Monday, September 21, 2009

పుష్పక విమానం గురించి కొన్ని కబుర్లు

ప్రపంచ భాసల్లో చూడదగ్గ ఉత్తమ చిత్రాలలో వందని ఎంపిక చేస్తే దాంట్లో ఇప్పటికి ఎప్పటికి చెరగని స్థానం ఉన్న సినిమా సింగీతం శ్రీనివాస్ రావు గారు నిర్మించి దర్శకత్వం వహించిన పుష్పకవిమానం. దానికి గురించి సింగీతం గారు చెప్పిన కొన్ని కబుర్లు అయన జన్మ దిన శుభసందర్భంగా బ్లాగ్ మిత్రులతో పంచుకుందాం అని రాసిన వ్యాసం ఇది ...

శ్రింగార్ నాగరాజ్ సమర్పించు
మందాకినీ చిత్ర (P) లిమిటెడ్
పుష్పక విమానం

సాంకేతిక వివరాలు
వర్ణ చిత్రం
పద్నాలుగు రీళ్ళు
నిడివి : రెండు గంటల పది నిమషాలు

నటి నటులు :
కమల్ హసన్ .. నిరుద్యోగి
అమల ... మ్యజిషెయన్ కూతురు
కే ఎస్ రమేష్ ... మ్యజిషెయన్
టిను ఆనంద్ ... కిరాయి హంతకుడు
పి యల్ నారాయణ ... బిచ్చగాడు
ప్రతాప్ పోతన్ .. రమ్య ప్రేమికుడు
సమీర్ కక్కర్ ..తాగుబోతు ధనవంతుడు
లోకనాథ్ ... హోటల్ యజమాని
ఫరీదా జలాల్ .. మ్యజిషెయన్ భార్య
రమ్య ... ధనవంతుడి భార్య
మందీప్ రాయ్ , స్వరూప్ కామత్
ఛాయాగ్రహణం, : బి సి గౌరీ శంకర్
కళ : తోట తరణి
కూర్పు : పి వాసు
సంగీతం : ఎల్ వైధ్యనాథన్
సహాయ దర్శకుడు : పూర్ణ ప్రజ్ఞా
నిర్మాతలు : శ్రింగార్ నాగరాజు , సింగీతం శ్రీనివాస రావు
కథ చిత్రానువాదం దర్శకత్వం : సింగీతం శ్రీనివాస రావు

కథ :
కమల్ ఒక నిరుద్యోగి , ఒక రోజు ఒక తాగుబోతు ధవంతుడిని రోడ్డు పక్కన చూస్తాడు. ఇంటికి తెసుకువచ్చి బందించి అయన లాగ అయన ఉండే హోటల్ కి వెళ్లి అక్కడ రాజభోగాలు అనుభవిస్తాడు. అక్కడ మ్యజిషెయన్ కూతురు అమల తో పరిచయం, ప్రేమగా మారుతుంది. ధనవంతుడి భార్య ప్రియుడు నియమించిన కిరాయి హంతకుడు, ధనవంతుడు అనుకుని కమల్ మిద పలు మార్లు హత్య ప్రయత్నం చేసి విఫలం అవుతాడు. కమల్ కొన్ని సంఘటనలతో తన తప్పు తెలుసుకుని ధనవంతుడిని విడుదల చేస్తాడు. అమలకి కూడా నిజం చెపుతాడు. అమల తన చిరునామా ఉన్న కాగితాన్ని పారేసుకుంటాడు. మళ్ళా ఉద్యోగం వేట లో నిల్చోడం తో చిత్రం ముగుస్తుంది.

అప్పట్లో కమల్ అంటే కమల్ మీసం ఒక క్రేజ్. కమల్ ని మీసం లేకుండా అప్పటివరకు ఉహించడం కూడా కష్టం. అలాంటిది కమల్ ఈ చిత్రం కోసం మీసం తిసేసాడు. ఆ ఫోటోలు అప్పట్లో ప్రతి పత్రిక ముఖ చిత్రం గా వేసాయి. (మాములుగా మనవాళ్ళు నాయకి ముఖచిత్రాలు వేసినట్టు నాయకులవి వేయరు ).

