Thursday, February 24, 2011

కుదిరితే కప్పు కాఫీ దర్శకుడి , కెమెరామాన్ ల తో ఇంటర్వ్యూ

అర్. పి. పట్నాయక్ 'అందమైన మనసులో' సినిమా చూసిన తర్వాత.. ఆ సినిమాలో ఫోటోగ్రఫి బాగా నచ్చి పట్నాయక్ గారి దగ్గర సంతోష్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. అలా సంతోష్ తో మొదటి పరిచయం. ఇప్పుడు 'కుదిరితే కప్పు కాఫీ'కి పని చేసాడని తెలిసి..ఆ సినిమా దర్శకుడు రమణ తో కలిసి ఇద్దరినీ ఒక సారి ఇంటర్వ్యూ మొదలు పెట్టాను. ఇద్దరూ ఫోటోగ్రఫి నేపథ్యం నుంచే కాబట్టి, వారి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆ విశేషాలు..

శ్రీ : రమణ గారు మీరు స్వహతగా ఛాయాగ్రహకులు కదా (రమణ 'వినాయకుడు' , 'విలేజిలో వినాయకుడు' చిత్రాలకి ఛాయాగ్రహణం చేసారు ). మరి ఈ సినిమాకి వేరే కెమెరామన్ ని ఎందుకు తీసుకున్నారు.
రమణ : దర్శకుడిగా నాకు ఇది మొదటి సినిమా. నా ఏకాగ్రత మొత్తం సినిమా మీదే ఉండాలి. సో, రెండు బాధ్యతలు అంటే కష్టం. అందుకని సంతోష్ గారిని పెట్టుకున్నాను.

