“ఈ చొక్కాకి గుండీ కుట్టి పెట్టవా” అంటూ చొక్కా పేపర్ చదువుతున్న నా మీద వేసారు రాము.
“ఈ రోజు వేసుకెల్లాళి”
“మీరె కుట్టుకోండి, ఏం కుట్టుకోలేరా?! “ అంటూ పేపర్ మడుస్తూ “రేపు నేను లేక పోతే మీకు కష్టం కాబట్టి ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి మీ పనులు మీరు చేసుకోవడం“ అన్నాను.
నా వైపు ఒక సారి చూసారు , పెళ్ళై పదిహేను ఏళ్ళు కాబట్టి నా మొహం చూడగానే ఏమనుకుంటున్నానో తెలిసిపోతుంది ఆయనకి. ఇంకేం అనకుండా చొక్కా తీసుకుని “దారపు డబ్బా ఎక్కడ ఉంది అని” అన్నారు.
“రోజూ ఉండే చోటే అలమారాలో. అక్కడ నుంచి అది కదలదు “ అని అన్నాను.
రెండు నిమషాలలో దారపు డబ్బా తెచ్చుకుని నా పక్కన కుర్చుని, నల్ల దారం తీసి సూదిలోకి ఎక్కించడం మొదలు పెట్టారు
“తెల్ల చొక్కా కి నల్లదారం ఎంటి స్వామీ? తెల్ల దారం వాడండి” చిరాగ్గా అన్నా .
మారు మాట్లాడకుండా తెల్లదారం ఒక గజం తెంపి, సూదిలో కి ఎక్కించి కుట్టడం మొదలు పెట్టారు బ్రోచేవారెవరురా అని పాట పాడుతూ మెల్లగా.. ఒక రెండు కుట్లు అయ్యాక “ ఈ రోజూ నీ మూడ్ బావోలెదా,మళ్ళి మీ నాన్న గారి మీద కొపం వచ్చిందా” దారాన్ని లాగుతూ అడిగారు .
“వూ .. ఆయనకి నచ్చినట్టు ఆయన పనులు చెయ్యడం నా వల్ల కావడం లేదు, ఇది అంతా మా అమ్మ తప్పు, ఆయనను అలా తయారు చేసింది. ఆయన చెయ్యి కూడా ఆయనని కదుల్చుకోనివ్వకుండా పనులు చేసిపెట్టేది ఇప్పుడు నా చావుకు వచ్చింది,” చిరాగ్గా అన్నా.
రాము చేతిలో చొక్కా తీసుకుంటూ “ అందుకే మీ పనులు మీరు చేసుకోవాలని అనేది, రేపు నేను లేక పోతే మీరు అలా అందరి మీద ఆధారపడకూడదు అనే నా కోరిక” అన్నా సంజాయిషీ గా..
మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తావు? అమెరికాలో మీ అన్న దగ్గరికి వెళ్ళే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? అన్నారు నవ్వుతూ..
"ఆ నవ్వులాటలే వద్దు. నేనంటోంది మీకర్ధమయ్యిందని నాకు తెలుసు" చిరు కోపంతో అన్నాను.
నువ్వు చెప్పినట్టల్లా చేస్తే మీ నాన్న వయసుకి నేను మన వాళ్ళందరిలోకి ఎక్స్పర్ట్ అవుతానులే అన్నారు రాము.
వచ్చే నవ్వు ఆపుకుంటూ, గుండీ కుట్టడం పూర్తి చేసి, ఆయనకు క్యారేజీ కట్టి ఇచ్చి, ఆయన అటు వెళ్ళగానే నాన్నగారికి భోజనం పట్టుకుని ఆయన ఫ్లాట్ కి బయలు దేరాను. ఇంటి నుంచి పది నిమిషాల నడక ఆయన ఉండే ఫ్లాట్.
అమ్మ పోయిన తర్వాత గత రెండు సంవత్సరాలుగా నా పని అదే. రోజూ పొద్దున్నే నిద్ర లేచే అమ్మ ఒక రోజు లేవలేదు. తన ఆరోగ్యం గురించి ఎవరికీ చెప్పలేదు. డాక్టర్ ఇచ్చిన మందులు మామూలుగానే నిర్లక్ష్యం చేసి ఒక రోజు
వెళ్ళిపోయింది.
