Saturday, January 9, 2010

సంక్రాంతి - ముగ్గులు


సంక్రాంతి అనగానే ముందర మనకి గుర్తు వచ్చేవి ముగ్గులు , ముగ్గుల పైన జోకులు... మా ఆవిడ రధం ముగ్గు వేస్తూ వెళ్ళింది ఇంకా రాలేదు అన్నది వినని వాళ్ళు ఉండరు ఏమో. ఇవే కాక బోగి పళ్ళు, చెరుకు ముక్కలు, బోగి మంట, హరి దాసులు , అరిసెలు ఇలా లిస్టు చాలా నే ఉంది ... ముగ్గులు అనగానే అమ్మాయిలకే కదా, అబ్బాయిలకి ఏంటి అనకోకండి. అబ్బాయిలకి కూడా ముగ్గు కష్టాలు ఉంటాయి మరి...

బాగా చిన్నప్పుడు మేము నారాయణగూడా లో అద్దెకి ఉండేవాళ్ళం. అక్కడ సందు మొత్తంలోకి మాదే పెద్ద వాకిలి. దాంతో సంక్రాంతి వచ్చిందంటే చాలు నాకు పొద్దునే డ్యూటీ పడేది. నాకు ఇద్దరు అక్కలు. చినక్క లేచేది కాదు. పెద్దక్కకి తోడు గా నేను లేగవాల్సి వచ్చేది. పొద్దునే అయిదు కి లేచి నన్ను సందు చివర ఉన్న పాలవాళ్ళ దగ్గరకి బకెట్ ఇచ్చి పంపేది. మళ్ళా చలి ఎక్కువ అని తాతగారి ముఫ్లర్ తలపాగా లాగా చుట్టి, స్వెటర్ వేసి పంపేది. బకెట్ పట్టుకుని అక్కడ నిలుచుంటే ఒక పావుగంట చూసి ఆ పాలవాళ్ళ ఎవరో ఒకళ్ళు వచ్చి దాని నిండా పేడ ఇచ్చి పంపేవాళ్ళు. అది మోసుకుంటే వస్తే అక్క దాంట్లో నీళ్ళు కలిపి కళ్ళాపి చల్లి ముగ్గు మొదలు పెట్టేది. తోడుగా దుప్పటి కప్పుకుని చలికి ఆపు కుంటూ నిద్ర కళ్ళతో తోడుగా కూర్చుని ఆ గీత సరిగ్గా రాల ఇక్కడ వంకర పోయింది అని వంకలు పెట్టి సందు మొత్తం మీద పెద్ద ముగ్గు వేసి ఆ రోజు ముగించేది. మాకు గొబ్బెమ్మలు పెట్టె ఆచారం లేదు కాని ముగ్గు మద్యలో పసుపు కుంకుమ, రేగిపళ్ళు చెరుకు ముక్కలు వేసేవాళ్ళం. రధం ముగ్గు మళ్ళా గీతలు, చుక్కలు అని రెండు రకాలుగా రెండు వైపులా వేసేది. ఆ గీతల ముగ్గులు చాలా ఈజీ కదా సో మనకి బాగానే వచ్చేశాయి కొన్ని రోజులకి. హృదయ పద్మం, పూలసజ్జ , సీతాకోక చిలకల ముగ్గు, దీపం ఇలా ఒక పుస్తకం నిండా ఉండేవి. బోటనీ పుస్తకం ఉంది కదా దానిలో ఎప్పటికప్పుడు షీట్స్ ఆడ్ చేసుకోడమే పని. ఒక సైజు దిండు అనుకోండి. (కొంచం పెద్ద అయ్యాక క్లాసు లో అమ్మాయిలకి సైట్ కొట్టడానికి ఈ జ్ఞానం పనికి వచ్చింది. సిటి అమ్మాయిలకి ముగ్గులు సరిగ్గా రావు కదా మరి).

పెద్దక్క పెళ్లి అయ్యాక ఆ ఇల్లు మారిపోయాం, దాంతో ముగ్గు బాద తప్పింది అనుకున్నా. ఈ సారి ఇల్లు కి పాత ఇల్లు అంత వాకిలి లేకపోయినా బాగానే ఉంది. ఇక్కడ పాలవాళ్ళు కూడా లేరు, అబ్బ ఇంకా బోలెడు హాప్పీస్ అనుకున్నా. అప్పటిదాకా రోజు ఏడు కి కూడా ఏడుస్తూ లేచే చిన్నక్క , పెద్దక్క లేని లోటు తీరుస్తా అని మంగమ్మ శపదం చేసింది. దాంతో మళ్ళా మన కష్టాలు మొదలు. పేడ మాత్రం తెచ్చే పని తప్పింది. మా పక్కింటికి పాలు పొయ్యడానికి వచ్చే వాడు తెచ్చిస్తా నెలకి పది ఇస్తే అని బేరం పెట్టాడు. దాంతో ఆ పని తప్పింది కాని, తోడుకోసం లేచే పని మాత్రం తప్పలా. పెద్దక్క వేసే అప్పుడు చూసే వాడిని కాబట్టి మనకి కూడా కొంచం ముగ్గులు వచ్చేవి. దాంతో చిన్నక్కకి అప్పడప్పుడు సలహాలు ఇచ్చేవాడిని. ఒకో సారి ఊరుకున్నా మనం లెవెల్ కొంచం ఎక్కువ కొడితే, టెంకి జెల్లలు పడేవి. దాంతో నేను ఉండను పో అని అలిగీవాడిని. ముగ్గులో పోయగా మిగిలిన రేగిపళ్ళు లంచం ఇస్తా అని , లేక పొతే చెరుకు ముక్కం మొత్తం నీకే అని ఏదో ఒకటి చెప్పి కుర్చోపెట్టేది. ఇంకో రెండేళ్ళకి ఈ అక్కకి కూడా పెళ్లి అయిపొయింది. దాంతో పొద్దునే లేచే బాద తప్పింది అనుకున్నా.