శ్రీ : మీ ఇద్దరికీ పరిచయం ఎలా జరిగింది ?
రమణ : నేను సినిమా అనుకోగానే నేను అనుకున్నది సరిగ్గా తెర మీదకి ఎవరు చక్కగా చూపించగలరా అని ఆలోచించాను. అంతే కాక నా స్వభావానికి తగ్గ వ్యక్తి కావాలి. ఆ సమయం లో 'అందమైన మనసులో' సినిమాకి సహాయ దర్శకుడి గా పని చేసిన నరసింహం కలవడం, సంతోష్ గురించి చెప్పడం జరిగింది. అప్పుడు సంతోష్ ని కలిసాను. ఒక రోజు మొత్తం ఆయనతో సమయం గడిపాక నా సినిమాకి తను పూర్తి గా న్యాయం చెయ్యగలడు అనిపించింది. కథ విన్నాక తను లొకేషన్ కోసం కూర్గ్ అయితే సరిగ్గా సరిపోతుంది అని చెప్పాడు. అప్పటికే తను 'జోష్' అనే కన్నడ సినిమా అక్కడ తీయడం వల్ల అక్కడి పరిసరాలు అన్ని బాగా తెలుగు. ఎక్కడ ఏ సన్నివేశాలు తీస్తే బాగుంటుందో వెతుకుతూ మూడు సార్లు వెళ్ళాము. అక్కడ మిస్ట్ గా ఉండి, పచ్చగా అందంగా ఉండే సీజన్ ఒక నెల రోజులే ఉంటుంది. అందుకని ఆ సమయం వచ్చేవరకు ఆగి అప్పుడు షూటింగ్ మొదలు పెట్టాము. సంతోష్ : 'అందమైన మనసులో' అయ్యాక నేను 'జోష్' సినిమాకి సొంతంగా దర్శకత్వం చేద్దాం అనుకోవడం వల్ల తెలుగు లో వెంటనే సినిమాలు చెయ్యడం కుదరలేదు.
రమణ : అంతే కాదు తను 'జోష్' సినిమాకి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ ని పరిచయం చేసారు. అయనని కూడా తెసుకుని అక్కడికి వెళ్ళాము. అది చాలా సహాయపడింది నాకు. అయన ఒక చెట్టుని చూసి అది మేము షూటింగ్ చేసే సమయం లో ఆ వాతావరణానికి ఎలా ఉంటుంది అని చెప్పగలిగే వారు. అయన సినిమాకి చాల పెద్ద హెల్ప్ అయ్యారు.
శ్రీ : ఇద్దరు కూడా స్వతహాగా కెమెరామెన్ లు. ఇప్పుడు దర్శకులు గా మారారు . మరి ఒకరి పనిలో ఇంకొకరు జోక్యం ... లేక ఇది అయితే నేను ఇంకా బాగా తీసేవాడిని లాంటివి ..సందర్భాలు ఏమైనా ఉన్నాయా..
సంతోష్ : లేదు. అలాంటిదేం జరగలేదు .ఎందుకంటే కథ రమణ గారిది. నా పని అయన అనుకున్నది తెరకెక్కించడమే. తనకి ఏది కావాలో ఎలా కావాలో ముందే తను చెప్పడం వల్ల నా పని సులువు అయ్యేది. నేను స్క్రిప్ట్ విషయం లో జోక్యం చేసుకోలేదు. అది నా పద్దతి కాదు.రమణ : సీన్ బెట్టేర్మేంట్ కోసం సలహాలు ఇవ్వడం అన్నది మాములుగా జరిగే విషయం. కానీ తను ఎంతవరకు చెప్పింది , అనుకున్నది సరిగ్గా వస్తోందా రావడం లేదా అన్నదాని మీదే ఎక్కువ ఆలోచించేవాడు. చాలా ఓపిక తనకి.
శ్రీ : అన్ని పాజిటివ్ లే ఉండవు కదా ..
సంతోష్ : నాకు ఏ కంప్లైంట్స్ లేవు (నవ్వు)
రమణ : నాకు కూడా లేవు. కూర్గ్ లో ఉన్నప్పుడు అక్కడ స్థలాభావం వల్ల మేము ఇద్దరం ఒక గదిలో సర్డుకోవలిసి వచ్చింది. అప్పుడు చూసా తన ఓపికని. పొద్దున్న నాలుగున్నరకే లేచి రెడీ అయ్యి షూటింగ్ స్పాట్ కి వెళ్ళిపోయేవాడు లైటింగ్ చూసు కోడానికి. ఒక్కటే కంప్లైంట్ తన మీద (నవ్వు) తనకి పెళ్లి కుదిరింది అప్పుడే. రోజూ ఆ అమ్మాయి తో సాయంకాలం ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడేవాడు. అక్కడ ఏమో సిగ్నల్ పని చేసేది కాదు దాంతో సిగ్నల్ ఎక్కడ దొరుగుతుందో వెతుక్కుంటూ వెళ్ళి పోయేవాడు. (నవ్వు).
శ్రీ : ఒక పాటకోసం ఏదో ప్రయోగం చేసారని విన్నాను ?
సంతోష్ : మాములుగా మనం తీసే షాట్ ఒక దానికి ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఉం టాయి. కాని దీంట్లో ఒక పాటకోసం ఐదు వందల ఫ్రేమ్స్ వాడాము. మామూలుగా ఇది ఫైటింగ్ సన్నివేశా లకి స్లో మోషన్ కోసం వాడతారు. కాని మేము దీన్ని సాంగ్ కోసం వాడాము. ఈ షాట్ లో మనం ఒక సబ్బు బుడగ పేలితే వచ్చి చిన్ని చిన్ని తుంపరలు కూడా చాల క్లియర్ గా చూడగలం. అది మీరు తెరపైన చూసినప్పుడు కలిగే అనుభూ తి వేరు.

శ్రీ : రమణ ఇందాక సంతోష్ ఓపిక గురించి ఏదో చెప్తున్నారు. ..
రమణ : క్లైమాక్స్ షూటింగ్ జైపూర్ లో అనుకున్నాము. అప్పటికి సంతోష్ పెళ్లి తేది దగ్గరకి వచ్చేసింది. మరో అయిదు రోజుల్లో పెళ్లి. ఆ సమయం లో కూడా ఎం మాట్లాడకుండా సినిమాకోసం వచ్చే సాడు. అది ఒక పెద్ద కథ (నవ్వు). నేనూ, సంతోష్ ఇద్దరం బెంగుళూరులో ఉన్నాం. జైపూర్ వెళ్ళాలి ఉదయానికల్లా. వరుణ్ ఏమో బొంబాయి లో ఉన్నాడు. తను అక్కడనుంచి విమానం లో వచ్చేసాడు. మా విమానం ఏమో ఏవో కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో ఒక వాన్ మాట్లాడుకుని డ్రైవర్ నిద్రపోకుండా రాత్రి అంతా తనకి కథలు చెప్తూ పొద్దున్న ఎనిమిదికల్లా అక్కడికి చేరుకొని షూటింగ్ మొదలు పెట్టి సాయంత్రం ఆరు గంటలకల్లా పూర్తి చేసి మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యాము. రాత్రి అంతా డ్రైవర్ కి కథలు చెప్పడం మామూలే (నవ్వు ) లేకపోతే మేము కథలో కలిసి పోతాం కదా..