నిర్మాత దర్శకులు సింగీతం శ్రీనివాస రావు గారు చెప్పిన విశేషాలు :
కే వి రెడ్డి గారి దగ్గర సహాయకుడిగా పని చేస్తున్నప్పుడు ఒక సారి ఒక సన్నివేశం లో హాస్య నటుడిని భయం అన్నది సంభాషణలు లేకుండా అభినయం ద్వార చూపించమని అన్నారు. అప్పుడే నాకు అసలా చిత్రం మొత్తం సంభాషణలు లేకుండా ఎందుకు తియ్యకూడదు అన్న ఆలోచన వచ్చింది . ఆ ఆలోచన అలా తొలుస్తూనే ఉంది కానీ ఎలాటి కథ, కథనం అన్నది అర్ధం కాలా ... నేను దర్శకుడిని అయ్యాక కూడా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన ఉంది...
ఒక రోజు స్నానం కోసం షవర్ కింద నిల్చునప్పుడు హటాత్తుగా ఇలా తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. రెండు వారాల్లో మొత్తం ఒక కథ, కథనం మొత్తం పూర్తీ చేసి, ఒక రోజు వెళ్లి కమల్ ని కలిసి కథ చెప్పాను. అప్పట్లో నేను ఏదో కన్నడ చిత్రం షూటింగ్ లో ఉన్నాను. కమల్ సినిమా కూడా ఒకటి చేస్తున్నాను అప్పుడు. కమల్ కి ఎప్పుడూ కూడా కథ లో కొత్తదనం ఉంటె చాలు .. వెంటనే ఒప్పుకున్నారు .. నిర్మాత ఎవరు చేస్తారు అని వెతకడం మొదలు పెట్టాను. చాలా మంది నిర్మాతలని కలిసాను కాని అన్ని బాగున్నై కాని చెయ్యడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. చివరకి నేను సొంతంగా తీద్దాం అని నిర్ణయించుకున్నాను. రామోజీ రావు గారిని ఒక సందర్భం లో కలిసినప్పుడు అయన ఒక సలహా ఇచ్చారు. నీకు బాగా కావలిసిన వాళ్ళు ఆరుగురికి నీ నిర్ణయం చెప్పు. దాంట్లో ముగ్గురు నీకు ఓటు వేస్తె అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు అని అన్నారు. నాకు . నేను నాకు సన్నిహితులైన సంగీత దర్శకుడు చక్రవర్తి గారిని , క్రాంతి కుమార్ గారిని, విజయబాపినీడు గారిని అడిగాను వాళ్ళు ముగ్గురు చెయ్యమని ప్రోత్సహించారు.

అప్పుడు కన్నడ చిత్రం చేస్తున్నా అని చెప్పాను కదా , రాజకుమార్ గారి బ్యానర్ కి అది.. రాజకుమార్ గారికి స్నేహితుడు శ్రింగార్ నాగరాజ్ గారు కి నేను ఇలా ఒక విభిన్నమైన చిత్రం చేస్తున్న అని తెలిసి వివరాలు అడిగారు. అంతా విన్నాక అయన నిర్మాత గా ఉండటానికి వెంటనే అంగీకరించారు . ఇది అయన నిర్మించిన ఏకైక చిత్రం (ఇప్పుడు అయన రాజ కుమార్ గారికి వియ్యంకులు )

ముందుగా నాయకి పాత్రకి నీలం కొటారి ని అనుకున్నాం (నీలం మొదటి చిత్రం లవ్ 86 గోవింద తో, అది మంచి హిట్ సినిమా. తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని సినిమాలు వదిలేసారు ఆ తర్వాత భర్తని కూడా వదిలేసారు ప్రస్తుతం నగలు డిజైన్ చేస్తున్నారు అని వార్త ) ఒప్పందం రాసుకున్నాము, షూటింగ్ కి ముందర ఆ అమ్మాయి దుస్తులు అవి అన్ని కమర్షియల్ సినిమాకి వాడే లాగ కావాలి అని అన్నారు. ఇది అలాంటి సినిమా కాదు అని చెప్పినా వినలేదు. దాంతో ఆ అమ్మాయి ని తొలగించక తప్పలేదు.

