Friday, April 26, 2013

ఉత్సవ కానుక – ఆదూరి వెంకట సీతారామమూర్తి

ఉత్సవ కానుక – ఆదూరి వెంకట సీతారామమూర్తి

 
utsavakanuka
వ్యాసకర్త: శ్రీ అట్లూరి
*****
ఈ పుస్తకం మాములుగా కన్నా ఎక్కువ సమయం పట్టింది చదవటానికి. నిజానికి ఈ పుస్తకం చదవటానికి కారణం బాపు గారి బొమ్మ. అది చూసి ఈ పుస్తకం కొన్నాను. మొత్తం పదిహేను కథలు, మూడు ఇతర విశేషాలతో ఉన్న పుస్తకం ఇది.
సరళమైన భాష అందరికి అర్థమయ్యే పదాల పొందిక ఈ కథల విశేషాలు. మొదటి కథ ఉత్సవ కానుక అన్నిటిలోకి బాగున్న కథ. ఒక సంగీత అభిమాని ఒక సంగీత కళాకారుడికి ఇవ్వగలిగిన బహుమతి అంతకన్నా ఏముంటుంది అనిపిస్తుంది కథ మొత్తం చదివాక.
రెండో కథ అమ్మాయి పెళ్లి. ఒక మధ్య తరగతి ఇల్లాలు తన కూతురుకి అమెరికా సంబంధం కోసం పడే తాపత్రయం ఈ కథ. తెరువు కథ మూడోది … ఈ కథ చాలా మంచి కథ. మనం చూసేవి అన్ని మనం అనుకున్న నిజాలు కాకపోవచ్చు అన్నదానికి ఇది మంచి ఉదాహరణ ఈ కథ. తప్పకుండా చదవాల్సిన కథ ఇది.
పాత బంగారులోకం ఒక మామూలు కథ . ఊరట, సర్వం జగనాథం, సంసారంలో హింసానాదం, బెస్ట్ కపులు గిఫ్ట్ కూపను ఒక మోస్తరు కథలు. చిలకపచ్చరంగు చీర బట్టలకోట్లల్లో జరిగే డిస్కౌంట్ ల సంబరం మీద, దాన్నివల్ల మధ్యతరగతి వాళ్ళు ఎలా మోసపోతున్నారో తెలియచెప్పే కథ (ఇలాంటి కథలు మనం ఇంతకు ముందు కూడా చదివి ఉండొచ్చు ). బతుకు దారి దిగువ తరగతి కుటుంబాల్లోని నిజాయితీకి అద్దం పట్టే కథ.
వృత్తి ధర్మం మనకున్నదాంట్లో ఒకరికి సహాయపడితే భగవంతుడు మనకి సహాయపడతాడు అని చెప్పే కథ. అంతరాలు మధ్యతరగతి జీవితాల్లో డబ్బుకి మానవ సంబంధాలకి జరిగే అంతర్మథనం ప్రధాన వస్తువు. కొంచం సాగతీత అనిపిస్తుంది. బంధం కథ ముగింపు ఓ హెన్రీ కథలని పోలి ఉంది. మంచి ముగింపు ఉన్న కథ ఇది. గోరింట పండింది బాగా పాతకాలం కథ. ఇప్పటి కథ కాలం కథ కాదు. ఆనందపురం వెళ్ళాలి టైటిల్ కొంచం మధురాంతకం గారి కథ లాగా అనిపించినా బాగానే ఉన్న కథ.
మొత్తం మీద కథలు అన్నీ మధ్యతరగతి సమస్యలు, వారి జీవన విధానాలు ప్రధాన అంశాలుగా తీసుకున్నారు. అన్ని చదివించే కథలే. కాని కొన్ని కథలు సాగతీత వల్ల మంచి కథ అవాల్సి కూడా కాకుండా మాములు కథలాగా మిగిలిపోతాయి. వీరి ఇంకో కథా సంపుటి అత్మద్రుతి నేను చదవలేదు దాని గురించి విశేషాలు ఈ కథా సంపుటిలో ఉన్నాయి.
*****
from : http://pustakam.net/?p=14304
Book available in Kinige.com 

No comments: