ్వగానే డైనింగ్ టేబుల్ మిద తేజ ఒకడిని చంపడం . ఏంటి ఈ పాత చింతకాయ సీన్స్ అంటే అదే మరి తూఫాన్ గొప్పదనం . ఒక్కటంటే ఒక్కటి కొత్త సీన్ లేకుండా , నలభై ఏళ్ళ  క్రితం వచ్చిన జంజీర్ సినిమాకి అదే సీన్స్ తో తెలుగు హిందీ నటులతో ఏ మాత్రం కొత్తదనం కాని, నటన కాని లేకుండా ఎంత చెత్తగా తియ్యోచ్చో భారి కర్చు పెట్టి అని చూపించారు .
   ఇంకా ఈ సినిమా కి అన్ని చోట్ల జీరో రేటింగ్స్ ఇచ్చినా అంజనీ పౌత్రుడు మాత్రం అబ్బో నాకు బోలెడు మంది ఫోన్స్  చేసి పోగిడేసారు అని ఊదర కొట్టేస్తున్నాడు .
  రిలీజ్ కి ముందరే ఈ సినిమా వంద (నా బొంద ) కోట్లు దాటేస్తుంది అని కాకి లెక్కలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. హిందీ మిద చూస్తె తెలుగు లో కొంతవరకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది , హిందీ లో ప్రకటన కర్చులు కూడా వచ్చే అవకాశం లేదు మరి .  ఈ హీరో కి నటన ఎప్పటికి వచ్చెనో లేక మనం తినగా తినగా వేమ  తియ్యగనుండు లాగ ఈ చెక్క మొహానికి అలవాటు పడిపోతాం ఏమో (ఇప్పటికే అలవాటు పడ్డవాళ్ళ గురించి నేను ఎం చెప్పలేను అనుకోండి ). 
 సినిమా కి పాటలు , నేపధ్య సంగీతం దొందు దొందే ... ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఇంతోటి సినిమా కి అది చాల్లే అనుకున్నట్టు గా ఉన్నారు ..
సినిమాలో లోపాలు కో కొల్లల్లు .. హీరో తండ్రిని కోల్పోయిన సంఖ్య సీన్ కి ఒకలాగా మారుతుంది. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఎందుకు ఎలా పుట్టిందో డైరెక్టర్ కి కూడా తెలుసా అన్నది అనుమానమె. 
సొరంగం లో నీటి నిప్పుల మధ్య జరిగే పోరాటం మొహ్హారం ఊరేగింపు లో కి వచ్చి మళ్ళి సొరంగం లో కి ఎలా వెళ్తుందో ఆ ఎడిటర్ కి కూడా తెలీదు .. 
ఇలా ఒకటా రెండా సినిమా చూస్తె మెదడు ఏ కాల్లో ఉందొ ఎత్తుక్కుకోవాల్సి వచ్చింది
ఈ సినిమా తరవాత ఇంకా రెండో మూడో హిందీ సినిమాలు అతి త్వరలో అని ప్రకటించేసాడు అబ్బాయి .. ఇంకా కాసుకోండి...  

Friday, April 26, 2013

ఉత్సవ కానుక – ఆదూరి వెంకట సీతారామమూర్తి

ఉత్సవ కానుక – ఆదూరి వెంకట సీతారామమూర్తి

 
utsavakanuka
వ్యాసకర్త: శ్రీ అట్లూరి
*****
ఈ పుస్తకం మాములుగా కన్నా ఎక్కువ సమయం పట్టింది చదవటానికి. నిజానికి ఈ పుస్తకం చదవటానికి కారణం బాపు గారి బొమ్మ. అది చూసి ఈ పుస్తకం కొన్నాను. మొత్తం పదిహేను కథలు, మూడు ఇతర విశేషాలతో ఉన్న పుస్తకం ఇది.
సరళమైన భాష అందరికి అర్థమయ్యే పదాల పొందిక ఈ కథల విశేషాలు. మొదటి కథ ఉత్సవ కానుక అన్నిటిలోకి బాగున్న కథ. ఒక సంగీత అభిమాని ఒక సంగీత కళాకారుడికి ఇవ్వగలిగిన బహుమతి అంతకన్నా ఏముంటుంది అనిపిస్తుంది కథ మొత్తం చదివాక.
రెండో కథ అమ్మాయి పెళ్లి. ఒక మధ్య తరగతి ఇల్లాలు తన కూతురుకి అమెరికా సంబంధం కోసం పడే తాపత్రయం ఈ కథ. తెరువు కథ మూడోది … ఈ కథ చాలా మంచి కథ. మనం చూసేవి అన్ని మనం అనుకున్న నిజాలు కాకపోవచ్చు అన్నదానికి ఇది మంచి ఉదాహరణ ఈ కథ. తప్పకుండా చదవాల్సిన కథ ఇది.
పాత బంగారులోకం ఒక మామూలు కథ . ఊరట, సర్వం జగనాథం, సంసారంలో హింసానాదం, బెస్ట్ కపులు గిఫ్ట్ కూపను ఒక మోస్తరు కథలు. చిలకపచ్చరంగు చీర బట్టలకోట్లల్లో జరిగే డిస్కౌంట్ ల సంబరం మీద, దాన్నివల్ల మధ్యతరగతి వాళ్ళు ఎలా మోసపోతున్నారో తెలియచెప్పే కథ (ఇలాంటి కథలు మనం ఇంతకు ముందు కూడా చదివి ఉండొచ్చు ). బతుకు దారి దిగువ తరగతి కుటుంబాల్లోని నిజాయితీకి అద్దం పట్టే కథ.
వృత్తి ధర్మం మనకున్నదాంట్లో ఒకరికి సహాయపడితే భగవంతుడు మనకి సహాయపడతాడు అని చెప్పే కథ. అంతరాలు మధ్యతరగతి జీవితాల్లో డబ్బుకి మానవ సంబంధాలకి జరిగే అంతర్మథనం ప్రధాన వస్తువు. కొంచం సాగతీత అనిపిస్తుంది. బంధం కథ ముగింపు ఓ హెన్రీ కథలని పోలి ఉంది. మంచి ముగింపు ఉన్న కథ ఇది. గోరింట పండింది బాగా పాతకాలం కథ. ఇప్పటి కథ కాలం కథ కాదు. ఆనందపురం వెళ్ళాలి టైటిల్ కొంచం మధురాంతకం గారి కథ లాగా అనిపించినా బాగానే ఉన్న కథ.
మొత్తం మీద కథలు అన్నీ మధ్యతరగతి సమస్యలు, వారి జీవన విధానాలు ప్రధాన అంశాలుగా తీసుకున్నారు. అన్ని చదివించే కథలే. కాని కొన్ని కథలు సాగతీత వల్ల మంచి కథ అవాల్సి కూడా కాకుండా మాములు కథలాగా మిగిలిపోతాయి. వీరి ఇంకో కథా సంపుటి అత్మద్రుతి నేను చదవలేదు దాని గురించి విశేషాలు ఈ కథా సంపుటిలో ఉన్నాయి.
*****
from : http://pustakam.net/?p=14304
Book available in Kinige.com