అప్పట్లో సినిమా express వాళ్ళు ఒక అవార్డు ఫంక్షన్ చేసే వారు ప్రతి సంవత్సరం , దానికి దక్షిణ భారత దేశం నుంచి దాదాపు గా అందరు వచ్చే వారు. అక్కడ ఆ సంవత్సరం అమల ఆ ఫంక్షన్ కి వాఖ్యత గా వచ్చారు . అప్పటికి ఆవిడా నటించిన సినిమాలు నేను చూడలేదు. అక్కడ నాకు నచ్చి ఆ అమ్మాయి ఎవరు అని ఆరా తీసాను. కళాక్షేత్ర లో నాట్యం నేరుచున్నారు అని తెలిసింది. నాకు కావలిసిన అమ్మాయి ఈమె అని అనుకున్నాము. అలా అమల చిత్రం లో కి వచ్చారు .

చిత్రం లో సంభాషణలు లేనందు వాళ్ళ సినిమా ని అన్ని భాసల్లో విడుదల చెయ్యవచ్చు కాబట్టి సినిమా లో భారత దేశం నుంచి అన్ని భాషల నటి నటులని తెసుకుందాం అనుకున్నాం. అప్పట్లో నుక్కడ్ అని దూరదర్శన్ లో చాలా పాపులర్ సీరియల్ దాంట్లో సమీర్ కక్కర్ పాత్ర తాగుబోతు. అది ఆయనకి చాలా పేరు తెచ్చింది. అందువల్ల ఆయనని ఆ పాత్ర కి అనుకున్నాము. అలాగే ఫరీదా జలాల్ ని కూడా. ఒక సారి బెంగుళూరు లో రమేష్ చేసిన మేజిక్ చూసాను.. అప్పడే అయన ఆ పాత్రకి సరి పోతారు అని అనుకుని ఆయనని సంప్రదిన్చాము. పి. ఎల్ నారాయణ గారితో ఇంతకు ముందే పరిచయం ఉండటం వల్ల అయన ని బిచ్చగాడి వేషానికి తెసుకున్నాము.

తోట తరణి తో నాకు ముందర నుంచి పరచయం ఉంది. మొదట్లో అయన వారి తండ్రి గారి దగ్గర సహాయకుడిగా పనిచేసే వారు. అయన తండ్తి గారు తోట వెంకటేశ్వరా రావు గారు కూడా పేరు పొందిన కళ దర్శకులు. తరణి గారికి మొదటి చిత్రం స్వతంత్రంగా చేసే అవకాసం నేను చేసిన అమావాస్య చంద్రుడు చిత్రం లో నేనే ఇచ్చాను .. అలా ఆయనతో నాకు మంచి అనుభందం ఉంది . అందువల్ల అయన ఈ చిత్రానికి అడగగానే ఆనందంగా ఒప్పుకున్నారు.
బెంగళూరు లో హైలాండ్ హోటల్ ఉంది, ఎక్కువగా అక్కడ సినిమా వాళ్ళు బస చేస్తూ ఉంటారు ఆ హోటల్ మేడ మిద ఒక గది ని తాత్కాలికంగా నిర్మించారు (అది కమల్ ఇల్లు సినిమాలో ). అలాగే ఆ హోటల్ పక్కన ఒక వంతెన , దాని పక్కనే ఒక వీధి కూడా నిర్మించారు సినిమాకోసం అయన. చిత్రం చాలా వరకు Windsor Manor హోటల్ లో తీసాము.
ముందర వేరే వాళ్ళని సంగీత దర్శకుడిగా అనుకున్నా కాని అది కుదరలేదు. ఒక దశ లో నేనే సంగీతం చేద్దాం అని అనుకున్నాను ఆ సమయం లో ఎల్ వైద్యనాథన్ గారు దొరికారు. మిగిలిన వాళ్లతో సమస్య ఏంటి ఇంతే .. ఈ సిన్త్రనికి మాటలు లేవు కాబట్టి నేను అడిగినట్టు సంగీతం కావలి అని చెప్పాను. అంటే సంగీతం నా పర్యవేక్షణ లో జరగాలి ఒక రకంగా అని అన్నాను .. దానికి మిగిలిన వాళ్ళు ఒప్పుకోక పోవడం వల్ల కుదరలేదు. భాష మారినప్పుడు అల్లా కొంచం చిన్న చిన్న మార్పులు తప్ప (తెలుగు దానికి వచ్చే రేడియో పాత ఆరేసుకోబోయి పారేసుకున్నాను లాంటివి ) మిగిలినది అంతా యధాతధంగా వాడుకున్నాము .