ఇద్దరు అక్కలు వెళ్ళిపోయాక. ఆ డ్యూటీ నానమ్మ తీసుకుంది. తాతగారు తోడుగా లేచే వారు కానీ సమస్య ఏంటి అంటే నానమ్మ ముగ్గు వేస్తా పెద్దగా రామదాసు కీర్తనలో, లేక పొతే ఏదో ఒక రాముడి మీద పాట అందుకునేది. (అలా విని విని నాకు చాల వరకు వచ్చేశాయి). ఇంకేం నిద్ర పడుతుంది. తాత గారు పోయాక ఇంకా మళ్ళా మామూలే నేను డ్యూటీ లో కి మొదలు.

ఇలా కాదు అని కొన్ని సార్లు పండగకి నూజివీడు పెదనాన్నగారి ఇంటికో లేక మా ఊరో వెళ్దాం అని ఎత్తు వేసా. ఒక సారి నూజివీడు వెళ్ళా. అక్కడ నిద్రలేపే వాళ్ళు కాదు కాని, పొద్దునే గోబ్బిళ్ళు పాట ఉండేది. ఆ దెబ్బకి లేచి కుర్చోవాల్సిందే. మేము ఉండేది కోనేరు పేట లో అప్పుడు. ఆ వీదిలో పంతులు గారు , మునసబు గారు ఇంకా అన్ని పెద్ద వాళ్ళ ముంగిళ్ళు , దాంతో పోటి పడి ముగ్గులు వేసేవారు. అమ్మాయిలందరూ పొద్దునే గొబ్బెమ్మ పాటలు. ఇంకా ఎం పడుకుంటాం. కాని చూడటానికి భలే బాగుండేది లెండి. ఆది అవ్వగానే మమ్మల్ని నిద్ర మొహలతోనే తోడు కోసం వేణుగోపాల స్వామి గుడికి లాక్కుపోయెవాళ్ళు. పొద్దునే సంక్రాంతి రోజుల్లో మంచి ప్రసాదం పెడతారు కదా మరి.

ఇలా కాదు అని ఇంకో సారి మా ఊరు వెళ్ళాను. అక్కడ ఇంట్లో లేపే వాళ్ళు ఎవరు వుండరు అని బోలెడు సంతోషించా. ఎక్కడా తెల్లారక ముందే బోగిమంట వేస్తున్నాం రా అని పక్కింటి వాళ్ళ పిల్లలు లేపెసారు. ఏది దొరికితే అది తెచ్చి వెయ్యడమే ఆ మంటల్లో. ఆ తరవాత హరిదాస్ గారు రావడం, ఎడ్ల పూజ , భూమి పూజ గట్రా గట్రా అని ఆ వారం ఏదో ఒక రకం గా నిద్రలేపెసారు.

ఐరనీ ఏంటి అంటే, అంత ముగ్గులు పెట్టిన అక్కకి పెళ్లి అయ్యాక కాపురం మేడ ఛాలా కాలం. దాంతో ముగ్గు ముచ్చట కి పెళ్లి తో ఆగిపోయింది. చిన్నక్కకి మేడ మీద కాకపోయినా వాకిలి తక్కువ. దాంతో ఆవిడకి అంతే. ఇప్పుడు ఇద్దరికీ సొంత ఇళ్ళు ఉన్నా వాకిళ్ళు తక్కువ కావడంతో అంత పెద్ద పెద్ద ముగ్గులు పెట్టె ఆశ లేదు. నేను తర్వాత కాలం లో హాస్టల్ లో ఉండటం, అక్కడ చదువు ముగించుకుని ఇక్కడ కూలీ పనికి రావడం తో ఆ ముగ్గులు, హరికథలు, అన్ని మిస్ అవుతూనే ఉన్నా. ఇక్కడ ఎక్కడన్నా ఒకళ్ళ ఇంటిముందర ఎపుడన్నా ప్లాస్టిక్ ముగ్గులు చూడటమే, మొన్న డల్లాస్ లో మాత్రం మా స్నేహితుడి భార్య ఇంటి ముందర చాక్ పీస్ తో వేసిన ముగ్గు చూసి ముచ్చట పడ్డా. సంక్రాంతి కి ఇంకా పెద్ద ముగ్గు వేస్తా అని అంది , కాని పాపం ఈ Arctic blast వల్ల అక్కడ కూడా మంచు పడటం తో ముగ్గు వేసే ఆశ లేదు ఈసారి అక్కడ.ఇదిగోండి డల్లాస్ లో మంచు పడితే ఎలా ఉంటుందో చూడండి ..

3 comments:

సురేష్ - మ్యూజింగ్స said...

బాగుందండి మీ ముగ్గు గురించి వివరణ. పోతే మీ టపాలో నూజివీడు పేరు, డలాస్ పేరు కనపడి మరింత ఆసక్తి పెరిగింది.

మురళి said...

గొబ్బెమ్మలు...భలే విషయం గుర్తు చేశారుగా.. ఇక కాసుకోండి..
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు..

sunita said...

చాలా బాగుంది.