వార్త వినగానే అమెరికా నుంచి అన్నయ్య వెంటనే వచ్చాడు. వాడక్కడ పదిహేనేళ్ళుగా ఉండడం వల్ల వాడి పద్ధతులు, ఆలోచనలు, అన్నీ అమెరికనైజ్ అయిపోయాయి. వాడిని తట్టుకోవడం నాకు కష్టమయిపోయింది. వదిన పిల్లలందరినీ పదిరోజులకోసం తీసుకురావడం డబ్బులు దండగ అని అనేసాడు. వీడేనా చిన్నప్పుడు నాతో ఆడుకున్న అన్న అని విస్తుపోయాను.
నాన్నగారు అన్నయ్యతో వెళ్ళడానికి ఇష్టపడలేదు. అన్నయ్య పెదవి చివరినుండి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. ఆయనకి ఒక సారి అక్కడికి వెళ్ళినప్పటి ఒంటరితనం గుర్తు వచ్చిందో ఏమో మరి.
నేను రాను. అమ్మలు ఉందిగా, తను చూసుకుంటుంది లే ఇక్కడ అని నా ప్రమేయం ఏమీ లేకుండానే చెప్పేసారు.
అన్నయ్య మొహంలో కనిపించిన రెలీఫ్ చూసి పిచ్చి కోపం వచ్చింది. వెంటనే వాడితో నెల నెలా నాన్నగారికి డబ్బులు పంపు. ఆయన అవసరాలకి, వంటమనిషికి, పనిమనిషికీ కావలసి ఉంటుంది అన్నాను.
అదేంటీ? నాన్న గారు నీతో ఉండరా? ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తి అడిగాడు అన్నయ్య. వాడి దృష్టిలో నాకు ఇంకేం పని లేదు మరి. పెద్దాయన ఒక్కడే కష్టం కదా అమ్ములు అన్నాడు పైగా.
నాన్న గారు కలగజేసుకుని వాడికి సమాధానం ఇచ్చారు. "అదేంటీ? నేను అక్కడ ఎలా ఉండగలను? నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడే స్వతంత్రంగా ఉంటుంది.అదీ..." అంటూ రాము గదిలోకి రావడంతో అసంపూర్తిగా ఆపేసారు. అది కూతురు ఇల్లు అక్కడ ఎలా ఉండగలను అని ఆయన పాతకాలపు ఆలోచన.
ఆయన ఆలోచనకి నాకు కొంత సంతోషమే వేసింది. ఈయన ఇంటికి వస్తే, ఉన్న రెండో బెడ్రూం ఈయనకి ఇవ్వాల్సి వచ్చేది. మా అబ్బాయి హాల్లో దివాన్ మీద పడుకోవాలి. చదువు పరీక్షల సమయంలో సరిగ్గా సాగదు. ఇవన్నీ గిర్రున బుర్రలో తిరిగాయ్.
ఆ సంతోషం కొంతకాలమే ఉంది. ఆయన పనులకి ఒక పనిమనిషిని పెట్టినా, ఆయన వాడి చేతి వంట తినడానికి ససేమీరా ఇష్టపడలేదు. పై పనులవరకూ సరే. కానీ వంట మాత్రం రోజూ రెండు పూటలా తీసుకెళ్ళల్సి వచ్చేది. అతి కష్టం మీద పొద్దున్నే బ్రెడ్డూ, టోస్ట్, కాఫీ వాడి చేతి మీద తినడానికి ఒప్పుకున్నారు.
ఇంకా నేను వెళ్ళేటప్పటికి, రోజూ నాకోసం ఏదో ఒకపని వేచి ఉండేది. ఒక రోజు బట్టలు ఇస్త్రీకి వెయ్యడం, ఇంకో రోజు వంటగదిలో లైటు పని చెయ్యడం, లేకపోతే చెత్తడబ్బా విరిగింది అని ఏదో ఒక పని చెప్పేవారు. ఒక్కో సారి రెండు సంసారాలు చూస్తున్నానా? అనిపించేది. దీనికన్నా ఆయన నా దగ్గిర ఉంటే బావుండేదేమో అనిపించేది.