శ్రింగార్ నాగరాజు గారు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు కావడం వాళ్ళ కన్నడ సినిమా అని అన్నారు కాని మాటలే లేని సినిమాకి భాష తో పని ఎం ఉంది. తెలుగు లో స్రవంతి రవి కిషోర్ గారు విడుదల చేసారు. హిందీ లో రాజేంద్ర కుమార్ గారు విడుదల చేసారు బొంబాయి ఏరియా కి. అప్పటిదాకా అయన ఎప్పుడు సినిమాని పంపిణి చేసింది లేదు. ఈ సినిమా కోసమే అయన పంపిణి దారునిగా మారారు. ఇంకా తమిళ్ మలయాళం లో కూడా ఈ చిత్రం విడుదల అయ్యింది. .
IMDB రేటింగ్ లో ఈ రోజు కి కూడా 9.1 రేటింగ్ ఉంది ఈ సినిమాకి .

- 1978 లో ఈ చిత్రానికి అత్యంత జనాదరణ పొందిన చిత్రం గా జాతీయ బహుమతి ని పొందిన చిత్రం ఇది.
- ప్రపంచం లో 100 గొప్ప సినిమాలలో స్థానం సంపాదించిన సినిమా ఇది.
- రాజ్ కపూర్ , బాల దాకరే, లాంటి వాళ్ళ ప్రసంశలు పొందిన చిత్రం.

కెమెరామన్ స్వర్గీయ గౌరీ శంకర్ గారి గురించి కొంత ...
ఈ చిత్రానికి చాయాగ్రహణం బి.సి గౌరీ శంకర్ గారు. తెలుగు వాళ్ళకి అంతగా పరిచయం లేదు కాని ఈయన దాదాపు గా తొంభై తొమ్మిది చిత్రాలకి చాయాగ్రహణం ని అందించారు. Jayachamarajendra Occupational Institute లో కెమెరా విభాగం లో పట్టభద్రులైన ఈయన , ముంబై వెళ్లి కొంతకాలం ప్రయత్నం చేసి తిరిగి వచ్చి కన్నడ రాజ్ కుమార్ కి చెందిన కంఠీరవ స్టూడియో లో సహాయకుడిగా చేరారు. అక్కడికి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక కెమెరామన్ దగ్గర చాలా మెలకువలు నేర్చుకున్నారు. తెలుగు వారైన పట్టాభిరామిరెడ్డి గారి కన్నడ లో తీసిన శృంగారరస చిత్రానికి మొదటి సరి ఆవకాశం ఇచ్చారు. బి.వి . కారంత్ గారు తీసిన లఘు చితం హుస బెలకు చిత్రీకరణ సమయం లో సిని నటి మమతా రావు తో పరిచయం, ప్రేమగా గా మారి పెళ్లి కి దారి తీసింది . వీరి కుమార్తె రక్షిత (అసలు పేరు శ్వేత ) తెలుగు కన్నడ రంగాల్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించింది. (ఇప్పుడు కన్నడ దర్శకుడు ప్రభు ని పెళ్ళాడి తాత్కాలికంగా సినిమాలకి దూరంగా ఉన్నారు ). తెలుగు లో గౌరీ శంకర్ గారు (అంటే మనం (నేను ) చూసిన సినిమాల్లో నాకు గుర్తు ఉన్నవి అమరిచితులు (నటుడు కాశీనాథ్ దర్శకుడిగా మొదటి చిత్రం, సస్పెన్స్ థ్రిల్లర్ , బాలు మహేంద్ర భార్య స్వర్గీయ శోభ నటించిన చిత్రం ). మైకేల్ మదన కామ రాజు, పుష్పక విమానం. గౌరిశంకర్ గారు మూడు సినిమాలకి కూడా దర్శకత్వం వహించారు, కానీ అవి పెద్దగా విజయం సాదించలేదు. తన యభైయవ ఏట దీర్గ అస్వస్తత కారణంగా నవంబర్ 16, 2004 లో అయన స్వర్గస్తులయ్యారు. కర్ణాటక లో అత్యదికంగా (ఆరు )ప్రభుత్వ అవార్డ్లు లు కెమెరా మాన్ గా అందుకున్న అరుదైన వ్యక్తీ శ్రీ గౌరీ శంకర్ గారు.

