Saturday, May 15, 2010

ఓ వర్షం ... ఓ అనుభూతి

పొద్దున్నే కాఫీ తాగుతూ బ్లైండ్స్ తీస్తే ధారగా పడుతున్న వర్షం... ఎదురుగా పచ్చటి తివాచిలాంటి పచ్చిక బైలు... బస్సు లో కూలిపనికి పోతుంటే బస్సు వెళ్ళే లోయ అంతా పచ్చగా , ఏపుగా పెరిగన చెట్లు మధ్యలో వర్షం ధారగా పడుతుంటే అలా బస్సు దిగి అక్కడే నుల్చోవలనిపిస్తుంది ..

కాలేజి లో ప్రాజెక్ట్ చేసే రోజుల్లో వైజాగ్ వెళ్ళాను ప్రాజెక్ట్ పని మీద. అక్కడ సందీప్ కిషన్ (ప్రస్థానం లో శర్వానంద్ కి తమ్ముడు గా వేసిన అబ్బాయి ) వాళ్ళ తాత గారి ఇంట్లో నా మకాం. వాళ్ళ ఇల్లు వైజాగ్ లో శాంతి ఆశ్రమం ఎదురుగా ఉంది. ఆశ్రమం పక్కనే కైలాస కోన వెళ్ళే దారి ఒక వైపు ఉంటె ఇంకో వైపు రామకృష్ణా బీచ్ అందువల్ల సంద్రాన్ని రోజు సంబరంగా చూసే వాడిని.. పొద్ద్దునే లేచే అలవాటు ఉండటం వల్ల ఉదయం వ్యాహ్యాళి కి వెళ్ళే వాడిని రోజు పొద్దునే సంధ్య దేవి ని బలవంతం వల్ల రోడ్డున పడే సూర్యుడి ఎరుపుదన్నాన్ని చూసే వాడిని.. సందీప్ వాళ్ళ తాతగారికి నేను ఇలా రాముడు మంచి మంచి బాలుడు టైపు అవ్వడం వల్ల తెగ నచ్చేసాను . నాకు నిజానికి సందీప్ బాబాయిలు ఇద్దరు మంచి స్నేహితులు (వయో బేదం ఉన్నా కాని ). దాంతో నన్ను బ్రహ్మాండం గా ఊరంతా తిప్పి తెసుకోచ్చేవారు.

సరే ఒక రోజు అరకు వెళ్దాం అని అడిగాను. అరకు అంటే వైజాగ్ నుంచి పొద్దునే ఒక రాలు ఉంటుంది. అది కిరండోలు దాక వెళ్ళాక అక్కడ నుంచి ఇంకో ఇంజన్ తగిలించుకుని వెళ్తుంది. పొద్దునే వెళ్ళిన రైలు మళ్ళి రాత్రి కి తిరిగి వస్తుంది వెళ్ళే అప్పుడు ట్రైన్ లో వెళ్లి వచ్చే అప్పుడు బస్సు లో రావాలి అని మా ప్లాన్. కాని ట్రైన్ పొద్దునే ఏడు లోపలే బయలు దేరుతుంది. వీళ్ళ ఇంట్లో ఏమో ఏడుకు ముందర లేగవటం అంటే అదో ప్రపంచ వింత. అతి కష్టం మీద సందీప్ వల్ల ఆఖరి చిన్నాన్నని ఒప్పించగలిగా.

సరే పొద్దునే అయిదు కి లేచి అరుకల్ల్లా రైలు స్టేషన్ లో ఉన్నాం. అప్పటికే తుపర పడుతోంది..మేము రైలు పెట్టె లో ఎక్కి కూర్చున్నాం . ఎక్కువ జనాలు లేరు. బోగి కి నలుగురు ఉంటె గొప్ప. బాగ్ లో నుంచి వాక్ మాన్ తీసి హెడ్ ఫోన్స్ పెట్టుకుని చెరో పుస్తకం పట్టుకుని రైలు బయలు దేరడం కోసం వేచి చూస్తున్నాం.. చేతిలో ఉన్న చందమామ పూర్తీ అయింది కాని రైలు ఎక్కడా కదిలే సూచనలు కనపడలా. కిందకి దిగి వెళ్లి కనుక్కుంటే వాడికి తెలీదు పోమ్మనాడు.. ఇంకా చేసేది ఎం లేక ప్లాట్ ఫోరం మీద దొరికే ఇలాచి టీ తాగుతూ పడుతున్న వర్షాన్ని చూస్తూ కాసేపు గడిపాం.

