Saturday, January 16, 2010

నెలవంక (1983)


చిన్నప్పుడు ఈ సినిమా చూసినప్పుడు. ఎందుకు ఈ సినిమా ఆడలేదు అన్నది నాకు అర్ధం కాలేదు. మంచి సినిమా మంచి సాహిత్యం మంచి నటన, మంచి సంగీతం, మంచి చాయాగ్రహణం అన్నీ ఉన్నాయ్ కాని సినిమా ఆడలేదు.

కథ టూకీగా :
ఆ ఊరికి మాజీ రాజా వారు శ్రీరామదాసు (గుమ్మడి ) అయన గుర్రంబండి నడిపేవాడు రహీం (సోమయాజులు ) . ఇద్దరు చిన్నపుడు కలిసి చదువుకున్నా పదిమందిలో వారి చనువు బైట పెట్టేవారు కాదు. ఆ ఊరిలో ఉన్న ఇద్దరు హిందూ ముస్లింల ఐక్యత కి తమ స్వార్థానికి బలి పెడతారు. దానికి రామదాసు, రహీం ఎం చేసారు అన్నది ముఖ్య కధాంశం. దానికి ఉపకథ గా ,రామదాసు కూతురు ప్రేమాయణం, రహీం కొడుకు మంచితనం లాంటివి జోడించారు.
చిత్రం లో చెప్పుకోదగ్గవి , గుమ్మడి, సోమయాజుల నటన. ఇద్దరు పోటి పది నటించారు. వాటికి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి సాహిత్యం, రమేష్ నాయుడు సంగీతం, ఎస్ గోపాల రెడ్డి గారి చాయాగ్రణం అదనపు ఆకర్షణ.

సినిమా గురించి :

జంధ్యాల గారికి ఇది నాలుగో సినిమా దర్శకుడిగా. అంతకు ముందర తీసిన మూడు (ముద్దా మందారం, మల్లె పందిరి, నలుగు స్తంభాలాట ) కూడా ప్రేమ చుట్టూ తిరిగే సినిమాలు. ఇది మాత్రం మత సామరస్యం కి సంభందించిన సినిమా. అసలు గుమ్మడి ని, జే వి సోమయజులని పెట్టి సినిమా మొత్తం తియ్యడానికి బోలెడు ధైర్యం కావాలి (ముఖ్యాపాత్రదరులు గా ) . ఈ సినిమా నిజానికి జంధ్యాల తన క్లాస్స్ మేట్ మెట్టెల రామబ్రహ్మం నిర్మాతగా మొదలు పెట్టారు. అయన అప్పుడు జగయ్య పేట కాలేజి లో కామర్స్ ఉపాధ్యాయునిగా పని చేస్తూ ఉండేవారు. సినిమా పూర్తీ అయ్యాక దాదాపుగా మూడు నెలలు విడుదల కి నోచుకోలేదు ఈ సినిమా. అక్టోబర్ లో సెన్సార్ జరుపుకున్న ఈ సినిమా జనవరి లో విడుదల అయ్యింది. ఆ ఇబ్బందుల నుంచి బైటపడటానికి నరసింహ రావు గారిని ఆశ్రయించారు. అందువల్ల అయన పేరు నిర్మాతగా కనపడుతుంది.

సినిమా మొత్తం ముక్త్యాల లోని వాసిరెడ్డి రాజ్యలక్షమ్మ గారి కోట లో తీసారు. ఈ కోటకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే , ఈ కోటకి ఒక వైపు గుంటూరు, ఇంకో వైపు వరంగల్లు మూడో వైపు కృష్ణనది కి అవాలి వొద్దు కృష్ణ జిల్లా. అంతే కాక ఇక్కడ జనాభా హిందూ ముస్లింలు దాదాపుగా సరి సగం. ఇప్పటి వరకు ఎప్పుడు అక్కడ హిందూ ముస్లింల గొడవలు జరగలేదు. ముక్త్యాల రాజా వారి గుర్రం బండి తోలేవాడు కూడా ముస్లిం. ఇవి అన్ని దృష్టిలో పెట్టుకుని జంధ్యాల ఈ సినిమాని ఇక్కడే తియ్యాలి అని నిశ్చయించుకున్నారు.

నిర్మాత ది జగ్గయ్య పేట కావడంతో, అక్కడకి ముక్త్యాల దగ్గరే కావడంతో, వంట వాళ్ళని జగ్గయ్యపేట నుంచి తీసుకువచ్చి ఇక్కడ మెస్ ఏర్పాటు చేసి మొత్తం అందరికి భోజనాలు ఏర్పాటు చేసారు. సినిమా మొత్తం దాదాపు నలభై రోజుల్లో పూర్తి చేసారు. జూన్ ఇరవై మూడున నెలపొడుపు రోజున మొదలు పెట్టి ఆగష్టు నాలుగో తారీఖికుకి మొత్తం చిత్రీకరించడం పూర్తి చేసారు. యూనిట్ మొత్తం కోటలోనే బస. సోమయాజులు గారు సహజత్వం కోసం నిజంగానే గడ్డం పెంచారు. కాని మధ్యలో రెండు రోజులు బాపు గారి పెళ్లీడు పిల్లలు షూటింగ్ లో పాల్గొనాల్సి రావడం తో అయన గడ్డం తీసేశారు. దాంతో మళ్ళి గడ్డం పెదిగే దాక ఒక వారం ఆయనతో షూటింగ్ జరపలేదు జంధ్యాల . ఆ సమయం లో మిగిలిన సన్నివేశాలు తీసారు. ఈ షూటింగ్ లో నే గుమ్మడి గారు తన యాభై ఆరో పుట్టిన రోజు జరుపుకున్నారు.

