Saturday, December 26, 2009

త్రీ ఇడియట్స్

గత ఏడాది ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు చేతన్ భగత్ పేరు వచ్చింది. అప్పిటికి నేను Five point someone పుస్తకం చదవలేదు. పేరు గుర్తు పెట్టుకుని, తర్వాత పుస్తకాల దుకాణం కి వెళ్ళినప్పుడు కొనుక్కుని వచ్చి చదివా. పుస్తకం బాగుంది. దాని అమీర్ ఖాన్ తో తీస్తున్నారు అని తెలిసినప్పుడు కుతూహలం పెరిగింది. పుస్తకం కన్నా సినిమా ఇంకా బాగుంది. పుస్తకం కొంత నెమ్మదిగా వెళ్లినట్టు అనిపిస్తుంది. సినిమా అలాకాదు. చూసినంత సేపు నవ్వుకోవడమే. ఇది నిజానికి సిద్దార్థ కూడా చెయ్యాల్సిన సినిమా. పారితోషకం ఒక కారణం అయితే, తన పాత్ర కి ఎక్కువ ప్రాధాన్యత లేదన్న ఇంకో కారణం తో సిద్దార్థ చెయ్యలేదు అని ఒక వార్త.

సినిమా కథ గురించి ఎక్కువ చెప్పను. ముగ్గురు స్నేహితులు, వాళ్ళ కాలేజి జీవితం, వాళ్ళ తల్లి తండ్రులు వాళ్ళ పైన పెట్టుకునే ఆశలు, వీళ్ళ మిద ఉండే ఒత్తిడి ఇలా చాలా చర్చిస్తారు కథలో. చదువును ఉద్యోగం కోసం కాకా చదువుకోవాలన్న ఇష్టం తో చేస్తే అది బాగుంటుంది. అలా కాక ఇష్టం లేని చేడువు వుద్యోగం కోసం చేసే చదువు తో కష్టం అని చెపుతారు సినిమాలో.

సినిమాలో కావలసినంత హాస్యం ఉంది. అది చతుర్ కావచ్చు, లేదా మిల్లిమీటర్ కావొచ్చు. సినిమా దాదాపు రెండున్నర గంటలు పైగా ఉన్నా, ప్రతి దృశ్యం నవ్వులు రువ్వుస్తూ నే ఉంటుంది. శర్మన్ ఆసుపత్రి లో ఉన్నప్పుడు కూడా, మీ అక్కకి పెళ్లి, మనవాడే అంటే , అబద్దాలు అపరా బాబు అంటాడు , శర్మన్ , బతికిపోయవో పో అంటాడు మాధవన్ తో అమీర్. ఒకటి అని ఎం ఉంది, ప్రతి దృశ్యం నవ్వే. ఆగష్టు లో షూటింగ్ మొదలు పెట్టి, మొత్తం మన దేశం లో తీసి, డిసెంబర్ కల్లా విడుదల చేసారు అంటే స్క్రిప్ట్ ఎంత పకడ్బందిగా రాసుకున్నారో చూసి నేర్చుకోవాలి. సినిమా మొత్తం బెంగుళూరు, ఢిల్లీ, సిమ్లా , లడఖ్ లో తీసారు.

సినిమా లో కథ, కాని దృశ్యాలు కొత్తవి అని చెప్పను. కాని మీరు చెల్లించే ప్రతి పైసా కి న్యాయం జరింగిది అని మాత్రం చెప్పగలను. నేను అయితే ఇంకో రెండు సార్లు చూడమన్నాచూస్తాను. సమీక్షలు చదివి సినిమా చూడటం మాత్రం మానకండి.

Sunday, December 6, 2009

ఆడియో పుస్తకాలు ... ? ! ...