మా మిద జాలేసిందో ఏమో డ్రైవర్ వచ్చాడు దాదాపు తొమ్మిది గంటలకి. రైలు ఎక్కి కూర్చున్నాం, వర్షా కాలం కావడం వల్ల ఏమో, పచ్చగా తివాచి పరిచినట్టు ఉంది రైలు లో నుంచి చూస్తుంటే, దాదాపు గంటన్నర ప్రయాణం చేసి ఉంటాం, హటాత్తుగా రైలు సిగ్నల్ దగ్గర ఆగి పోయింది. పావు గంట అయినా కదలలేదు.. వెళ్లి డ్రైవర్ కి అడిగాం. మాదెం ఉంది సారు .సిగ్నల్ లేదు అన్నది జావాబు. రైలు ఎక్కడ ఉంది అని అడిగితె ఎస్ కోట దగ్గర అన్నాడు . ఎస్ కోట అంట శృంగవరపు కోట అని అర్ధం. సరే అని పట్టాలమీద నడుచుకుంటూ స్టేషన్ దాకా వెళ్ళాం .. కానీ అది కొండల మధ్య ఉండటం వల్ల బైట ప్రపంచం ఎం కనపడలా. అక్కడ స్టేషన్ లో కొంచం సేపు ప్రచార్లు చేసాం... ఎక్కడా కదిలేలాగా కనపడలా...

అప్పుడు మా వాడు చల్లగా .. ఇక్కడ ఎక్కువ సేపు ఉంటె మా వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు అని చెప్పాడు... నాకు అర్ధం కాలా. మా కాబోయే మామ గారిది ఈ ఊరే. అయన అందరికి తెలుసు, నేను కూడా తెలుసు కాబట్టి వార్త చేరిందంటే నన్ను, నాతొ పాటు నిన్ను ఇంటికి తీసుకెళతారు అన్నాడు.. ఇదేమి ట్విస్ట్ రా బాబోయ్ అనుకుని , కిం కర్తవ్యమ్ తోచక దిక్కులు చూస్తూ కూర్చున్నా. దూరాన ఏదో కొండ మీద రెప రెప రెప లాడుతున్న జెండా కనపడింది. ఏంటి అది అడిగా.. అది గుడి అని చెప్పారు.. వెళ్దామా అని అడిగాను. అది కొంచం కష్టం ఏమో అని నసిగాడు మా వాడు.

ఆ గుడికి వెళ్ళాలి అంటే, ఒక కొండ ఎక్కి, దిగి , ఒక వాగు దాటి ఇంకో కొండ ఎక్కాలి అని చెప్పాడు. మరి ఇంకేం పద అని బాగ్ తెసుకు వచ్చి స్టేషన్ మాస్టర్ కి అప్పగించి ఇద్దరం పట్టాల వెంట వెళ్లి కొండ దగ్గర ఆగాము. అక్కడ నుంచి మెట్లు ఉన్నాయ్.. కొండ మీదకు, అప్పటికి పూర్తిగా తడిచిపోయాము... వేసుకున్న నైకీ బుట్లలోకి పూర్తిగా నీళ్ళు వెళ్లి పోయాయి.. తను వేసుకున్న చెప్పులు జారే సూచనలు కనపడ్డాయి.. సరే అని వాటిని అక్కడ వదిలేసి (పక్కనే బడి ఉంది లెండి, అక్కడ బంత్రోతుకి అప్పగించాం ).

అక్కడ నుంచి మెట్లు ఎక్కి కొంచం పైకి వెళ్ళగానే ఇంకా మెట్లు అయిపోయాయి కానీ సిమెంట్ దరి కొంచం ఉంది... అది ఎక్కి మళ్ళి కొండ దిగాం. రెండు కొండల మధ్య వాగు (నిజానికి అది నలుగు కొండల మధ్య లోయ లాగా ఉంది ఎటు చూసినా పచ్చని చెట్లు ఆకాశం నుంచి ధారగా పడుతున్న వర్షం, చుట్టూ పచ్చదనం, కింద నీళ్ళు, అదో అద్భుత ప్రపంచం లాగా ఉంది... సరే వాగు దాటుందాం అని చూస్తే ఉరవడి వేగం గా ఉంది.. మా ఇద్దరికీ ఈత రాదు. సరే అని కాసేపు తగ్గుతుంది ఏమో చూద్దాం అని కాళ్ళు వాగులో పెట్టి ఒడ్డున కాసేపు కూర్చున్నాం. ఎక్కడ వర్షం తగ్గే సూచనలు కనపడాల మేము తడవటం తప్ప.
మావాడు పోద్దామా అని అడిగాడు (అంటే వెనక్కి అని వాడి అర్థం )