రోజూ ఈ డ్యూటీ వల్ల నేను చూసే టీవీ సీరియల్లు మానేసా. మధ్యాహ్నం పూట స్నేహితులతో వెళ్ళే మ్యాటినీ సినిమాలు, హస్కు కి సమయం లేకుండా పోయింది. ఒక జైలులో బందీ అన్న భావన ఏర్పడి పోయింది. దానికి తోడు నాన్నగారికి నేను సేవ చేస్తున్నానన్న భావన ఏమాత్రం లేదు. ఆయన హక్కు లాగ అనుకుంటారు అది. అది సహజం కావచ్చు కాని నాకు ఒకో సారి చిరాకు వచ్చేది. ఒక రోజు కూరలో ఉప్పు తక్కువ, ఇంకో రోజు పప్పుబాగా ఉడకలేదు అనో లేకపోతే అన్నం ఎక్కువ ఉడికింది అనో వంకలు పెట్టేవారు. నాకు కోపం వచ్చి మాట్లాడే దాన్ని కాదు. అమ్మ ఎలా తట్టుకుంది ఈయన్ని అన్నేళ్ళు అని ఒక్కో రోజు గొణుక్కుండేదాన్ని. ఒక్కో రోజు అన్నయ్య ఇవి అన్ని తప్పించుకున్నందుకు పీకల లోతు కోపం వచ్చేది. అవీ ఇవీ అన్ని ఒకోసారి ఆయన మీద చూపలేక రాము మీద మా అబ్బాయి మీద చూపించవలసి వచ్చేది. వాళ్ళు కూడా సర్దుకు పోవడం నేర్చుకున్నారు. ఈ బాధలన్ని చూడలేక ఒక రోజు రాము నాన్నగారిని మా ఇంటికి తీసుకొద్దామనే ప్రతిపాదన తెచ్చారు. అది తలచుకుంటేనే
భయం వేసింది. అప్పుడు రోజంతా ఆయనకోసం పరిగెత్తడం నా వల్ల కాదు.
ఇదంతా రాస్తున్నా అని నేను ఏదో మరీ చెడ్డ కూతుర్ని అనో లేక మా నాన్న గారు ఆయన పనులు ఆయన చేసుకోలేరు , నేను చూడటం లేదు అనుకోకండి. ఆయన రోజూ పొద్దున్నే నాలుగు మైళ్ళు సాయత్రం నాలుగు మైళ్ళు నడుస్తారు. మంచి ఉక్కు కడ్డీ లాంటి కాయం. కాని ముందు నుంచి మా అమ్మ అటు పుల్ల ఇటు పెట్టకుండా చేసి ఇలా
అలవాటు చేసింది. ఆయన దృష్టిలో ఆయన ఏమీ పని చెయ్యకూడదు అంతే.
ఒక రోజు రాము ఆఫీసునుంచి రాగానే తనకి సింగపూరు రెండు నెల్ల ట్రిప్ పడిందని, కంపనీ నాకు కూడా సగం టికెట్ పెట్టుకుంటుందని అన్న మంచి వార్త మోసుకొచ్చారు. కాని మరి మా నాన్న సంగతో... దాంతో హుషారు అంతా చచ్చిపోయింది. మా అబ్బాయి ని తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ రెండు నెలలు ఉంచవచ్చు, కాని మా నాన్న గారి తిండి మాటో? నాకు ఏడుపు ఒక్కటే తక్కువ.
రాము తెలిసిన ఎవరినన్నా వంట కి పెడదాం అని అన్నారు. నాకు పక్కవీధిలో ఉండే విధవ మామి గారు గుర్తుకు వచ్చారు. ఆవిడ అప్పడాలు, పచ్చడులు పెట్టి అందరికీ అమ్ముతూ ఉంటారు. ముందు మా నాన్న గారిని దానికి ఒప్పించాలి కదా అని తలచుకునే సరికి నీరసం వచ్చేసింది.
ఆయన దగ్గర ఈ విషయం ఎత్తగానే నేను అనుకున్నంతా అయ్యింది. డబ్బు దండగ అంత దూరం ఎందుకు వెళ్ళడం ? నువ్వు వెళ్తే నాకు భోజనం ఎవరు వండి పెడతారు? నాకు ఏదన్నా అయితే ఎవరు ఉంటారు? అన్నారు.
ఓపిక అంతా కూడగట్టుకుని, మీకు ఏమీ కాదు నాన్నగారు, రోజూ మీ మనవడు వచ్చి చూసి వెళ్తాడు. మీకు వంటకు పక్క వీధి మామిని మాట్లాడుతాను ఈ రెండు నెలలు అని చాల సేపు నచ్చచెప్పి, రోజు విడిచి రోజు ఫోన్ చేస్తా అని ఒట్టు వేసి బైట పడ్డా.
ఆయన దానికి కూడా సవాలక్ష ప్రశ్నలు, ఆవిడ శుభ్రంగా వుంటారా? సరిగ్గా మడి కట్టుకు వండుతారా? అసలు ఒప్పుకుంటారా? ఆవిడ ఎందుకు మనకి వండి పెడుతుంది గట్రాలు..
అన్నయ్యకి ఫోన్ చేసి నేను వెళ్తున్నట్టు, మామి గారు వండి పెడుతున్నారు అని చెప్పి నేను రాము సింగపూరు బయలుదేరాం. రోజు విడిచి రోజు మా వాడు తాతగారి దగ్గర మేము ఫోన్ చేసినప్పుడు ఉండేలా చేసాం. (ఫోన్ బిల్లు తగ్గుతుంది అని)
ఆయనకి ఫోన్ చేసినప్పుడల్లా ఎలా ఉన్నారు అని అడిగితే బాగానే ఉన్నాను అని చెప్పేవారు. నన్ను ఎక్కువ మిస్ అవుతున్న ఫీలింగు ఏమీ కనపడలా నాకు. అదే అన్నా రాముతో ఒక రోజు. రాము నవ్వి "నువ్వు మీ నాన్న మొత్తానికి నీ మీద ఆధారపడి పోవాలి అన్న భావం మనసులో ఉన్నట్టు ఉంది అది తొలగించుకోవడం మంచిది. ఒకరి
కోసం కాలం ఆగదు అన్నారు.
రెందు నెలల తర్వాత రాగానే, సూట్కేసులు ఇంట్లో పెట్టి అలాగే నాన్న గారి దగ్గరకి వెళ్ళాను. ఆయన కులాసాగా నవ్వుతూ కనిపించారు చాల రోజుల తర్వాత. ఆయనకి మామి వంట చాలా బాగా నచ్చినట్టు ఉంది. ఆయనకి నేను లేని లోటు ఎక్కడా కనపడ్డ ఛాయలు లేవు, అది నన్ను బాగా బాధించింది.
రెండో రోజు నేను మధ్యాహ్నం వెళ్ళిన కాసేపటికి నాన్న గారు, నాకు రోజు వండిపెట్టడం నీకు ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది కదా అమ్మలు అని అడిగారు.
నేను ఆశ్చర్యపోయాను. "అలా ఏం లేదు అండి, అలవాటు అయిపోయింది" అన్నా.
కానీ నాకా వయసు అయిపోయింది, నా అవసరానికి నిన్ను రోజు ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు రోజు నువ్వు అక్కడ ఇక్కడ రెండు చోట్ల పనులు కష్టం కదా" అన్నారు.
ఈయన అక్కడ కి వచ్చేస్తారా ఎంట్రా భగవంతుడా అనుకున్నాను.
ఈ లోపల ఆయనే "నాకు ఎవరన్నా తోడుగా ఇక్కడ ఉంటే బాగుందును అని అనుకుంటున్నా" అన్నారు.
హమ్మయ్య అయితే రారు అని ఊపిరి పీల్చుకున్నా. "అదేంటండి రోజూ మెంఉ వచ్చి వెళ్తూనే ఉన్నాంగా? అన్నా.
"అలా కాదు అమ్మలు, ఎంత కాలం ఇలా? మీకు ఇబ్బంది... నేను మళ్ళీ పెళ్ళి చేసుకుందాం అని అనుకుంటున్నా" అన్నారు చాలా నెమ్మదిగా విని వినపడనట్టుగా.
నేను విద్యుత్ఘాతం తినట్టు ఉలిక్కిపడ్డాను. నా చెవులను నేను నమ్మలేకపోయాను. నిలబడే శక్తి లేక దగ్గర్లో ఉన్న కుర్చీ లో కూర్చుని.." మీరు...మళ్ళీ పెళ్ళా?" ఎవరిని ? అన్నా కూడబలుక్కుంటూ.
నన్ను వేరుగా అనుకోవద్దు అమ్మలూ..శారీరిక అవసరాలకోసం కాదు నేను ఈ పెళ్ళి చేసుకుంటున్నది. ఇంట్లో ఒంటరిగా ఉండడం చాలా కష్టం. అర్ధరాత్రి పూట మంచినీళ్ళు కావలసిన అడగటానికి ఎవరూ ఉండరు. రోజంతా నేను ఒక్కడినే ఉండటం వల్ల ఆ నిస్సహాయత ఒకో సారి నీమీద చూపేవాడిని" అన్నారు.
"కానీ మిమ్మల్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? ఈ వయసులో? "అస్పష్టంగా గొణిగాను.
"నీకు తెలిసిన ఆవిడే మన వంటకోసం తెచ్చిన మామి ని చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఆవిడికి ఓర్పు, దైవభక్తి చాల ఎక్కువ, నాకు సరిపోతారు" అన్నారు.
"మరే ఆవిడ వంట కూడా మీకు చాలా ఇష్టం కదా" వెటకారంగా అన్నాను.
