Thursday, August 6, 2009

స్వప్న (1981)

ముద్ద ముద్ద మందారాలు, లేత బుగ్గ సింగారాలు - ఇవి రెండు దాసరి గారు (లేక పాలగుమ్మి పద్మరాజు గారా?) వ్రాసినవి.

ఇన్ని సూపర్ హిట్ పాటలు ఉన్న చిత్రం "స్వప్న"! హైదరాబాదులోని సంధ్య 70mm థియేటర్లో విడుదల అయిన ఈ చిత్రానికి సంగీతం "ఢోలక్" సత్యం గా ప్రసిద్ది పొందిన చెళ్ళపిళ్ళ సత్యం గారు. దాదాపు అంతా కొత్తవాళ్ళతో తీసిన చిత్రం గా చెప్పుకొనవచ్చు ఈ చిత్రాన్ని. "స్వప్న"గా నామకరణం చెయ్యబడ్డ మంజరికి తెలుగులో ఇదే మొదటి చిత్రం. తర్వాత ఈ అమ్మాయి "టిక్.. టిక్.. టిక్..", "పార్వతీపరమేశ్వరులు", "ప్రియ" లాంటి కొన్ని తెలుగు చిత్రాలలో కనిపించి ఆ తరువాత "ఏక్ దిన్ కీ బహూ" అన్న చిత్రంతో హిందీ రంగానికి వెళ్లి అక్కడ "తేరీ మెహర్బానియా"(జాకీ ష్రాఫ్ సగంలో చనిపొతే కుక్క ప్రతీకారం తీర్చుకునే సినిమా అంటే కొందరికి గుర్తు రావచ్చు.) చిత్రంలో రెండో నాయకగా కనిపించి అలా అలా మెల్లిగా మాయమయిపోయింది లెండి. (పాఠకులు చెప్పిన వార్త స్వప్న అమెరికాలో Las -Vegas లో ఒక షో ప్రోమోటర్ గారిని పెళ్ళాడారు పదేళ్ళ క్రితం కనపడ్డారు )...

ఈ చిత్రం లో బాగా పేరు వచ్చింది రాజాకి. అంకితం నీకే అంకితం..., ఇదే నా మొదటి ప్రేమలేఖ... అన్న పాటలు ఇతని మీదే తీసారు. రాజా చాలా చిత్రాల్లో సహాయ పాత్రల్లో బాగానే రాణించి, పాపం, చిన్న వయసులో గుండె నొప్పితో చనిపోయాడు.

ఇంకో నాయకుడిగా రాంజీ అన్న ఉత్తరాది అబ్బాయి నటించాడు. "జేగంటలు" అన్న చిత్రం గుర్తు ఉందా? (ఇది ఆమని సాగే చైత్ర రథం, ఇది రుక్మిణి ఎక్కిన పూల రథం..., జేసుదాస్ పాడిన ఎవరమ్మా, ఎవరమ్మా ఈ కొమ్మ..., వందనాలు, వందనాలు, వలపుల హరిచందనాలు..., తెలుసులే, నీకు తెలుసులే... వంటి అద్భుతమైన పాటలుండి సింగీతం దర్శకత్వం వహించిన ఫ్లాప్ చిత్రం) ఆ చిత్రంలో ముచ్చెర్ర్ల అరుణ పక్కన కథానాయకుడిగా చేసాడు రాంజీ. తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి కనుమరుగయిపోయాడు.(పాఠకులు చెప్పిన వార్త : రాంజీ గారు ప్రస్తుతం travel agent గా వుండి అవుట్ డోర్ షూటింగ్ లకి సహాయపడుతున్నారు )

నాటకరంగంలో ప్రసిద్ధి గాంచిన చాట్ల శ్రీరాములు గారు ఈ చిత్రంలో తండ్రి పాత్ర పోషించారు. (ఈయన "న్యాయం కావాలి" చిత్రంలో రాధికకి తండ్రిగా కనిపించారు, ఈ మధ్య విడుదల అయిన "రాముడు మంచి బాలుడు" చిత్రంలో కూడా కనిపించారు.) చాట్ల శ్రీరాములు గారు నాటకరంగానికి చేసిన సేవ చాలా గొప్పది. ఈయన "రసరంజని" అన్న సంస్థ ద్వారా "శంకరాభరణం" సోమయాజులు గారితోనూ, వారి సోదరుడు, నటుడు జె.వి. రమణమూర్తి గారితోనూ కలిసి బోలెడు నాటక ప్రదర్శనలు ఊరూరా ప్రదర్శిన్చారు.

