Saturday, June 27, 2009

మైఖేల్ జాక్సన్ కి నివాళి

"నువ్వు లేవు నీ పాట ఉంది
ఇంటి ముందు జూకామల్లె తీగల్లో అల్లుకుని
లాంతరు సన్నని వెలుతురులో క్రమ్ముకుని
నా గుండెల్లో చుట్టుకుని
గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో
దాక్కుని నీరసంగా, నిజంగా ఉంది
జాలిగా హాయిగా వినపడుతూ వుంది
శిశిర వసంతాల మధ్య వచ్చే మార్పుని గుర్తుకి తెస్తోంది"
(దేవరకొండ బాలగంగాధర తిలక్ వ్రాసిన "అమృతం కురిసిన రాత్రి" నుండి)

మైఖేల్ జాక్సన్ పోయారు అనగానే ఒక్కసారిగా మాటలు కరువయ్యాయి... ఎప్పుడూ మనం కలవని వ్యక్తే కావచ్చు కానీ మనకు బాగా తెలిసిన వ్యక్తి పోయారు అన్న భావన... మన జీవితాల్లో మనకి తెలియకుండా వచ్చేసి మనతో ఉన్న వ్యక్తి అలా హఠాత్తుగా వెళ్ళిపోయిన భావన... ఏదో చెప్పలేని బాధ, గుండెల్లో బరువు, గొంతు నిండా వ్యథ, తెలియకుండానే చెమర్చిన కళ్ళు, జ్ఞాపకాల పొరల్లోంచి "జాక్సన్ ఒక్కసారి చీల్చుకుని వచ్చేసారు...

అప్పట్లో ఇంకా VCD, DVD లాంటివి రాలేదు, VHS tapes మాత్రమే దిక్కు "వీడియో"కి. ఇప్పటి తరాలకి తెలియకపోవచ్చు కానీ అప్పట్లో జాక్సన్ వీడియోలకి మంచి గిరాకీ ఉండేది. పంజాగుట్టలో రాము నడిపే shop లో ఎప్పుడూ ఒకటే గొడవ మనకి "మంచి prints తెప్పించ"మని. ఆ shop నడిపే అతనిది మరో రకం గొడవ: "మొన్ననే తెచ్చాను. అప్పుడే tape అరిగిపోయింది. నన్నేం చెయ్యమంటారు!?" అని. నిజమే మరి, tape అన్నాక ఎక్కువ సార్లు rewind చేసి play చేస్తే ఎన్ని సార్లు తట్టుకుని ఉంటుంది గనక! వాటిని అద్దెకి తీసుకునే ప్రతి వాడూ rewind చేసి మళ్ళీ మళ్ళీ చూడటమే పని మరి!

...ఇంటి పక్కనే ఉండే జగ్గూ జాక్సన్ లాగా leather jacket వేసుకుంటే మహా కుళ్ళుగా ఉండేది. హైదరాబాద్ వాతావరణానికి ఆ "జాకెట్" వేసుకుని తిరుగుతుంటే పట్టే చెమట మనకి కనబడేది కాదు ఆ వయసులో. "జాక్సన్ జాకెట్" చూపించుకోవటానికి జగ్గూ గాడు ఇంటి ముందు నుంచి పది సార్లు ఇటూ అటూ తిరిగేవాడు. ఇలా కాదని ఇంట్లో శతవిధాల పోరి, తిండి మానేసి అలిగి 400 రూపాయలు పెట్టి మైఖేల్ జాక్సన్ వేసుకునే లాంటి shoes కొనుక్కుని జగ్గూకి "ఝలక్" ఇవ్వటం ఎలా మరచిపోతాం! ("మరణ మృదంగం" సినిమాలో చిరంజీవి అలాంటి shoes వేసుకుంటాడు... కానీ, నేను కొనే సరికి ఆ సినిమా ఇంకా రాలేదు. ఆ సినిమా వచ్చే సరికి ఇక చూసుకోండి మన హంగామా! మన లెవెల్ ఎంత పెరిగిపోయుంటుందో ఊహించుకోవటం కష్టం కాదు మరి! అంతా జాక్సన్ మహిమ!) మైఖేల్ జాక్సన్ ఇండియా వస్తున్నాడని విని తిండి మానేసి, ఇంట్లో పోట్లాడి మరీ టికెట్ కొనటం, తీరా ఆ టూర్ ప్రోగ్రాం రద్దైతే బెంగ పడి మళ్ళీ తిండి మానెయ్యటం ఎలా మరచిపోతాం!

వేసవి సెలవులకి ఊరికి వెళ్తే అక్కడ మా పశువులు మేపే కుర్రాడికి తెల్ల t-shirt ఇస్తే వాడి కళ్ళల్లో జాక్సన్ కనిపించాడు అంటే మైఖేల్ జాక్సన్ మన జీవితాల్లోకి ఎంతటి స్థాయిలో చొచ్చుకుపోయాడో ఆలోచించండి! స్కూల్లోనూ, కాలేజీల్లోనూ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసే ఎవరైనా సరే...మైఖేల్ జాక్సన్ ప్రవేశ పెట్టిన moonwalking step తప్పని సరి!