పోయిన మాసం ఓ పుస్తకం కోసం అంతర్జాలం లో వెతకడం మొదలు పెట్టాను. పుస్తకం అయితే అప్పుడు దొరకలేదు కానీ ఆ పుస్తకం యొక్క ఆడియో వెర్షన్ బోలెడు చోట్ల డౌన్లోడ్ కి ఉంది. (ఇప్పుడు ఆ పుస్తకం దొరికింది లెండి ఎక్కువ వెతకకుండానే ). చాలా సార్లు గ్రంధాలయానికి వెళ్ళినప్పుడు కావలిసిన పుస్తకం దొరకపోవడం, దాని ఆడియో వెర్షన్ ని చూస్తూ ఉండటం పరిపాటి నాకు. కానీ పుస్తకం చదవడం లో ఉన్న మాధుర్యం ఆడియో వినడం లో దొరుకుతుందా ?! నా వరకు నాకు అది మింగుడుపడనిదే. ఒక కథ మనం చదువుతున్నప్పుడు ఆ సన్నివేశాన్ని మన కావలసినట్టు గా ఊహించుకోడం, దాన్ని సన్నివేశానికి అనుగుణంగా మనం స్పందిచడం లాంటివి అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం. లేదా అది ఒక నాటకం గా కాని సినిమా గా కాని అయితే అది కొంచం నటీ నటుల సామర్ధ్యలని బట్టి మనకి రసానుభూతి కలుగుతుంది. అలా కాక ఒకే రచయిత కానీ వ్యక్తీ కాని ఆ కథని చదివి వినిపిస్తే మనకి మనం పుస్తకం చదివిన అనుభూతి వస్తుందా అంటే నా వరకు అయితే రాదు మరి.

గుడిలో పంతులు గారు మరి పురాణం చదివితే నోరు తెరుచుకుని, నోట్లోకి దోమలు పోతున్నా చెవులప్పగించి వింటూ ఉంటావు కదా అంటే పురాణం వేరు అది మనకి అర్ధం అయినా కాని , పంతులు గారు చెప్పే విధానం బాగుంటే వింటాం అని అంటాం. కానీ కథ కాని నవల కాని అలా వినగలమా ? ఏమో ? అప్పట్లో శారదా అశోకవర్ధన్ , రత్న కుమారి గారు (రేడియో చిన్నక్కయ్య గా ప్రసిద్ది పొందారు ఆవిడ) ఇలా చదివే వారు అని అంటారు. వారు చదివిన కథ / నవల ఆ రచయితలూ వారు చదివిన విధానానికి సంతోషపడే వాళ్ళు (కొండక చొ ముగ్ధులు కూడా) అయ్యేవారు అని విన్నాను ). కాని తెలుగు లో మొదటి సారిగా అది కూడా అంతర్జాలం లో ఆడియో పుస్తకం గురించి వినడం ఇదే.

సరే ఈ సోది అంతా ఏంటి అనుకుంటున్నారా, ఈ రోజు ఒక టపా (మెయిల్ ) వచ్చింది. బాపు - రమణ గారి కోతి - కొమ్మచ్చి స్వాతి లో ధారావాహికంగా వస్తోంది కదా, అలాగే ఇప్పటికే మొదటి బాగం పుస్తక రూపం లో రావడం, మొదటి ప్రచురణ రెండు రోజులలో అమ్ముడు పోవడం లాంటివి జరిగాయి అని అందరికి తెలుసు కదా ... ఇప్పుడు ఆ పుస్తకాన్ని స్వర గంధర్వుడు గా పేరు పొందిన బాల సుబ్రహ్మణ్యం గారు చదివి మనకి కొంత రుసుముకి వినిపించే సౌలభ్యాన్ని వినియోగించు కోవచ్చు అని దాని సారాంశం. మచ్చుకు కొన్ని భాగాలు కూడా అక్కడ పెట్టారు. ఇప్పటికి అయిదు భాగాలు పెట్టారు అక్కడ. అయిదు భాగాలు కలిపి ధర రెండు డాలర్లు మాత్రమె. పన్నులు అదనం. నేను అక్కడ మచ్చుకు పెట్టినవి చూసాను. బాగానే ఉన్నా నావరకు మాత్రం నేను చదువుకుంటే ఉండే ఆనందం వేరు గా ఉంటుంది అన్నది నా భావన. (బాల సుబ్రహ్మణ్యం గారిని కించపరచాలని కాదు అని నా మనవి. అయన బాగా చదివారు కూడా ) కాని లోకో భిన్న రుచి .అందువల్ల నేను నా పుస్తకాన్ని చదువుకుంటే వుండే ఆనందాన్ని పాడు చేసుకోదల్చు కోలేదు. . మీరు కూడా ప్రయత్నించి చూడండి . మీకు నచ్చవచ్చు .మీకోసం ఇదిగోండి లింక్ ..కోతికొమ్మచ్చి.కాం