నేను పోదాం అని వాగులోకి అడుగు వేసాను.
,మా వాడు ఎం అనలేక నాతొ పాటు వాగులోకి అడుగు వేసాడు .
వాగు మరి ఎక్కువ దూరం లేదు.. కాని లోతు బాగానే ఉంది..

దాదాపు రొమ్ముల వరకు నీరు వచ్చింది మధ్యలో దానికి తోడూ ఒరవడి బాగానే ఉంది.. నేను ఉత్సాహం గానే ఉన్నా.. మా వాడు గంభీరంగా ఉన్నాడు... అయిదు నిమషాల్లో వాగు దాటేసాం మా వాడు ఒక దీర్ఘమైన నిట్టూర్పు వదిలాడు. నేను విననట్ట్టు గా మళ్ళి కొండ ఎక్కడం మొదలు పెట్టాను. అప్పటికి బట్టలు కాకుండా .. లో దుస్తులు కూడా తడిసి వర్షం బైట కాదు దుస్తుల లోపల కూడా అన్నట్టు గా ఉంది. కాని చుట్టూ ఉన్న సౌందర్యం అవి దేన్నీ లెక్క చేయ్యనివడం లేదు. అలా కొండ ఎక్కి వెళ్తే చిన్న గుడి. ఒక చిన్న వరండా . దాంట్లో ఒక బైరాగి గారు కుర్చుని ఉన్నారు. జడలు కట్టిన జుట్టు, వంటి మీద కాషాయ రంగు పంచె తప్ప ఎం లేదు. ఏంటి బాబు ఈ వానలో వచ్చారు అని అడిగారు...
వాగు పొంగి ఉండాలి .. ఎలా వెళ్తారు అని కూడా అడిగారు.
ఈ అబ్బాయిది ఈ వూరు కాదు.. గుడి చూద్దాం అని వచ్చాడు అని మా వాడు సమాధానం ఇచ్చాడు..
రాత్రికి ఇక్కడ ఉండటానికి ఎం లేదు బాబు, తిరిగి వెళ్తారా ? వాగు పొంగి ఉంటుంది కూడా ఇంకా ఎలా అని అడిగారు అయన ...
ఇంకా ఎం అనుకోలేదు స్వామి.. ఇక్కడ చూడటానికి బాగుంది... చాల చల్లగా కూడా ఉంది... చుట్టూ ఎటు చూసినా కొండలు భలేగా ఉంది అని అన్నాను...

స్వామి దగ్గర ప్రసాదం తీసుకువచ్చి ఇద్దరికీ పెట్టారు... అక్కడే కింద కుర్చుని తిని వర్షం నీళ్ళతో చేతులు కడుక్కుని కొంచం సేపు కూర్చున్నాక ..
చీకటి పడేలా ఉంది అని గొణిగాడు మా వాడు...
వాగు పరిస్తితి ఎలా ఉందొ అన్నారు స్వామి గారు...
పోనీ ఇక్కడే ఉందాం లే .. వెళ్లి చేసేది ఎం లేదు గా అన్నాను నేను...
ఇంకా నయం ... మామ వాళ్ళు ఈపాటికి గుడి దగ్గర మనకోసం కాపు కాసి ఉంటారు .. మనం వెళ్ళాక పొతే కాగాడాలతో పైకి వచ్చినా వస్తారు అని కంగారుగా అన్నాడు మా వాడు
సరే ఎలాగు నీళ్ళల్లో నే కదా వచ్చింది .. పోదాం పద అని బయలుదేరాము స్వామి వారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తెసుకుని ...
కిందకి వేగంగానే వచ్చాం.. ఇందాకటి కన్నా వాగు ఇంకా కొంచం పొంగింది.. కానీ బాగానే దాటాం.. నాకన్నా మావాడు పొడవు కాబట్టి తనకి ఎం ఇబ్బందిలేక పోయింది. నాకు మాత్రం మెడ దాకా వచ్చాయి నీళ్ళు... కాకపోతే ఈ సరి ఒక కర్ర తెసుకున్నం లోతు ఎంత ఉందొ ముందర తెలేదానికి అందువల్ల ఎక్కువ రిస్క్ అనిపించలేదు ఆ వాగు దాటి కొండ ఎక్కి చేసే అప్పటికి మళ్ళి వెనక్కి వెళ్దామా అన్నంత అందంగా ఉంది ఆ ప్రక్రుతి.