కథాంశం ప్రకారం స్వప్నని రాజా ప్రేమిస్తాడు. అది చెప్పే లోపలే స్వప్నకి రాంజీతో పెళ్లి నిశ్చయం చేస్తారు ఆమె తండ్రి. రాంజీ అన్ని విధాల తగిన వాడు అని స్వప్న కూడా ప్రేమలో పడుతుంది. ఈ లోపల స్వప్న తండ్రి మరణిస్తారు. స్వప్న ఆస్తి మొత్తం కోర్టు గొడవల్లో ఉండటంతో రాంజీ ఇంకో డబ్బున్న అమ్మాయి వెనకాల పడతాడు. ఆ అమ్మాయి రాంజీ స్వభావం తెలిసి వదిలేస్తుంది. రాంజీ తిరిగి స్వప్న దగ్గరకి వస్తాడు. స్వప్న ఛీకొట్టి రాజాతో వెళ్ళిపోతుంది. రెండో అమ్మాయి పేరు గుర్తు లేదు కాని తరువాత శోభన్‌బాబుతో ఒకటి రెండు చిత్రాలు చేసింది ఆ అమ్మాయి.

ఈ సినిమాని నిర్మించింది జగదీశ్ ప్రసాద్. జగదీశ్ గారు తన భార్య లలిత గారి పేరు మీద పెట్టిన బ్యానర్ "లలితా కంబైన్స్". లలిత గారు అన్నపూర్ణ కంబైన్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు గారి కూతురు కావటం వల్లన జగదీశ్ గారికి సినిమా రంగంతో పరిచయం ఏర్పడింది. జగదీశ్ గారు దాసరితో దీనికి ముందర "ఇదెక్కడి న్యాయం?", "కోరికలే గుర్రాలయితే..." చిత్రాలు తీసారు. "స్వప్న" వీరిద్దరి కలయికలో మూడో చిత్రం. మూడో చిత్రం కదా అని మూడు భాషల్లో మొదలు పెట్టినట్టు ఉన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తీసారు.

నాయకానాయికలు తప్ప మిగిలిన సహాయ పాత్రలకి ఆయా భాషల చిత్రరంగాల్లోని నటులని తీసుకున్నారు. కానీ ల్యాబ్‌లో జరిగిన పొరపాటు కారణం వల్ల తమిళ చిత్రం ప్రింట్ పాడయ్యి తమిళంలో విడుదలవలేదు. తెలుగు, కన్నడ భాషల్లో మాత్రం విజయవంతం అయ్యింది.

4 comments:

మురళి said...

'ఇదే నా మొదటి ప్రేమలేఖ..' 'అంకితం..' పాటలు ఇష్టపడని వాళ్ళు ఉండరేమోనండీ.. బాగుంది టపా...

budugu said...

నిరీక్షణ సినిమా గురించి రాయండి సార్. మొన్నీ మధ్యే అనుకోకుండా ఎఫ్ఫెం లో "ఆకాశం..ఏనాటిదో" పాట విని ఇదెక్కడిదా అని తీగ లాగితే నిరీక్షణ అని తేలింది. అంత మంచి పాటలున్న సినిమా సంగతి ఏమైనట్టు..నేనెప్పుడూ విన్నట్టు లేదు.

భావన said...

మంచి పాటలు గుర్తు చేసేరు.. స్వప్న, జేగంటలు పాటలు గుర్తు లేని సినిమా సంగీతాభిమానులుంటారా! దాసరి సినిమా అని చూడక పోయినా పాటలన్ని చిరపరిచితమే..
తెలియని తెర వెనుక సంగతులు చాలా చెప్పేరు ధన్యవాదాలు.

శ్రీ said...

మురళి గారు : ధన్యవాదాలు
బుడుగు గారు : సినిమా హిట్ అండి ... పాటలు కూడా మంచి హిట్..
భావన గారు : ధన్యవాదాలు అండి ... మీ చలం గారి బ్లాగ్ బాగుంది..