Tuesday, December 1, 2009

ఆర్య - 2 సమీక్ష

గత ఏడాది జూలై లో నవదీప్ లో మాట్లాడుతున్నప్పుడు ఆర్య - 2 చిత్రం చేస్తున్నా అని చెప్పారు. అల్లు అర్జున్ ని హీరో గా పెట్టుకుని మీకు అంత చెయ్యడానికి ఏం ఉండక పోవచ్చ్చు అని అన్నాను. కథ ముగ్గురి మీద ఉంటుంది. అందువల్ల సమస్య ఉండక పోవచ్చు అని అన్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు కాగానే ముందర అనుకున్న కథ కన్నా బాగా వస్తోంది అది ఇది అని కబుర్లు మొదలు పెట్టారు.

జగడం తో అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన సుకుమార్ ఈ సారి చాలా జాగర్త గా అన్ని చూసుకుని చేస్తున్నాడు అని అంటే ఓహో నిజమే కాబోలు అని నమ్మారు జనాలు. జగడం నిర్మాత , బి వి ఎస్ ఎన్ ప్రసాద్ కలిసి సంయుక్తంగా తీస్తున్నారు అని అన్నారు. సినిమా పూర్తి కావోచ్చే సరికి నిర్మాతలు ఇద్దరికీ గొడవలు వచ్చేసాయి. నిర్మాతకి దర్శకుడికి గొడవలు వచ్చేసాయి. హీరో కి నిర్మాతకి గొడవలు వచ్చేసాయి. ఇన్ని గొడవల మధ్య లో అసలా సినిమా పూర్తి అయ్యి విడుదల అవుతుందా అన్నది నమ్మకం లేకుండా పోయింది. బిజినెస్ మాత్రం బోలెడు చేసేసారు. దేశం లో నే కాక బైట కూడా అన్ని చోట్ల కూడా ధియేటర్ లు బుక్ చేసారు. తెలుగు లో ఒకే ఒక డి టి ఎస్ చేసే అతను ఉన్నాడు మన ఖర్మ కి . అతనికి కూడా ఆర్య అయ్యే వరకు వేరే సినిమా కి పని చెయ్యడానికి లేక కూర్చున్నాడు. దానితో రావలిసిన సినిమా లు అన్ని ఆగిపోయాయి.

సరే ఇన్ని అంచనాలు తో విడుదల అయిన సినిమా ఎలా ఉంటుందో అన్ని నిద్ర మాని ప్రీమియర్ కి వెళ్ళిన వాళ్లకి చావు దెబ్బ కొట్టాడు సుకుమార్. తెలుగు లో పర్వేర్తేడ్ దర్శకులు ఉన్నారు అని తెలుసు కాని ఇంత పెర్వేర్షన్ ఉన్న దర్శకులు ఉన్నారు అని తెలుసు కోవడం ఇదే మొదటి సారి. ఇప్పటి దాకా పూరి ఒక్కడే అనుకున్నా సుకుమార్ పూరి కి ఇంకో రెండు ఆకులు ఎక్కువ చదివాడు.

కథ గురించి చెప్పదల్చుకోలేదు. ఇప్పటికే బోలెడు మంది చెప్పేసి ఉంటారు కదా. సినిమాలో తిక్క గురించి చెప్పడం ఈ వ్యాసం ఒక్క ఉద్దేశం. హీరో కి లేని అలవాటు లేదు. ఒక పక్క నవదీప్ ని ప్రేమిస్తున్నా అని అంటాడు. ఇంకో పక్క నాయిక ని కూడా ప్రేమిస్తాడు. అర్జున్, నవదీప్ ల మధ్య సన్నివేశాలు చూస్తూ ఉంటె జనాలకి అర్జున్ మిద ఇంకో అభిప్రాయం వస్తే అది వారి తప్పు కాదు. దారుణమైన హెయిర్ స్టైల్. మొహం సగం కనపడదు (అదే కరెక్ట్ ఏమో లెండి, నటన అవసరం లేదు అప్పుడు. ఏది చేసినా చెల్లిపోతుంది కదా. నవదీప్ కి చెయ్యడానికి ఎం లేదు. శ్రద్ధ దాస్ కి అంతే. బ్రహ్మానందం పాత్రం దారుణం. సినిమాలో అయన పేరు దశావతారం. ఆ కంపెనీ కి హెచ్ ఆర్ . సినిమాలు జనాలు అందరు అయన చుట్టూ చేరి భజన తప్ప ఎం కనపడదు సినిమాలో. పరమ దండగ పాత్ర. మొదటి గంట గీత (నాయిక ) ఆర్య మంచి వాసు కాదు అని నిరూపించడానికి చేసే ప్రయత్నాలే తప్ప మిగతాది ఎం కనపడదు.

ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఎలా నడుస్తుందో కూడా తెలీకుండా ఎలా సినిమా తీయావచ్చో సినిమా చూస్తె అర్ధం అవుతుంది. సినిమా లో నాయిక వచ్చిన ఐదో నిమషం లో నాయకుడు పెదవుల మిద ముద్దుపెట్టేస్తాడు. అంతే మనకి అప్పుడే తెలిసి పోతుంది ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అని. ఒక రకంగా కథ అయిపోయినట్టు. అలాంటిది దాని ఇంకో రెండు గంటలు సాగా తియ్యడం దేనికో అర్ధం కాదు. ఒక దశలో ఆర్య చేష్టలు చూసి ఈ దర్శకుడు సమాజానికి ఎం చెప్పదలుచుకున్నడో అర్ధం కాదు. ఊరూరా ఉన్న మనోహరులు చాలరు అన్నట్టు గా కొత్తగా ఈయన నాయకుడు అనే వాడు ఇలా ఉండాలి అని చెప్పడం ఒక రకం గా విడ్డూరం. ఆర్య చేసే దానికి చిన్న ఉండాహరణ ఇంట్లో తలకిందులుగా వేలాడుతూ టి వి ని కూడా తలకిందులుగా వేలాడదీసి గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఇది మచ్చుకు మాత్రమె.

దర్శకుడు ప్రేమ ఆంటే ఎలా ఉండాలి అని దర్శకుడి అబిప్రాయం ? ఆర్య లాగ అన్ని విదాలుగా మోసం చేసి ప్రేమించాలా ? అల చేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది ? మోసం కాని. సినిమా అంటా ఒక రకమైన ఏవగింపు. అసహ్యం మన మిద మనకే కలుగుతుంది ఇలాంటి చెత్త సినిమా ఇంతవరకు రాలేదు .. దీనికన్నా ఆలి చేసిన సోంబేరి, తిన్నామా పడుకున్నామా లాంటి సినిమాలు చాలా చాలా బెటర్ అని అనిపిస్తే అది మన తప్పు కాదు. గీత పాత్ర కి బుర్ర అంటూ ఉన్నది ఆంటే సందేహమే ... సినిమాలో ప్రతి పాత్రా గీత తో ఫుట్ బాల్ ఆడుకుంటుంది. ఇన్ని చెప్పాక కూడా ఇంకా చూడాలని ఉందా ...మీ ఖర్మ .. అల్లు అర్జున్ ఈ మీకు దిక్కు. సినిమా మొత్తం చూసాక కోతి నుంచి వచ్చాడు మానవుడు అని పాడుకుంటూ బైటకి రాక పొతే అడగండి.

ఇన్ని చెప్పి సంగీతం గురించి చెప్పక పోవడం అన్యాయం. పాటలు ఓ హిట్ రేంజ్ కదా. సినిమాలో మొత్తం సెన్సార్ చేసి బైట ఉన్న ఆడియో కి సినిమాలో వినే దానికి బోలెడు మార్చి పడేసారు. రెండు పాటలు తప్ప అన్ని ఆంగ్ల గీతాలు అనుకుంటే మన తప్పు కాదు. దేవి శ్రీ పాత పాటలే ఇంగిలి పీసు లో పాడేసాడు కొత్తగా.. పాత భాణీలే అయినా రెండు పాటలు బాగున్నాయి . అవి వింటే చాలు .. వాటి కోసం సినిమా చూసారో చచ్చారే .. మీఇష్టం..