Tuesday, March 26, 2013

ప్రళయ కావేరి కథలు – స. వెం. రమేష్



pralayakaverikathalu
వ్యాసకర్త: Sri Atluri
******
దాదాపు గా నాలుగు ఏళ్ళ క్రితం అనుకుంటా ప్రళయ కావేరి కథలు చదివాను. భాష కొంచం నాకు కష్టం గానే ఉండింది. కానీ రెండు కథలు చదవగానే అర్ధం కావడం మొదలు పెట్టింది. నిజానికి ఈ కథలు అన్ని ఆంధ్రజ్యోతి ఆదివారం లో ప్రచురించబడ్డాయి కాని అప్పటికి ఆన్లైన్ లో ఆంధ్రజ్యోతి రాకపోవడం వల్లో లేక నేను సరిగ్గా చూడకపోవడం వల్లో చదవలేకపోయాను. అనుకోకుండా ఒకసారి ఈ కథలగురించి వినడం దాంతో ఇండియా నుంచి తెప్పించి చదవడం జరిగింది.
ఈ కథ సంకలనం లో మొత్తం ఇరవై ఒక్క కథలు ఉన్నాయి. ఉత్తరపొద్దు కథతో మొదలైన ఈ సంకలనం వోల్లెరుగని నిద్ర కథ తో పూర్తవుతాయి. రమేష్ గారికి భాష మీద పట్టుతో పాటు ప్రేమా, మమకారం కూడా చాలా ఉన్నాయి. ప్రళయకావేరి అనగా మనకి తెలిసిన పులికాట్ సరస్సు. ఇది ఇండియా లో రెండో అతి పెద్ద సరస్సు. ఈ సరస్సు చుట్టూ ఉన్న దీవులు వాటి పేర్లు, అక్కడి వారి జీవన విధానం ఏంటో, ఎంతో అందం గా రాసారు. మనకు తెలీని బోలెడు పేరులు మానని అలా పలకరించి మానని వదలవు.
ఈ పండ్ల పేర్లు చూడండి.. పాలపండ్లు , కలిగి పండ్లు , బీర పండ్లు , బిక్కి పండ్లు, నిమ్మ టాయలు, ఊటి పండ్లు , గొంజి పండ్లు, ఎలుక చెవులు, బలిజ పండ్లు, పిల్లట్లు – ఇవి అన్ని అడవిలో దొరికే పండ్లు. వీటిలో ఒక్కదాని పేరు కూడా వినలేదు నేను ఇప్పటిదాకా (రుచి మాట దేవుడెరుగు). అసలు ఇలాంటి పండ్లు ఉంటాయని కూడా తెలీదు నాకు. అంటే మనం పట్నం లో పెరిగి ప్రకృతికి ఎంత దూరం గా పెరిగామో అని ఒక రకమైన సిగ్గు వేస్తుంది. నారింజ కాయని కిచ్చిలి కాయ అంటారని ఇప్పుడే తెలిసింది. బలిగూడు (చెడుగుడు) ఆటలో కూతలు ” ఆకు పాకు బెల్లం పెడతా నాకు” “గోడమీద గొలుసు, నీ అబ్బ నాకు తెలుసు ” వింటే ఎంత నవ్వు వస్తుందో… ఇలాంటివి కూడా ఉంటాయని తెలీదు మనకి (నాకు) .పరంటిది పెద్దోళ్ళు కథలో భజన గురించి చదువుతుంటే చిన్నప్పుడు మన అక్కవాళ్ళు బొమ్మల పెళ్ళికి మనం చేసే హడావిడి గుర్తుకు రాకమానదు.
ఇరవై ఒక్క కథలలో ఒక్క కథ కూడా నచ్చని కథ లేదు అంటే అతిశయోక్తి లేదు. అన్ని కథలు చాలా బాగున్నాయి. ఒక కథ చదువుతుంటే మానని మనం చదువుకుంటున్న భావన వస్తే అది మన తప్పు కాదు.
తిని దిబ్బెకిన్నోడూ, అవునమ్మి అప్పుతీరిచ్చినోడు బాగుపడడు అని చెపుతాడు రమేష్. దాదాపు గా ఇదే సంగతి మన ఇళ్ళల్లో మన. పెద్దవాళ్ళు చెపుతారు . ఎద్దుల గురించి చదువుతుంటే మా నాన్నకి మా ఇంట్లో ఉన్న ఎద్దుల మీద ఉన్న మమకారం గుర్తుకు వచ్చింది. వాటిని అమ్మవలసి వచ్చిన రోజు అయన కూతురిని అత్తవారింటికి పంపిన బాధ కంటే ఎక్కువ పడ్డాడు.. దాదాపు గా నాలుగేళ్ళు నెల నెల వెళ్లి చూసుకు వచ్చేవాడు వాటిని.
అమ్మ పాల కమ్మదనం చదువుతుంటే అమ్మతనం మీద మమకారం పెరగక పోదు.ఆటకెక్కిన అలక చదువుతుంటే మన చిన్ననాటి అలక ఎంత సేపో చెప్పకనే చెప్పుతుంది. అలాగే ఆడే వయసులో ఆడాల, కాసేవ్వఅత్తా భాగోతం, పాంచాలి పరాభవం, పరంటిది పెద్దోళ్ళు కతలు నవ్వు తెప్పిస్తే, పద్దినాల సుట్టం, తెప్ప తిరనాళ్ల, వోళ్ళేరుగని నిదుర, అడ పోడుసు సొంగోం కథలు కంటతడ పెట్టిస్తాయి. ఒక్క కథ పేరు చెప్పి ఇంకో కథ పేరు చెప్పకపోవడం ఆ కథలకి అన్యాయం చెయ్యడమే. ప్రతి కథ ప్రత్యేకమైనవే.
“అమ్మంటే కన్నతల్లె కాదు, అమ్మ బాస కూడా, అమ్మంటే అమ్మనేల కూడా” ఎంత చక్కటి విశ్లేషణ. ఇది చెప్పింది చదువుకొని రమేష్ తాతగారు. వారికి నా నమస్సులు. ఇలాంటి కథలు రమేష్ గారు మర్రిన్ని రాయాలని కోరుకుంటూ …

Pustakam.net vachina naa sameeksha