సంగీత దర్శకుడు స్వర్గీయ ఎల్ వైధ్యనాథన్ గారి గురించి ..
మాల్గుడి డేస్ అన్న సీరియల్ చూసిన వారెవ్వరూ కూడా ఎల్ వైధ్యనాథన్ గారు తెలిదు అనరు .. ఆ సీరియల్ అయ్యి ఎన్ని ఏళ్ళు అయినా ఎక్కడో అక్కడ ఆ సీరియల్ ఏదో ఒక భాషలో ప్రసారం అవుతానే ఉంది. సంగీత కుటుంబం లో జన్మించిన ఇయనకి తండ్రిగారే గురువు గారు. జి.కే వెంకటేష్ గారి దగ్గర సహాయకుడిగా చలన చిత్ర రంగ ప్రవేశం చేసారు ఈయన. నూట యాభై చిత్రాలకి పైగా వివిధ భాషలో చిత్రాలకి అయన సంగీతం అందించారు. తెలుగు లో పుష్పక విమానం , అపరిచితులు చిత్రాల ద్వార మనకి ఇయన సుపరిచితులు. తన అరవై అయిదవ ఏట మే 19, 2007 న అయన పరపదించారు.

స్వర్గీయ ఎల్ నారాయణ గారి గురించి ...
పే ఎల్ నారాయణ గారు అంటే తెలుగు లో దేశం లో దొంగలు పడ్డారు లాంటి టి. కృష్ణ గారు సినిమాలు గుర్తుకు రాక మానవు. నటుడిగానే కాక అయన చాల చిత్రాలకి మాటలు కూడా రాసారు. ఎక్కువగా ఆర్ నారాయణ మూర్తి గారి సినిమాలకి , స్వర్గీయ వేజెళ్ళ సత్యనారాయణ గారి సినిమాలకి ఇయన మాటలు సమకూర్చారు. ఈయన దర్శకత్వం వహించిన చిత్రం కాళీపట్నం రామ రావు గారు రాసిన యజ్ఞం అన్న నాటకం. బాగా ప్రసిద్ది పొందిన ఈ నాటకాన్ని సినిమాగా తియ్యడం ఒక సాహసం గా చెప్పుకొనవచ్చు. ఈ సినిమాకి ఆయనకి నంది అవార్డు కూడా వచ్చింది.
నారాయణ గారు నటి ఊహ కి (ఇప్పుడు శ్రీమతి ఊహ శ్రీకాంత్ ) దగ్గర బంధువు.

సింగీతం గారి తో ముఖాముఖి ఆంగ్లం లో
సింగీతం గారి గురించిన సమాచారం ఇక్కడ

4 comments:

sunita said...

chakkaTi vyaasam. Baagundi.

మురళి said...

"- 1978 లో ఈ చిత్రానికి అత్యంత జనాదరణ పొందిన చిత్రం గా జాతీయ బహుమతి ని పొందిన చిత్రం ఇది." ఇది సరిచూడండి..
ఊహ పి.ఎల్. నారాయణ మేనకోడలు అని విన్నాను..
బాగుందండీ పరిచయం.. తెర వెనుక సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి...

jeevani said...

పుస్పక విమానం తనివితీరని సినిమా. మీరు గొప్పగా ప్రెజెంట్ చేసారండీ. నిజంగా చాలా బాగా రాశారు. సినిమా నడుస్తుంటే ఆ నిశ్శబ్దంలో పాత్రల మానసిక చిత్రణను విశ్లేషించుకుంటూ చూడటం గొప్ప అనుభూతి. ముఖ్యంగా కమల్, పి.ఎల్. నారాయణల సీన్లు.

Vijar.r said...

Neelam's First movie is Jawani and not Love86