శ్రీ : మరి సంతోష్ కి నిద్ర సరిపోయిందా లేక పెళ్లి లో నిద్రపోయాడా ?
సంతోష్ : లేదు రాగానే ఒక రోజంతా నిద్ర.. మర్నాడు పెళ్లి (నవ్వు) ...

శ్రీ : మీ సంగీత దర్శకుడు కూడా ఈ సినిమా మధ్యలో పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్నాడు ...
రమణ : అవును తన పెళ్లి కూడా ఈ మధ్యే జరిగింది .
శ్రీ : అసలు యోగి ని సంగీత దర్శకుడిగ పరిచయం చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది.
రమణ : దానికి కారణం.. మా సినిమా మాటల రచయిత అబ్బూరి రవి. ఈ సినిమాలో రెండు పాటలని శాస్త్రి గారి తో రాయించాలి అనుకున్నాను. ఆయనతో నాకు అసలు పరిచయం లేదు. రవి కి పరిచయం. రవి తీసుకెళ్ళి పరిచయం చేసాడు. అయన నేను కథ మొత్తం వివరంగా చెప్పగానే. మొత్తం పాటలు రాస్తాను అని అన్నారు. అప్పుడు కూడా యోగి గురించి అనుకోలేదు. మద్రాస్ లో ఇంకో సంగీత దర్శకుడిని అనుకున్నాము. ఆయనతో మాట్లాడటం, అడ్వాన్సు ఇవ్వడం కూడా అయిపొయింది. కాని నాకు ఎక్కడో ఇయనకన్న వేరే వాళ్ళు అయితే బాగుంటుంది అన్న భావన మొదలైంది. నాకు నేను ఏదన్నా చెయ్యగలను అన్న పొగరు ఉన్న సంగీత దర్శకుడు కావాలి. అది కొత్త సంగీత దర్శకులు అయితే ఉంటుంది. అదే రవి తో చెపితే, తను యోగి పేరు సూచించారు. అలా యోగి తో పరిచయం. యోగి అన్ని పాటలు ఒక్కసారి కంపోజు చేసినవే. ఒక్క టైటిల్ సాంగ్ మాత్రం రెండో సారి ట్యూన్ చెయ్యవలిసి వచ్చింది సన్నివేశానికి, సాహిత్యానికి తగ్గట్టుగా తను అందంగా చేసాడు.

శ్రీ: సంతోష్ మీకు ఎలా అనిపించాయి పాటలు.
సంతోష్ : వాటిని అంతే అందంగా తీసారు రమణ అనిపించింది (నవ్వు).

శ్రీ : షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేసారు అని విన్నాను ..
సంతోష్ : ( నవ్వు )
రమణ : నిజంగానే బాగా ఎంజాయ్ చేసాం లెండి ... అక్కడ ఈ మహానుబావుడు చెప్పులు కూడా వేసుకోనివ్వలేదు ఎవ్వరిని. అక్కడ బోలెడు జలగలు. షూస్ కాని చెప్పులు కాని వేసుకుంటే కనపడవు కదా అందుకని ఎవ్వరిని చెప్పులు కూడ వేసుకోనివ్వలేదు. ఆ ఏరియా అంతా సంతోష్ కి కొట్టిన పిండి.

శ్రీ : మరి హనీమూన్ కి మళ్ళా అక్కడికే వెళ్తున్నారా ?
సంతోష్ : లేదు ఈ సారికి ఆ సీజన్ అయిపొయింది కదా. వచ్చే సంవత్సరం వెళ్తాం ఏమో;..
శ్రీ : వరుణ్ తెలుగు మిద సటైర్లు ఉన్నాయ్ అంట కదా ...
రమణ : అవును .. అన్ని ఇప్పుడే చెప్పను తెర మిద చూడండి. (నవ్వు)

No comments: