Thursday, January 28, 2010

గుమ్మడి గారి గురించి నా జ్ఞాపకాలు

గుమ్మడి గారిని మొదటి సారి అక్క పెళ్లి లో చూసాను. అప్పటికి బాగా చిన్నవాడిని కావడం తో ఏమీ తెలీదు. నిజానికి అయన గుమ్మడి అని కూడా నమ్మలేదు లెండి. అంతకు ముందే మాయాబజార్ సినిమా చూసి ఉండటం వల్ల గుమ్మడి అయితే బలరాముడి గెట్ అప్ లో ఉంటాడు, ఇయన ఎవరో అని అనుకున్నా. దాంతో ఎక్కువ పట్టించుకోకుండా ఆడుకోవడానికి వెళ్లి పోయాను. తరవాత స్కూల్ లో ఉన్నప్పుడు ఒక రోజు స్కూల్ ఎగ్గొట్టి (ఇంట్లో వాళ్ళే ఎగ్గోట్టించారు లెండి ) ఏదో సినిమా ప్రీమియర్ కి అన్నపూర్ణ స్టూడియో కి వెళ్ళాం. అప్పుడు అక్కడ ప్రేమాభిషేకం షూటింగ్ జరుగుతోంది. గుమ్మడి గారిది దాంట్లో డాక్టర్ వేషం.. షూటింగ్ గాప్ లో ఎవరి అబ్బాయి, ఎం చదువుతున్నావు అని మార్కులు అడిగి, పాలు బిస్కెట్స్ తెప్పించి ఇచ్చారు.

తరవాత ఏడాది గాంధి సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా ప్రిమియర్ మహేశ్వరి టాకీస్ లో జరిగింది. దానికి వెళ్ళినప్పుడు మా పక్క సీట్స్ లో ఉన్నది గుమ్మడి గారు, సుహాసిని గారు, బానుచందర్, రాజా (బహుదూరపు బాటాసారి షూటింగ్ నుంచి వచ్చారు అందరూ ). ఆ తరవాత దాదాపుగా కలవలేదు సరిగ్గా ఎప్పుడు. ఏదన్నా సినిమా ఫంక్షన్ లో చూసినా వాళ్ళది ఫ్రంట్ రోవ్స్ మాది ఎప్పుడు స్టేజి వెనకాల సంత దాంతో ఎక్కువ మాటలు ఉండేవి కాదు.

ఆయనకి ఇద్దరా సినిమా చేస్తున్న సమయం లో ఆయనకి గొంతు సంబందిత చికిత్స జరగడం వల్ల ఆయనకి నూతన్ ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పారు. అయన కి అది చాలా బాద కలిగించింది. ఒక నటుడు ఎరువు గొంతుకు తో నటించాలా అన్న భావనతో నటనకి దూరంగా చాలా కాలం దూరంగానే ఉన్నారు. రెండు ఏళ్ళ క్రితం అతి బలవంతం మీద శ్రీ కాశీ నాయన చరిత్ర అన్న సినిమాకి అయన వయసుకి సరిపడా పాత్ర కావడం తో ఒప్పుకున్నారు. అది గత ఏడాది విడుదల అయ్యింది.

2007 లో తానా సభలకి అయన వారి మనవడు వీరు ఉప్పల తో వచ్చారు. అయన పక్కన రామారావు గారి అమ్మాయి పురంధరేశ్వరి గారు ఉన్నారు. నన్ను వీరు తీసుకువెళ్ళి పరిచయం చేసారు. అప్పటికే బోలెడు జర్నీ చేసి రావడం వల్ల అయన అలసి పోయి ఉన్నారు. మర్నాడు తన హోటల్ గదికి రమ్మని చెప్పారు. పురందేశ్వరి గారు బాబాయ్ గారు అంటూ ఆయనతోనే ఉన్నారు.

మర్నాడు మరీ పొద్దునే వెళ్లి ఆయనని ఇబ్బంది పెట్టడం దేనికి అని మధ్యానం వెళ్దాం అనుకున్నాను. పొద్దునే బాలకృష్ణ గారి తో కలిసి అయన సాయంత్రం వేయబోయే నాటకం రిహార్సల్ కి వెళ్ళాను. అక్కడకి గుమ్మడి గారు వచ్చారు. బాలకృష్ణ గారు ఎదురు వెళ్లి బాబాయ్ గారు అంటూ తీసుకు వచ్చి కూర్చోబెట్టి అయన తో కాసేపు గడిపి నాటకం రిహార్సల్స్ లో మునిగి పోయారు. అయన మధ్య మధ్య లో వచ్చి ఎమన్నా కావాలేమో కనుక్కుంటూనే ఉన్నారు. నేను గుమ్మడి గారితో అక్కడ ఆ పూటంతా గడిపి ఆయనతో భోజనం హాల్ కి కూడా వెళ్ళాం. అప్పటి నుంచి ఆయనతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఫోన్ చెయ్యగానే ముందర వారి ని చూసే రమేష్ ఫోన్ ఎత్తి పేరు చెప్పి ఆయనకి ఇచ్చేవాడు. అయన కి మళ్లీ గుర్తు చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. చాల ఆప్యాయం గా మాట్లాడేవారు. ఒక పెద్ద నటుడిని అన్న ఎగో ఎప్పుడు ఉండేది కాదు. మన ఇంట్లో తాతగారితో మాట్లాడినట్టే ఉండేది ఆయనతో మాట్లాడుతుంటే.

ఒక మాయాబజార్, ఒక మహామంత్రి తిమ్మరుసు , ఒక నేను మనిషినే, ఒక తాత మనవడు, ఒక అర్ధాంగి ఇలా చాలా సినిమాలు ఉన్నాయి అయన లేకుండా ఇంకొకరు చెయ్యలేని సినిమాలు. అయన ఎప్పుడు పక్క నటులని dominate చెయ్యాలని చూసేవారు కాదు. పక్కవారితో పోటీ పడేవారు కానీ వాళ్ళని మింగేయ్యలని మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఆయనతో మాట్లాడుతుంటే ఒక బాబాయ్ గారి తోనో, ఒక మమయ్యగారితోనో లేక మన తాత గారితోనో మాట్లాడుతున్నట్టు ఉండేది. కానీ ఒక పెద్ద నటుని తో మాట్లాడ్తున్నట్టు గా ఉండేది కాదు. అయన పోవడానికి ముందర రెండు రోజుల క్రితం మాయాబజార్ రంగుల్లో వస్తోంది అని ఫోన్ చేసినప్పుడు బోలెడు సంబర పడిపోయారు ఆ సినిమా గురించి చాల మాట్లాడారు. ఇంతలో ఇలా అవుతుంది అని అనుకోలేదు. నాకు తెలిసి ఆయనకి విరోధులు అంటూ ఎవరు లేరు. చిత్ర పరిశ్రమ లో అజాత శత్రువు అందరికి మిత్రుడు ఆయనే.

ఆయన ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ ...

5 comments:

antaryagam said...

మీరు అన్నది అక్షరాల నిజం అని నాకు అనిపిస్తుంది. నేను టీవీ లో చూసిన ఒకటి రెండు ఇంటర్వ్యూ ల లో ఆయన సహ నటుల పట్ల వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఎంత నమ్రత ఉట్టిపడుతూ ఉంటాయో విన్నాను.

ఆయన ఎశ్వీ రంగా రావు గారి గురించి మాట్లాడుతూ, ఆయన తెలుగు వాడయి పుట్టటం మన అద్రుష్టం, ఆయనకి దురద్రుష్టం అన్నారు. అది నిజమె కదా. ఎశ్వీ రంగా రావు గారి ప్రతిభకి రావలసిన గుర్తింపు రాలేదని, గుమ్మడి గారు మనస్ఫూర్తి గా బాధ పడ్డారు.

అలాగే గుమ్మడి గారికి కూడా, ఇంత వైవిధ్యం విలక్షణత ఉన్న నటుడు, ఇంత సీనియర్ అయి ఉండీ రావలసినంత గుర్తింపు - అవార్డులు రాకపోవటం ఆయనకి కాదు మనకి సిగ్గు చేటు. తెలుగు వాడు అయి పుట్టిన ప్రతీ వాడు బాధ పడవల్సిన విషయం.

శరత్ కాలమ్ said...

వారి వ్యక్తిత్వం గురించి మంచి విషయాలు అందించారు మీరూ, అంతర్యాగం గారూనూ. గుమ్మడి గారి మీదున్న గౌరవం ఇంకా ఇనుమడించింది. అలాగే పురంధరేశ్వరి, బాలక్రిష్ణలమీద కూడా గౌరవం కలిగింది. గుమ్మడి గారు మీ కుటుంబానికి ఎలా పరిచయమో చెప్పనేలేదు!

Anil Dasari said...

గుమ్మడి అంటే రకరకాల పాత్రల పేర్లు చెబుతారు అందరూ. అవన్నీ గొప్ప వేషాలే అనుకోండి. నాకు మాత్రం, ఎందుకో గుమ్మడి పేరు చెప్పగానే 'ముఠామేస్త్రి'లో ఆయన వేసిన ముఖ్యమంత్రి పాత్ర గుర్తొస్తుంది. ఆ పంచె కట్టు, ఆ హుందాతనం .. తెలుగువారి ముఖ్యమంత్రంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది (ఆ సినిమా వచ్చినప్పుడు కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుంటా. I don't exactly admire Kotla as a CM, but ఆ వేషంలో గుమ్మడిని తలచుకుంటే అనుకోకుండా కోట్ల కూడా గుర్తొస్తాడు)

budugu said...

నాకు పెళ్ళి పుస్తకం సినిమాలో పాత్ర గుర్తొస్తుంది. నేనూ.... అంటూ సరదా ఉచ్ఛారణతో హుందాగా ఉంటుందా పాత్ర.

Anonymous said...

aayana aatmaku saanti chekuraali ani pradistunna devudini