ఇంకో పక్క వర్షం ఏమో చొక్కలోనుంచి ధారలు గా కారుతోంది... ఆ మెట్ల మీద అలా వాన మాతో పాటు గా వస్తున్నట్టు గా మా ముందర మాకు దారి చూపిస్తున్నట్టు జల జల సాగుతున్న వాన నీరు... కొండల మీద నుంచి దూకుతున్న సన్నన్ని ధార ఒక వైపు ఇంకో వైపు వర్షపు ధార. చుట్టూరా పచ్చని చెట్లు... వాటి మీద నుంచి పడే ధార... ఎంతసేపటికి కదిలే సూచనలు కనపడపడక మా వాడు మెట్లమిదే కూర్చున్నాడు... కొంచం సేపటికి మా వాడి మీద జాలి తలిచి దిగడం మొదలు పెట్టాను... బడి దగ్గరకి వెళ్ళే అప్పటికి మా వాడి కాబోయే బావమరిది గొడుగు తో తువ్వాలు తో రెడీ గా ఉన్నాడు ..నాకు నవ్వు ఆగలేదు... మా వాడు సిగ్గు పడిపోయాడు..
ఏంటి ఇలా సెప్పకుండా పారోచ్చేసినారు (వచ్చేసారు ) అని అడిగాడు బి.ఎం (బావ మరిది ).
మా వాడు దిక్కులు చూస్తున్నాడు
అనుకోకుండా రైలు ఆగిపోవడం తో ఇలాగా పారోచ్చినాం (వచ్చాం ) అని చెప్పా..
మరి ఎలాదారనేటి (వెళ్దామా ) అన్నాడు బి.ఎం (అయన ఉద్దేశం లో వాళ్ళ ఇంటికి )
మా వాడు మళ్ళి దిక్కులు లెక్క పెట్టడం మొదలు పెట్టాడు...
లేదు ఈ పాలికి ఒగ్గేయండి ... మల్లీ పాలోచ్చినప్పుడు ఇంటికి వస్తాం.. ఈ రోజు ఎల్లక పొతే అంకుల్ కంగారు పడతారు అని చెప్పా...
అక్కడ నుంచి మా సామాను తీసుకుందాం స్టేషన్ కి వెళ్లి అనుకుంటే బి.ఎం గారు ఆల్రెడీ తీసుకునే వచ్చేసారు. ఎం అనలేక ఇంక అక్కడ ఉన్న పాక హోటల్ లో టీ తాగి బస్సు ఎక్కి మళ్ళి వైజాగ్ వచ్చేసాం ... అలా అరకు వెళ్ళలేదు కాని .. అంత అందమైన ప్రదేశాన్ని చూసాం అన్న భావన మాత్రం ఇప్పటికీ ఉంది.
మేము ఇంటికి చేరే అప్పటికి మేము శృంగవరపు కోట కి వెళ్లి వాళ్ళ మామగారింటికి వెళ్ళకుండా వచ్చేసాం అన్న వార్త ఇంటికి చేరిపోయింది. ఇంక పాపం మా వాడిని ఆడుకున్నారు ఒక వారం రోజులు ఇంట్లో అందరు...

ఎప్పుడు వర్షం వచ్చినా (మా పిట్ట్స్ బర్గ్ లో ) మా ఊర్లో ఉన్న కొండల మధ్య ఆ వర్షాన్ని చూసినా నాకు ఆ శృంగవరపు కోట, ఆ గుడి ఆ వర్షం, ఆ కొండలు గుర్తుకు వస్తూనే వుంటాయి..

1 comment:

Unknown said...

Bagundi..varnana good. kalla mundu drishyala vaana ala dharaga padutondi..mee varnana pravhaham lo veltunte..

kooliki velladam anedi konchem ibbandiga anipinchindi..office ki anocchu kada