పోయిన మాసం ఓ పుస్తకం కోసం అంతర్జాలం లో వెతకడం మొదలు పెట్టాను. పుస్తకం అయితే అప్పుడు దొరకలేదు కానీ ఆ పుస్తకం యొక్క ఆడియో వెర్షన్ బోలెడు చోట్ల డౌన్లోడ్ కి ఉంది. (ఇప్పుడు ఆ పుస్తకం దొరికింది లెండి ఎక్కువ వెతకకుండానే ). చాలా సార్లు గ్రంధాలయానికి వెళ్ళినప్పుడు కావలిసిన పుస్తకం దొరకపోవడం, దాని ఆడియో వెర్షన్ ని చూస్తూ ఉండటం పరిపాటి నాకు. కానీ పుస్తకం చదవడం లో ఉన్న మాధుర్యం ఆడియో వినడం లో దొరుకుతుందా ?! నా వరకు నాకు అది మింగుడుపడనిదే. ఒక కథ మనం చదువుతున్నప్పుడు ఆ సన్నివేశాన్ని మన కావలసినట్టు గా ఊహించుకోడం, దాన్ని సన్నివేశానికి అనుగుణంగా మనం స్పందిచడం లాంటివి అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం. లేదా అది ఒక నాటకం గా కాని సినిమా గా కాని అయితే అది కొంచం నటీ నటుల సామర్ధ్యలని బట్టి మనకి రసానుభూతి కలుగుతుంది. అలా కాక ఒకే రచయిత కానీ వ్యక్తీ కాని ఆ కథని చదివి వినిపిస్తే మనకి మనం పుస్తకం చదివిన అనుభూతి వస్తుందా అంటే నా వరకు అయితే రాదు మరి.
గుడిలో పంతులు గారు మరి పురాణం చదివితే నోరు తెరుచుకుని, నోట్లోకి దోమలు పోతున్నా చెవులప్పగించి వింటూ ఉంటావు కదా అంటే పురాణం వేరు అది మనకి అర్ధం అయినా కాని , పంతులు గారు చెప్పే విధానం బాగుంటే వింటాం అని అంటాం. కానీ కథ కాని నవల కాని అలా వినగలమా ? ఏమో ? అప్పట్లో శారదా అశోకవర్ధన్ , రత్న కుమారి గారు (రేడియో చిన్నక్కయ్య గా ప్రసిద్ది పొందారు ఆవిడ) ఇలా చదివే వారు అని అంటారు. వారు చదివిన కథ / నవల ఆ రచయితలూ వారు చదివిన విధానానికి సంతోషపడే వాళ్ళు (కొండక చొ ముగ్ధులు కూడా) అయ్యేవారు అని విన్నాను ). కాని తెలుగు లో మొదటి సారిగా అది కూడా అంతర్జాలం లో ఆడియో పుస్తకం గురించి వినడం ఇదే.
సరే ఈ సోది అంతా ఏంటి అనుకుంటున్నారా, ఈ రోజు ఒక టపా (మెయిల్ ) వచ్చింది. బాపు - రమణ గారి కోతి - కొమ్మచ్చి స్వాతి లో ధారావాహికంగా వస్తోంది కదా, అలాగే ఇప్పటికే మొదటి బాగం పుస్తక రూపం లో రావడం, మొదటి ప్రచురణ రెండు రోజులలో అమ్ముడు పోవడం లాంటివి జరిగాయి అని అందరికి తెలుసు కదా ... ఇప్పుడు ఆ పుస్తకాన్ని స్వర గంధర్వుడు గా పేరు పొందిన బాల సుబ్రహ్మణ్యం గారు చదివి మనకి కొంత రుసుముకి వినిపించే సౌలభ్యాన్ని వినియోగించు కోవచ్చు అని దాని సారాంశం. మచ్చుకు కొన్ని భాగాలు కూడా అక్కడ పెట్టారు. ఇప్పటికి అయిదు భాగాలు పెట్టారు అక్కడ. అయిదు భాగాలు కలిపి ధర రెండు డాలర్లు మాత్రమె. పన్నులు అదనం. నేను అక్కడ మచ్చుకు పెట్టినవి చూసాను. బాగానే ఉన్నా నావరకు మాత్రం నేను చదువుకుంటే ఉండే ఆనందం వేరు గా ఉంటుంది అన్నది నా భావన. (బాల సుబ్రహ్మణ్యం గారిని కించపరచాలని కాదు అని నా మనవి. అయన బాగా చదివారు కూడా ) కాని లోకో భిన్న రుచి .అందువల్ల నేను నా పుస్తకాన్ని చదువుకుంటే వుండే ఆనందాన్ని పాడు చేసుకోదల్చు కోలేదు. . మీరు కూడా ప్రయత్నించి చూడండి . మీకు నచ్చవచ్చు .మీకోసం ఇదిగోండి లింక్ ..కోతికొమ్మచ్చి.కాం
1 comment:
నేను కూడా ఆడియో వినడానికి ఇష్ట పడను. ఇప్పటిదాకా వినలేదు కూడా. చదవడమే నాకిష్టం.
చదివే సమయం లేని వారికి ఈ ఆడియో పుస్తకాలు కొంత ఉపయోగమేమో. అయినా వేరే పనులు చేస్తూ వింటే అవి ఎంతవరకూ తలకెక్కుతాయో నాకు అనుమానమే.. :)
Post a Comment