జాక్సన్ Thriller, Beat It, Bad, Dangerous లాంటి పాటలు అర్థం కాకపోయినా తెగ పాడేసేవాళ్ళం! చిరంజీవి "దొంగ" సినిమాలో "కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో..." అన్న పాట జాక్సన్ పుణ్యమా అని మనకు వచ్చినదే. (ఈ తెలుగు పాట Halloween's Top 10"గా నిలిచి ఎంతో మంది విదేశీయులకి కూడా నచ్చింది. Youtubeలో ఈ పాటకి ఏకంగా subtitles పెట్టి మరీ upload చేసిన వాళ్ళు పదుల సంఖ్యలో ఉంటారు. అందరికీ ఈ పాట ఎలా "ఎక్కేసిందా" అంటే... అందరికీ ఇది "Indian Michael Jackson's Thriller"గా తెలుసు.) తెలుగు సినిమాల్లో break danceకి భాష్యం చెప్పిన చిరంజీవి మాత్రమే కాదు "ముద్దుల మామయ్య"లో బాలకృష్ణ (నే రాజా, విలాసం నాది...), "గూఢచారి 117"లో చిన్నప్పటి మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, ఆఖరికి బాబూమోహన్‌తో సహా అందరి పాటల్లోనూ, డ్యాన్సుల్లోనూ జాక్సన్ గురించిన ఏదో ఒక భంగిమో, స్టెప్పో, కనీసం జాక్సన్ నామస్మరణమో కనిపించిందంటే మన మీద జాక్సన్ ప్రభావం ఎంతో ఆలోచించండి!

ప్రభుదేవా లాంటి డ్యాన్స్ మాస్టర్‌లకు "Indian Michael Jackson" అన్నది ఒక అవార్డ్ లాగానూ, ఒక prestigious title లాగానూ కనిపిస్తుందంటేనే ఆ ప్రభావం తెలిసిపోతుంది. Smooth Criminal నుంచి "పెదవిని చూడు, పెరపెర చూడు..." (భలే దొంగ), "They don't really care about us..." నుంచి Magic of the music... (ఉగాది) వంటి పాటలు ఏకంగా తెలుగు వేషంలో చొచ్చుకుని వచ్చేసాయి. తానే ముఖ్యపాత్రధారిగా, తన సంగీతనాట్యాలే ప్రాణంగా అద్భుతంగా తయారైన Michael Jackson's Moonwalker అన్న video game కూడా (జాక్సన్ సొంత నిర్మాణంలో రూపొందించినది) పిల్లలుగా కొందరైనా ఆడి తామే మైఖేల్ జాక్సన్ అయినట్టు సరదా తీర్చుకుని ఉంటారు 1990వ దశకంలో. "గాయం" సినిమాలో కోట డైలాగ్ గుర్తుందిగా? "ఎవడ్రా ఈడు... స్ప్రింగ్ గిట్ట ఏమన్న మింగిండా?" అని ఆశ్చర్యపోవటం... మైఖేల్ జాక్సన్‌ని చూసి ప్రపంచమే ముక్కున వేలేసుకుని అన్న మాట అది.

"...అవి కాళ్ళేనా?!" అనిపించేట్టుగా మెరుపులా కదులుతూ అబ్బురపరిచే "Dance Magician" మరి రాడు ఈ ప్రపంచంలో! వచ్చినా మైఖేల్ జాక్సన్ గుర్తు రావలసిందే కానీ అంత కన్నా మరో బిరుదు ఉండదు అలాంటి కళాకారుడికి. అంతలా అందరనీ సమ్మోహితులను చేసాడు జాక్సన్! అలాంటి మైఖేల్ జాక్సన్ జీవించి లేడంటే నమ్మబుద్ధి కాదు నాకు ఎప్పటికీ... తన పాట, తన నాట్యం మాత్రం జీవించే ఉంటాయి కలకాలం, నేను కూడా పోయిన తరువాత కూడా!

ఇటీవలే తన అనారోగ్యం గురించి వచ్చిన కొన్ని పుకార్లను పటాపంచలు చేసేలా వచ్చే నెల ఇంగ్లాండ్‌లో చేస్తున్న పెద్ద టూర్-తో మళ్ళీ King of Pop గా వస్తాడు అని ప్రపంచమంతా ఆశగా ఎదురు చూస్తుండగా అనుకోని విధంగా ఈ అశనిపాతం ఎందరినో హతాశులను చేసిందనటం అవాస్తవం కాబోదు! కేవలం Prince లేదా King కాదు... పాశ్చాత్య నృత్యరంగంలోనే కాక ఒకసారి చూస్తే ఎటువంటి వారి దృష్టిలోనైనా "రారాజు"గా మిగిలిపోయే మహాకళాసంపన్నుడు మైఖేల్ జాక్సన్.

తెలుగు సినిమా ప్రపంచానికి స్వతహాగా తనతో సంబంధం లేదన్నది నిజమే అయినా అది వాస్తవంలా అనిపించదు. అంతగా ప్రతి జీవితాన్నీ పెనవేసుకుని...పోయిన మైఖేల్ జాక్సన్ కళారంగంలో చిరస్థాయిగా నిలచిపోయే ధ్రువతార అవుతాడనటం అతిశయోక్తి కాదు.

2 comments:

మురళి said...

అబ్బ! ఎన్ని జ్ఞాపకాలు.. పాటలకే కాదండి కామెడీ కీ జాక్సన్ ని వాడుకున్నారు మనవాళ్ళు.. ముఖ్యంగా అతని ఆహార్యాన్ని.. జాక్సన్ చరిత్ర సృష్టించాడు.. a fitting tribute..

Sreekanth Devarakonda said...

Sri garu,

Liked your article very much. I dont think there is any individual whom MJ has not influenced.

PS: Tilak gari kavita reference chaala sandharbochitam gaa undi...

Sreekanth