జంధ్యాల గా అందరికి పరిచయం ఉన్న జంధ్యాల గారిని మాకు శివ గా తెలుసు. చిత్రపరిశ్రమ కి రాకముందు స్నేహితులు ఆయనని శివ అని కాని శాస్త్రి అని కానీ పిలిచేవారు. జంధ్యాల గారి తండ్రిగారికి విజయవాడ లో బుష్ Radio షాప్ ఉండేది. అప్పట్లో నేను అల్ ఇండియా Radio లో పని చేసే వాడిని. నేను రాసిన తెరలు నాటకం radio లో ప్రసారం అయ్యింది. అప్పటికే జంద్యాల తన ట్రూప్ తో కలిసి సంధ్యారాగం లో శంఖారావం లాంటి నాటకాలు రాసి ప్రదర్శిస్తూ ఉండేవారు. నా నాటకం విని కబురు చేసారు. అలా ఇద్దరం నవోదయ లోనో , వారి షాప్ లో నో కలుస్తా ఉండేవారం. తరవాత అయన బి. ఎన్. రెడ్డి గారు రంగుల రాట్నం తరవాత సినిమా చేద్దాం అనుకుని, దానికి ఈయనతో సంభాషణ లు రాయించడానికి పిలిపించడం తో మద్రాస్ వెళ్ళిపోయారు.
జంధ్యాల గారు, వేటూరి గారు అప్పట్లో విశ్వనాధ్ గారికి , రాఘవేంద్ర రావు గారికి సమంగా సినిమాలు రాసేవారు. రెండు వైపులా పేరు బాగా వచ్చింది. బాపు గారు కృష్ణావతారం అని కృష్ణ - శ్రీదేవి నాయకా నాయకులుగా చేస్తూ నన్ను ఒక పాట రాయమని అడిగారు. అలా రాసిన పాట చిన్నారి నవ్వు చిట్టి తామర పువ్వు .. ఆ పాట విని నేను సినిమాకు రాసా అని తెలిసి జంధ్యాల చాలా సంతోషించారు.
నెలవంక సినిమాకి అసలు నిర్మాత మెట్టెల రామబ్రహ్మం అని జగ్గయ్య పేట కాలేజి లో కామర్స్ lecturer గారు. ఆయన జంధ్యాల ఇద్దరు క్లాస్ మేట్స్ . నాలుగు స్తంభాలాట సినిమా పెద్ద హిట్ అయింది. వెంటనే జంధ్యాల ఈ సినిమా మొదలు పెట్టారు. నాలుగు స్తంభాలాట సినిమా లో బాగా పాపులర్ అయిన జంట సుత్తి జంట అని అందరికి తెలిసిందే. సుత్తి జంట లో ఒకరయిన సుత్తి వీరభద్ర రావు గారు నాకు రేడియో లో సహాధ్యాయి. (జంధ్యాల వీరభద్ర రావు గారు ఇద్దరు కాలేజి నుంచి స్నేహితులు , కలిసి కూడా నాటకాలు ఆడారు ) అయన జంధ్యాల కి నాగురించి చెప్పారు. జంధ్యాల. జంధ్యాల కి నేను ముందే పరిచయం అయ్యి ఉండటం వాళ్ళ వెంఠనే రమ్మని కబురు పంపారు. నేను వెళ్ళాక మద్రాస్ పామ్ గ్రూవ్ హోటల్ లో బస ఏర్పాటు చేసారు. అక్కడే ఆరు పాటలు రాసాను నెలవంక సినిమాకి. ఒక వారం ఉన్నాను అక్కడ.
షూటింగ్ మొత్తం ముక్త్యాల కోట పరిసర ప్రాంతాల్లో జరిగింది. నిర్మాతలది కూడా జగ్గయ్య పేట కావడం తో చుట్టుపక్కల వాళ్ళు చాల సహాయం చేసారు. నేను షూటింగ్ కి ఎక్కువ వెళ్ళలేదు. ఏది మతం ఏది హితం పాట అప్పుడు మాత్రం ఒక రోజు ఉన్నాను. ఆ పాటకి తప్పకుండా జాతీయ బహుమతి వస్తుంది అని అనేవారు జంధ్యాల. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ప్రింట్ సకాలం లో ఢిల్లీ చేరకపోవడం వల్ల అది తప్పిపోయింది అని అంటారు అయన.
ఈ సినిమా తరవాత పుత్తడి బొమ్మ సినిమాకి (నిర్మాత వెంకటరత్నం , పూర్ణిమ, నరేష్, ముచెర్ల అరుణ తారాగణం). రావు గోపాల రావు సినిమా కి (జయకృష్ణ నిర్మాత , చంద్రమోహన్ , ముచ్చెర్ల అరుణ , రావు గోపాల రావు తారాగణం ) జంధ్యాల గారితో పనిచేసాను. ఎక్కువగా నాకు సినిమాల మిద ఆసక్తి లేకపోవడం వల్ల నేను మద్రాస్ లో ఎప్పుడు ప్రయత్నం చెయ్యలేదు.
రేడియో లో పని మానేసాక నేను ఆంధ్ర ప్రభ లో పని చేశాను. అక్కడ ఉన్నప్పుడు జంధ్యాల గారితో జంధ్యా సమయం అని ఒక కాలమ్ రాయించాను. అది అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. అయన తరవాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఎక్కువగా కలవక పోయినా అప్పుడప్పుడు స్నేహితుల ఇళ్ళల్లో జరిగే విందుల్లో కలుస్తూ ఉండేవాళ్ళం. అయన మంచి సరదా అయిన మనిషి. ఇంకా మంచి సినిమాలు తీసేవారు ఏమో బతికి ఉంటె. చిన్న వయసులో నే పోయారు. నేను మరచిపోని మంచి మనుషుల్లో జంధ్యాల గారు ఒకరు.
జనవరి పద్నాలుగు జంధ్యాల గారి జయంతి సందర్భంగా ...
2 comments:
బావుంది.
అదేదో విశ్వనాథ్ సినిమాలో చిరంజీవి హీరో మీనాక్షి శేషాద్రి హీరోయిన్. అందులో ఆమె తండ్రిగా వేసింది జంధ్యాల అని ఎవరో అన్నారు, నిజమా?
సినిమా పేరు ఆపద్భాందవుడు . జంధ్యాల పూర్తి స్థాయిలో నటించిన చిత్రం అది ఒక్కటే.
Post a Comment