గమ్యం క్రిష్ తీసిన వేదం మీద అందరికి మంచి అంచనాలే . కారణం తారా తోరణం, గమ్యం బాగుండటం. సినిమా చూసాక కొందరికి తెగ నచ్చింది. నాలాంటి వాళ్ళకి అసంతృప్తి ని మిగిలిచింది. కారణాలు అనేకం ...పోయిన వారంతం చికాగో లో ఇంట్లో జనాలు ఎక్కువ అవడం వల్ల , వర్షం లో ఎక్కడికి వెళ్ళే అవకాశం కూడా లేక పోవడం వల్ల సినిమాకి పోలో మని పోయాం. హాలు బాగానే నిండింది. పక్కనే రాజనీతి కి కూడా చాల రష్ ఉండింది లెండి.
అల్లు అర్జున్ నటించిన కేబుల్ రాజు పాత్ర, గాలి శీను పాత్రకి కొనసాగింపుగా అనిపించింది తప్ప కొత్తగా ఎం చెప్పాడు అన్నది అర్ధం కాలేదు. కాకపోతే అర్జున్ కి రాసిన సన్నివేశాలు బాగున్నాయి. డబ్బు దొంగతనం చేసే సన్నివేశం లో బాగా చేసాడు. అతని పక్క చేసిన అమ్మాయి దండగ. నటన అంటే ఏంటో తెలీదు.
అమలాపురం సరోజ గా అనుష్క పాత్ర పూర్తిగా డెవలప్ చేసినట్టు కనపడదు. వొళ్ళు అమ్ముకుని సొంతంగా సంపాదించుకోడానికి నగరానికి పారిపోయి వచ్చిన అమ్మాయి, చివరకి మరి ఏదో ఒక పని చేసుకుని పొట్ట పోసుకుందాం అనుకుంటుంది. నటన పరవాలేదు. అనుష్క పక్కన అటు ఇటు కాని పాత్ర వేసింది అనుష్క మేకప్ మాన్. బాగానే పండింది ఆ పాత్ర.
మనోజ్ పాత్ర అతిధి పాత్ర అని అన్నారు. సినిమాలో ఒక రకం గా అన్ని అతిధి పాత్రలే మరి. మనోజ్ తన ఫ్రెండ్ తో ఉండగా, భజరంగ దళ సభ్యులు వచ్చి అమ్మాయికి తాళి కట్టమని బలవంతం చేస్తారు (ఈ మధ్యే వచ్చిన శ్రీకాంత్ వందో సినిమా మహాత్మా లో ఇదే సన్నివేశం ఉంది సుమా !).(ఇక్కడ ఇంకో మెలిక ఉంది. ఇది కృష్ణవంశి సొంత బుర్ర లో పుట్టిన సన్నివేశం కూడా కాదు. total tollywood అన్న వెబ్ సైట్ కి ఫణి అనే అతను రాసేవాడు . ఇప్పుడు ఆ సైట్ లేదు లెండి. ఆతను కృష్ణవంశి కి ఒక కథ వినిపించాడు. దాంట్లో ముక్క ని కృష్ణవంశి సినిమాలో ఇరికించాడు. దాని క్రిష్ మళ్ళా ఎత్తుకోచ్చారు ).
మనోజ్ బాజపాయ్ వేసింది ముస్లిం పాత్ర. మన సినిమాల్లో మాములుగా జరిగే ముస్లిమ్స్ త్యాగం, గొప్పతనం వాళ్ళు ముస్లిమ్స్ కావడం వల్ల జరిగే అన్యాయం అన్ని సినిమాల్లో లాగే జాలి కలిగేలా చిత్రీకరంచబడింది. దాదాపు క్రాష్ అన్న 2004 లో వచ్చిన సినిమాలో సన్నివేశాలని ఈ సినిమాలో పోలీసు ఆఫీసర్ కి ముస్లిం కి జరిగిన సంభాషణల్ని వాడుకున్నారు.
నాగయ్య కథ చాల వరకు సహజత్వానికి దగ్గరగా ఉంది. కాకపోతే మిత్తి (వడ్డీ ) యాభై వేలు అని మొదట్లో చెబుతారు. చివరకి నలభై వేలు అని అంటారు. పది వేలు ఎవరు తీర్చారో మరి తెలీదు.. సినిమా మొత్తం లో అయిదు పాత్రలు. అయిదు కథలు అన్ని కలిసి ఆసుపత్రి లో బాంబు దాడి లో కలుస్తారు. ఇద్దరు చని పోతారు.
ఓం శాంతి లో కూడా అయిదు పాత్రలు, అయిదు కథలు మాల్ లో బాంబు దాడి లో కలుస్తారు. రెండు సినిమాలకి మూలం ఒకటే 2004 లో వచ్చిన క్రాష్ సినిమా. దాంట్లో ఒక కార్ క్రాష్ తో మొదలవుతుంది కథ. ఇంకో కార్ క్రాష్ తో ముగుస్తుంది. ఇక్కడ బాంబు బ్లాస్ట్ తో ముగుస్తుంది. గమ్యం తో ఒక మంచి సినిమా చూసిన అనుభూతి ని ఇచ్చిన క్రిష్ ఈ సినిమాలో తన సహజత్వాన్ని కోల్పోయడనే అనిపించింది నాకు. అంచనాలు అనవసరంగా పెట్టుకోవడం కూడా ఒక కారణం కావచ్చు ఏమో..
కొసమెరుపు ఏంటి అంటే ... ఈ సినిమా గురించి ప్రస్థానం దేవా గారు ఒక సైట్ లో సూపర్ అని రాయడం. (క్రిష్ ప్రస్థానం ని మెచ్చుకున్నాడు కదా మరి.. అయన వీపు ఈయన., ఈయన వీపు ఆయనా గోక్కున్నారు) రాజమౌళి గారేమో మనసు కడుకున్నట్టు గా ఉంది అన్నారు (రాజమౌళి గారి మర్యాద రామన్న నిర్మాత కూడా వేదం నిర్మాతే సుమా !).
చందు (చంద్ర సిద్ధార్థ ) అందరి బందువయ సినిమా ప్రకటించగానే ఫీల్ గుడ్ సినిమా అని తెలిసిపోయింది. కాని ఈ మధ్య తీసిన ఇదీ సంగతి నన్ను బాగా నిరాశపరచడం తో ఎక్కువ ఆశలు పెల్లుకోలేదు నేను. వర్షం లో వరసగా తడవటం వల్ల వచ్చిన సెలవుల వల్ల సినిమా అనుకోకుండా చూసాను. సినిమా చూసాక మంచి సినిమా చూసిన అనుభూతి తప్పకుండా కలిగింది అనడం లో ఎటువంటి సందేహం లేదు. సినిమాలో అన్ని మనం నిజ జీవితం లో చెయ్యలేక పోవచ్చు. కానీ, పక్షులకి ధాన్యం , పశువులకి గ్రాసం, మనషికి సాయం చెయ్యడం అన్నది నిజమైన సాయం. సినిమాలో కొన్ని అనవసర సన్నివేశాలు ఉన్నా, సినిమా మాత్రం తప్పక చూడవలిసిన సినిమా. నందు (శర్వానంద్ ), నరేష్ ఇద్దరు పోటిపడి నటించారు. ఈ సంవత్సరం వచ్చిన మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటి అనడం లో ఎటువంటి సందేహం లేదు