"ఈ వయసులో అందరికీ జిహ్వ చాపల్యం ఎక్కువ అవుతుంది అమ్మలు. నీకు అనుభవం మీద తెలుస్తుంది. నిజమే ఆవిడ వంట కూడా నాకు నచ్చింది" అన్నారు.
నాకు మా అమ్మ స్థానం ఎవరికో ఇవ్వడం అసలు నచ్చలేదు. ఈయన అన్నేళ్ళ తన సహచరిని ఎలా మరిచి పోగలిగారు అనుకుంటే కన్నీళ్ళు ఆగలేదు. లేచి ఆయన పిలుస్తున్నా వినిపించుకోకుండా గబా గబా వచ్చేశాను.
ఇంటికి వచ్చేసరికి రాము ఇంట్లోనే వున్నారు. తన లీవు ఉండటం వల్ల ఆఫీసుకి పోలేదు. రాగానే సోఫాలో కూర్చున్న తన పక్కన కూర్చుని భుజం మీద తల పెట్టి భోరుమన్నాను. రాము గాభరా పడిపోయారు.
"ఏమయింది? మామయ్య గారు కులాసాన? " అదుర్దాగా అడిగారు.
"ఆయనకేం? బ్రహ్మాండంగా ఉనారు. కాబోయే పెళ్ళి కొడుకు ఆయనకి ఏంటి?" అన్నా వెక్కిల్ల మధ్య.
"సరిగ్గా చెప్పు" ఆశ్చర్యంగా అన్నారు, నా కన్నీళ్ళు తుడుస్తూ.
"మీకు కొత్త అత్తగారిని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు ఆయన" అంటూ మొత్తం చెప్పాను.
అంతా విన్నాక ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉండి "ఇంతకీ ఆవిడ ఒప్పుకుందా?" అని అడిగారు.
"ఒప్పుకున్నట్టే ఉంది. మనం లేని సమయంలో మా నాన్నకి ఏ మందో మాకో పెట్టి ఉంటుంది. లేకపోతే ఆయన మా అమ్మని మర్చిపోగలరా?" అన్నా కళ్ళు తుడుచుకుంటూ.
"నువ్వు ఆయన ఒంటరి తనం చూడటం లేదు, మీ అమ్మ గారు పోయారు. ఈయన ఇంకా చాలా కాలం బతుకుతారు. ఆయనకు తోడు కావాలి అది ఎందుకు ఆలోచించవు? నువ్వు?"
"ఈ వయసులో ఆయనకు ఈ వ్యామోహం ఏంటి అండీ?" కోపంగా అన్నాను.
"మీ నాన్నగారు పదహారేళ్ళ బాలాకుమారిని చేసుకోడం లేదు కదా .. వ్యామోహం అనుకోవడానికి" నవ్వుతూ అన్నారు.
నాకు నవ్వు వచ్చింది. ఆయన అన్నది సబబుగానే ఉందికదా. ఈ వయసులో ఆయన పడక సుఖంకోసం చేసుకోరు కదా. నాలో అసూయ, కోపం తగ్గి మెల్లగా, తిన్నగా ఆలోచించి నాన్న గారికి ఫోన్ చేసా.. ఈపెళ్ళి నాకు ఇష్టమే అని. ఫోటోలో అమ్మ నవ్వినట్టు అనిపించింది నేను సరైన నిర్ణయమే తీసుకున్నా అన్నట్టు.
గమనిక : ఈ కథ దాదాపు అయిదు ఏళ్ళ క్రితం రాసింది. నాకే నచ్చక అలా పక్కన పడేసి ఉంచా. ఇలాంటి కథలు బోలెడు వచ్చాయి. కొత్తగా ఎం చెప్పాను ? ఏమి లేదు ... హిందీ లో అవతార్ అని రాజేష్ ఖన్నా, షబానా అజ్మి లతో ఒక సినిమా వచ్చింది . తెలుగు లో దాన్నే అది దంపతులు అని తీసారు. కొంచం అటు ఇటు గా, కలికాలం, బహుదూరపు బాటసారి గట్రా గట్రా లాంటి చిత్రాలు వచ్చాయి ఓల్గా రాసిన తోడు (దిన్ని సినిమా గా కూడా తీసారు )ఇలాంటి కథాంశం తో నే వచ్చింది దాంతో ఇది అవసరమా అని పక్కన పడేసా.
2 comments:
ప్రయత్నం బాగుందండీ.. మీరు చెప్పినట్టుగా బాగా నలిగిన సబ్జెక్ట్.. ఈసారి కొంచం వైవిధ్యం ఉన్న సబ్జక్ట్ ప్రయత్నించండి..
It's actually quite good.
But, I see your wisdom in keeping at aside.
Post a Comment