ఆదుర్తి గారి మొదటి చిత్రం అమర సందేశం లో కథానాయకుడిగా నటించిన అమర్ నాథ్, కెమెరామన్ ఎస్ గోపాలరెడ్డి గారు పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవారు. అమర్ నాథ్ గారి అబ్బాయి రాజేష్ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలిసి జంధ్యాల గారికి పరిచయం చేసారు గోపాల రెడ్డి గారు. అలా ఈ సినిమాలో తులసి పక్కన నటించే అవకాశం వచ్చింది. తర్వాత రెండు జెళ్ళ సీత, ఆనంద భైరవి లాంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు, చాలా సినిమాల్లో సహాయ పాత్రలు చేసారు. చిన్నవయసులో తండ్రి లాగే గుండె నొప్పి తో పోయారు. గోపాల రెడ్డి గారి మేనల్లుడు అనూర్ (కమెరా మాన్ / దర్శకుడు రసూల్ కి అన్నయ్య ) ఇంకో ముఖ్య పాత్ర వేసాడు. కాకపోతే సినిమాలో అతని పేరు కిరణ్ గా వేసారు. అనూర్ తరవాత రెండుజెళ్ళ సీత లో ఒక చిన్న పాత్ర వేసారు. ప్రస్తుతం ఇంగ్లండు లో ఎలెక్ట్రానిక్ పరిశ్రమ నడుపుతున్నారు. ఈ సినిమాలో ఇంకో చిన్న పాత్ర వేసింది రాజ్యలక్ష్మి తల్లి గారు సభారంజని (రాజ్యలక్ష్మి సినిమాల్లోకి రాక ముందర ఈవిడ ప్రముఖ రంగస్థల కళాకారిణి. ).

రాజేష్ కి గాత్ర ధారణ చేసింది బాలుగారు, జంధ్యాల కూడా రెండు మూడు పాత్రలకి గాత్రధారణ చేసారు. ఈ సినిమాకి పని చేసిన వాళ్ళల్లో ముఖ్యులు ఎం వి రఘు తరవాత కాలం లో పేరు పొందిన ఛాయాగ్రాహకుడు / దర్శకుడు గా పేరు పొందారు. దివాకర్, శ్రీనివాస్ రెడ్డి లు కూడా చాయగ్రహకులుగా రాణించారు శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా బాలకృష్ణ తో కృష్ణబాబు అన్న సినిమా కూడా నిర్మించారు. సహాయ దర్శకుడు ఈ వి వి దర్శకుడిగా మరి ప్రస్తుతం తన యాభయ్యవ సినిమా తీస్తున్నారు.

పుల్లారావు ఈ చిత్రం నుంచి జంధ్యాల గారి దగ్గర చేరారు. దాదాపుగా జంధ్యాల గారి అన్ని సినిమాలకి ఈయన పనిచేసారు. ప్రస్తుతం తమ్ముడు భగవాన్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.

ముద్దమందారం, నాలుగుస్తంభాలాట తరవాత తులసికి ఇది మూడో సినిమా జంధ్యాల గారి దర్శకత్వం లో. ఈ సినిమా నాటికి తులసికి పదనాలుగేళ్ళు. నటుడిగా బాలాజీ కి ఇది మొదటి చిత్రం. తర్వాత ఓ ఆడది ఓ మగాడు లో పెద్ద పాత్ర తో జనాలకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో రాజేష్ పక్కన తోలుబొమ్మలాటలో సహాయకుడిగా వేసాడు. నిజానికి ఆ పాత్ర జిత్ మోహన్ మిత్ర వెయ్యాల్సింది. ఆ తోలుబొమ్మల పాట పాడింది జిత్ మోహన్ మిత్రా నే. బాలాజీ నటి రోహిణి కి అన్న.

ఈ సినిమాకి తప్పకుండా జాతీయ బహుమతి వస్తుంది అని ఆశించారు జంధ్యాల. అవార్డు కోసం పంపిన ప్రింట్ సకాలం లో ఢిల్లీ చేరకపోవడం, అసలు ప్రింట్ ఎక్కడ ఉందొ కూడా తెలీక పోవడం లో రాజకీయాలు జరిగి ఉంటాయి అని అన్నారు జంధ్యాల.

సినిమా విజయవంతం కాకపోవడం లో తన తప్పుకూడా ఉందేమో అంటూ నెలవంక తీశాను. కాని నేల వంక చూడటం మర్చిపోయాను అన్నారు (పామర జనానికి నచ్చలేదు ఈ సినిమా అని అయన భావం).

కృతజ్ఞతలు : శ్రీ జంధ్యాల, పులగం చిననారాయణ , ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, జే పుల్లారావు, రసూల్

ఈ సినిమా గురించి మరికొన్ని వివరాలకి ఆంగ్లం లో రాసిన వ్యాసం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
జంధ్యాల గారికి , ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి నివాళి

2 comments:

Anonymous said...

warangal kaadandi nallagonda jilla

S said...

Btw: I just love this movie. Want to see it again. Will see soon I guess...